Previous Page Next Page 
రక్తచందనం పేజి 31


    విజయ్ మెత్తగా నవ్వాడు.
    అలా చేయటం బాగోదన్నట్లు సంజ్ఞ చేశాడు.
    మహిమ అసహనంగా పరిసరాల్ని గమనించసాగింది.
    చర్చ్ చుట్టూ అడవి.... అడవిలోని కొంత భాగాన్ని కట్ చేసి ఆ భాగంలో చర్చ్ ని కూర్చోబెట్టినట్లుగా వుంది. చర్చ్ కి మూడువేపులా అతని ముఖద్వారంవేపు గ్రామంలోకి సాగిపోయిన మట్టిరోడ్డు....ఆవరణ కలుపు మొక్కలతో, గడ్డి దిబ్బలతో నిండిపోయివుంది.
    పురాతన భవనాల్లోకి వెళ్ళినప్పుడు వేసే అదో రకమయిన వాసన వేస్తోంది.
    వెళ్ళిన వ్యక్తి అరగంటయినా తిరిగి రాలేదు.
    మహిమకి అనుమానం వచ్చింది.
    అరుగుమీంచి లేచింది....
    విజయ్ ఆగమన్నట్లు సైగ చేశాడు.
    అంతలో వినిపించిందో శబ్దం....ఇద్దరూ ఆ శబ్దం వింటూ ఆశ్చర్యపోయారు.
    అది జీపు స్టార్టయి వెళ్ళిపోతున్న శబ్దం....
    మహిమ మరిక ఆలశ్యం చేయలేదు.
    సివంగిలా దూకింది_ ఆమె చర్చ్ గోడ మలుపు తిరిగి ప్రహరీగోడ వద్దకు వెళ్ళి ఆవలివేపు చూస్తుండగానే ఒక పాత జీప్ అడవిలోకి వెళ్ళి అదృశ్యమైపోయింది.
    మహిమ వెనుదిరిగేసరికి విజయ్ అక్కడున్నాడు.
    "కొద్దిలో అదృష్టాన్ని మిస్ అయ్యాం" అంది.
    "అర్థంకాలేదు" అన్నాడు విజయ్.
    "వీరూ వచ్చి ఫాదర్ ని కలిసి వెళ్ళిపోయాడు" అంది కాన్ఫిడెంట్ గా.
    విజయ్ ఒళ్ళు ఒక్క క్షణం జలదరించింది. వెన్నులో చలి.... వినటం.... చదవటం తప్ప.... అతనికి కేవలం వంద గజాల దూరంలో తెలీకుండానయినా వున్నందుకు అర్థంలేని, అర్థంకాని భయం అతనిని ఆవహించింది. ఆపైన తేరుకున్నాడు.
    "అతనే అని ఎలా తెలుసు? నువ్వు చూడలేదు" విజయ్ అన్నాడు మెల్లగా.
    "మనం ఈ గ్రామంలో ప్రవేశించేముందు జీప్ ఆపి ఒక వ్యక్తి చర్చ్ కి దారెటని అడిగాం. అతను దారి చూపించి నిన్నటినుంచి జ్వరం అని చెప్పటం గుర్తుందా?" మహిమ ఆ పరిసరాల్ని, చర్చ్ ని కెమెరాలోకి ఎక్స్ పోజ్ చేసుకుంటూ అంది.
    ఆమె రీజనింగ్ కి అప్రతిభుడయ్యాడు విజయ్.


