Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 31


    ఛటర్జీ ఆశ్చర్యపోయి విన్నాడు. ఇప్పుడాయనకు పూర్తి నమ్మకం చిక్కింది... త్రినాధ్ తన కొడుకును తప్పక బాగుచేయగలడని.

    ఆయన చిరునవ్వుతో డన్ అన్నట్లు కళ్ళద్వారానే సంజ్ఞ అందించాడు.


                                                  *    *    *    *


    రాత్రి పదకొండు గంటల సమయం.

    హాస్పిటల్ అంతా చీకటి నిశ్శబ్దంలో స్నానం చేస్తున్నట్టుగా వుంది.

    బోస్ కి పూర్తిగా స్పృహ వచ్చిందని తెలిసి త్రినాధ్ ఆఘమేఘాల మీద బయలుదేరి వచ్చాడు.

    బోస్ కింకా పూర్తి స్వస్థత చేకూరకపోయినా, పూర్వంలా తయారయ్యాడు, ఒకింత నీరసం తప్ప.

    త్రినాధ్ ఇప్పుడు సూటిగా బోస్ వేపు చూస్తున్నాడు.

    బోస్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి.

    "నాకు తెలుసు నీకు నామీద కసిగా, కోపంగా వుందని. అయినా సరే, నీ పట్ల నా ప్రవర్తన సబబైనదే."

    త్రినాధ్ మాటలు పూర్తికాక ముందే బోస్ ఒక్కసారి గర్జించాడు.

    "నిన్ను, దాన్నీ ఇద్దర్నీ చంపేస్తాను...." బోస్ మాటలకు అతని తల్లి తండ్రి తిరిగి కృంగిపోయారు.

    "మీరేమీ అనుకోకుండా వుంటే మా ఇద్దర్నీ కొద్దిక్షణాలు ఒంటరిగా వదిలేయండి..." ఛటర్జీ దంపతుల్ని ఉద్దేశించి శాసిస్తున్నట్లుగా అన్నాడు త్రినాధ్.

    వాళ్ళు వెంటనే బయటకు నడిచారు. త్రినాధ్ వెంటనే ఆ రూమ్ కి లోన గడియవేశాడు.

    "ఇంకా నువ్వే కరక్ట్ అని నీవు అనుకుంటే.... కమాన్! బీట్ మీ....కిల్ మీ... కిల్ మీ.... ఐ... సే..." త్రినాధ్ కంఠం ఆ నిశ్శబ్ధ వాతావరణంలో మార్మోగిపోయింది.

    అప్పటివరకు స్తబ్దుగా కూర్చున్న బోస్ సివంగిలా త్రినాధ్ మీదకు దూకాడు. దొరికినచోట దొరికినట్లు కొట్టడం ప్రారంభించాడు.

    త్రినాధ్ చిరునవ్వుతో ఆ దెబ్బల్ని భరిస్తున్నాడే కాని ఎంతమాత్రం ప్రతిఘటించలేదు.

    బోస్ త్రినాధ్ ని కొడుతున్న దెబ్బలకు హఠాత్తుగా హాస్పిటల్ మేల్కొంది. పేషెంట్స్, నైట్ డ్యూటీ స్టాఫ్ ఆందోళనగా ఆ రూమ్ వైపు రాసాగారు.

    అప్పటికే ఛటర్జీ దంపతులకి అనుమానం వచ్చి గది కిటికీ తెరిచి లోనకు చూసి నవ్వెరపోయారు.

    బోస్ కొట్టిన దెబ్బలకి త్రినాధ్ ఒళ్ళు అక్కడక్కడా రక్తసిక్తమయింది. ఆ సమయంలో త్రినాధ్ ఒక్కసారి ఎదురుతిరిగినా తమ కొడుకు బ్రతకడని వారికి తెలుసు. ఇప్పుడు అదికాదు వారి ఆందోళన- కొడుకు దెబ్బలకు త్రినాధ్ ఏమవుతాడోనని. అన్ని దెబ్బల్నీ చిరునవ్వుతో ఎలా భరించగలుగుతున్నాడు-?!

