Previous Page Next Page 
జైలు పేజి 31


    అ మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయ్ ఆమెకు. అవమానంతో శరీరం గడ్డకట్టుకు పోయినట్లనిపించింది.

 

    ఆమె ఏదో మాట్లాడటానికి నోరు తెరిచిందిగానీ, మరోసారి పడ్డ బెల్ట్ దెబ్బ రక్తాన్నంతా తాగేసింది. ఏదో నిస్సత్తువ కమ్ముకుంది! కళ్ళలోంచి రక్తం జారుతున్నట్టు భావన.

 

    ఆర్ముగం ఒకడును ముందుకు వేసి ఆమె పైట తీశాడు. మోకాళ్ళ దగ్గర చిన్నగా తన కాళ్ళను బిగించి వెనక్కు తోశాడు. ఆమె దబ్బున కింద పడిపోయింది.

 

    అప్పుడు అర్థమైంది ఆమెకు తనను ఎందుకు తీసుకొచ్చాడో.

 

    గట్టిగా కేకవేయాలని నోరు తెరిచింది.

 

    స్త్రీ ఎప్పుడు ఎలా ప్రతిఘటిస్తుందో తెలిసిన ఆర్ముగం ఆమె నోట్లో జేబురుమాలు కుక్కాడు.

 

    ఇక తనకు ఎదురుండదని తెలిసినవాడు కావడంతో ఆమెమీద ఎగిరి పడ్డాడు.

 

    క్షణంలో ఆమెను వివస్త్రను చేసి పూర్తిగా ఆక్రమించుకున్నాడు.

 

    తమకు ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని కృష్ణారావుతోపాటు మరో యిద్దరు వార్డర్లు కూడా బ్యారెక్కు బయట ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

 

    వార్డర్లంతా మహిళల బ్యారెక్కుకు వెళుతుండడం చూసిన రఘుపతి నింపాదిగా వూపిరి పీల్చుకున్నాడు.

 

    అతను ఓ ఖైదీ, ముప్ఫై ఏళ్ళ వయసుంటుంది. ఏదో పెట్టీ కేసు కింద సంవత్సరం జైలు శిక్ష పడింది. ఆరునెలలయింది జైలుకి వచ్చి సన్నగా బలహీనంగా వున్న రఘుపతిని చూస్తూనే వార్డర్లు కిచెన్ లో వంటలు వండడానికి కన్విక్ట్ ఆఫీసర్ గా వేశారు. తను హత్య చేయబోయే జీవికోసం చూస్తూ కిచెన్ లో కూర్చున్నాడు అతను.

 


                                 *    *    *    *

 

    తిలక్ చెప్పినట్టు రెండోసారి పారిపోవడానికి లాలస అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. అందుకు ఎంతో శ్రమపడింది. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసింది. ఈసారి తిలక్ వాళ్ళు సక్సెస్ అవుతారన్న నమ్మకం కలుగుతోంది. తిలక్ ప్లాన్ అద్భుతంగా వున్నట్టు అనిపిస్తోంది.   

 

    అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కానీ ఎల్లుండి ఉదయం పదిగంటలకు రడీగా వుండమని తిలక్ కు చెప్పాల్సిందే మిగిలిపోయింది. అన్ని పనులు చకచకా జరిగాయి. గానీ అక్కడకు వచ్చేసరికి బ్రేక్ పడింది.

 

    జైలులోకి ఆమెను అనుమతించలేదు. తిలక్ కోసమే కాదు ఏ ఖైదీని ఏ విజిటరూ కలవకూడదని సూపరింటెండెంట్ స్ట్రిక్ట్ గా చెప్పారట. ఎవరైనా ఓ వార్డును బుట్టలో వేసుకుని సీక్రెట్ గా విషయం చేరావేద్దామన్నా వీలైంది కాదు. లెటర్ రాస్తే ప్రయోజనం వుండదని తెలుసు. జైలుకు వచ్చే ప్రతి ఉత్తరాన్ని ముందుగా స్టాఫ్ చదువుతారు.

 

    మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలో, ఎలా తిలక్ కి కబురంద జేయాలో తెలియక ఆమె గింజుకుపోతోంది.

 

    బెడ్ మీద నుంచి లేచి కిటికీ దగ్గరకు వచ్చి కూర్చుంది. కిటికీ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. కిటికీ ఆమెకు ఆత్మీయ నేస్తం. ఎన్నో రాత్రులు కిటికీని పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. తనలో ఉబికి వస్తున్న బాధను కిటికీతో పంచుకుంది. తనకోసం యెవరు రారని తెలిసినా ఎవరో వస్తారన్న ఆశతో కిటికీ దగ్గర కూర్చునేది. తన బాధను చూసి కిటికీ ఓదారుస్తున్నట్టే వుండేది.

 

    చిన్నప్పట్నుంచీ అంతే ఆమె. భయంకరమైన ఒంటరితనంలో గడిపేది. స్కూల్ దాటి కాలేజీకి వచ్చినా అంతే. గతం భయంకరమైన కలలా వెంటాడుతూ వుంటే నిద్ర మేల్కొని కిటికీ పక్కన కూర్చునేది. తనలాగే రాత్రి కూడా అనాధ పిల్లలా అనిపించేది.  

