తర్వాత వేదిత నాలుగు రోజులవరకూ గుమ్మందాటి ఎరుగదు. ఆ నాలుగు రోజులూ ఆమె ఎండకన్ను చూడలేదు. గుడి ముఖం చూడలేదు. ఇంట్లోనైనా భగవంతుడి విగ్రహాన్ని తాకలేదు. యెప్పుడూ కళ్ళు మూసుకుని పడుకుని ఉండేది. లేకపోతే యోగినిలా కూర్చుని గంటల తరబడి యోచిస్తూ ఉండేది. గోవిందాచార్యులుగారు ఊరిలో లేనప్పుడు వచ్చి దేవాలయ నిధులు సరిచూసే అర్చకుడే వచ్చి యధావిధిగా కార్యక్రమాలు నిర్వర్తించిపోతున్నాడు. వేదిత రావటంలేదే అని అమ్మలక్కలు కుటీరంలోకి వచ్చి "అమ్మా! మా మీద దయ తప్పిందా? ఎందుకని మీరు గుళ్ళోకి కాలుపెట్టటం లేదు? మేమేమైనా తప్పు చేశామా? మా మీద కోపం వచ్చిందా?" అని అడిగారు. "లేదమ్మా! నా కెవరిమీదా కోపంలేదు. నా వంట్లో ఆరోగ్యంగా ఉండటంలేదు. స్వస్థత చేకూరగానే మీరెవరూ పిలవకుండానే నేనే మీ మధ్యకు వచ్చి నిలుస్తాను" అని వేదిత వాళ్ళందరికి సౌమ్యంగా చెప్పి పంపించేసింది. రెండు రోజులు గడిచాక గ్రామానికి తిరిగివచ్చిన ఆచార్యులుగారు కూతురి పరిస్థితి, ప్రవర్తన చూసి కలవరపడ్డాడు. మళ్ళీ జ్వరం తగిలిందేమోనని నాడి చూసి తృప్తిపడి, తీరని మనోవ్యధతో ఆమె కృంగిపోతూందని గ్రహించి, ఆమె హృదయంలోని ఆరాటాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించారు. కాని ఎంత ప్రయత్నించినా "నా ఆరోగ్యం సరిగ్గాలేదు." అని అన్నమాట తప్ప ఆమె యింకేమీ పలకకపోయేసరికి హతాశుడై, ఏమీ అర్థం చేసుకోలేక, వీలుచిక్కినప్పుడల్లా సావకాశం చూసుకుని కుమార్తె దగ్గర కూర్చుని భగవత్ గీత పఠించసాగాడు. వేదిత కొంచంసేపు మాత్రం ఆయన్ని భరించగలిగి తర్వాత ముఖం ఎత్తి అసహనంగా "నాన్నా! నాకు ఎడతెగని శిరోభారంగా వుంది. దయవుంచి యిప్పుడేమీ చదవకు" అంది. "అలాగే! అంతా పరమేశ్వరుని దయ. కృష్ణ కృష్ణ" అంటూ ఆయన మెల్లిగా అక్కడ్నుంచి లేచి వెళ్ళాడు.
మరో రెండు రోజులు గడిచాయి. ఆనాడు కూడా మధ్యాహ్న సమయాన వేదిత అలాగే చాపమీద పడుకుని వుంది. తండ్రి పనిమీద ఊళ్ళోకి వెళ్ళాడు. ఇంతలో గుమ్మందగ్గర అడుగుల చప్పుడయేసరికి ఆమె తల త్రిప్పి చూసింది.
"చెల్లీ!" అంది వెంటనే ఆశ్చర్యంతో లేచి కూర్చుంటూ.
సీత వచ్చి ఆమె ప్రక్కన ఆసీనురాలవుతూ "అక్కా! అలా ఉన్నావేం వంట్లో బాగాలేదా?" అంది భుజంపైన చేయివేసి.
"వంట్లోనా? బాగానే వుంది" అంది వేదిత మ్లానవదనంతో.
సీత ఆమెకు యింకా బాగా దగ్గరగా జరిగి, తన రెండవ చేతిని కూడా ఆమె భుజంచుట్టూ వేసి తనవైపు లాక్కుంటూ "అక్కా! మనం కలుసుకుని చాలా రోజులయింది. బోలెడు విశేషాలు జరిగాయి ఈ మధ్య. బహుశా నీకు సంబంధించనివనుకో. అయినా నువ్వు వినాలి," అంది మురిపిస్తున్నట్లు.
"ఏమిటవి? నీ విశేషాలు నా విశేషాలే. నువ్వు నా చెల్లెవి" అంది వేదిత తల ఆడించి.
