Previous Page Next Page 
జైలు పేజి 32


    రాత్రి రాకకోసం పరిచిన ఎర్రటి తివాచీలా వుంది సాయంసంధ్య.

 

    బ్యారెక్కులోకి వెళ్ళమని వార్డర్లు ఖైదీలను తరుముతున్నారు.

 

    యధాప్రకారం మొదటి బ్యారెక్కులోకి వెళ్ళబోతున్న ఉత్తరుడ్ని ఓ వార్డర్ నిలిపాడు. "నీ బ్యారెక్కు మారింది. నెంబరు నాలుగు" అన్నాడు.

 

    తనను బ్యారెక్కు ఎందుకు మార్చారో అర్థం కాలేదు ఉత్తరుడికి. ఇప్పుడు ఏం చేసినా బ్యారెక్కు మారదు. రేపు డిప్యూటి జైలర్ తో మాట్లాడితేగాని తిరిగి తనను మొదటి బ్యారెక్కుకు వేయరు. అందుకే ఏమీ మాట్లాడకుండా ఆగిపోయాడు.

 

    అయితే ఈ విషయం తిలక్ కి చెబుదామని చూశాడుగానీ వీలుపడలేదు. అప్పటికే తిలక్ బ్యారెక్కులోపలికి వెళ్ళిపోయాడు.

 

    "నువు నాలుగో నెంబర్ బ్యారెక్కుకిరా" అని వార్డరు అతని చేతిని పట్టుకుని తీసుకెళ్ళాడు.

 

    అతను వెళ్ళేసరికి ఆ బ్యారెక్కు బయట నలుగురు ఖైదీలున్నారు. వాళ్ళలో నైఫ్ వుండడం చూసి అతను ఓ క్షణం భయపడ్డాడు. ఈ రాత్రి తనమీదున్న ప్రేమనంతా చెప్పి బోర్ కొట్టిస్తాడని అనుకున్నాడు.

 

    అంతకు మించిన ప్రమాదాన్ని అతను వూహించలేకపోయాడు.

 

    అమాయకంగా వాళ్ళతోపాటు బ్యారెక్కులోకి వెళ్ళాడు.

 

    వార్డర్ తలుపు తాళంపెట్టి వెళ్ళిపోయాడు.

 

    ఉత్తరుడ్ని చూసి నైఫ్ మత్తుగా నవ్వి కన్నుగొట్టాడు.

 

    "డియర్! ఇలారా! వచ్చి పక్కన కూర్చో. కబుర్లు చెప్పుకుందాం" మరింత మత్తుగా పిలిచాడు.

 

    "నీతో నాకు మాటలేమిటి?" ఉత్తరుడు విసుక్కున్నాడు.

 

    "నాతో కాకుండా ఇంకెవరితో మాట్లాడతావు? నేను నీకు ప్రియుడ్ని" నైఫ్ క్రూరంగా నవ్వుతూ అన్నాడు.

 

    "బుద్దుంటే నాతో మాట్లాడవు"

 

    "అలా కోప్పడకు ప్రియా! నువు ఎంత అందంగా వుంటావో తెలుసా!" మిగిలిన ముగ్గురు ఖైదీలూ ఉత్తరుడ్ని చాలా కాంక్షతో చూస్తున్నారు. ఆడపిల్ల ఫీచర్స్ తో అతి నాజూగ్గా కనిపిస్తున్న అతడ్ని చూస్తూ వాళ్ళు ఉద్రేకపడుతున్నారు.

 

    ఉత్తరుడు సిమెంట్ దిమ్మమీద పడుకుని ఇటు తల తప్పుకున్నాడు.

 

    వాళ్ళు నలుగురూ అతనిమీద ఏవేవో జోక్ లేసుకుంటూ నవ్వుతున్నారు.

 

    ఎనిమిది గంటల ప్రాంతాన భోజనం వచ్చింది.

 

    ఏదో తిన్నాననిపించి ప్లేటు కడిగి పెట్టేసి తిరిగి పడుకుండిపోయాడు. అయినా నిద్ర రావడంలేదు.

 

    మిగిలిన నలుగురూ మాట్లాడుకుంటున్నారు.

 

    నైఫ్ అంటున్నాడు. "ఈ సెక్స్ బలహీనతవల్లే నేను జైలుకొచ్చాను."

 

    "ఏం చేశావు గురువా?" ఓ ఖైదీ అడిగాడు.

 

    "అదో పెద్ద కథలే" నైఫ్ నిట్టూర్చాడు.

 

    "చెప్పు గురూ! మన కార్యక్రమానికి ఇంకా టైముంది"

 

    "అయితే వినండి" అని నైఫ్ గొంతుసవరించుకున్నాడు.

 

    మిగిలిన ముగ్గురూ ఖైదీలు తమ చెవులకి నైఫ్ కి తగలేశారు.

 

    అతను చెప్పడం ప్రారంభించాడు.

 

    "మా వూరు అడవి. అడవంటే అడవే. మా వూరు సముద్రానికి దగ్గరగా మరో ప్రపంచంలా వుండేది. టౌన్ కు రావాలంటే ఏడెనిమిది మైళ్ళు నడిచి రావాలి. మా వూరికి బస్సుగానీ, రోడ్డుగానీ వుండేవికావు. ఎప్పుడో ఆరునెలలకో, సంవత్సరానికో టౌన్ కొచ్చి ఓ సినిమా చూసి వెళ్ళేవాళ్ళం. మిగిలిన రోజుల్లో అంతా మాకు నరసింహులు టీ కొట్టే కాలక్షేపం"

 

    నైఫ్ ఆగి మళ్ళీ ప్రారంభించాడు. "నాకు అప్పుడు పద్ధెనిమిది ఏళ్లు. నూనూగు మీసాలతో మంచి వేడి మీదున్నాను. మా వూర్లో సెక్స్ ఒక్కటే కాలక్షేపం. సినిమాలు, షికార్లు ఏమీ లేకపోవడంతో ఆడవాళ్ళను గురించి మాట్లాడుకోవడమే నాలాంటి వాళ్ళకు ఇష్టంగా వుండేది.

