పనిమనిషి చెప్పినమాట అబద్ధం కాదు. సీతకు కళ్ళలో ఉన్నాయి ప్రాణాలు. మనిషి నీరసించి, కృశించి, ముఖం కళావిహీనమై ఉంది. కనుల చుట్టూ నల్లని గీతలు అలుముకున్నాయి.
వేదితను చూడగానే ఆమె ముఖం సంతోషంతో వికసించింది. "అక్కా వచ్చావా?" అన్నది ఆనందం ధ్వనించిన హీనస్వరంతో.
వేదిత చప్పున ఆమె దగ్గరకు వెళ్ళి, మంచంమీద కూర్చుని, శరీరంమీద చేయివేసి నిమురుతూ " మనుషులు యింత స్వల్ప వ్యవధిలో కూడా గుర్తుపట్టకుండా చిక్కిపోవచ్చని నిన్ను చూడగానే గ్రహించాను. ఏం జరిగింది నీకు?" అంది ఖేదంగా.
సీత ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆమె చేతిని తన సున్నితమైన వేళ్లతో నిమురుతూ "అన్నమాట తప్పేశానుగా, నువ్వు రావనుకున్నానక్కా. అసలు ఉత్తరంరాసి పంపిద్దామనుకున్నా కాని కలం పట్టుకోవటానికి కూడా ఓపిక చాలలేదు. నువ్వు రాకపోతే ఏం జరిగేదో తెలుసా? అంది.
"ఏం జరిగేది?"
"ఈ మంచాన్ని మోయించుకుని నేనే వచ్చేసేదాన్ని" అంది నవ్వి. వేదిత ఆమె బుగ్గమీద చిటికెవేసి "నువ్వు అన్నిటికీ తగుదువు. ఈ సమయంలో నిన్ను చూస్తుంటే ఓ కోరిక పుడుతున్నది చెల్లీ" అంది.
"ఏమిటక్కా!" అంది సీత కుతూహలం కనబరుస్తూ.
"మన మిద్దరం మానవులుగా జన్మించకుండా - నేనో స్వేచ్ఛగా ఎగిరే పావురాన్నయి, నీవు నా పిల్లవై పుడితే ఎంత బాగుండేదా అని?" సీత కనులలో ఆనందం మెరుస్తూండగా "అట్లైతే ఎంచక్కా బాగుంటుంది. కాని అన్ని జన్మలలోకి మానవజన్మ ఉత్తమ మంటారు. అన్ని తెలిసిన విజ్ఞాన దేవతవు. మానవజన్మ గురించి అంత విరక్తిగా మాట్లడతావేం?" అన్నది.
"మానవజన్మ ఉత్తమమేగాని మానవులందరికి కాదు."
ఈ మాటలు విని సీత చకితురాలయి వేదిత ముఖంలోకి చూసింది. అదే గంభీరముద్ర!
"అక్కా! తెల్లవారుతుంది. పగలు సాగుతుంది. సంధ్య అలుముకుంటుంది. చీకటి కబళిస్తుంది. దూరంగా ఏరు ప్రవహిస్తుంది. చెట్లమీద నుంచి పక్షులు యెగురుతాయి. తిరిగి గూళ్ళకి చేరుకుంటాయి. పువ్వులు పరిమళిస్తాయి. మళ్ళీ సువాసనని పోగొట్టుకుంటాయి. అంతా అవే దృశ్యాలూ అవే సంఘటనలు. నూతన స్పందనలేదు. మార్పులేదు. కొత్త చిగుళ్ళు తొడగవు. బావురుమనే వంటరితనం, ప్రగాఢ నిశ్శబ్దం.... అందుకే రోజులు గడపటం ప్రళయంగా ఉంటుంది."
"చెల్లీ!" అంది వేదిత యీ ప్రసంగానికి విహ్వలురాలై.
"అక్కా! నాకు జబ్బు చేసింది. ఏం జబ్బో తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తికూడా లేదు. పాపం నాన్న వచ్చారు నన్ను చూడటానికి. చూడటమే కాదు తీసుకెళ్ళి పోతానంటున్నారు. వెళ్ళమంటావా?"
"వెళ్ళు చెల్లీ! బస్తీకి వెళ్ళి మంచి వైద్యం చేయించుకుని జబ్బునయం చేసుకో."
"ఎలా వెళ్లనక్కా ప్రమాదస్థితిలో వున్న అత్తగార్ని వదిలి?"
