Previous Page Next Page 
అభయారణ్యం పేజి 30

  

    తేజా నిశ్శబ్దంగా ఉండిపోయాడు చాలాసేపటిదాకా.

    "అది సమర్థింపుగా ఎందుకనుకుంటున్నారు?"

    "జీవితంలో ప్రతి అంశానికి కొన్ని మినహాయింపులు వుండాలి తేజా! రాజీపడటం అన్నది జీవితంలో ఓ భాగం అనుకోనప్పుడు సంఘం మొత్తం అస్తవ్యస్తమైపోతుంది."

    "మీ స్నేహితురాలి గురించి కాస్త వివరంగా చెప్పండి!"

    "తప్పనిసరి పరిస్థితుల్లో బావని పెళ్ళిచేసుకుంది. అయితే అతడు ఆమెకన్నా తక్కువ చదువుకున్న వ్యక్తి అది ఆమె అభ్యంతరంగా భావించలేదు. కానీ అతడి అణకువ యిబ్బందిగా ఫీలవుతుంది. తన ఆలోచనా పరిధికి దగ్గరకు రాకుండా ప్రతి క్షణం కుంచించుకుపోయే అతడితో అడ్జస్టు కాలేక తన ఐక్యూకి సరిపోయే మరో పెళ్లయిన మగాడితో సంబంధము పెట్టుకుంది."

    "చూశారా...... నేను వూహించినదానికన్నా పెక్యూలియర్ కేస్."

    "అంటే అలాంటి పాత్రలుండటం సమంజనమంటారా?"

    "మీ స్నేహితురాలే వుందన్నారుగా."

    "నేను చెప్పింది అది నాకు చెప్పిన కారణాన్ని. కానీ అది మాత్రమే తను గాడితప్పటానికి కారణమనిపించడం లేదు." అలా అయితే ఒక్క భార్య కూడా భర్తతో సవ్యంగా కాపురం చేయలేదు."

    "మీరు ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు మిసెస్ ఆర్తీ! ఒక వ్యక్తిలో మార్పుకి చాలా చిన్న సంఘటనలు కారణం కావచ్చు. కానీ స్నేహితురాలు అంతగా మారింది ఒక జీవితకాలం వెలితిని భర్తీ చేసుకోటానికి."

    "అంటే మీరు ఒక స్త్రీ అలా ప్రవర్తించటాన్ని అడ్వకేట్ చేస్తున్నారా?"

    "నేను అడ్వకేట్ చేయడంలేదు. మనిషీ - సంతృప్తి అనే అంశం గురించి చెబుతున్నాను. 'వియ్ నెవ్వర్ గెట్ వాట్ వియ్ వాంట్ అండ్ వియ్ సెల్డిమ్ వాంటే వాట్ వియ్ గెట్' అన్న థియరీని మనం మనస్ఫూర్తిగా అంగీకరించగలిగితే అసలు వెలితి అన్నపదం గురించే మనం ఆలోచించం. దురదృష్టమేమిటంటే మనిషి బ్రతికినంతకాలం ఉన్నదాని గురించి కాక లేనిదాని గురించి ఆలోచిస్తూ వుంటాడు. స్త్రీ కావచ్చు...... మగాడు కావచ్చు. బ్రతికేది సంఘంలో కాబట్టి పక్కనున్న మనిషితో కంపేర్ చేసుకుంటూ అంసతృప్తికి లోనవుతుంటారు. చివరికి మనం బ్రతికేది మన ఆలోచనలకి అనుకూలంగానే అనే ఓ దరికి చేరి అది సవ్యమా లేక అపసవ్యమా అన్నది అంతా అయిపోయాక కాని అర్థం చేసుకోలేని స్థితిలో కూరుకుపోయారు."

    క్షణం ఆగి అన్నాడు తేజా-

    "సో..... మీ స్నేహితురాలూ అలాంటి స్థితిలోనే పొరపాటు చేసిందని మీరు ఆమెను క్షమించేయొచ్చుగా."

    "నా స్నేహితురాలికి మీ సీరియల్ చాలా ప్రేరణ అందించొచ్చు."

    "నేను రాసేది అందరి కోసం ఆర్తీ! అందులో హోమ్ యీజ్ డిఫరెంట్ ప్రమ్ మియర్ హౌస్ అనుకునే వాళ్ళకి కాస్త ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది నేను జీవితంలో అన్నీ సాధించానూ అనుకొన్న వాళ్ళకన్నా నేను చాలా ఆనందంగా వుండగలుగుతున్నాను అనుకనే వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తూంది."