                             *    *    *    *


    గుండ్ల పేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు....
    రాత్రి ఎనిమిది గంటల సమయం....
    పొగమంచు క్రమంగా ఆ ప్రాంతాన్ని కప్పివేస్తోంది.
    ఆఫీసు లోపల ఉలెన్ కోట్స్ తో వున్న డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్_ ఇద్దరి మధ్య సంభాషణ నడుస్తోంది.
    "మనమీద ఈ పోలీసుల జులుం ఏమిటి? వాళ్ళు మన అధికార పరిధిలోకొచ్చి మనల్ని శాసించటం ఏమిటి? కొత్తగా వాళ్ళొచ్చి సాదించిందేమిటి?" డి.సి.ఎఫ్. ఒకింత ఆగ్రహంతో అన్నాడు అతని పేరు చెంగప్ప.
    "మనం చేతులెత్తేయబట్టే వాళ్ళు రంగప్రవేశం చేశారు. అయినా మనమే ఈ అడవిలో అన్ని ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నాం. ఇంక వాళ్ళెలా వెళ్తారు....? కొత్తగా వచ్చిన ఫారెస్ట్ విభాగం ఎస్.పి.రంజిత్ రెచ్చిపోతున్నాడట. నిన్న రాత్రి పాలార్ బ్రిడ్జి దగ్గర వీరూ సరుకును ట్రాక్ చేసే ప్రయత్నంచేసి, విఫలమయి వెర్రిముఖం వేశాడట. పట్టుకుంటే గిట్టుకుంటే మన డిపార్ట్ మెంట్ వల్లే కావాలిగాని, పోలీసుల వల్లేమవుతుంది?" ఒకింత అసహనంగా అన్నాడు ఎ.పి.ఎఫ్. కుషాలప్ప.
    "సరీగ్గా చెప్పావ్....మందు బయటకు తీయ్_ వీరూని ఇటు ఛేజ్ చేస్తే కావేరీ దాటి అటు తమిళనాడులోకి ఎంటర్ అవుతాడు. అక్కడ  మనకు అధికారం లేదు. ఆ స్టేట్ పోలీస్ కూడా సహకరిస్తేనే గదా? వీరూని పట్టుకోవటం అంటూ జరిగితే అది మన మూలంగానే జరగాలి. మనకే పేరు రావాలి. పోలీసులక్కాదు. మనకేదన్నా ఇన్ఫర్మేషన్ తెలిసినా ఆ రంజిత్ కి తెలియపర్చకూడదు"
    "బట్....శర్మాజీ ఆయనతోనే వున్నాడే....? మన సంగతి తెలిసి సస్పెండ్ చేసి పడేస్తే....?"
    "ఏమిటాధారం....? డోంట్ వర్రీ.... వీరూని మనమే పట్టుకొని, ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ ని మనమే దక్కించుకోవాలి"
    "రేపో, ఎల్లుండో శర్మాజీ ఇటుకేసి రాబోతున్నారట"
    "అందుకే రికార్డ్స్ అవీ సిద్ధంగా వుంచాను...."
    ఆపైన ఇద్దరూ సంభాషణ ఆపి కార్యక్రమంలో మునిగిపోయారు. చీకటి, చలి, నిశ్శబ్దం, నీరవం ఆ ప్రాంతాన్ని తమలో ఇముడ్చుకుంటున్నాయి.