    అప్పటికి అందరూ ఆ రూమ్ ముందు గుమికూడి ఆందోళనగా చూస్తున్నారు లోనకు.

    "ఎంత అన్యాయమో చూశారా? అతను ఆత్మహత్య చేసుకోబోతే ఇతను కాపాడి ఇక్కడకు తెచ్చాడు. ఆ కృతజ్ఞతయినా లేకుండా అతన్నే చంపాలని చూస్తున్నాడు ఆ రాక్షసుడు. తలుపులు బ్రద్దలు కొట్టండి-" అని ఒకరు అనీ అనగానే నలుగురైదుగురు ఆతృతగా తలుపుని నిరగొట్టే ప్రయత్నంలో పడ్డారు.

    మొత్తానికి రెండు నిమిషాలకు తలుపులు బద్దలయిపోయాయి. లోనకు అడుగుపెట్టబోతున్న వార్ని ముందే పసిగట్టిన త్రినాధ్ "అక్కడే ఆగిపోండి" అంటూ సింహగర్జన చేశాడు గుడ్లురుముతూ.

    సరీగ్గా అదే సమయానికి బోస్ ఆఖరి దెబ్బగా సిలైన్ బాటిల్ స్టాండ్ ని చేతుల్లోకి తీసుకున్నాడు.

    అందరూ ప్రాణాలు ఉగ్గబట్టి చూస్తున్నారు.

    బోస్ త్రినాధ్ వైపు క్రౌర్యంగా చూస్తూ ఒక్కో అడుగు ముందుకేస్తున్నాడు.

    ఛటర్జీ దంపతులు నిశ్చేష్టులైపోయారు.

    అక్కడున్న ప్రతివారికి ఆ దారుణాన్ని ఆపాలని వున్నా, వారి మధ్యకు వెళ్ళే సాహసం చేయలేకపోతున్నారు.

    ఇప్పుడు బోస్ త్రినాధ్ కి బాగా దగ్గరగా వచ్చాడు.

    బోస్ తన ఒంట్లోకి శక్తినంతా కూడగట్టుకొని ఆ స్టాండ్ ని అమాంతం గాల్లోకి లేపాడు.

    బోస్ చేతుల్లో వున్న స్టాండ్ క్రిందకు దిగుంటే త్రినాధ్ కి అవే ఆఖరు క్షణాలయ్యేవి.

    చుట్టుప్రక్కల మూగిన జనం ఊపిరిబిగపట్టారు. సూదిపడితే వినిపించేంత నిశ్శబ్దం అక్కడ అలుముకుంది.

    బోస్ చేతుల్లో విసురుగా క్రిందకు దిగిన స్టాండ్ సెకన్ లో వెయ్యోవంతులో పక్కకు జారింది. అది త్రినాధ్ భుజాన్ని చీలుస్తూ వెళ్ళి నేలను తాకింది. త్రినాధ్ పెదాలు విడివడకుండా నవ్వుకున్నాడు తను కళ్ళు మూసుకుని వున్నా. తన నిగ్రహమే బోస్ ని కదిలించివేసిందని, అందుకే బోస్ చేతిలోని స్టాండ్ గురి తప్పిందని అతనికొక్కడికే తెలుసు.


                      *    *    *    *


    ఒకరి సహనం మరొకరి అసహనానికి, ఆవేశానికి అడ్డుకట్టవేసింది.

    బోస్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అప్పటికే త్రినాధ్ అదేచోట జాయిన్ అయ్యాడు. బెడ్ మీద పడుకుని పైకప్పుకేసి నిశ్చలంగా చూస్తున్నాడు త్రినాధ్. బెడ్ పక్కనే తల్లి వసుంధరాదేవి పళ్ళరసం తీస్తోంది.

