Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 31

    "అంటే నీ ఉద్దేశ్యం పోలీసువాళ్ళమీద విమర్శకూడా చెయ్యొద్దంటావా?"
   
    "ఇది  పోలీసువాడి తర్కం లాఠీ! తర్కం!"
   
    "డాడీ! డాక్టర్ హేమచంద్ర లైన్ లో ఉన్నారు" సుధవచ్చి చెప్పింది   
    రమణమూర్తి లేచి ఫోన్ దగ్గిరకు వెళ్ళాడు.
   
    "గుడ్ ఈవెనింగ్ డాక్టర్! నేను రమణమూర్తిని మాట్లాడుతున్నాను, డాక్టర్ భాటియా...."
   
    "యస్! యస్! మిస్టర్ మూర్తీ! డాక్టర్ భాటియా ఇంతకుముందే ఫోన్ చేశారు. పేషెంటు ఎక్కడున్నాడు?" అవతలనుంచి ఫోన్ లో డా. హేమచంద్ర మాట్లాడుతున్నాడు.
   
    "ఇక్కడే, ఇంటిదగ్గిరే ఉన్నాడు. ఎప్పుడు రమ్మంటారూ?"
   
    "సెవెన్ థర్టీకి రండి! ఉంటాను మరి!"
   
    "జస్ట్ ఎ మినిట్ డాక్టర్! పేషెంట్ ఒకపట్టాన రాకపోతే కొంచెం బలప్రయోగంతో... ..."
   
    "నో! నో! అలా చెయ్యొద్దు. మామూలుగా వస్తే తీసుకురండి. రాకపోతే ఫోన్ చెయ్యండి. నేనే వస్తాను. పేషెంటు ఏ స్థితిలో ఉన్నాడో నన్ను చూడనివ్వండి ముందు. అప్పుడు అవసరమైతే మీరన్నట్టే చేద్దాం! ఓ! కే!"
   
    "థాంక్యూ డాక్టర్."
   
    ఫోన్ పెట్టేసి చౌదరి దగ్గరకు వస్తూ, ఎదురుగా శోకదేవతలా నిల్చుని వున్న సుధను చూసి గతుక్కుమన్నాడు రమణమూర్తి.
   
    అంత లావుమనిషి జావకారిపోయాడు.
   
    పొంగివస్తున్న కన్నీటిని రెప్పలచాటున దాచుకోలేక సుధ అక్కడినుంచి వెళ్ళిపోయింది.
   
    "బ్లడీఫూల్ మీ పోలీసోళ్ళకు కండబలం తప్ప మెదడుబలం లేదురా చూశావుగా సుధను? ఎంత బాధపడిపోతూందో?" మందలించాడాయన.
   
    రమణమూర్తి పక్కచూపులు చూశాడు.
   
    గుండెల్లో రగులుతున్న కుంపటినిప్పును దాచుకోవడానికి ప్రయత్నించాడు. పెదవులు బిగించి సోఫా అంచును వేళ్ళతో గట్టిగా నొక్కిపట్టాడు.
   
    ఆ స్థితిలో రమణమూర్తిని చూసి ఆయన చలించిపోయాడు.
   
    రమణ సంగతి తనకు చిన్నప్పటినుంచీ బాగా తెలుసు. వట్టి మేకపోతు గాంభీర్యం. కూతురి భవిష్యత్తు తల్చుకుంటూ కుమిలిపోతున్నాడు.
   
    "రమణా! ధైర్యంగా ఉండాలి. కృష్ణకు జబ్బు పెద్దగా ముదరలేదు. నువ్వే చూశావుగా? కాకపోతే కొద్దిగా ఎక్కడో దెబ్బతిన్నాడు. ట్రీట్ మెంటు ఇస్తే త్వరగానే కోలుకుంటాడనే నమ్మకం నాకుంది. ఆఫ్టరాల్ హీ ఈజ్ జమ్ ఆఫ్ ఏ పర్సన్!" డాక్టర్ చౌదరి స్నేహితుడిని ఓదార్చసాగాడు.
   
    ముఖం పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకొన్నాడు మూర్తి.
   