                                                 *    *    *    *


    ఫారెస్ట్ డిపార్ట్ మెంటయినా, పోలీస్ డిపార్ట్ మెంటయినా, మరే ప్రభుత్వ శాఖయినా, ప్రజా జీవితాన్ని సులభతరం చేయతానికిం సుఖమయం చేయటానికే.
    అందరూ ప్రజల సేవకులే.
    ఎమ్.పి. అయినా, ఎమ్,ఎల్.ఏ. అయినా, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్.
    మంత్రులు, ముఖ్యమంత్రులు, చివరకు ప్రధానమంత్రయినా, రాష్ట్రపతయినా, సుప్రీంకోర్టు జడ్జి అయినా ప్రజలకు సేవ చేయటానికే ఆ పదవుల్లోకి తీసుకురాబడ్డారు. సేవ చేయటానికి ఒప్పుకోబట్టే వారికి జీతాలు, కార్లు, బంగ్లాలు, సర్వసౌకర్యాలు, అధికారాలు_
    కానీ అది మర్చిపోతుంటారు_ ఎప్పుడూ.
    ప్రజల్ని ఉద్దరించటానికి పుట్టిన దైవాంశసంభూతుల్లా ఫీలవుతూ ఆత్మవంచన చేసుకుంటూ అమాయక ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేస్తారు కూడా.
    వీరూని పట్టుకొనే విషయంలో కూడా అదే జరుగుతోంది. ఫారెస్ట్ పోలీసు శాఖల లక్ష్యం ఒక్కటే_ జీతాలకింద తీసుకొనేది ప్రజల సొమ్మే కానీ వారిమధ్య వైరుధ్యాలు....వ్యక్తిగత వైషమ్యాలు_ఇగోలు_ఆలోచనా సరళిలో వైవిధ్యాలు, అధికారాల అవరోహణల మీమాంస_ఎవరు ఎవర్ని శాసిస్తున్నారు? ఎవరి పరిధి ఏమిటి? అర్థంలేని అభిజాత్యం....
    వివిధ శాఖల మధ్య రేగే అంతఃకలహాలు _ ఐ.ఎ.ఎస్.ని చూసి ఐ.ఎఫ్.ఎస్.... పళ్ళు నూరుకోవటాలు_పథకాల్ని నీరుకార్చటాలు.
    లక్ష్యం ఒక్కటే అయినప్పుడు ఎవరు సాధిస్తే ఏమిటి? అనే విశాల దృక్పథం కొరవడింది. సమిష్టి లక్ష్యం దెబ్బతింది.
    కో_ఆర్డినేషన్, కో_ఆపరేషన్ మృగ్యమయిపోయింది. అది చాలు వీరూకి.
    వీరూని పట్టుకోవటం అప్రధానమయింది.
    ఎవరు పట్టుకోవాలన్నది ప్రధానమయింది.
    చివరకు ఎవరూ పట్టుకోలేకపోతే.... ఆ శాఖల్ని ప్రజలు ఎందుకు మేపుతున్నట్లు? ఈ ప్రశ్నే ప్రాధాన్యతని సంతరించుకుంటే ఫలితం....? ప్రజా విప్లవం.
    రోడ్ల భవనాలశాఖ రోడ్లేస్తుంది. (ఎక్కడా ఆ ఛాయలే లేవు. టెలిఫోన్ డిపార్ట్ మెంట్ తవ్వుతుంది. వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చేలోపు రోడ్ల భవనాలశాఖ తిరిగి రోడ్లేస్తుంది. వాళ్ళు తిరిగి తవ్వుతారు_ అవి పూడ్చేలోపు డ్రైనేజి వాళ్ళొచ్చి కాలవల పరిధిని పెంచిపోతారు. ఈలోపు ట్రాఫిక్ వాళ్ళు వచ్చిపడి పదో, పరకో_లేక ఫైన్సో....?!
    ఏమిటీ ఆటలు....?
    ప్రభుత్వ శాఖల అసమన్వయపు చదరంగపు బల్లపై ప్రజలు బంట్లా? ఆటబొమ్మలా? వినోదాన్నిచ్చే కేతిగాళ్ళా....?!
    అన్ గ్రేట్ ఫుల్ అండ్ యూజ్ లెస్ డిపార్ట్ మెంట్స్.
    కుషాలప్ప అర్ధరాత్రి కావటానికి అరగంటముందు బెడ్డెక్కేస్తూ అన్నాడు_"రేపు పాలార్ ఫారెస్ట్ కి ఏనిమల్ సెన్సెస్ కి వెళ్ళాలి" అని.
    ప్రజాధనానికి సెల్యూట్ చేసి, వృత్తి ధర్మానికి గుడ్ నైట్ చెప్పి ఆ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు, సిబ్బంది నిద్రలోకి జారుకుంది....అడవి నవ్వుకుంది.


                             *    *    *    *

 Previous Page Next Page