    బెడ్ కి మరోపక్క నుంచున్న హిందూ చేతిలోని ఫైల్ ని ఒకింత నిరాశగా తిరగేస్తూ అంది. "త్రినాధ్... నీ మనస్సులో ఏముందో తెలియదు కాని, మనం ఇచ్చిన ప్రకటన మూలంగా పెద్దగా రెస్పాన్స్ ఏం లేదు."

    త్రినాధ్ మౌనంగా విన్నాడు కాని సమాధానం ఏం చెప్పలేదు.

    వసుంధరాదేవి మౌనంగా తన పని తాను చేసుకుపోతోంది.

    సమయం రాత్రి తొమ్మది గంటలవుతోంది. పేషెంట్స్ ని పలకరించడానికి ఇచ్చిన ప్రకటన మూలంగా పెద్దగా రెస్పాన్స్ ఏం లేదు."

    త్రినాధ్ మౌనంగా విన్నాడు కాని సమాధానం ఏం చెప్పలేదు.

    వసుంధరాదేవి మౌనంగా తన పని తాను చేసుకుపోతోంది.

    సమయం రాత్రి తొమ్మిది గంటలవుతోంది. పేషెంట్స్ ని పలకరించడానికి వచ్చిన బంధుమిత్రులు ఒక్కొక్కరే తిరిగి వెళ్ళిపోతున్నారు హాస్పటల్ నుంచి.

    ఆ రూమ్ నిశ్శబ్దంగా వుంది.

    త్రినాధ్ ఆలోచిస్తున్నాడు- అతను చెప్పబోయే సమాధానం కోసం హిందూ ఎదురుచూస్తోంది.

    అంతలో ద్వారం దగ్గర అలికిడి అయింది. ఒక్కసారే ముగ్గురూ తలలు తిప్పి చూశారు.

    ఆ వచ్చిందెవరో వసుంధరాదేవికి అర్ధంకాలేదు. కాని వచ్చినవాళ్ళ చేతుల్లో వున్న పూలగుత్తిని చూసి ఎవరో తెలిసినవాళ్ళు పరామర్శించడానికి వచ్చి వుండవచ్చని అర్ధం చేసుకుందామె.

    హిందూ మాత్రం ఓ క్షణం షాక్ తింది. త్రినాధ్ ఒకింత ఆశ్చర్యపోయినా ఆ భావం బయటపడకుండాజాగ్రత్తపడుతూ చిరునవ్వుతో చూశాడు.

    ఆమె సరాసరి బెడ్ దగ్గరకు వచ్చి బొకేను త్రినాధ్ కు అందించింది. అందిస్తూనే "త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అంది.

    త్రినాధ్ మౌనంగా వున్నాడు.

    ఆమె తిరిగి అంది- "నువ్వు నాతోనే యుద్ధంలో పోరాడి ఓడిపోవాలే గాని ఇలా కాదు..." అంటూ త్రినాధ్ కి మాత్రమే వినిపించేలా.     

    అతను సర్దుకుని కూర్చుంటూ ఏదో అనేందుకు ప్రయత్నిస్తుండగా మరలా ద్వారం దగ్గర అలికిడయింది. ఈసారి ఆ ముగ్గురి బదులు వచ్చినామె ఆశ్చర్యపోయింది.

    త్రినాధ్ హఠాత్తుగా, ఆ టైమ్ లో వచ్చిన బోస్ ని చూసి ఒకింత కంగారు పడ్డాడు.

    బోస్ చేహ్తిలో పూలగుత్తి!

    హిందూ తన కళ్ళను తానే నమ్మలేకపోతోంది. సరీగ్గా 24 గంటల క్రితం చంపేయాలన్నంత కసితో వున్న బోస్ లో ఇంతటి మార్పా...?

