"హైజాకింగ్ కి శిక్ష ఏమిటో చెప్పండి వాళ్లకి ముందుగా. నెమ్మదిగా చెప్పండి. రెచ్చగొట్టేటట్లుకాదు. అప్పటికీ లాభం లేకపోతే వాళ్ళ డిమాండ్స్ ఏమిటో తెలుసుకోండి."
"సర్!" అని చెప్పి, శతృఘ్నతో మాట్లాడటం మొదలుపెట్టాడు చీఫ్ సెక్రటరీ. సౌమ్యంగా ఉంది అతని గొంతు. "హలో దేర్? నీ పేరేమిటి?"
"షాట్ గన్!"
భుజాలెగరేశాడు చీఫ్ సెక్రటరీ.
"ఓకే మిస్టర్ షాట్ గన్! హైజాకింగ్ చాలా తీవ్రమైన నేరం అని మీకు తెలుసునా? మన దేశపు చట్ట ప్రకారం, అంతర్జాతీయ ఒడంబడికల ప్రకారం కూడా అతి తీవ్రమయిన శిక్ష పడుతుంది మీకు. ఆ సంగతి మీరు గ్రహించకపోయి ఉండవచ్చు. ఇప్పటికయినా మించిపోయింది లేదు. విమానం సురక్షితంగా సవ్యసాచి చేతుల్లో ఉంది. కాబట్టి ఇంతకు ముందు జరిగింది అంతా ఒక పీడకల అని మర్చిపోదాం. ప్రభుత్వం మీకు ఉదారంగా క్షమాభిక్ష ప్రసాదిస్తుంది ఓకే?"
"మా డిమాండ్స్ ఎవరికి చెప్పాలి?" అన్నాడు శతృఘ్న.
ఒక్కక్షణం ఆగి, శాంతంగా అన్నాడు చీఫ్ సెక్రటరీ. "చూడు నువ్వు మొండిగా హైజాక్ చెయ్యడానికి నిశ్చయించుకున్నా, ప్రపంచంలోని ఏ దేశమూ నీకు ఆశ్రయం ఇవ్వదు. రక్షణ ఇవ్వదు గుర్తుంచుకో!"
"మా డిమాండ్స్ ఎవరికి చెప్పాలి?" అన్నాడు శతృఘ్న మళ్ళీ.
అతి కష్టం మీద ఆగ్రహాన్ని అణుచుకున్నాడు చీఫ్ సెక్రటరీ. "సరే నేను చెప్పవలసింది చెప్పాను. ఏమిటి నీ డిమాండ్సు?"
ఒక్కొక్క అక్షరం విడివిడిగా పలుకుతూ చెప్పాడు శతృఘ్న.
"మాకు పదికోట్ల రూపాయలు కావాలి ఇండియన్ కరెన్సీ కాదు. అమెరికన్ డాలర్సు, అవీ చిన్ననోట్లు, పాతవి కావాలి. ఓకే? మేము పాకిస్తాన్ లో రావల్పిండి ఎయిర్ పోర్టులో ప్లేన్ నీ, పాసింజర్స్ నీ వదిలేస్తాము. అక్కడ నుంచి మేము మా ఇష్టం వచ్చిన దేశానికి వెళ్ళిపోవడానికి ఫ్రీ పాసేజ్ కావాలి. ఎలాంటి ఆంక్షలూ ఉండకూడదు."
"జస్ట్ ఏ మినిట్!" అని అడ్డు తగిలాడు సవ్యసాచి. "ఇమీడియెట్ ప్రాబ్లం ఒకటి ఉంది విమానంలో. ఫ్యూయెల్ ఇంకో గంట ప్రయాణం చేస్తే అయిపోతుంది. మనం దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్టులో దిగి రీ ఫ్యూయల్ చేయించుకోవాలి తక్షణం! లేకపోతే విమానం కూలి పోతుంది."
"మనకి దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్టు ఏది?" అన్నాడు శతృఘ్న.
సవ్యసాచి అదే ప్రశ్నని ఎయిర్ పోర్టు కంట్రోల్ టవర్ ని అడిగాడు.
"మెడ్రాస్!" అని చెప్పాడు మెహతా.
విమానం ఇందాకటినుంచీ అగమ్యంగా ఎగురుతూ మెడ్రాస్ దరిదాపుల్లోకి వచ్చిందన్నమాట! మెహతా ఇచ్చిన ఇన్ ఫర్మేషన్ ప్రకారం విమానం ఉన్న లొకేషన్ ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు సవ్యసాచి.
"మాకు మెడ్రాస్ ఎయిర్ పోర్టులో రీ ఫ్యూయెలింగ్ కి ఫెసిలిటీస్ కావాలి!" అన్నాడు శతృఘ్న.
