Previous Page Next Page 
నివేదిత పేజి 32


    "చదువుకుంటాను. పరీక్షలు ప్యాసవుతాను. ఈ నలుపును చెరిపేసుకుంటాను" అంటూ నవ్వింది సీత. తర్వాత వడివడిగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.

 

    వేదితా ఆశ్చర్యంగా చూస్తున్నది. ఎంత హఠాత్తుగా వచ్చిందో అంత హఠాత్తుగానే వెళ్ళి పోయింది సీత. బహుశా తనే వెళ్లగొట్టింది. ఆకస్మికంగా సీత వ్యక్తిత్వం ముందు తన వ్యక్తిత్వం ఎంత అనిపించింది. ఆమె తల భూమిలోకి కృంగిపోయినట్లు అనిపించింది.

 

                                            * * *

 

    రానూ రానూ వేదిత ఉన్మాదినిలా అయిపోతున్నది. ఎడతెగని ఆలోచనలతో ఆమె తల బ్రద్ధలయిపోతున్నది. ఎప్పుడూ ఎవరో వెన్ను మీద చరిచినట్లు ఉలికిపడుతూ ఉంటుంది. రాత్రిళ్ళు నిద్రరాదు. పీడ కలలు, ఒడలంతా లావా విరచిమ్ముతున్నట్లు వుండేది. రాత్రుళ్ళు హఠాత్తుగా లేచి కూర్చుని, ఆ చీకట్లో ఒంటరిగా చెట్లమధ్యగా తిరుగుతూ ఉండేది. తండ్రికి ఆమె స్థితి అర్థంగాక సతమతమయేవాడు. "నేనేమన్నా పొరపాటు చేశానా? ప్రభూ! తప్పుదారి త్రొక్కించానా? ఆమె జీవితాన్ని నరకం చేశానా ?" అని వాపోయేవాడు.

 

    ఎటూ తోచక వేదిత ఒకసారి వేదమాతకు ఉత్తరం రాసింది. "మాతా! మొదట ఇంతవరకూ సాఫీగా, సుగమంగా ఉన్న మార్దవం ఇప్పుడు మూసుకుపోతోంది. చీకటి ఛాయలు క్రమ్మివేస్తున్నాయి. నా మనస్సు నా వశం తప్పిపోతోంది చనిపోయిన పెనిమిటి ఎన్నోసార్లు నా స్వప్నంలో సాక్షాత్కరించారు. ఏమిటో అంటారు. అంతా గోలగా ఉంది. ప్రకృతి శక్తులు నన్ను చెండుకు తింటున్నాయి. సవాలు చేస్తున్నాయి. జీవితమంటే ఒకరకం అభిరుచి బయల్దేరింది. నా ఉనికి నాకు అసహ్యంగా మారింది. ఉపశాంతి లభించటంలేదు. ఈ స్థితిలో నాకు దిక్కు తోచటంలేదు. నా గమ్యం ఏమిటి? నన్ను నేను ఎలా మలుచుకోను? నా చేతుల్లో ఎంతవరకూ ఉంది? నేనేం చెయ్యాలి?"

 

    వేదమాత జవాబు రాసింది.

 

    "వత్సా! నీ ఉత్తరం చదివి నీవు ప్రస్తుతం ఉన్న దశను అర్థం చేసుకున్నాను. భగవత్ సాధన అంటే అంత తేలిక అనుకున్నావా? సాధకుడు లేక సాధకురాలు నిరంతరం యిలా ఎన్నో సంగ్రామాలు చేయవలసి ఉంటుంది. ఒక్కోసారి నీ మీద నీకే అనుమానం వస్తూ ఉంటుంది. నీ నమ్మకాలమీద నీకే అపనమ్మకం కలుగుతూ ఉంటుంది. భగవంతుడి ఉనికిమీద కూడా సందేహాస్పదురాలవు అవుతూ ఉండటం కూడా కద్దు. ఏం?

 

    "నీ విప్పుడు భ్రాంతి అనే విషవలయంలో మునిగి తేలుతున్నావు. సాధకుడు ఈ భ్రాంతిలోంచి బయటకు తేరుకున్నప్పుడు గాని ఉచ్ఛస్థితికి రాలేడు. అయితే అలా రావటానికి యేం చెయ్యాలి? మనమీద మనం అసహ్యం పెంపొందించుకుంటే పరిష్కారం జరగదు. సాధనను నియమబద్ధంగా ఆచరించాలి.

 

    "ప్రపంచంలో యే పని చేయటానికన్నా ఓ నియమం, పధ్ధతి ఉన్నాయి. ఆయా పద్ధతుల ప్రకారం ఆచరించినప్పుడే ఆ పనులకు సార్థకత, పుష్టి సమకూరుతాయి. అలాగే సాధనలోకూడా జపమాల త్రిప్పటం దగ్గర్నుంచీ, ప్రతి స్వల్ప విషయంలోనూ నిర్ధిష్ట పద్ధతులున్నాయి. వాటిని సక్రమంగా నిర్వహించినపుడే సరియైన ఫలితం సమకూరుతుంది.