    త్రినాధ్ ఆలోచనలు వేరుగా వున్నాయి అదే సమయంలో. తను ఆశించినట్టే బోస్ లో మార్పు రావడం ఆనందంగా వుంది ఓ పక్క. మరో పక్క ప్రియాంక ఇక్కడే వుంది. ఇప్పుడతను ఆమెను చూసి తిరిగి రెచ్చిపోతే?!

    బోస్ త్రినాధ్ దగ్గరకు వస్తూనే ప్రియాంకను చూసి నిరసనగా తల తిప్పుకున్నాడు. అదే సమయంలో హిందూవైపు చూసి ఒకింత గిల్టీగా ఫీలయ్యాడు.

    త్రినాధ్ బోస్ చూపుల్ని, ఆ చూపుల్లో వ్యక్తమైన భావాన్ని పసిగట్టి గుండెనిండా ఊపిరి తీసుకున్నాడు.

    బోస్ ని చూస్తూనే ప్రియాంక విసురుగా బయటకు నడిచింది.


                     *    *    *    *


    ప్రియాంక అవమానంతో ఉడికిపోతోంది. తను త్రినాధ్ ని పలకరించాలని వెళ్తే తనూహించని విధంగా, తనకోసమే కలియబడ్డ రెండు సింహాలు ఒకటయ్యాయి. తను తిరిగొస్తుండగా త్రినాధ్ పెదవులపై విరిసిన నవ్వులో ఏదో మెలిక వుంది. అది తనను 'చూశావా ఎంతలో ఎంత మార్పో...?" అని పరిహసిస్తున్నట్లుంది.

    ఏదో ఒకటి చేయాలి.

    ఎలాగైనా త్రినాధ్ ని ఘోరంగా అవమానించాలి. ఎలా...?

    వెంటనే సైంటిస్ట్ కి కబురుపెట్టింది.


                      *    *    *    *


    "మరొక్క రోజే వుంది-" ఒకింత దిగులుగా అంది హిందూ.

    "నా అంచనా తప్పదు. ఈరోజు ఆఖరి రోజు. ఈ సాయంత్రానికి మనం ఇచ్చిన బాక్స్ నెంబర్ కి చేరిన వాటిని కలెక్ట్ చేసుకురా. లెక్కకు మించినన్ని అప్లికేషన్స్ వచ్చి వుంటాయి..." స్థిరంగా అన్నాడు త్రినాధ్ ఎటో చూస్తూ.


                                                  *    *    *    * 


    "నువ్వో కెమికల్ ఇంజనీర్ వి. నీ సిలబస్ నీకు చెప్పింది, ఆల్ రడీ కనుగొనబడిన ఎనాలసిస్ ని వర్కవుట్ చేయటం కాదు. ఒక రచయిత, దర్శకుడికే కాదు క్రియేటివిటీ- ఇంజనీర్స్ క్కూడా వుండాలి. నేనో వ్యర్ధ పదార్ధం గురించి చెబుతాను. అది మనకు ఉచితంగా కాని, తక్కువ రేటుకు కాని దొరుకుతుంది. దాన్ని శుభ్రపరచి పనికొచ్చే విధంగా మార్చగలగాలి..." త్రినాధ్ చెబుతున్నది శ్రద్ధగా వింటున్నాడు ఇంజనీర్.    

    "ఆర్.టి.సి. బస్ డిపో దగ్గర ఒక్కసారి వాడగా వేస్ట్ గా మిగిలిన ఆయిల్స్ ని డ్రైనేజీలో గుమ్మరించడం నేను చూశాను. కొన్ని పీపాలు కొని దాన్ని వాటిలో నిలువ వుంచుతాను. నాకో నమ్మకం, అది ఏదో విధంగా మరలా ఉపయోగపడుతుందని. కనుక నీకిదొక ఛాన్స్. మామూలు ఛాన్స్ కాదు. నీవు చదివిన చదువుకి వచ్చిన ఫస్ట్ క్లాస్ మార్కులకు యిదొక ఛాలెంజ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శోధించు. దాన్ని ముడిపదార్ధంగా వుపయోగించి ఏ ప్రొడక్ట్ ని తయారు చేయగలవో పరిశోధించు...." అంటూ టేబుల్ సొరుగు లోంచి కొంత డబ్బు తీసి అందించాడు.

