Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 31


    అప్పుడు రాత్రి రెండుగంటలు దాటింది.


                             *    *    *    *    *


    తను ఎటు వెళ్తున్నాడో తెలీదు. ఈ దారి ఎటు తీసికెళ్తుందో తెలీదు.

 

    ఎంత దూరం నడిచాడో తెలీదు.

 

    వర్షం తగ్గుముఖం పట్టి చినుకులుగా మారింది. శరీరం, మనసూ రెండూ అలిసిపోయాయి.

 

    ఓ చెట్టులాంటిది కనిపిస్తే ఆ చెట్టు మొదట్లో కుప్పకూలిపోయాడు.

 

    వళ్ళంతా నొప్పి... బాధ....

 

    కళ్ళు మూతలు పడిపోతున్నాయి.

 

    ఆదిత్యకు తెలియకుండానే నిద్రపట్టేసింది.

 

    బ్రతుకు చిమ్మచీకట్లో ఆదిత్య-


                                                 *    *    *    *    *


    టప్ మని కనురెప్పమీద చినుకుపడితే అధాటున మెలుకువొచ్చింది ఆదిత్యకు.

 

    చెట్టుకొమ్మల మధ్యనుంచి చంద్రుడు తెల్లగా కనిపిస్తున్నాడు.

 

    చినుకులు కూడా తగ్గిపోయాయి.

 

    ఈ పాటికి పోలీసులు తన కోసం గాలింపు చర్యలు ప్రారంభించి వుంటారు.

 

    సమీపంలోని అన్ని పోలీసు స్టేషన్లకూ మెసేజ్ ళు వెళ్ళే వుంటాయి.


    
    ఈ అడవిలో కూడా తనుండడం క్షేమం కాదు.

 

    తెల్లవారే లోపుగానే తను ఇక్కడనుంచి తప్పించుకోవాలి... తప్పదు.

 

    అటూ ఇటూ చూసి గుడ్డి వెలుతురులోనే నడవడం ప్రారంభించాడు. అలా రెండు మైళ్ళు నడిచాడు.

 

    అప్పుడు విన్పించింది ఆదిత్యకో శబ్దం...

 

    ఆ శబ్దాన్ని స్పష్టంగా పోల్చుకున్నాడు ఆదిత్య. లారీ శబ్దం... అంటే... తను రోడ్ పాయింట్ కు చాలా దగ్గర్లో వున్నాడన్నమాట.

 

    ఆదిత్య నడక వేగం హెచ్చింది.

 

    మరో ఇరవై నిమిషాల తర్వాత ఆదిత్య అడవిలోంచి రోడ్డుమీద కొచ్చాడు.

 

    లక్కీగా ఆ రోడ్డు నేషనల్ హైవే కాదు. నేషనల్ హైవేకి ఆనుకుని వున్న మట్టి రోడ్డు.

 

    మట్టి రోడ్డు వుందంటే సమీపంలో ఏదో గ్రామం వుండుండాలి...

 

    ఆ గ్రామ్మలో కనీసం ఒక ప్రైమరీ హెల్త్ సెంటరైనా వుండకపోదు... ఒక డాక్టరైనా వుండకపోడు.

 

    శక్తి లేకపోయినా నడుస్తున్నాడు ఆదిత్య.

 

    అతని ఆశ వృధా కాలేదు.

 

    రెండు కిలోమీటర్ల దూరం నడిచాక ఒక బస్ షెల్టర్... ఆ పక్కన మినుకు మినుకుమంటున్న ఎలక్ట్రిక్ లైటు.

 

    ఆ బస్ షెల్టర్ మీద రాసున్న అక్షరాలు చూశాడు. రెడ్డిపాలెం బస్ స్టాపు...

 

    రెడ్డిపాలెం...

 

    దూరంగా ఊరు కనిపిస్తోంది.

 

    అటూ ఇటూ పంటపొలాలమీంచి వస్తున్న చల్లని గాలి...