"కొంచెంసేపు ఆగు!" అని ఢిల్లీని కాంటాక్టు చేసి శతృఘ్న డిమాండ్స్ తెలియచేశాడు చీఫ్ సెక్రటరీకి.
"ఆలోచించుకోవడానికి టైం కావాలని చెప్పండి" అన్నాడు విదేశాంగమంత్రి.
ఆ మాటలు శతృఘ్నకి చెప్పాడు చీఫ్ సెక్రటరీ.
నిరసనగా నవ్వాడు శతృఘ్న.
"సరే! మద్రాసు ఎయిర్ పోర్టులో దిగాక ఇరవైనాలుగు గంటలు టైం ఇస్తున్నాను!
లుక్! టైమ్ ఇచ్చాను కదా అని వెధవ్వేషాలు వెయ్యాలని చూడొద్దు! చిల్లర కొట్లో బేరమాడినట్లు నాతో బేరమాడాలని కూడా చూడొద్దు. మా డిమాండ్స్ ఒప్పుకోవడం తప్ప వేరే దారిలేదు మీకు. విన్నావా ఇరవైనాలుగు గంటలు టైము, ఆ తర్వాత పాసెంజెర్సు అందరినీ అరగంటకి ఒకళ్ళు చొప్పున కాల్చేస్తాను."
వెంటనే ఆ మెసేజ్ ని ఢిల్లీకి కన్వే చేశాడు చీఫ్ సెక్రటరీ. అది వెంటనే ప్రధానమంత్రికి చేరింది. ఆయన తొమ్మిది దేశాల పర్యటన ముగించుకుని, దాదాపు రెండువందల సమావేశాల్లో పాల్గొని నిన్ననే తిరిగి వచ్చారు ఇండియాకి.
"గుర్తుంచుకోండి! ఇరవైనాలుగు గంటలే టైము! నేను పరమ కిరాతకుడిని!" అని డిస్ కనెక్టు చేసి, పాసెంజెర్సు కేబిన్ లోకి తిరిగివచ్చాడు శతృఘ్న.
పాసెంజెర్స్ లో కొంతమంది భయంతో నీలుక్కుబోయి, నోట మాట రాకుండా కూర్చుని ఉన్నారు. కొంతమంది సన్నగా ఏడుస్తున్నారు.
అప్పటికి పూర్తిగా స్పృహలోకి వచ్చేసింది సుజాత. నిటారుగా కూర్చుని జరుగుతున్నదంతా గమనించి చూస్తూంది. ఆమె మొహంలో నిన్నటి బెదురు లేదు. మృత్యువు అంచుదాకా వెళ్ళి తిరిగివచ్చిన తర్వాత ఆమెకు చిత్రంగా చావంటే భయం పోయింది.
శతృఘ్ననే వెన్నాడుతున్నాయి ఆమె చూపులు.
అప్పుడు
పేగులు తెగిపోతున్నంత బాధపడుతూ పెద్దగా కేక పెట్టింది ప్రెగ్నెంటు అమ్మాయి. ఆమె పేరు స్వాతి. సీట్లో కూర్చోలేక విలవిల్లాడుతూ మెలికలు తిరిగిపోతోంది. ఆమెని గట్టిగా పట్టుకుని, సముదాయిస్తోంది మోనికా.
శతృఘ్న గబగబా స్వామి దగ్గరగా వెళ్ళి, ఆమెని పరీక్షించి, వెంటనే మోనికాతో అన్నాడు "చూడు! ఈ అమ్మాయికి డెలివరీ టైం దగ్గర పడింది. ఎయిర్ క్రాఫ్ట్ వెనక భాగంలో, టాయిలెట్స్ కి దగ్గరగా కర్టెన్ లాంటిది ఏదన్నా కట్టు! హాట్ వాటర్ అరేంజ్ చెయ్యగలవా? త్వరగా!"
త్వరత్వరగా వెళ్ళి, ఒక దుప్పటీ, రెండు రగ్గులూ-దిండ్లూ తెచ్చింది మోనికా. దుప్పటి కర్టెన్ లా కట్టింది. రగ్గులని ఫ్లోర్ మీద పరుపులా పరిచింది.
స్వాతిని చిన్న పిల్లని ఎత్తుకున్నట్లు రెండు చేతుల్లోనూ ఎత్తుకుని తీసుకెళ్ళి, రగ్గుల మీద పడుకోబెట్టాడు శతృఘ్న. తలకింద దిండ్లు అమర్చాడు కానీ వాటిమీద తల ఉంచి పడుకోలేకపోతోంది స్వాతి. దుర్భరమైన బాధతో వివశురాలై అటూ ఇటూ దొర్లిపోతోంది.