Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 31

 తుపాకిని రెడీగా వుంచుకుని, స్వప్నవైపు రెండడుగులు వేశాడు సందీప్.
పులి ఇందాక వెళ్ళిన వైపునుంచి మళ్ళీ అతనిమీదకు లంఘించింది.
ఈసారి తయారుగా వుండడంవల్ల తక్షణం కాల్చాడు సందీప్.
ఇందాకటి లాగానే పులి మళ్ళీ నేలను తాకగానే అదే వేగంతో చెట్ల వెనుకకు ఉరికి, కనబడకుండా పోయింది.
తనని తనే తిట్టుకున్నాడు సందీప్. పులి ఇంత సమీపంలోకి వచ్చినా, కాల్చలేకపోయాడు. తను క్రాక్ షాట్ అనీ, రెండొందల గజాల అవతల కొండమీద ఆకులు మేస్తున్న మేక గుండెకి తగిలేటట్లు కాల్చగలననీ సన్నటి గర్వం వుండేది. ఆ గర్వాన్ని అణచడానికే తీర్మానించుకుందా ఈ పులి? కవ్విస్తున్నట్లు ఆరడుగుల దూరంలోకి రెండుసార్లు వచ్చినా కాల్చలేకపోయాడు తను! ఎందుకని? తన శరీరంలో ఇంద్రియాలకు మధ్య సమన్వయము లోపిస్తోందా? చూపు దెబ్బ తింటోందా? చేతులలో పటుత్వం తప్పుతోందా? మెదడు మొద్దుబారుతోందా?
ఏం జరిగింది?
చేదు మింగినట్లు అయింది అతని మనసు.
స్వప్న మీదకు ఒంగి పరీక్షగా చూశాడు. భయం వల్ల షాక్ కలిగి స్పృహతప్పి వుండాలి. శరీరం మీద పెద్ద గాయాలేమీ కనబడటం లేదు. శ్వాస మాత్రం బలహీనంగా వస్తోంది.
కొద్ది సెకెండ్లకి ఒకసారి కొద్దిగా కదులుతున్నాయి ఎత్తయిన గుండెలు. క్రమంగా క్షీణిస్తున్నాయి ఉశ్చ్వాస నిశ్వాసలు.
శ్వాస సరిగా ఆడనప్పుడు కృత్రిమంగా శ్వాసక్రియ జరిగేటట్లు చెయ్యడానికి ప్రాథమిక చికిత్సలో ఒక ప్రక్రియ వుంది. 'ఆర్టిఫిషియల్ రిసస్టికేషన్' అంటారు దాన్ని. అది ఉపయోగించడానికి నిశ్చయించుకున్నాడు సందీప్.
స్వప్న భుజాల్ని చేతులతో పట్టుకొని, ఆమె మొహం మీద తన మొహం వుంచి, ఆమె పెదిమలను తన పెదిమలతో బలంగా తెరిచి పట్టుకున్నాడు. ముక్కు ద్వారా దీర్ఘంగా శ్వాస తీసుకుని, అది తన నోటిద్వారా స్వప్న ఊపిరితిత్తులు ఆ గాలితో నిండాయి.
కొద్ది క్షణాల తర్వాత, స్వప్న నోటిలో నుంచీ గాలిని పీల్చేసి, తన ముక్కు ద్వారా వదిలేశాడు. మళ్ళీ అదే పద్ధతిలో గాలిని స్వప్న నోటిలోకి పంపాడు. కొన్ని నిమిషాలపాటు వీళ్ళిద్దరికీ ఒకే ఊపిరి అయిపోయింది.
ఆమె పెదవులు చల్లగా గులాబీ రేకుల్లా ఉన్న విషయం అతనికి అప్పుడు గమనానికి రాలేదు. అందమైన ఆమె మొహం ఆ సమయంలో అతనికి మోహాన్ని కలిగించలేదు.    ఆమెని రక్షించాలి. అదొక్కటే అతని మనసులో మెదులుతున్న భావం.
అయిదు నిమిషాల తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచింది స్వప్న.
జరుగుతున్నదేమిటో 'అపార్థం' చేసుకోవడానికి అయిదు సెకెండ్లు కూడా పట్టలేదు స్వప్నకి. తను నేలమీద వెల్లకిలా పడి ఉంది. అస్తవ్యస్తంగా ఉన్నాయి తన బట్టలు. తనమీదకు ఒరిగి ఉన్నాడు సందీప్. తన పెదిమలు అతని పెదిమల మధ్య -
తల విసురుగా అటూ ఇటూ విదిలించి అతన్ని తోసేసి, లేచి కూర్చుంది స్వప్న.
"వాడు వదిలాడనుకుంటే నువ్వు తయారయ్యావన్నమాట ! సిగ్గు లేదూ! ఛీ! మీ మొగాళ్ళ కంటే అడవి దున్నలు నయం!" అంది రౌద్రంగా.
విసురుగా తన చెంపను తాకబోతున్న స్వప్న చేతిని పట్టుకుని ఆపాడు సందీప్.
"స్వప్నా! అనవసరంగా తొందరపడకు. అసలు జరిగిందేమిటో పూర్తిగా నాకు చెప్పు. ఏం చేశాడు భూతాలరాజు ?"
"బయలుదేరాడండీ ఆర్తత్రాణ పరాయణుడు! తప్పుపని చెయ్యబోతూ దొరికిపోయి నన్నేదో ఉద్దరించే వాడిలా ఫోజు పెడతావేమిటి?" అంది స్వప్న రెండు చేతులూ అడ్డం పెట్టుకుని, అర్థ నగ్నంగా కనబడుతున్న వక్షాన్ని దాచుకోవాలని వ్యర్థప్రయత్నం చేస్తూ.

 Previous Page Next Page