 

    అలా నరసింహులు టీ అంగట్లో కూర్చుని కబుర్లాడుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం. ఏడుస్తున్న పిల్లాడికి పాలబుడ్డీ ఇచ్చీనట్టు మా వూరికి సత్యభామ వచ్చింది. సత్యభామ ఎవరో కాదు - నరసింహులు భార్య.

 

    ఆమె నరసింహులు టీ అంగడికి ఎక్ స్ట్రా ఆకర్షణ అయింది.

 

    ఆమె అందం అలాంటిది. ఒంటిమీదున్న పదితులాల బంగారమూ ఆమె పరువం ముందు వెలవెలపోయేది. ఎప్పుడూ దొంగ పైర్లు మేసి బలిసిన గేదెలా వుండే ఆమె గుండెలు మతి పోగొట్టేవి. ఒడ్డూ పొడుగుతో ఎనిమిదో సంవత్సరంలోనే రజస్వల అయినట్టు వుండేది. ఎందుకో తెలియదుగానీ ఆమెను చూస్తే మంచం తప్ప మరేం గుర్తురాదు.

 

    దీంతో టీ అంగడికి వచ్చే జనం పెరిగారు. బలిసిన కోడిపుంజు కూతలాగా బిజినెస్ వూపందుకుంది.

 

    అయితే నరసింహులు మాత్రం తగ్గిపోవడం ప్రారంభించాడు. రోజు రోజుకీ అతను క్షీణించడం మొదలుపెట్టాడు. సత్యభామలాంటి ఆడది ఇంట్లో వుంటే నిజమైన మగాడు తగ్గిపోకుండా వుంటాడా అని అర్థం వచ్చేటట్టు రకరకాలుగా వూర్లో వాళ్ళు అనుకోవడం ప్రారంభించారు.

 

    జబ్బు ఏమో తెలియదుగానీ ఓరోజు నరసింహులు చచ్చిపోయాడు. సత్యభామ ఒంటరిదైపోయింది. గొలుసు తెంపుకున్న ఆవు ఎవరి చేలో పడుతుందోనన్న బెంగ వూర్లోని స్త్రీలందరికీ పట్టుకుంది.

 

    కానీ సత్యభామ పడింది మా చేలోనే. మా నాన్నకు, ఆమెకూ జత కుదిరింది. మా నాన్న చిన్నప్పుడు పెళ్ళి చేసుకుని నన్ను కనడంతో ఆయన నాకు అన్నలా వుండేవాడు. అప్పటికి ఆయన వయస్సు ముప్ఫై ఆరేళ్ళే.

 

    రంకు మొగలిపువ్వు లాంటిది. అది ఎక్కడన్నా గుప్పుమంటుంది. ఈ విషయం నా చేవిలోనూ పడింది.

 

    అప్పటికే సత్యభామ మీది మొహంతో నేను పిచ్చివాడ్ని అయిపోయాను. ఆమె మీదున్న కోరిక రోజు రోజుకూ ఎక్కువవుతోంది. మా నాన్నంటే ఈర్ష్య మొదలైంది. ఆయన పడుకుని నిద్రపోతున్నప్పుడు చంపెయ్యాలని కూడా చాలాసార్లు అనుకున్నాను. రాత్రయితే సత్యభామ దగ్గరకు బయల్దేరే నాన్నను చూస్తుంటే కోపంతో నరాలు పగిలిపోయేవి.

 

    ఏదో పనిమీద ఆరోజు మానాన్న టౌన్ కెళ్ళాడు. ఇక ఆరాత్రికి రాడని తెలుసు. ఒంటరిగా ఇంటి బయట తిన్నెమీద పడుకున్నాను. నిద్ర రావడం లేదు. సత్యభామను అనుభవించాలన్న కోరిక శరీరాన్నంతా కొండ చిలువలా చుట్టేసుకుంది. ఏదో ఒకటి ఒకటి చేయాలని మనసు తొందర పెడుతోంది.

 

    అప్పుడు తట్టింది నాకు ఓ ఉపాయం. ఇక ఆగలేకపోయాను. సత్యభామే కళ్ళముందు మెదులుతోంది. లేచి ఆమె ఇంటికి బయల్దేరాను.

 

    బయట మసగ్గా వెన్నెల - దారంట నడుస్తున్నాను. దెయ్యం జడల్లా తాటిచెట్లు. ఆ జడల్లోని జడబిళ్ళల్లా కల్లుకుండలు. రెండు చెట్లు ఎక్కి కల్లు తాగాను. సత్యభామ కళ్ళముందు నిలిచి కవ్విస్తోంది. ఏదో తెలియని మత్తు ఒళ్లంతా పాకుతోంది.

 

    ఆమె ఇంటికి నడిచాను.

 

    రాత్రి పది దాటిపోవడంతో వూరంతా నిద్రలో జోగుతోంది.

 

    మెల్లగా తలుపు తట్టాను.

 Previous Page Next Page