    పోలీసువాని కంట్లోగూడా నీరుంటుందనే వాస్తవాన్ని స్వయంగా చూశాడు చౌదరి. నిట్టూర్పు విడిచాడు.
   
    ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు.
   
    కొద్దినిముషాలు గడిచాక "ఎక్కడా?" అని అడిగాడు రమణమూర్తి.
   
    "విమలా, కృష్ణా, గార్డెన్ లో కూర్చున్నారు. మనం డాక్టర్ తో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసుకొనేంతవరకూ, కృష్ణను ఎంగేజ్ చెయ్యమని విమలకు చెప్పాను" అన్నాడాయన.
   
    "ఇంతకూ అల్లుడిగారిని డాక్టర్ దగ్గిరకు ఎలా తీసుకెళ్ళాలి? ఏమని చెప్పి తీసుకెళ్ళాలి? ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి?" మూర్తి ఆందోళనగా అన్నాడు.
   
    చౌదరి ఆలోచనలో పడ్డాడు.
   
    కాసేపాగి "ఆ పనేదో విమలకే అప్పగిస్తే?" అన్నాడు.
   
    "విమల సమర్ధురాలే! ఏదో ఒకటి చెప్పి ఒప్పించగలదు. కాని....."
   
    "ఏమిటి నీ అనుమానం!" అతనడిగాడు మూర్తి ముఖంలోకిచూస్తూ.
   
    "విమలను చూస్తే కృష్ణ మనసులో ఏదో సంచలనం కలుగుతున్నట్టుగా ఉంది. మొదటిసారి ఆమెను విమానంలో చూసినప్పుడు చాలా వింతగా ప్రవర్తించాడట గదా? మళ్ళీ డాక్టరూ, సైకియాట్రిస్టూ అంటే ఎలా రియాక్టు అవుతాడో?"
   
    "అదీ ఆలోచించాల్సిందే మరి!" ఇంటికప్పుకేసి చూస్తూ అన్నాడాయన.
   
    "ఓ పని చేద్దాం!"
   
    "ఏమిటదీ?" ఆతృతగా ముందుకు వంగి రమణమూర్తి కేసి చూశాడాయన.
   
    "డాక్టరూ, సైకియాట్రిస్టూ అంటూ చెప్పకుండా ఫామిలీ విజిట్ అని చెప్పి అందరం హేమచంద్ర దగ్గిరకు వెళదాం. ఏమంటావ్?"
   
    "గుడ్ ఐడియా, మొత్తంమీద పోలీసువాడివనిపించావ్" అతను స్నేహితుడి భుజం చరుస్తూ అన్నాడు.
   
    మూర్తి మునివేళ్ళతో మీసాలు సవరించుకొన్నాడు.
   
    "ఒరే రమణా! పెళ్ళికిముందు కృష్ణనుగురించి వివరాలేమీ తెలుసుకోలేదా? అసలు ఈ సంబంధం ఎలా కుదిరిందీ? ఎవరిద్వారా వచ్చిందీ?" అడిగాడాయన.
   
    "అదో పెద్ద కథరా చౌదరీ!"
   
    "అంటే? కృష్ణ నిన్నూ సుధను అనుమానించడానికి-!"
   
    "ఛ! ఛ! అలాంటిదేమీ లేదు" మధ్యలో అందుకున్నాడు మూర్తి.
   
    "మరేదో పెద్ద కథేనంటున్నావ్."
   
    "అంకుల్!" అంటూ హడావిడిగా వచ్చింది విమల.
   
    ఇద్దరూ విమలకేసి కంగారుగా చూసారు.
   
    "అంకుల్! బావగారు సినీమాకు తీసికెళతానంటున్నారు."
   
    "ఎవరినీ? నిన్నేనా?"
   
    "నన్నూ సుధనూ! ముగ్గురం వెళతాం" హుషారుగా చెప్పింది విమల.
   
    "మనందరం కలిసి ఓ ఫామిలీఫ్రెండును చూడటానికి ఏడుగంటలకు వెళుతున్నాం. మీరు సినీమాకు వెళ్లడం ఎలా కుదురుతుందీ?" అన్నాడాయన, విమల వెనక కృష్ణ వస్తున్నడేమోనని తొంగిచూశాడు.
   
