Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 31


    "ఇంకా అనుమానమా బ్రదర్...! కేవలం కొద్ది రోజుల్లో మిషనరీ అంతా తుప్పు పడుతుంది. వెంటనే దానిని మనం పాత ఇనుప సామానులు అమ్మేవారికి వేసేస్తాం. మన డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాక్టరీ భవనాలు, స్థలం ఆక్రమించుకుంటారు. దాంతో కోట్లకొద్దీ ఆస్తి హరీ - సుధీర్ కుమార్ సగం ధనవంతుడిగా మిగులుతాడు."
    "అద్భుతం...అమోఘం...వెంటనే ఈ వార్తను తీసుకెళ్ళి సుధీర్ కుమార్ గారికి చెబుతాను" ఆనందంతో పరుగెత్తాడతను.


                                                *    *    *    *


    "అదంతా నాకనవసరం...సినిమా ఎనౌన్స్ చేసిన కాసేపటికే బయ్యర్స్ ఇంటిచుట్టూతా కిక్కిరిసిపోతారని అన్నారా లేదా మీరు...?" భవానీశంకర్ నీ, ప్రకాష్ నీ నిలదీసి అడిగాడు మార్కండేయులు కోపంగా.
    "ఆ మాట నిజమే ఫాదరిన్లా! కానీ మన బాడ్ లక్. పెద్ద బడ్జెట్ ఫిలిమ్ ఒకటి వీర ఫ్లాప్ అవటం చేత బయ్యర్లందరూ ఎవరి ఊళ్లకు వాళ్ళు పారిపోయి మిగిలిన ఎకరం పొలం దున్నుకుంటున్నారు. ఆ పొలం బాగా పండగానే మళ్ళీ వస్తారు."
    "ట్రాష్...! నాకదంతా అనవసరం. ఈ సినిమా కూడా రిలీజవదని నాకు తెలిసిపోయింది. అందుకని మన ఎగ్రిమెంట్ ప్రకారం ప్రకాష్ తాలూకు ఆస్థిలో ఈ సినిమాకైన డబ్బు కట్ చేసేస్తున్నాను."
    ప్రకాష్ ధీనంగా భవానీశంకర్ వైపు చూశాడు.    
    అతను చిరునవ్వు నవ్వాడు.
    "ఇదన్యాయం ఫాదరిన్లా! అతని ఆస్తికి మీరు ట్రస్టీగా వుండాలిగానీ ఇలా ఆస్థంతా కొట్టేయమని కాదు మిమ్మల్ని పెట్టుకుంది."
    "అందుకే ముందే చెప్పాను. సినిమా సక్సెస్ అయితేనే నీ ఆస్థి నీకు వస్తుందని. ఆ సినిమా అమ్మి నా డబ్బు నాకు ఇప్పించు. అప్పుడు ప్రకాష్ డబ్బు అతనికిస్తాను అంతే."
    "అదికాదు మావయ్యా! నాకున్న ఆస్తే లక్ష రూపాయలు. అదికాస్తా కాజేస్తే ఇంక నా భవిష్యత్తేమిటి?"
    "తిరుపతి గుండ్లు గొరిగే పోస్ట్ లో చేరిపో! సినిమా పేరుతో నాకు గుండు గొరిగావ్. కాబట్టి నీ జీవితం అంతా అదేపని చేసుకో. పో..."
    అతను వెళ్ళిపోయాడు.
    ప్రకాష్ దిగులుగా వుండడం చూసి భవానీశంకర్ ఉత్సాహంగా అతన్ని సమీపించాడు. "ఈ మాత్రానికే అలా కంగారుపడిపోతే ఎలా బ్రదర్...! ఇంకా బోలెడు స్కీములు అమలుచేయాల్సి వుంది మనం?"
    "కానీ నా ఎకౌంట్ లో కనీసం లక్ష రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ లేందే సుష్మను పెళ్ళి చేసుకోడానికి వీల్లేదని ఖండితంగా చెప్పేసింది వాళ్ళమ్మ. ఇప్పుడు ఆ లక్ష రూపాయలు కాస్తా అంకుల్ కొట్టేశాడు."
    "చిన్నప్పుడు పద్యాలను చదవలేదా బ్రదర్! ధర తగ్గుట హెచ్చుట కొరకే అని... అలాగే మీ అంకుల్ డబ్బు కొట్టేయటం తిరిగి ఇచ్చుట కొరకే."
    "మా అంకుల్ సంగతి నీకు తెలీదు గురూ...! ఒక్క పైసా ఛస్తే తిరిగి ఇవ్వడు ఎవరికీ."
    "ఇవ్వకపోతే కక్కిస్తాం బ్రదర్! అందులో మనం గ్రేట్ ఎక్స్ పర్ట్! అంచేత ఇంక ముఖం మీద ఆ దిగులు చెరిపేసి 'ప్యార్ మొహబ్బత్ కేసినా యేజిందగీ క్యా జిందగీ' అని పాడుతూ నన్ను ఫాలో అవ్వు. ఓ.కె?"
    "ఓ.కె."
