Previous Page Next Page 
చెక్ పేజి 31


    "చూడండి బాబులూ, మన చిటికెన వేలుకు దీపం వేడి తగిలినా అల్లాడిపోతాం. అలాంటిది భగభగమని మండుతున్న మంటల్లో దీనిని కాల్చాను. ఇది ఇనుపగుండు. దీన్ని రామూ కడుపుమీద పెడతాను. ఆ జుట్టుపోలుగాడి దయవల్ల వాడికి కాలదు. చర్మం యధాప్రకారం పువ్వులానే వుంటుంది. ఏదీ ఒకసారి చప్పట్టు కొట్టండి"

 

    పట్టుకర్రతో ఇనుప గుండును అగ్గిలో నుంచి పైకి తీసి దాన్ని రామూ కడుపుమీద పెట్టాడు.

 

    వాడి కళ్ళకు గంతలు కట్టి వేయడంతో ఇనుపగుండు తన కడుపుమీద పెట్టాకే వాడికి తెలిసింది. వాడికి కడుపు కాలకపోవడంతో అలానే పడుకుండిపోయాడు.    

 

    సత్యనారాయణ రెడ్డితో సహా అందరూ విస్మయంతో చూస్తున్నారు.

 

    ఇనుపగుండు చల్లారిపోయింది.

 

    రామూ కడుపుపై నుంచి దాన్ని తీసి కింద పెట్టాడు పెరుమాళ్.

 

    "ఏరా అబ్బీ" పిలిచాడు పెరుమాళ్.

 

    "ఆ" రామూ పలికాడు.

 

    "ఇంతకు ముందు ఏం జరిగిందో తెలుసా?"

 

    "తెలియదు."

 

    "అగ్గిలో కాల్చిన ఇనుపగుండును నీ పొట్టపై పెట్టాను"

 

    దాంతో రామూ కంగారుగా లేచిపోయి, గంతలు విప్పుకోవడానికి ప్రయత్నించాడు.

 

    "అవసరపడకు నేనే విప్పేస్తాను."

 

    పెరుమాళ్ రామూ కళ్ళకున్న గంతలు విప్పాడు.

 

    వాడు కళ్ళు సులుముకుంటూ గుంపులోకి పరుగెత్తాడు.

 

    పెరుమాళ్ ఆ తరువాత కొబ్బరి ఆకును పసరిక పామును చేశాడు. ఓ వేరుశనగ పప్పును భూమిలో పాతి, చెట్టును మొలిపించాడు.

 

    ఈ విద్యలు చేశాక పెరుమాళ్ గొంతు సవరించుకున్నాడు.

 

    "అమ్మలార ! అయ్యలార ! జుట్టుపోలుగాడి మహిమ వల్ల నేను ఇవన్నీ చేస్తున్నాను. వాడి దయ లేకపోతే ఈ విద్యలు చేసే నేను రక్తం కక్కుకుని చచ్చిపోతాను. వాడి కరుణ వుండబట్టి నేను బతికి బట్ట కడుతున్నాను. అలాంటి వాడికి నేను కాయో, కర్పూరమో, పూలో, పండ్లో ఇవ్వాలి. ఈ విద్యలన్నీ చూసిన మీరు నాకు వడ్లో, సజ్జలో, జొన్నలో పెట్టాలి. అది ధర్మం. మీరు నాకు ధాన్యంపెట్టే ముందు నా దేవుడికి నేను కర్పూరం హారతి ఇస్తాను."

 

    సంచిలోనుంచి కర్పూరంలా వుండే తెల్లటి పదార్ధం తీశాడు. దానిని జుట్టుపోలుగాడి బొమ్మ ముందు పెట్టాడు.

 

    ఎండ చురుగ్గా కాస్తోంది. మర్రి ఆకులు ఎండను జల్లెడ పడుతున్నాయి. వెలుగు చుక్కల్లాగ ఎండి అక్కడక్కడ నేల మీద పడుతోంది.

 

    పెరుమాళ్ కళ్ళు మూసుకున్నాడు. "నేను జుట్టుపోలుగాడికి కర్పూరం పెట్టాను. నేను దానిని వెలిగించాను. వాడికి మహత్యం వుంటే వాడికి శక్తి వుంటే ఆ కర్పూరం దానంతట అదే మండుకోవాలి."

 

    పెరుమాళ్ ఢమరుకం తీసుకుని కసికొద్దీ వాయించాడు.

 

    ఒక్కోక్షణం గడుస్తూ వుంది. జనం కళ్ళన్నీ కర్పూరంపైనే వున్నాయి. అందర్లోనూ ఒకటే ఆలోచన-కర్పూరం దానంతట అదే మండుతుందా లేదా అని.

 

    జనం దానికేసి తీక్షణంగా చూస్తున్నారు.

 

    జుట్టుపోలుగాడు ఒక్కక్షణం పైకెగిరి గాల్లో మాయమైనట్టే ఉంది చూసేవాళ్ళకు. ఆ బొమ్మ బొమ్మలా లేదు. మంత్రాలు వచ్చిన మనిషిలా వుంది. మహిమవల్లే ఆ మంత్రాల మనిషి బొమ్మలా అయిపోయినట్టుంది.