    ఒక్కోమారు ఎదుటి వ్యక్తి మేథస్సు మన ఆలోచనా జ్ఞానాన్ని చంపేస్తుందనటానికి అతడిపై అసాధారణంగా పేరుకొన్న గౌరవమో, అభిమానమో కారణమైతే యిప్పుడు ఆర్తి కూడా అలాంటి వలయంలోనే కూరుకుంది.

    "ఒక్క ప్రశ్నకి జవాబు చెబుతారా తేజా?"

    "మీరడగాలే కాని వంద ప్రశ్నలకి చెబుతాను."

    "నేను మీతో స్నేహం చేయడం ఆరోగ్యకరమైన ఆలోచనేనా?"

    "అదేమిటి..... తప్పేముంది?"

    "అదే....." తొట్రుపడింది ఆర్తి. "ఆడా, మగా..... అదీ పెళ్ళయిన మనలాంటి వాళ్ళు స్నేహానికి సిద్ధపడ్డారూ అంటే అన్ కాన్షస్ గా మరేదో కోరుకుంటున్నారూ అని అర్థమని మీరే రాశారు ఓ నవల్లో."

    అరనిమిషం నిశ్శబ్దం తర్వాత అన్నాడు "మనం ఆడా, మగా మాత్రమే కాదు, ఒక రచయిత-ఆ రచయితని ఇష్టపడే అభిమానిగా స్నేహం మొదలుపెట్టిన వాళ్ళం."

    "ప్రారంభం ఎలా జరిగినా కానీ....."

    "ఉన్నట్టుండి మీరు యిలాంటి టాపిక్ ప్రారంభించారేం?" అన్నాడు తేజ. "మీరు నా గర్ల్ ఫ్రెండ్ కాదు..... ఫేన్ మాత్రమే."

    ఆమె గుండె కలుక్కుమంది. "మీకు గర్ల్ ఫ్రెండ్స్ వున్నారా?"

    నిశ్శబ్దం.

    "చెప్పకూడదనుకుంటున్నారా?"

    "అసలు గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఏ కోవకి చెందిన వ్యక్తులో మీరు చెబితే వున్నారో, లేదో నేను చెబుతాను" అన్నాడు తేజ.

    "మీ శ్రీమతిలో దొరకనివేవో వెదుక్కోటానికి మీకు సహకరించే వాళ్ళు."

    "నా భార్యలో నేను అన్నీ చూడగలుగుతున్నాను."

    "నమ్మమంటారు."

    "ఎస్" నిజాయితీగా అన్నాడు.

    "అదికాదు తేజా! నేను నా హద్దులు దాటి మాట్లాడుతున్నానూ అనుకోనంటే ఒక్కమాట. మామూలు తెలివి వున్న మగవాళ్ళే భార్యలు తమముందు అన్ని రకాలుగా అనర్హులని అనుకుంటూంటే ఇంత మేథస్సు వున్న మీరు మీ భార్య గురించి ఇలా ఆలోచించటం ఆశ్చర్యంగా వుంది మరి."

    "ఒకవేళ చాలా తెలివైన భార్య అయివుంటే నేను రచయితగా ఇంత ఎదిగేవాడ్ని కానేమో. నిడం ఆర్తీ! ఆమె ప్రపంచానికి నేను చక్రవర్తిని. అందుకే నన్ను ఆరాధిస్తుంది. ఆమె తిరిగే యీ ఇంటిలో నేనో పసికందుని. అందుకే నన్ను నేను మరిచి రాయడంలో నిమగ్నమైన క్షణంలో అమ్మలా నాకు అన్నం కలిపి తినిపిస్తుంది. ఆలోచనలతో నిద్రపట్టక యిబ్బందిపడుతుంటే స్నేహితురాలిలా నా మనసుని పంచుకునే ప్రయత్నం చేసింది. నలుగురూ నా గురించి ఒకవేళ ఏదన్నా కామెంట్ చేసినా నమ్మకుండా మా అమ్మమ్మలా అక్కున చేర్చుకుంటుంది. ఇన్ని అపురూపమైన లక్షణాలు గల భార్యని కాదని నేను మరెవరికైనా ఎలా దగ్గరకాగలను?"
 

 Previous Page Next Page