    భవానీశంకర్ తోపాటు బయటకు నడిచాడతను.
    బయట కళ్ళొత్తుకుంటూ కూర్చుని వుంది సుష్మ.
    ఆమెను చూడగానే ప్రకాష్ కరిగిపోయాడు.
    "ప్రకాష్! ఇదంతా నావల్లే జరిగింది. నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటే ఆ సినిమా రిలీజవటం కష్టమని ముందే చెప్పాను" అంది కన్నీళ్లు తుడుచుకుంటూ.
    "కానీ ప్రియురాలికిచ్చిన మాట నెరవేర్చడానికి నేను నా ఆస్తి పోగొట్టుకోడానికయినా సిద్ధమే! ఒకే బాణం, ఒకే మాట, ఒకే ఎలక్షన్, ఒకే దీపం, ఒకే కంచం...అనేది అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆచరిస్తాను."
    సుష్మ కన్ఫ్యూజ్ అయిపోతూ అతని వైపు చూసింది. "నువ్వు అన్న మాటలు నాకేం అర్థం కాలేదు."
    "కాంటెస్ట్ తప్పుపడింది అంతే! ఈ సారి కరెక్ట్ గా చెప్తాడు సిస్టర్! నువ్విక మా ఇద్దరినీ వదిలేస్తే మేము వేరే కార్యక్రమం చేపట్టాల్సి వుంది" అన్నాడు భవానీ.
    సుష్మ సిగ్గుపడి నవ్వేసింది.
    "ఓకె ప్రకాష్! నేను వెళుతున్నాను. రేపు ఉదయం నేను యాక్ట్ చేసిన సింగిల్ ఎపిసోడ్ ఒకటి టి.వి.లో వస్తుంది చూడు. నాకు చిన్నప్పుడు హెయిర్ కటింగ్ చేసినతను డైరెక్ట్ చేశాడు. డైలాగ్స్ లో హెయిర్ కటింగ్, సమ్మర్ క్రాఫ్ లాంటి మాటలు ఎక్కువసార్లు వచ్చినా, అంతకుముందు డైరెక్టర్ల కంటే కొంచెం బాగానే తీశాడతను."
    "ఓ! తప్పకుండా చూస్తాను సుష్మా" ఆనందంగా అన్నాడతను.
    "మీరు కూడా చూడండి భవానీశంకర్ గారూ!"
    "ఆ ఎపిసోడ్ వచ్చే రెండు నిముషాల ముందు పాముకాటు వేస్తే తప్పక చూస్తాను సుష్మాజీ!"
    ఆమె ఆమె ఆశ్చర్యంగా చూసింది.
    "పాము కాటు వేస్తేనే చూడటం ఎందుకు?"
    "ఎందుకంటే విషానికి విరుగుడు విషమేనని సెవెంత్ క్లాస్ లో అనుకుంటాను చదివాను. బైదిబై.. మన తెలుగు ప్రోగ్రాంలు ఎక్కువమంది పాము కాటుకు గురైనవారే చూస్తున్నారని పేపర్లో వేశారు. మీరు చూడలేదా?"
    "లేదు"
    "వెరీ బాడ్! ఎనీవే ఒకవేళ పాములు కూడా తెలుగు టి.వి. ప్రేక్షకులను చూసి ఎదురు కాటు వేయకపోవచ్చు. ఎందుకంటే విషం ఎదురెక్కే అవకాశం వుంది. అయినాగానీ ప్రామిస్ చేస్తాను. తప్పక మీ కార్యక్రమం చూస్తాను."
    "థాంక్యూ"
    "ఇప్పుడేం చేయాలి మనం" అడిగాడు ప్రకాష్.
    "వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జర్నలిస్టులందరికీ కొంచెం ఖరీదయిన బహుమతులు వగైరాలు ఇచ్చి మన సినిమా గురించి కాంట్రవర్సీ స్టార్టు చేయించు. ఆ సినిమా రిలీజ్ చేస్తే చంపేస్తామని నక్సలైట్స్ ఫోన్ లో బెదిరించినట్టు స్టేట్ మెంటివ్వు.
    అయినాగానీ భారతదేశంలో ప్రబలిపోతున్న హింసను చూడలేక నీ ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధపడి నువ్వీ పిక్చర్ రిలీజ్ చేయబోతున్నట్లు రాయించు. నేనూ నక్సలైట్ నే అని ఎన్టీఆర్ లాగా స్టేట్ మెంట్ ఇవ్వు. ఆ తర్వాత సినిమా సెన్సార్ కి పంపించు. సెన్సార్ మెంబర్స్ నీ మాట వినేలా చేసుకొని (?) సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా వుందని స్టేట్ మెంట్ ఇప్పించు. నేనీలోగా అటెళ్ళి జనరంజని పబ్లికేషన్స్ వ్యవహారం ఓసారి చూసి వస్తాను."

 Previous Page Next Page