    అది తీసుకుని ఇంజనీర్ బయటకు వస్తుండగా హుషారుగా ఎదురొచ్చింది హిందూ.

    చిరునవ్వుతోనే హిందూని విష్ చేసి ముందుకు సాగిపోయాడు ఇంజనీర్.

    తను తెచ్చిన ఫైల్ త్రినాధ్ కి అందిస్తూ ప్రశంసగా చూసింది హిందూ.

    "మొత్తం ఎన్ని...?"

    "దాదాపు 370...."

    "వ్యాపారంలో దాదాపులు, అయితేలు వుండకూడదు మిస్ హిందూ...." అంటూ ఫైల్ అందుకున్నాడు. దీక్షగా ఫైల్ లోని అప్లికేషన్స్ ని చూస్తున్న త్రినాధ్ వేపు ఆశ్చర్యంగా చూస్తోంది హిందూ.

    అప్లికేషన్స్ చూస్తున్నాడంటే చదవడం వచ్చినట్లేనా...?! ఇది సాధ్యమా? కేవలం మూడు నెలల వ్యవధిలో...?!

    ఒక్కొక్క అప్లికేషన్ డిటైల్ గా చూస్తూ కొన్నింటిని కుడివేపు ట్రేలో మరికొన్నింటిని ఎడమవేపు ట్రేలో వుంచుతున్నాడు.

    "నీకు చాలా రోజులుగా నా నమ్మకంపై సందేహం..." త్రినాధ్ తలొంచుకుని పని చూసుకుంటూనే హిందూ నుద్దేశించి మాట్లాడుతున్నాడు.

    "ఈ వ్యవస్థలో భద్రత తక్కువ. దే ఫీల్ అన్ సెక్యూరిటీ. అందుకే పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోసం వెంపర్లాడుతారు. గవర్నమెంట్ జాబ్స్ దొరకకపోతే నమ్మకమైన పెద్ద ప్రైవేట్ కంపెనీల్లో జాబ్స్ కోసం ఆరాట పడతారు. లక్షలు సంపాదించగల మేధస్సు ఉన్నవాడి కన్నా, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనగల స్థయిర్యం వున్నవాడికన్నా చిన్న ఉద్యోగం ఉన్నవాడికే ఈ వ్యవస్థలో విలువెక్కువ. వాడికి సోషల్ ప్రెస్టీజ్ ఉంటుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూతుర్ని ఇచ్చేటప్పుడు ఆస్తికన్నా పర్మినెంట్ ఉద్యోగం వుందా లేదా అనే చూస్తారు. ఉద్యోగ స్థాయినిబట్టే కట్నం ఇస్తారు. కనుక మగపిల్లల తల్లిదండ్రులు తమ కొడుకులు సొంత కాళ్ళ మీద నిలబడే విషయం వేపు తమ దృష్టి మళ్ళించరు. లంచాలిచ్చైనా ఉద్యోగం తెచ్చుకోవాలని చూస్తారు. ఏభైవేలు లంచం ఇస్తారు ఉద్యోగం కోసం. కాని ఆ యాభైవేలతో తమ కొడుకు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటే పోలే... అని అనుకోరు. ఆస్తి ఇవాళ వుండవచ్చు, రేపు పోవచ్చు. కాని పర్మినెంట్ ఉద్యోగం ఎక్కడికీ పోదుగా. వరదలొచ్చినా, కరువు కాటకాలొచ్చినా జీతాలు తప్పనిసరిగా వచ్చి తీరతాయి కదా... అందుకే మనవాళ్ళు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడరు.

 Previous Page Next Page