"ఆలకించు. ఒకటి: మావారు అర్థాంతరంగా గ్రామం విడిచి బొంబాయి వెళ్ళిపోయారు. మళ్ళీ యిటువైపు వస్తారనీ యీ అదృష్టవంతురాలివైపు కళ్ళెత్తి చూస్తారనీ అనుకోను."
వేదిత గగుర్పాటును అణుచుకుంది. "సీతా! నీ అదృష్టానికి లోటెప్పుడూ రాదు" అన్నది.
"వ్యాఖ్యానాలు తర్వాత, అత్తగారికి జబ్బు ఎక్కువగా ఉంది. పోనీ బస్తీకి తీసుకువెళ్ళి, వైద్యం చేయిస్తానని బలవంతం చేసాను. ఆమె అంగీకరించటం లేదు."
ఈ సంగతి బహుశా ఆచార్యులుగారు కూతురికి చెప్పేవుంటారు. కాని తను ప్రస్తుతం ఉన్న మానసికస్థితిలో ఆమె వినిపించుకుని ఉండదు.
"ఇది మూడో విశేషం. చాలా సామాన్యమైంది. కొద్దిరోజుల్లో సీతకు పిచ్చి ఎత్తబోతోంది."
"సీతా!" అని అరిచి వేదిత ఆమెను తన అక్కున చేర్చుకుంది. "అలాగనకు చెల్లీ. అలాగనకు. కలకాలం శుభప్రదంగా వర్ధిల్లవలసిన సౌభాగ్యవతివి నీవు. ఉన్మాదం నీ ముఖాన శోభించదు."
"కాని మనకు మనం తెలియని స్థితిలో వుండి వెర్రినవ్వులు నవ్వు కోవటం కంటే ఆనందం ఏముంటుందక్కా? అక్కడ ఈ హింసవుండదు. అక్కడ ఈ భయంకరమైన వంటరితనం, పిశాచపు దిగుళ్ళూ, గుండెలు పగిలేలాంటి నిశ్శబ్దం ఏమీ ఉండవు. అక్కా! పోనీ నన్ను నీ శిష్యురాలిగా స్వీకరించు. పరమ పావనియైన నీకూ, కరుణామయుడైన ఆ మోహనమూర్తికీ సపర్యలుచేస్తూ కాలం గడుపుతాను." సీత ఏడుస్తోంది.
వేదిత వ్యధిత హృదయంతో ఆమె కళ్లు తుడుస్తోంది. "చెల్లీ! నువ్వు నాకు పరమాప్తురాలివి. అందుకే వొకటి అభ్యర్థిస్తున్నాను. నన్ను యిప్పట్లో కలుసుకోకు" అంది.
సీత అదిరిపడి ఆమె కళ్ళలోకి చూసింది. కాని యేమీ అర్థం కాలేదు. ప్రశాంతనీలాలుగా ఉన్నాయి ఆమె నేత్రాలు.
వేదితే చెప్పింది. "వ్యామోహపూరితమైన ఈ బంధనాల నుండి, వ్యాపకాల నుండి దూరంగా ఉండి, ఎవరి పిలుపూ వినిపించనంత ఏకాంత దిక్చక్రానికి పారిపోయి, అక్కడ వొంటరిగా నివసించాలనుకుంటున్నాను నేను. కాని నా సాధన తుత్తునియలై పోయింది. ఈ భూమ్మీద అసహ్యం ఏ మూలవుందో అక్కడికే యిడ్వబడుతున్నాను నేనూ. ఇప్పుడు నాకు కోరికలు లేవు. జీవిత శిఖరాలను చేరుకోవాలన్న కాంక్షలులేవు. కాని మనిషిగా నా బాధ్యత నిర్వర్తించాలన్న కర్తవ్యం, ధర్మం మాత్రం ఉంది. సీతా! నువ్వు నా అనుంగు చెల్లివి. మల్లెపువ్వులాంటి నీ మనసు, అది వెదజల్లే పరిమళం నా కెంతో యిష్టం. కాని ఈ అభాగ్యురాలు నీకేం మేలు చేయగలుగుతుందమ్మా?"
"ఒక అభాగ్యురాలు....?" అంది సీత. "ఒక అభాగ్యురాలు మరో అభాగ్యురాలి నుండి సానుభూతి కోరుతుంది. ఒకరి కష్టం మరొకరి కష్టంతో పోటీపడుతుంది. ఫలితం శూన్యమైనా బావురుమని ఆక్రోశించాలని ఉంటుంది కొంతమంది బలహీనులకు. అక్కా! నువ్వు రావద్దన్నావని నీ మీద నాకు కోపంలేదు. నీ స్థితిలో నేనున్నా అంతే చేస్తాను. నువ్వు నాకు యెప్పుడూ పూజనీయురాలివే " అని ఆమె పాదాలు కళ్ళ కద్దుకుని లేచి నిలబడింది సీత. "నేను వెళతాను."
"మరి ముందేం చేస్తావు?"