Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 30

 అమ్మకం రేట్ల వివరాలు
    వందరూపాయల బాబా సూట్ పది రూపాయలకే.
    "కెవ్వ్..." అరిచింది కామేశ్వరి.
    రెండొందల రూపాయల షిఫాన్ చీర యాభై రూపాయలకే-
    "కెహెవ్వు..." మళ్ళీ అరిచింది.
    మూడొందలు ఖరీదు చేసే టేరిఊల్ ప్యాంట్ పీస్ డెబ్బయిరూపాయలకే-
    "కెవ్... కెవ్వె..."
    యాభై రూపాయల దుప్పటి పది రూపాయలకే-
    "కెవ్వ్... కెవ్వ్...కెవ్వ్..."
    ముప్పయి రూపాయల టవల్ కేవలం అయిదు రూపాయలకే...
    మళ్ళీ సంతోషంతో గుండెలు బాదుకుంటూ అరిచింది కామేశ్వరి.
    అలా రేట్ల లిస్టంతా చదివి భర్త మొహం వంక చూసింది. అంతే... మళ్ళీ కెవ్వుమని అరిచింది.
    "అదేంటండీ... మీ మొహమంతా అలా గంట్లు పడ్డాయేం?... గెడ్డంకూడా చేస్కోవడం చాతకాదు మొహానికి..."
    "కెవ్వు కెవ్వుమని చావుకేకలు పెట్టి నేను లిక్కిపడేలా చేసి ఇప్పుడు గెడ్డం చేస్కోడం రాదంటావేం?... ఇంకొకసారిలా అరిస్తే పీక పిసుకుతానంతే..."అన్నాడు దీనంగా గంట్లు పడిన మొహాన్ని అద్దంలో చూస్కుంటూ.
    "పీక పిసికితే పిసికారు గానీ నన్నక్కడికి తీస్కెళ్ళాక పిసకండి..."
    "ఎక్కడికి?..." ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు కాంతారావు.
    "ఇంకెక్కడికి... దగాచంద్ డిస్కౌంట్ సేల్ కి... హేవండ్ వండేవం డీ... ప్లీజ్..." గెడ్డం పుచ్చుకుని బతిమలాడి "ఛీ... రక్తం, పాడు" అంటూ చేతిని కొంగుకి తుడుచుకుంది.   
    "తీస్కెళ్లనుగాక తీస్కెళ్లను ... అక్కడ కూడా నువ్వు కెవ్వుకెవ్వున అరిస్తావ్..."
    "ఉహు... నేనరవను... నన్ను దగాచంద్ డిస్కౌంట్ సేల్ కి తీస్కెళ్లండీ..."
    "ఇప్పుడెందుకూ... దండగ..." అన్నాడు మొహం చిట్లించి.
    కామేశ్వరి మొగుడి అమాయకత్వానికి ఫక్కుమని నవ్వింది.
    "మీ మొహం... దండగ మనకేంటి!ఆ దగాచంద్గాడికి దండగ అమ్ముతున్నాడు తెల్సా?... మీకైతే మూడొందలు ఖరీదు చేసే టెర్రీఊల్ ప్యాంట్ డెబ్బయి రూపాయలకే వస్తుంది తెల్సా?..." భర్తని టెమ్ట్ చేసింది కామేశ్వరి.
    "సర్లే... అలాగే వెళ్దాం..." అన్నాడు కాంతారావు తనుకూడా బట్టలు చవగ్గా కొట్టేయవచ్చు కదా అనే ఆలోచనతో.
    రెండు రోజుల తరువాత వాళ్లు దగాచంద్ డిస్కౌంట్ సేల్ కి వెళ్లారు.
    అక్కడికి జనం విపరీతంగా వస్తున్నారు. చాలా రద్దీగా ఉంది.
    గుమ్మం దగ్గర నిలబడి ఒక వ్యక్తి భోరుమని ఏడుస్తున్నాడు.
    "పాపం... ఎవరో ఆయన!?... అతని పర్సెవరైనా కొట్టేశారేమో! అందుకే అలా ఏడుస్తున్నాడు..." కాంతారావు అతనివంక జాలిగా చూస్తూ అన్నాడు.
    కామేశ్వరి మళ్లీ ఫక్కుమని నవ్వింది.
    "మీ తెలివి తెల్లారినట్లే ఉంది... అతనే దగాచంద్. మొన్నటి ఎడ్వర్ టైజ్ మెంట్లో అతని ఫోటో కూడా ఉంది... పాపం! మనందరికీ చవగ్గా బట్టలమ్మ దివాళా తీస్తున్నాడు కదా... అందుకే అలా ఏడుస్తున్నాడు... హి... హి... పదండి లోపలికి వెళ్ళి బట్టలు చూద్దాం..." అంది కామేశ్వరి గబగబా లోపలికి అడుగులు వేస్తూ.
    కాంతారావు ఆమెని అనుసరించాడు. దగాచంద్ వంక వెనక్కి వెనక్కి తిరిగి తిరిగి జాలిగా చూస్తూ.
    "రండమ్మా రండి..." అన్నాడు వీళ్ళని చూస్తూ చీరాల సెక్షనులోని కౌంటర్లో మనిషి.
    "మాంచి మాంచి చీరల్చూపించు బాబూ..." అంది కామేశ్వరి విలాసంగా.
    "చూపించే దేముందమ్మా... అదిగో అక్కడ గుట్టగా చీరలు పడేసి ఉన్నాయ్ గా... వాటిల్లోంచి సెలెక్ట్ చేసుకోడమే..."
    కామేశ్వరి ఒక్క గంతు గెంతి చీరాల గుట్టమీద పడింది.