"కాని యి స్థితిలో నీవిక్కడవుండి మాత్రం ఆమెకేమి సాయపడగలుగుతావు సీతా?"
"అదే నాన్న వాదనకూడా. కాని యీ వయసులో... యీ స్మశానం లాంటి కొంపలో.... వంటరిగా... ఆమె మనుగడను ఊహించుకో అక్కా!"
వేదిత ప్రక్కగది వంక ఒకసారి అప్రయత్నంగా చూసి నిట్టూర్పు విడిచింది.
"అందుకని, నేను వెళ్లనన్నాను. ఆమెని విడిచి ససేమిరా పోనన్నాను., కాని ఆమె నాకంటే మొండిదక్కా, వెడితేకాని వల్లకాదని కూర్చుంది. పెద్ద ఒట్టువేసి నన్ను తన మాట వినే తప్పని పరిస్థితిలో పడవేసింది."
వేదిత మౌనంగా ఆమె వంక చూస్తోంది.
"కాని బిక్కు బిక్కుమంటూ యీ ఇంట్లో ఆమె ఒక్కర్తీ ఏముంటుందక్కా!నాతోపాటు మ ఊరికి వచ్చేయమన్నాను. ప్రాధేయపడ్డాను. ఉహుఁ ఈ యిల్లుని, ఈ ఊరిని, ఈ భూమిని విడిచిపెట్టి కదలనని భీష్మించుకు కూర్చున్నారు." అని సీత నిట్టూర్చి రుద్ధకంఠంతో "ఈ స్థితిలో నన్నేం చేయమంటావు చెప్పు అక్కా" అంది.
వేదిత ప్రేమగా ఆమె చెక్కిలి నిమురుతూ "ఆవిడంత పట్టుదల పట్టి కూర్చుంటే నువ్వూ, నేనూ చెయ్యగలిగిందేముంది సీతా! పోనీ ఆవిడ ఆభీష్టానుసారం యిక్కడనే ఉండనీ. నువ్వు స్వస్థత చేకూరి వచ్చాక ఆవిడకు సపర్యలు చేస్తూ యిక్కడే ఉండిపోదువుగాని" అంది.
సీత నిట్టూర్చి సన్నని స్వరంతో "ఈ జబ్బు నయమయేదికాదు. నాకు స్వస్థత చేకూరటం కల్ల" అంది.
వేదిత తన చేతిని ఆమె నోటిమీద మూసి "తప్పు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు సలక్షణంగా తిరిగి వస్తావు" అంది.
రెండు నిముషాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఉదయం పదిగంటలు దాటి ఉంటుందప్పుడు. వేసవి యెండలు యింకా నిప్పులు చెరుగుతూనే ఉన్నాయి. సన్నని వేడిగాలులు ఉండి ఉండి వీస్తున్నాయి.
"అసలు నీకు ఎందుకు కబురంపించానో తెలుసా?" అంది సీత ఆ నిశ్శబ్దం తర్వాత.
తలవంచుకుని ఆలోచిస్తూ ఉన్న వేదిత ముఖం యెత్తి ఆమె కనులలోకి చూసింది.
"నిన్ను ఆఖరిసారి చూద్దామనిపించింది. అంతేకాదు. ఒక్కమారు నీ పాట విందామనిపించింది."
"ఇప్పుడా?"
"అవును ఇప్పుడే. నాలోని యీ వేడిని, ఈ తాపాన్ని భరించలేకుండా ఉన్నాను. నీ గానంతో ఒకింత చల్లదనం ఏర్పడుతుందేమోనని ఆశగా ఉంది, పాడవూ?"
వేదితకు ఒక రకం ఆవేశం వచ్చినట్లయింది. "పాడతానమ్మా! తప్పకుండా పాడుతాను" అంది అనుభూతి ధ్వనించే కంఠంతో.
వేదిత పాడసాగింది. ఆనాటి ఆమె గానంలో ఎన్నడూ లేనంత దుఃఖం, అనుభూతి, ఆరాధన మిళితమై సమగతమై ఉన్నాయి. హృదయ విదారకమైన మనస్సుతో ఆమె యెంతో ప్రార్థించింది భగవంతుడ్ని. ఆ సంగీతంలో రాళ్ళు కరిగినట్లు, సెలయేరు పారినట్లు, చీకటి ముద్దవెన్నెల వాకగా మారినట్లు అల్లంత దూరంగా ఆకాశం మెరిసినట్లు ధ్వనించింది ఆమె సంగీతం.