Previous Page Next Page 
గోరింటాకు పేజి 31


    "ఎక్కడికి పోతారు?"

 

    "చెప్పలేను. ఇంటికి పోవచ్చు. లేక హైదరాబాద్ స్నేహితుడి దగ్గరకు పోవచ్చు... గుడ్ బై" అంటూ రాజా టాక్సీలో యెక్కి కూర్చున్నాడు.

 

    "గుడ్ బై" అన్నాడు భుజంగరావు భారంగా చెయ్యి ఊపుతూ.

 

                                              8    

 

    సంక్రాంతి వచ్చింది. చక్రపాణికి తప్పలా ఊరికి రాక. బ్రహ్మానందం కూడా వాళ్ళవూరికి బయల్దేరాడు. అతను చక్రపాణిని కొన్నిరోజులు అతిథిగా రమ్మని అడిగాడు. చక్రపాణి మృదువుగా తిరస్కరించాడు. ముకుందానికి కొత్తగా చిన్న ఉద్యోగం దొరికింది. కాని ఈ ఉద్యోగం తన కుటుంబాన్ని ఆ పల్లెటూరినుంచి తీసుకువచ్చి ఇక్కడ స్థిరపడేటంత డబ్బు గుమ్మరించేది కాదు. అతను అక్కడనే వుండిపోయాడు.  

 

    ఇన్నాళ్ళయ్యాక చక్రపాణి మామూలుమనిషిలా ఇంటికి పోతున్నాడు గుండెల్లో బ్రహ్మానందం వెటకారంగా నవ్వుతున్నాడు. "ఆహా! అలాగా?" అంటున్నాడు. హఠాత్తుగా భయంపుట్టి రైల్లోంచి చీకటిలోకి దూకి, మళ్ళీ బయటకు రాకుండా అందులో దూరిపోవాలనిపించింది. బాత్ రూమ్ లోని అద్దంలో తన ముఖం వికృతంగా కనిపించాలనిపించింది. ఇతర్లు నవ్వుకునేటట్లు ఏడవాలనిపించింది.   

 

    ఈ లోకంలో అమాయకులెవరైనా వుంటే వాళ్ళు అవినీతిపరురాండ్రయిన ఆడవాళ్ళ మొగుళ్ళు. అలాంటి పిల్లల తల్లిదండ్రులు.

 

    అమ్మ దిష్టితీసింది. తాతయ్య ఆదరంతో ఒళ్ళంతా తడిమాడు. తండ్రి, తల్లి లోకంలో ఏ తల్లిదండ్రులూ యే కొడుకుతోనూ మాట్లాడనంత ఆప్యాయంగా మాట్లాడారు. అతని చెల్లాయిమట్టుకు ఎంతనిశితంగా చూసిందో "అన్నయ్యలో ఏదో మార్పు కనిపిస్తోంది" అని బిగ్గరగా అనేసింది.  

 

    తనలో తనకు కనిపించనిది దానికి కనిపించిందా?

 

    దాక్కుందామని ప్రతిగదిలోకి వెళ్ళాడు. ఎవరో ఒకరు పట్టుకు సతాయిస్తూనే వున్నారు.

 

    క్రమంగా అతనంటే అతనికే ఆశ్చర్యం కలిగింది. చాలా నెలలక్రితం నుంచీ తననేవాడు అక్కడ జీవించినట్లే, అసలు ఇక్కడినుంచి ఎక్కడకూ విడిచిపోనట్లే కలిసిపోయి తిరుగుతున్నాడు.

 

    రాజారావుకి వస్తున్నానని ముందుగా వ్రాశాడు. కాని ఇక్కడికి వచ్చాక అతను వాళ్ళవూరు వెళ్ళినట్లు తెలిసింది. పంటకోతల రోజులు, అంచేత పన్లమీద అక్కడికి పోయినట్లు తెలిసింది. వాళ్ళ ఊరికి పోదామనుకున్నాడు చక్రపాణి. కాని సెలవు నాలుగురోజులూ ఇంటిపట్టున వుండకుండా అటూ ఇటూ తిరగడానికి ఇంట్లో ఒప్పుకోలేదు.   

 

    చక్రపాణి కాలేజీ పుస్తకాలు చదువుకుంటున్నాడు. గతంయొక్క మూలుగు కలగానైనా వినబట్టంలేదు.

 

    చుట్టాలింటికి పోయొస్తున్నాడు. సిగ్గుపడుతున్నాడు. సంవత్సరాలుగా అలవాటున్నట్లు ప్రొద్దున్నే అయిదింటికే లేస్తున్నాడు.

 

    అక్కయ్యలూ వాళ్ళూ వచ్చేశారు ఇంటికి. ఆడవాళ్ళ పండక్కి తామెందుకని బావలు రాలేదు. "నీ మేనల్లుడికి నీ పోలికే వచ్చిందిరా" అంది రెండో అక్క. "అయ్యో తన పోలికా?" వాళ్ళకి తెలియదు.