 

    అందరూ చూస్తూనే వున్నారు.

 

    క్షణాలు గడుస్తున్నాయి.

 

    పెరుమాళ్ ఢమరుకం ఆగకుండా మోగుతూనే వుంది. అతను మూసిన కళ్ళను విప్పడం లేదు. అతని పెదవులు చిన్నగా కదులుతూనే వున్నాయి.

 

    ఒక్కసారిగా జనంలో కలకలం.

 

    కర్పూరం అంటుకుంది. గాల్లో పెట్టిన కర్పూరం ఎవరూ అంటించకుండానే దేదీప్యమానంగా వెలుగుతోంది.

 

    జనం ఈలలతో, చప్పట్లతో తమ సంతోషాన్ని, తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు.

 

    పెదవులపై మందహాసం పరుచుకుని వుండగా పెరుమాళ్ కళ్ళు విప్పాడు.

 

    కర్పూరం పూర్తిగా మండి ఆరిపోయింది.

 

    "జుట్టుపోలుగాడి దయ నా మీద వుంది. కాబట్టి నాకు గానీ, నా విద్యకు గానీ భయంలేదు. ఇప్పుడు మీకో అద్భుతం చూపిస్తాను. ఈ విద్యను పూర్తి చేస్తే మధ్యాహ్నం అయిపోతుంది. ఇప్పుడు దానిని ప్రారంభిస్తాను. మధ్యలో దానిని ఆపి మీ ఇంటి ముంగిటకి వస్తాను. మీకు తోచిన సాయం మీరు చేయండి. సత్యనారాయణ బాబు చేతికి ఎముక లేదని నాకు తెలుసు. ఆ బాబు కనీసం అరబస్తా ధాన్యం అయినా ఇప్పిస్తాడు. ఆయన కలియుగ దాన కర్ణుడు. మీరూ భోజనాలు చేసి ఇక్కడకు వచ్చేయండి. మధ్యలో ఆపిన నా విద్యను పూర్తి చేస్తాను."

 

    పెరుమాళ్ చెప్పడం ఆపాడు.

 

    ఇప్పుడు చూపించబోయే అద్భుతం ఏమిటోననే ఉత్సుకత అందర్లో.

 

    అప్పటికి టైమ్ ఒంటిగంట దాటుతోంది.

 

    పెరుమాళ్ ఓ పెద్ద బుట్టను తీసుకొచ్చి ముగ్గు మధ్యలో పెట్టాడు. మనిషి సులభంగా కూర్చోవడానికి వీలుగా వున్న బుట్ట అది. దానికి ఒక పక్క మాత్రమే మూతి వుంది. మూతిని నేలకు ఆనించి, బుట్టను బోర్లించాడు.

 

    "ఎవరో ఓ అమ్మాయి ముందుకు రావాలి" జనాంతికంగా అన్నాడు పెరుమాళ్.

 

    "నేనొస్తాను" ఇందాకటి రామూ ఉత్సాహంగా ముందుకు వచ్చాడు.

 

    "నేను అమ్మాయి కావాలన్నాను. నీకు ముందున్నది ఏమిటి?"

 

    దానికి అందరూ నవ్వారు.

 

    రాము వెనక్కు వెళ్ళి నిలుచున్నాడు.

 

    "నువ్వు రామ్మా" అని జయను చూస్తూ పిలిచాడు.

 

    "నేనా?" గతుక్కుమంది జయ.

 

    "నువ్వే."

 

    కుర్రకారంతా సంతోషం పట్టలేక విజిల్స్ వేశారు. ఆమెను దొంగచాటుగా చూడడం ఇబ్బందిగా వుంది వాళ్లకు. మధ్యలోకి వస్తే డైరెక్ట్ గా చూడవచ్చని వాళ్ల ఆశ.

 

    కంటికి అందంగా కనిపించడంతో పెరుమాళ్ జయను పిలిచాడు.

 

    "పోవే మరదలు పిల్ల, ఎం కాదులే" ఓ ముసలాయన పరాచికం ఆడాడు జయతో.

 

    "ఏం పెరుమాళ్? నీ కళ్ళు మా జయమీద పడ్డాయే" అన్నాడు సత్యనారాయణరెడ్డి నవ్వుతూ.

 

    పెరుమాళ్ సమాధానంగా ఆయన్ను చూసి నవ్వాడు.

 

    జయ జంకుతూ నిలబడిపోయింది. ఆమె అడుగు వేయలేకపోతోంది. పక్కనున్న ఆమె పినతండ్రి "వెళ్ళు. మంత్రగాడు పిలిస్తే వెళ్ళకుండా వుండకూడదు" అన్నాడు.

 

    ఇక తప్పదని జయ ముందుకు అడుగేసింది.

 

    సత్యనారాయణరెడ్డి జయ కంగారుని చూసి చూసి ముసిగా నవ్వుతున్నారు. జయలాంటి అందమైన ఆడపిల్ల అందులో భాగం పంచుకుందంటే తన విద్య మరింత రక్తి కడుతుందని తెలిసిన పెరుమాళ్ ఉత్సాహంగా తన సామాను అమర్చుకుంటున్నాడు.

 Previous Page Next Page