Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 30


    నిజమేనమ్మా. పల్లెటూళ్ళలో ఈ పట్టింపు ఉండదు. పట్నాలలో చదువుకున్నవాళ్ళు ఆరోగ్యం దృష్టితో అలా అలవాటు చేసుకుంటారు.


    "ఏమోరా అవన్నీ మాకేం తెలుసు. అది ఆడబిడ్డల్ని ఏ మాటపడితే ఆమాట అంటున్నది"


    "అమ్మా అదీ, ఇదీ అనడం కూడా అమూల్యగానీ, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు గానీ సహించరు. వాళ్ళు కన్నవాళ్ళను కూడా ఏమే, ఒసే అనరు."


    "అది మరీ బాగుందిరా. కోడల్ని ఏమండీ అనమంటావా?"


    "అమ్మా! నువ్వు పెద్దదానివి. ఇంతకంటే నేనేం చెప్పలేను" చెయ్యి కడుక్కుని లేచాడు శ్రీధర్.


    "అయ్యో...అదేమిటరా పెరుక్కూడా వేసుకోకుండా..."


    శ్రీధర్ పలక్కుండా గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని బయటికి వెళ్ళిపోయాడు.


    అమూల్య ఆరోజు భోజనం చెయ్యలేదు.


    మధ్యాహ్నం భోజనానికి వచ్చిన భర్తతో బంగారమ్మ ఆమాటే అన్నది.


    "ఏం? ఎందుకు తినలేదు"


    బంగారమ్మ జరిగిన సంగతి చెప్పింది.


    "పెద్దింటి పిల్ల పాపం. ప్రేమ ప్రేమ అంటూ ఈ కొంపలోకి వచ్చి పడింది.


    "ఇప్పుడు దానికేం తక్కువైంది?"


    "ఏం తక్కువైందా? ఒకసారి వాళ్ళింటికెళ్ళి చూసిరా."


    "అయ్యో రాత. అంత అదృష్టం కూడానా. వాళ్ళకు మనం మనుషుల్లా కన్పిస్తున్నామా?"


    "ఇక నీ పంచాంగం ఆపు" అంటూ లేచి అమూల్య గది గడపముందు నిల్చుని "అమ్మాయ్" అంటూ కేక వేశాడు.


    "ఏమిటి మామయ్యగారు?" మామ గారంటే అమూల్యకు చాలా గౌరవం. ఆ ఇంట్లో అతను ఒక్కడే అర్థం చేసుకునేవాడని ఆమె అభిప్రాయం.


    "ఏమ్మా అన్నం తినలేదట?"


    "తలనొప్పిగా వుంది."


    "ఏదైనా మాత్ర కావాలా? ఆచారికి కబురు పంపించనా?"


    "అక్కర్లేదండి కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది" మరోమాటకు అవకాశం ఇవ్వకుండా లోపలకు వెళ్ళిపోయి తలుపు వేసుకుంది.


    ఈ పల్లెటూర్లో తను ఉండలేదు.


    ఇది కూడా ఒక జీవితమేనా?


    బోర్


    ఇరవైనాలుగు గంటలూ ఇంట్లో వాసాలు లెక్కపెట్టుకుంటూ గడపడం తనవల్ల కాదు.


    అమూల్యకు తల్లీ, తండ్రీ గుర్తుకొచ్చారు. తన స్నేహితులు గుర్తొచ్చారు. క్లబ్బు షికార్లు, సినిమాలూ గుర్తొచ్చాయి. అబ్బ ఇరవై రోజులు తను ఎలా ఇంత స్థబ్దుగా ఉండగలిగింది?


    తను ఎక్కువ రోజులు ఇక్కడ వుండలేదు.


    ఈ గానుగెద్దు జీవితం గడపలేదు.


    తండ్రి తనపేర లక్ష రూపాయలు బ్యాంకులో వేశాడు. ఏం చేసుకోవడానికి?


    తన నగల సెట్లు ఎందుకు?


    ఇన్ని చీరలు ఎందుకు?


    సంవత్సరానికి నాలుగు చీరలు చాలు.


    తన ప్యాంట్లు ఏం చేసుకోవాలి? ప్యాంటులో తను చాలా బాగుంటుందని అందరూ అనేవారు. తను క్లబ్బుకు వెళ్తే ఎన్ని జతల కళ్ళు తనకేసి ఆశగా చూసేవి?

    
    శ్రీధర్ కోసం తను ఎంతో త్యాగం చేసింది.


    తనకోసం శ్రీధర్ ఏం చేస్తున్నాడు.


    ఇక్కడ ఈ పల్లెటూర్లో, ఈ దుమ్ములో ఈ అనాగరికుల మధ్య తనను వదిలేశాడు.


    శ్రీధర్ కు తనమీద ప్రేమలేదు.


    తను ఎలాంటి జీవితం నుంచి దూరంగా వచ్చిందో తెలుసు శ్రీధర్ కు. అయినా తనను తెచ్చి ఈ మురికి కూపంలో పడేశాడు. పాపం మమ్మీ అందుకే అంత బాధపడింది. మమ్మీని తను శతృవుగా భావించింది. డాడీ కూడా తనకు సున్నితంగా పరిస్థితుల్ని తెలియచెయ్యడానికే ప్రయత్నించాడు? అయినా తను ప్రేమకోసం దేన్నయినా త్యాగం చెయ్యగలం అనుకుంది. కాని...కాని...ఇదేమిటి? పెళ్ళయి మూడు నెలలన్నా నిండలేదు. శ్రీధర్ మీద కూడా చిరాకు వేస్తున్నది.


    ఏమైనాసరే తను ఈ జీవితం గడపలేదు. అసలు ఇది ఒక జీవితమా?


    హారిబుల్.


    ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిందే.


    అమూల్య పగలంతా కళ్ళు మూసుకొని పడుకున్నది. కాని నిద్రరావడం లేదు. ఆలోచిస్తూ పడుకున్నది.

    
    ఆరోజు శ్రీధర్ చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చాడు.


    "ఇంత పొద్దు పోయిందేరా?" తండ్రి అరుగుమీద చుట్ట కాలుస్తూ కూర్చుని ఉన్నాడు.


    మా బ్యాంకు రీజనల్ మేనేజర్ వచ్చాడు. బొంబాయి నుంచి అందుకే ఆలస్యం అయింది" అంటూ లోపలకు వెళ్ళాడు.


    అమూల్య నిద్ర నటిస్తూ పడుకుంది.


    శ్రీధర్ ఆమె నిద్రపోతుందనుకున్నాడు.


    డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న కొడుకుకు అన్నం వడ్డిస్తూ "నీపెళ్లాం పొద్దుటి నుంచి అన్నం తినలేదు" అన్నది.


    శ్రీధర్ తెల్లబోయి తల్లిముఖంలోకి చూశాడు.

    
    ఉదయం జరిగిన గొడవ గుర్తొచ్చింది.


    చివ్వున లేచి గదిలోకి వెళ్ళాడు.

 Previous Page Next Page