 

    అక్కాచెల్లెళ్ళందరూ కలిసి బొమ్మలు పెట్టారు. తల్లి దగ్గరుండి అన్నీ చేయించింది. తండ్రీ, తనూ కలిసి కష్టపడి బల్లలూ అవీ ఆర్చీలుగా అందంగా సర్ది నౌకర్లకి పనులు పురమాయిస్తూ హడావిడిగా తిరిగారు. అతను ఓపిగ్గా తోట, పెంకుటిల్లు, నడివీధి దీపాలతోరణం అందంగా అమర్చాడు.   

 

    పండుగనాటి సాయంత్రం పేరంటాళ్ళతో ఇల్లంతా ఎప్పటిమాదిరి కళకళలాడిపోయింది. తెలిసినవాళ్ళు, పెద్దవాళ్లు, చిన్నవాళ్ళు కొంతమంది తల్లుల భుజాల చాటునుంచి చిరునవ్వుతో, చనువుతో, సిగ్గుతో పాణిని తిలకించారు. అతనికి లజ్జాభారంతో చచ్చినచావయింది. చిన్నపిల్లాడిలా తబ్బిబ్బుపడ్డాడు. తననిచూస్తే తనకే జాలివేసింది. తనెంత మంచివాడు? తానా చెడిపోయింది?    

 

    రెండురోజులు గడిచాక గావును చెల్లాయి అతని పెట్టె సర్దుతూ గావుకేక పెట్టింది. అందరూ ఏమిటేమిటని గుమిగూడారు.

 

    "సిగరెట్లు అన్నయ్య పెట్టెలో" అంటూ తీసి ఇవతలకు గిరవాటు వేసింది.

 

    చక్రపాణి ముఖం పాలిపోయింది. అంతా ఒకరివంక ఒకరు తెల్లబోతూ చూసుకున్నారు. "ఎవరు? మన పాణా సిగరెట్లు కాల్చేది?" అంటూ అతని తల్లి గోడ కానుకుని ఏడవనారంభించింది.

 

    చక్రపాణికి గుండె ఫెళఫెళమని విరిగిందనిపించింది. వాళ్ళందరి చూపులూ బల్లెపుపోటులా వున్నాయి. అతని చెల్లాయి ఘనకార్యం చేసినట్లు కళ్ళు పెద్దవిచేసి చూస్తోంది. ఇంకా నయం! ఆ పిల్ల పుణ్యమా అని పెట్టె ఇంకా కొంచెం లోతుగా శల్యపరీక్ష చేయలేదు. తాను ఎంత మందమతి! తనకు తెలియకుండా ఒకటి రెండు సీసాలు, సిగరెట్ పెట్టెలూ పట్టుకొచ్చేశాడు. తర్వాత వాటిని ముట్టుకోనూలేదు, వాటినిగురించి ఆలోచించనూలేదు.  

 

    అతను మహాపరాధం చేసినట్లు అంతా నిశ్చయించుకుని కుమిలిపోసాగారు. "నువ్వు సిగరెట్ తాగుతున్నావా?" అంటూ చెల్లాయి కోపంగా అతనిమాట వినిపించుకోకుండా దూరంగా వెళ్ళిపోయింది.

 

    ఇది ఏమంత తప్పుకాదని నచ్చచెబుదామనుకున్నాడు చక్రపాణి. అనవసరంగా తాను పట్నానికి పోయాడని వాళ్ళు నిర్ధారణ చేసుకోవటం సహించలేకపోతున్నాడు.

 

    కాని తాను చెప్పటమారంభిస్తే తన గురించి వాళ్ళు మరికొన్ని నిజాలు తెలుసుకుంటారు. నరకమంటే అప్పుడు!

 

    తండ్రి తన నేమయినా అంటాడనుకున్నాడు. కాని ఆయన అప్పటికేమీ మాట్లాడలేదు. బాధనంతా మౌనంతో వెళ్ళగ్రక్కి శిక్షని నిట్టూర్పు విడవడంతో విధించి వెళ్ళిపోయాడు.

   

    ఇంత చిన్న విషయానికి తన తల్లి అదేపనిగా ఏడుస్తుంది.

 

    తనకు చిన్నప్పటి విషయం ఒకటి గుర్తుకు వచ్చింది. అతిగారాబంగా పెరిగాడు. ఎనిమిదేళ్ళ వయస్సు వచ్చేవరకూ తనకు ఒక్క చీపురుపుల్లయినా గ్రుచ్చుకోలేదు. అసలు ముల్లుబాధ ఎలావుంటుందో తెలియదు. ఒకరోజున స్నేహితుల్తో కొత్తగా ఆడుకుంటూంటే పాదంలో ముల్లు గుచ్చుకుంది, చీపురుముల్లు. బాధకోర్వలేక గట్టిగా ఏడవసాగాడు. తుమ్మముల్లు గ్రుచ్చుకున్నా ఆఖరికి మేకులు గ్రుచ్చుకున్నా తమకు ఏడుపురాదనీ, తాను గోరంతని కొండంతలు చేస్తున్నాననీ ఆక్షేపించారు. అది తను కలలోకూడా అనుకోని బాధ అనీ, అది అంతవరకూ అనుభవించి ఎరుగడనీ వాళ్ళకేం తెలుసు?

 Previous Page Next Page