 

    అయిదేళ్ళ కాలేజీ చదువులో ఏరోజూ ఆమెకోసం ఏ ఒక్క విజిటరూ రాలేదు. ఆదివారం సాయంకాలం స్నేహితురాళ్లంతా విజిటర్స్ తో గడపడానికి వెళ్ళిపోతే తను మాత్రం కిటికీకి అతుక్కుపోయేది - తోటలో గుంపులు గుంపులుగా జేరి మాట్లాడుకుంటున్న వాళ్ళకేసి ఈర్ష్యగా చూసేది.

 

    ఇదంతా గుర్తుకొచ్చి ఆమెకు కన్నీళ్ళు వూరాయి.

 

    ఇప్పుడు తను ఒంటరే. ఇలాంటి సమయంలో కూడా తనను ఓదార్చడానికి ఎవరూ లేరు. ఎవరూ రారు. తిలక్ ఓ రకంగా అనాధ అయితే తను మరోరకంగా అనాధ. ఈ సంబంధంవల్లే తిలక్ అంటే తనకు ఇష్టం కాబోలు అనుకుంది.

 

    తను తిలక్ ను ఇష్టపడుతున్నానన్న ఫీలింగ్ ఆమెకు థ్రిల్లింగ్ గా వుంది. అగ్గిపెట్టెలో జలపాతాన్ని బంధించినట్టుంది ఆమెకు.

 

    తిలక్ తోపాటే జీవితాంతం వుండిపోవాలనిపిస్తోంది. మరి తిలక్ జైలు నుంచి బయటపడాలి. ఎల్లుండి ఉదయం పదిగంటలకు రడీగా వుండమని అతనికి ఎలా చెప్పడం? ఈసారైనా సక్సెస్ కావాలి రెండోసారి ఫెయిలైతే మరో సంవత్సరంపాటు శిక్ష పెరుగుతుంది. తిలక్ బయటపడగానే తాము చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. అది అయిపోయాక ఆ తరువాత ఏమిటి పెళ్ళా? తన మీద తిలక్ ఉద్దేశ్యమేమిటో తెలుసుకోవాలి... ఎల్లుండి రడీగా వుండమని ఎలా తెలియజేయడం?    

 

    బుర్రంతా వేడెక్కినట్టనిపించి అక్కడినుంచి లేచింది.

 

    వంటిల్లు పడుకున్న పిల్లిలా నిశ్శబ్దంగా వుంది.

 

    స్టౌవ్ వెలిగించి కాఫీ కలుపుకుంది. కప్పు తీసుకుని తిరిగి వరండాలోకి వచ్చి కూర్చుంది.

 

    చుట్టూ మసగ్గా వుంది. ఇంటి ముందున్న కాంపౌండ్ వాల్ చీకటి కొక్కానికి వేలాడదీసిన తెల్లటి బట్టలా వుంది. ఓ పక్కగా వున్న రేకుల షెడ్ చిన్న పిల్లలు మూడువైపులా పెరికేసిన పక్షుల గూడులా వుంది.

 

    చీకటి మరింత చిక్కనై రాత్రి గాఢతను తెలుపుతోంది. టైము పన్నెండు దాటినట్టు గడియారంలోని ముళ్ళు చెబుతున్నాయి.

 

    మళ్ళీ ఆమెకు దిగులు ప్రారంభమైంది ఎల్లుండి ఉదయానికి తయారుగా వుండమని, అప్పుడు తమ ప్లాన్ మొదలవుతుందని తిలక్ కి ఎలా చెప్పాలో దారి తెలియక ఆలోచనల్లో పడింది.

 

    అలా ఆలోచిస్తున్న లాలస ఓ దగ్గర ఆగిపోయింది. తన ప్లాన్ తనకే అద్భుతంగా తోస్తున్నట్లుంది. తిలక్ కి సమాచారం ఎలా చేరవేయాలో ఐడియా తట్టేటప్పటికి ఆమె ఆనందానికి అవధుల్లేవు.

 

    ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి లోపలికి పరుగుపెట్టింది. బాత్రూమ్ కి వెళ్ళి చన్నీళ్ళను కుమ్మరించుకుంది.

 

    ఆలోచించేకొద్దీ తన ప్లాన్ లో ఎలాంటి లొసుగులు లేవన్న నమ్మకం కుదిరింది. మరో మూడు గంటల్లో తిలక్ కి తను పంపే సమాచారం అందుతుందన్న వూహే ఆమెను ఎంతో ఉత్సాహపరుస్తోంది.

 

    బాబీలోని పాటను హామ్ చేసుకుంటూ డ్రస్ మార్చుకుంది. తలుపు లాక్ చేసి బయటపడింది.

 

    మరో అయిదునిమిషాలకు ఆమె కారు టౌన్ వైపు దూసుకుపోతుంది.

 

                                 *    *    *    *

 Previous Page Next Page