Previous Page Next Page 
సీతాచరితం పేజి 31


    సుమిత్ర సంతోషించింది.


    రాముడు తల్లులవద్ద శెలవు తీసుకున్నాడు. సీతతో సహా తన భవనానికి వెళ్లాడు. అక్కడికి వశిష్ఠుడు వచ్చాడు. రాముడు వినయవిధేయతలతో వశిష్ఠుణ్ణి ఆహ్వానించాడు. రాముడు నిర్వర్తించాల్సిన కార్యాన్ని గురించి వశిష్ఠుడు చెప్పాడు. వెళ్లిపోయాడు.


    సీతారాములు వశిష్ఠుడు చెప్పినట్లు చేశాడు. వారు స్నానాలు చేశారు. నారాయణుని పూజించారు. రాముడు హవిఃపాత్రను నెత్తిన ఉంచుకున్నాడు. హోమం  చేశాడు. హవిశ్శేషాన్ని భార్యాభర్తలు భోం చేశారు. దర్భలు పరచుకొని పడుకున్నారు.


    తెల్లవారకముందే మేల్కొన్నారు. స్నానాలు చేశారు. రాముడు ప్రాతస్సంధ్య చేశాడు. గాయత్రిని జపించాడు. తరువాత బ్రాహ్మలు పుణ్యాహ వాచనం చేయించారు. ఆ మంత్ర ఘోషతో నగరం నినదించింది.


    అలా ఉండగా పౌరులు నగరాన్ని ముచ్చటగా అలంకరించారు.  భవనాలమీద పెద్దపెద్ద జండాలు కట్టారు. నాట్యకత్తెలు నాట్యాలు చేశారు. గాయకులు పాటలు పాడారు. ప్రతి ఇంటికి, ప్రతి ద్వారానికి పూలదండలు కట్టారు. పల్లెలనుంచి జనం వచ్చారు. వారితో నగరం నిండిపోయింది. వారు రామ పట్టాభిషేకాన్ని గురించి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. కొందరు గుమిగూడి రాముని గుణగుణాలను కొనియాడుతున్నారు.


    ఆ నగరం జలజంతువుల రొదకలిగి, కలతపడే సముద్రంలా ఉంది.


    రాజభవనాలు కుట్రలు, కుహకాలకు పుట్టలు ఎక్కడ చూచినా పుట్టలే. ఏ పుట్టలోంచి పాము లేస్తుందో భుస్సుమంటుందో తెలియదు. భుస్సుమన్న పాము ఊరుకుంటుందా? కాటు వేస్తుంది. ప్రతివాడూ కాటు వేయడానికి పొంచి ఉంచాడు. ఎటునుంచి కాటు పడుతుందో తెలీదు.


    దశరథుని కుటుంబంలో ముగ్గురు పెళ్లాలు - నలుగురు కొడుకులూ ఉన్నారు. మరో ఇద్దరు కొడుకులు ఈ కాండలో తరువాతగాని కనిపించరు. ప్రస్తుతానికి ఈ కుటుంబంలో ముగ్గురు భార్యలూ, ఇధ్దరు కొడుకులు మాత్రమే.


    ముగ్గురు భార్యల చరిత్ర విచిత్రంగా కనిపిస్తుంది. ఈ ముగ్గురిలో కైకమాత్రం రాజవంశానికి చెందిందిగా కనిపిస్తుంది. కౌసల్యా, సుమిత్ర పుట్టిళ్లను గురించి ఎక్కడా చెప్పలేదు. కౌసల్య సాధారణంగా స్త్రీ అయినా మొదటి భార్య. అందువల్ల ఆవిడకు కొన్ని హక్కులున్నాయి. సుమిత్ర విషయం విచిత్రం. ఆమె కౌసల్యకు నీడగా ఉంటుంది.  అంతేకాదు, ఆమె కొడుకులూ అంతే. లక్ష్మణుడు రామునికి నీడలాంటివాడు. శత్రుష్నుడు భరతునికి అలాంటివాడే. పాపం సుమిత్రను చూస్తే జాలివేస్తుంది.


    ఇహ కైక ఆమె కైకేయ రాజపుత్రి. ఆమెకు పుట్టింటి బలం ఉంది. రాజపుత్రిని అనే గర్వం కూడా ఉన్నట్లుంది. భార్యల్లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉన్నట్లుంది. ఆ విధంగా భార్యల్లో రెండు వర్గాలున్నట్లు కనిపిస్తుంది. ఒక వర్గం మరో వర్గాన్ని మట్టుపెట్టాలని కుట్రలు జరుగుతున్నాయి.


    కౌసల్య తన కొడుకు రాజు కావాలని కోరుకుంటుంది. రాముడు పెద్ద కొడుకు. కౌసల్య పట్టమనిషి. అతడు రాజు కావలసిందే. అనుమానం దేనికి? అయినా తన కొడుకు రాజు కావాలని ఆమె ఉపవాసాలు చేసింది. వ్రతాలు చేసింది. అంటే భరతుడు రాజు కావాలనే పథకం ఏదో మొదటినుంచీ ఉన్నట్లుంది.


    దశరథునికి రామునిమీద అభిమానం ఎక్కువ. భరతుడు ఎక్కువ కాలం మేనమామల ఇంట్లోనే పెరిగాడు. రాముణ్ణి రాజును చేయడానికి భయపడటం దేనికి? ఏదో ముంచుకొని వస్తుందని భయం ఉంది తనకు.