    "ఫామిలీ ఫ్రెండా? ఎవరు డాడీ?" ఉత్సుకతతో అడిగింది విమల.
   
    "సైకియాట్రిస్టు  డాక్టర్ హేమచంద్ర" గొంతు నొక్కిపట్టిచెప్పాడు మెల్లగా మూర్తి.
   
    విమల నిశ్చేష్టురాలైంది.
   
    "ఏంటలా చూస్తావ్ విమ్మీ? అర్ధం కాలేదా?" అన్నాడు విమల తండ్రి చౌదరి.
   
    "అదికాదు డాడీ! ముందేదో అనుకున్నాను. కాని మాట్లాడినతర్వాత అతను చాలా నార్మల్ గానే ఉన్నట్టు నాకు అన్పించింది."
   
    "అయితే ఇప్పుడు సైకియాట్రిస్టుతో పని మాకేనంటావా?" చిరాగ్గా అన్నాడాయన.
   
    "డాడీ!" విమల కంఠం కంపించింది.
   
    "విమ్మీ! నువ్వే సైకియాట్రిస్టులా మాట్లాడుతున్నావ్. నార్మల్ గా ఉన్నాడో, అబ్ నార్మల్ గా ఉన్నాడో, సుధకూ, నాకూ తెలుసు. అంకుల్ ని పిలిపించింది ఎందుకనుకున్నావ్? నువ్వు కృష్ణ దగ్గిరకెళ్ళి సాయంత్రం ఏడు గంటలకు డాక్టర్ హేమచంద్ర దగ్గిరకు వెళుతున్నావని చెప్పు. అతడికి ఏమాత్రం అనుమానం రాకుండా చెప్పాలి. తెలిసిందా? ఎలాగైనా ఒప్పించి మనతో వచ్చేలా చూడు."
   
    విమల తండ్రినీ, మూర్తినీ మార్చిమార్చి అదోలా చూసింది. తిరిగి గార్డెన్ లో కూర్చొన్న కృష్ణ దగ్గిరకు వెళ్ళింది.
   
    విమల వెళ్ళగానే రమణమూర్తి లేచి నిలబడ్డాడు.
   
    "మనంకూడా వెళ్ళడం మంచిదనుకొంటాను. విమల మానేజ్ చెయ్యగలుగుతుందో లేదో?"
   
    "అవును! ఎందుకైనా మంచిది" అంటూ చౌదరి లేచినిలబడ్డాడు.
   
    ఇద్దరూ గార్డెన్ లోకి వచ్చారు. రెండు కుర్చీలు లాక్కుని కృష్ణకు ఎదురుగా కూర్చున్నారు.
   
    "విమల ఏదో చెపుతున్నది. ఎవరింటికో వెళ్ళాలటగా?" అందుకని పిక్చర్ ప్రోగ్రాం కాన్సిల్ చెయ్యమంటోంది" చౌదరిని చూస్తూ చెప్పాడు కృష్ణ.
   
    "నేనెందుకు సార్! మీరు వెళ్ళండి."
   
    "నో! నో! యు మస్ట్ కమ్!" ఆపుకోవాలన్నా ఆపుకోలేని ఆత్రంతో చెప్పాడు.
   
    "ఇంతకీ ఎవరాయన?"
   
    "డాక్టర్ హేమచంద్ర."
   
    "సైకియాట్రిస్టు హేమచంద్రా?"
   
    ఆయనకు గవదలు బిగుసుకుపోయాయి. నిస్సహాయంగా మూర్తికేసి చూశాడు.
   
    "అవునండీ బావగారూ! సైకియాట్రిస్టు హేమచంద్రే! మాకు చాలా క్లోజ్!" విమల అంది.
   
    "ఓ ఐసీ!"
   
    అల్లుడి కళ్ళల్లో దేనినో వెదకిపట్టుకోడానికన్నట్టు చూశాడు మామ.
   
    "హేమచంద్ర నీకు తెలుసా?" అల్లుడు సైకియాట్రిస్టు ట్రీట్ మెంట్ లోనే ఉన్నాడేమోననే అనుమానం మామ బుర్రలో మెదిలింది.

 Previous Page Next Page