 

    "వత్సా! నువ్వు అధైర్యపడకు. నేను రాసే ప్రతి విషయమూ నిశితంగా పరిశోధించి, చిత్తశుద్ధితో ఆచరించి చూడు. సాధనలో తొందరపాటు, కంగారు కూడదు. ఎంత నిదానంగా, క్షుణ్ణంగా ఆచరిస్తే అంత మంచిది."

 

    అంటూ పద్మాసనం వెయ్యటం గురించీ, మంత్రాలు ఉచ్ఛరించే పధ్ధతిగురించీ, ఏయే వేళల ఏయే కార్యక్రమాలు నిర్వర్తించాలో ఆ విధానాలను గురించి యిలా వివిధ అంగాల గురించి విపులంగా రాసింది.

 

    ఆ ఉత్తరం చూశాక వేదితలో ఓ క్రొత్త జీవం ప్రవేశించినట్లయింది. నూతన బలం కలిగినట్లయింది.

 

    ఆమె ముందుకు సాగింది, నూతన చైతన్యంతో.  

 

                                            * * *

 

    ఓ రాత్రి గోవిందాచార్యులుగారు యింటికి తిరిగివచ్చి "ఇన్నాళ్ళూ ఇందుమతమ్మగారు రోగంతో కృశించి పోతున్నదా? ఇప్పుడు హఠాత్తుగా సీత కూడా మంచాన పడింది. వాళ్ళ యింటి పరిస్థితి యెలా ఉందని చెప్పమంటావు?" అని ఓ క్షణమాగి సాలోచనగా "మనోవ్యాధితోనే మంచమెక్కినట్లు కనబడుతుంది. ఏమయినా శాయి చేసిన పని బాగులేదమ్మా. సంవత్సరాల తర్వాత స్వదేశం తిరిగి వచ్చి, యింటి సంగతి యేమీ పట్టించుకోకుండా తన దార్న తాను బొంబాయి వెళ్ళిపోవటం బుద్ధిమంతుడు చేయవలసిన పనిగాలేదు. వాళ్ళకిప్పుడు ఎవరు దిక్కు చెప్పు" అన్నారు.   

 

    వేదిత దీనికేమీ సమాధానం చెప్పకుండా విని ఊరుకుంది.

 

    మరునాడు ఉదయం ఆమె కోనేటి గట్టున కూర్చుని ఉండగా ఇందుమతమ్మగారి పనిమనిషివచ్చి "మిమ్మల్నోసారి సీతమ్మగారు పిలుచుకు రమ్మన్నారు. అమ్మా" అని కబురు చెప్పింది.

 

    వేదిత విస్తుపోయి, సీత యిలా యెందుకు చేసిందనుకుంటూ "ఎందుకు?" అని ప్రశ్నించింది అప్రయత్నంగా.

 

    "తెలీదమ్మా. అసలమ్మగారే వద్దామనుకున్నారుగాని జబ్బుగా ఉండటం వల్ల మంచం మీదినుంచి లేవలేకపోతున్నారు. మిమ్మల్ని ఎలాగైనా తీసుకురమ్మని మరీమరీ చెప్పారు."

 

    "అంత జబ్బుగా ఉందా?" అని అడిగింది వేదిత క్షణమాగి.

 

    "అవునమ్మా! చాలా చిక్కిపోయారు. అసలమ్మగార్ని గుర్తుపట్టటమే కష్టంగా ఉంది."  

 

    ఆ యింటికి చేరి అక్కడి పరిస్థితి చూశాక దుఃఖాన్ని మరిచిపోదామనుకుంటూన్న వేదితకు దుఃఖం కలిగి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇందుమతమ్మగారు తను మామూలుగా పడుకునే గదిలో మంచానికి అంటుకుపోయి పడుకుని ఉంది. ప్రక్క గదిలో సీత ఉంది. వేదిత వెళ్ళేసరికి ఆ గదిలోంచి బయటకు వస్తూన్న యాభయి ఏళ్ళు దాటిన ఓ సజ్జనుడు ఆమెను చూసి నమస్కరించి ప్రక్కకి తప్పుకున్నాడు. మొదట ఇందుమతమ్మగార్ని పలకరించి ఆమె సీత వున్న గదిలోకి వెళ్ళింది. సీత మంచంమీద పడుకుని ఉండి గుమ్మంవైపు చూస్తోంది. మంచం చుట్టూ ఉన్న దోమతెర పైకి ఎత్తబడి ఉంది.

 Previous Page Next Page