    భరతుడు రాజు కావాలనే పథకం కైకేయ రాజు దగ్గర సిద్ధం అవుతున్నట్లుంది. కైకకు సంబంధించిన విషయాల్లో పుట్టింటివాళ్లే నిర్ణయాలు చేస్తున్నట్లున్నారు. ఆ విషయం దశరథునికి తెలుసు. అందుకే అతడు కైకేయ రాజకుమారునికి వర్తమానం పంపలేదు. వాళ్ళు వస్తే గొడవ జరుగుతుందని అతనికి తెలుసు. అందుకే ఆలస్యం చేయదలచలేదు. నిర్ణయం జరిగిపోయింది. తెల్లవారే పట్టాభిషేకం జరిపించాల్సిందని నిర్ణయించాడు. ఆలస్యం అవుతే కైకేయరాజుకు తెలియవచ్చు. వాళ్లు గొడవ చేయవచ్చు. దశరథుడు వార్త పంపనివాళ్లలో జనకుడు కూడా ఉన్నాడు. మాండవి విషయంలో కుశధ్వజునికి ఆసక్తి ఉంది. కుశధ్వజుడు, కైకేయరాజు ఒకటి కావచ్చు.


    రాముడు రాజవుతున్నాడు. ఈ వార్త కౌసల్యకు తెలిసింది. తననూ, సుమిత్రనూ సంతోష పెట్టమంటుంది. రామునితో. కైక విషయం ప్రస్తావించదు రాముడు తనకు రాజ్యం వస్తే లక్ష్మణునికి వచ్చినట్లే అంటాడు. అతడూ భరతుణ్ణి గురించి ప్రస్తావించడు.


    ఆ రోజుల్లో రాజ్యాలు వంశానుక్రమముగా సంక్రమించడం ఆచారం. ఇది భూస్వామ్య సంప్రదాయం. రాజ్యం వంశానుక్రమంగా సంక్రమించినా ప్రజలను సంప్రదించడం ఆచారంగా ఉన్నట్లుంది. ప్రజలకు నాయకుణ్ణి ఎన్నుకోవడం ఆదిమ సమాజపు రివాజు. కాబట్టి భూస్వామ్యం బాగా బలపడుతునట్లు కనిపిస్తుంది. అది ఆదిమ సమాజం నుంచి భూస్వామ్యానికి పరిణామం చెందుతున్న దశలా ఉంది.


    ఆనాటి ప్రజలను సంప్రదించే పద్ధతి చూస్తే అది ఈనాటి రాజకీయ నాయకుల ఎన్నికలాగే కనిపిస్తుంది. దశరథుడు రాజులనూ, సామంతులనూ వేరువేరుగా సంప్రదించాడు. వారిని ఒక నిర్ణయానికి తెచ్చాడు. వారిని తమ ప్రజలను వప్పించడానికి వదిలేశాడు. అప్పుడు సభచేశాడు.


    సభలో దశరథుడు నామమాత్రంగా తన నిర్ణయం వెల్లడించాడు. సభికులంతా వెంటనే ఏకగ్రీవంగా అంగీకరించారు. భూమిక సిద్దం చేసినవాడు దశరథుడే. అయినా అతడు సభకు కృతజ్ఞత తెలియజేస్తాడు.


    మన నాయకులూ అంతేగా.


    రాజ్యసభలు మేడలమీద జరిగినట్లు కనిపిస్తుంది. ప్రభువులను, సామంతులకు మాత్రమే రాజ్యసభలోకి అనుమతి. పౌరులు, జానపదులు వీధుల్లో నుంచుంటారు. ప్రభువులూ, సామంతులు బయటికి వెళ్లి పౌరులను జానపదులను సంప్రదించి వస్తారు.

    
    మనస్సులో మంట:


    మంధర కైకత వచ్చిన దాసి. పుట్టింటివారు ఆమెకు మంధరను అరణంగా ఇచ్చారు. మంధర ఎక్కడ పుట్టిందో తెలీదు. ఆమె కైక వెంట వచ్చింది అంతే తెలుసు.


    మంధర మామూలుగా మేడమీదికి ఎక్కింది. ఆమెకు పురవీధులు కనిపించారు. అవి అలంకరించి ఉన్నాయి. ఆనందం తాండవిస్తూంది. కారణం ఆమెకు బోధపడలేదు. పక్కనే ఒకదాసి కనిపించింది. అదీ ఉత్సాహంగా ఉంది. పట్టుబట్టలు కట్టుకొని ఉంది. మంధర దాసిని పిలిచింది. దాని ఉత్సాహానికి కారణం అడిగింది. "నీకు తెలీదా-రేపు రాముని పట్టాభిషేకం-దశరథుడు జరిపిస్తున్నాడు-చూడు నగరం సాంతం మురిసిపోతూంది" అని వెళ్లిపోయింది.


    దాసి దాని మాటలు మంధరమీద పిడుగులా కూలాయి. ఆమె ముఖం మాడింది. గుండె దడదడలాడింది. పడుతూ, లేస్తూ సుడిగాలిలా మెట్లమీంచి దూకింది. కైక దగ్గరకు పరిగెత్తింది. కైక పడుకొని ఉంది. నిశ్చలంగా ఉంది.

 Previous Page Next Page