    "చీరాల గుట్టమీద అలా పడ్తే ఎలా? వేరే వాళ్ళు కూడా సెలెక్షన్ చేస్కోవాలి కదమ్మా?... మీరు గుట్టమీంచి లేవాలమ్మా..." అన్నాడు సేల్స్ మాన్ మర్యాదగా.
    కామేశ్వరి ఓసారి సంతోషంగా చీర్లమీద పొర్లి లేచి నిలబడింది.
    "వామ్మోవ్!... ఎన్ని చీరలో... హెన్ని చీరలో!!!"అంది కళ్లింతింత చేస్కుని చూస్తూ.
    "తీస్కోండమ్మా... మీకోసమే ఈ చీరల్ని బాంబే నుండి తెచ్చాం..." అన్నాడు సేల్స్ మాన్.
    కామేశ్వరి గుట్టలోంచి ఆ చీరా ఈ చీరా కాస్సేపులాగి ఒక చీర సెలెక్ట్ చేసింది.
    "ఈ చీరెంత బాబూ?" అడిగింది.
    "ఇదా?... ముప్ఫయి రూపాయలమ్మా..."చెప్పాడు.
    "కెవ్వ్..." సంతోషంతో గట్టిగా అరిచింది కామేశ్వరి.
    ఆ కేకకి సేల్స్ మాన్ కంగారు పడిపోయాడు. గుమ్మం దగ్గరున్న దగాచంద్ ఏడుపాపి లోపలికి తోంగిచూశాడు.
    "ఏంటమ్మా అలా అరిచారు?... మేం తక్కువకేగా అమ్ముతున్నాం?..."
    అన్నాడు అయోమయంగా సేల్స్ మాన్.
    "అందుకే అలా అరిచాను..." అంది కామేశ్వరి.
    "తక్కువకి బట్టలమ్మేసి నేను చాలా దివాళా తీసున్నాన్రో దేవుడో..." అంటూ మళ్లీ ఏడుపు లంకించుకున్నాడు దగాచంద్.
    అతని ఏడుపు చూసి అక్కడున్న అందరూ చాలా సంబరపడ్డారు.
    బట్టలు చవగ్గా అమ్మి దివాళా తీస్తున్నాడు కాబట్టే అతనలా ఏడుస్తున్నాడు. అంతగా ఏడుస్తున్నాడంటే ఎంత లాభమో!!... అనుకుని అక్కడి జనం బట్టల మీదికి ఎగబడ్డారు.
    కామేశ్వరి రెండుచీరలు కొనుక్కుంది.
    "అయ్యగారికి సూటింగ్స్ చూస్తారమ్మా?... పది పర్సెంట్ నుండి తొంభై పర్సెంట్ డిస్కౌంట్ ఉంది..." అన్నాడు సేల్స్ మాన్.
    "తొంభై పర్సెంట్ డిస్కౌంట్!... నాకు అవే చూపించు బాబూ" అన్నాడు కాంతారావు సంతోషంగా.
    అతను ఒక జత బట్టలు కొనుక్కున్నాడు.
    ఆ తరువాత రెండు దుప్పట్లూ, నాలుగు టవల్స్ కొన్నారు.
    ఇన్ని కొన్నా బిల్లు మూడు వందల రూపాయలు మించలేదు.
    ఇంటికి వెళ్ళి కొన్నవన్నీ బయటికి తీసి మరీ మరీ చూస్కుని మురిసిపోయారు.
    "పాపం... ఆ దగాచంద్ ని చూస్తుంటే చాలా జాలేస్తుంది కదండీ... హిహి... జట్టలన్నీ చవగ్గా ఎంతమంది కొట్టేస్తున్నారో!... భలే దివాళా తీస్తున్నాడు..." అంది కామేశ్వరి తన చీరల వంక మెరిసే కళ్ళతో చూస్కుంటూ-
    కాంతారావు బట్టలు కుట్టడానికి టైలర్ కిస్తే కుట్టడానికి జతకి తొంభై రూపాయలు చెప్పాడు టైలర్.
    అది వింటూనే కాంతారావు కిసుక్కున నవ్వాడు.
    "నేనసలు ఈ బట్టలు ఎంతక్కొన్నావో తెల్సా? డెబ్బయి అయిదు రూపాయలక్కొన్నాను... ఇప్పుడు చెప్పు... కుట్టుకూలీ ఎంత ఇమ్మంటావ్?" అన్నాడు కళ్లెగురవేసి నవ్వుతూ.       
    "మీరు వెయ్యి రూపాయల డ్రస్సుకొన్నా తొంభైరూపాయలకే కుడ్తాం, యాభై రూపాయల డ్రస్సు కొన్నా తొంభై రూపాయలకే కుడ్తాం... అది మా రేటు సార్..."
    టైలర్ బట్టలు కుట్టి ఇచ్చాక కాంతారావు వాటిని తొడుక్కుని నిలువుటద్దంలో చూస్కుని మురిసిపోయాడు. కామేశ్వరి కూడా కొత్త చీరకట్టుకుని సంబరపడిపోయింది. డిస్కౌంట్ సేల్ లో కొన్నదుప్పటి, టవల్స్ కూడా వాడారు.
    ఆ రోజు డిస్కౌంట్ లో కొన్న బట్టల్ని ఉతికి తాడుమీద ఆరబెట్టిన కామేశ్వరి కెవ్వుమని అరిచి మూర్ఛపోయింది. కారణం ఆమె చీర ఓణీ అయిపోయింది. కాంతారావు చొక్కా పంట్లాం చిన్న పిల్లల బాబా సూట్ లా అయిపోయింది. దుప్పటి టవల్ అయిపోయింది. టవల్ సైజు చిన్నది కాబట్టి ఏకంగా మాయం అయిపోయింది.

                              *   *   *
 

 Previous Page Next Page