 

    రోడ్డు పక్కనున్న చెరువు దగ్గరకెళ్ళి ముఖం, చేతులూ, కాళ్ళూ కడుక్కుని గాయాల్ని తుడుచుకున్నాడు.

 

    మళ్ళీ నడక ప్రారంభించాడు.

 

    ఎక్కడో కుక్క అరుపు... అప్పటికి ఊరు మొదట్లో వున్నాడు.

 

    పంచాయితీ ప్రాథమిక పాఠశాల... పంచాయితీ లైబ్రరీ... కొంచెం ముందున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

 

    బోర్డు చూడగానే ఆదిత్య కళ్ళు మెరిశాయి.

 

    చుట్టూ పిట్టగోడ... మధ్యలో ప్రైమరీ హెల్త్ సెంటర్...

 

    మెట్లెక్కి వరండామీద నుంచున్నాడు. వరండా గోడకు చిన్న బోర్డు వుంది. డాక్టర్ బాలేశం... ఎమ్.బి.బి.ఎస్.

 

    అంటే ఇక్కడ డాక్టర్ కూడా వున్నాడన్నమాట.

 

    అదే సమయంలో నిశ్శబ్దాన్నీ, చీకటిని చీల్చుకుంటూ గోడ గడియారం కొట్టిన గంటల చప్పుడు.

 

    సరిగ్గా నాలుగు గంటలు.

 

    అంటే... ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎవరో వున్నారన్నమాట. బహుశా డాక్టరేమో!

 

    మరే మాత్రం ఆలస్యం చెయ్యలేదు ఆదిత్య.

 

    తలుపు కొట్టాడు.

 

    జవాబు లేదు.

 

    మళ్ళీ తలుపు తట్టాడు.

 

    "ఎవరు? ఆడగొంతు. డాక్టర్ భార్యా?

 

    "తలుపు తెరవండి. డాక్టర్ గారికోసం వచ్చాను" జవాబిచ్చాడు ఆదిత్య.

 

    లోపలినుంచి వినిపిస్తున్న అడుగుల చప్పుడు....

 

    నెమ్మదిగా దగ్గరౌతుంది.

 

    రెండు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. అదే సమయంలో గదిలో లైటు వెలిగింది.

 

    ఎదురుగా నిల్చున్న ఆమెకు పాతికేళ్ళుంటాయి. తెల్లటి డ్రస్ లో వుంది..

 

    ఆదిత్య ముఖంవైపు, బట్టలవైపు, బట్టలమీద రక్తం మరకలవైపు. గాయాలవైపు చూసింది అనుమానంగా.

 

    "డాక్టర్ గారు?"

 

    "ఎవరు... ఎందుకు?" కరుగ్గా ఉంది ఆ గొంతు.

 

    ఇలాంటి సమయంలో ఎలా మాట్లాడాలో తెల్సు ఆదిత్యకు.

 

    "సిటీకి వెళ్తున్నాను మేడమ్... వర్షం వల్ల కారు స్లిప్పయి బోల్తాపడింది. స్మాల్ ఇంజరీస్... పెద్ద ప్రమాదం ఏం లేదు. ట్రీట్ మెంట్."

 

    'మేడమ్' అని సంబోధించడం వల్ల ఆమె ముఖంలో కొంత మార్పు కనిపించింది.

 

    ఆ మార్పును గమనించాడు ఆదిత్య.

 

    "ఎంతమంది...."

 

    "మంది కాదు మేడమ్... నాకే... నేనొక్కణ్నే కారు డ్రైవ్ చేసుకొస్తుంటే."

 

    నిజమేనా అన్నట్టు... ఆదిత్య ముఖంలోకి చూసింది ఆవిడ.

 

    "బిలీవ్ మీ మేడమ్! ఇటీజ్ ట్రూ" భుజమ్మీద గాయాన్ని చూపిస్తూ అన్నాడు. ఏమనుకుందో ఏమో...

 

    "రండి" అంటూ లోనికి అడుగేసింది.

 

    ఆదిత్య లోనికెళ్ళాక తలుపు గడియ పెట్టింది ఆవిడ.

 Previous Page Next Page