Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 32


    "కానీ ఇవన్నీ చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా?"
    "ఉపయోగమా! చూస్కో తెల్లారేసరికల్లా జనం అంటే బయ్యర్లు, పోలీసులు, లాఠీఛార్జ్, మళ్ళీ పేపర్ కవరేజ్, మళ్ళీ ఎక్కువ బయ్యర్లు, మళ్ళీ పోలీసులు, మళ్ళీ లాఠీఛార్జ్...చివరకు ఆ సినిమా పదిలక్షల లాభంతో అమ్మేస్తాం."
    "అప్పుడు నా లక్ష నాకిచ్చేస్తాడు అంకుల్, కదూ?"
    "చచ్చినట్లు"
    ప్రకాష్ ఉత్సాహంగా వెళ్ళిపోయాడు.
    భవానీశంకర్ పబ్లికేషన్ ఆఫీస్ లోకి నడిచేసరికి ప్రతిమ అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుని వుంది.
    భవానీ అమాంతం ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. "నీకోసం కనులు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాను డియర్! మీ ఫాదర్ ఇప్పటివరకూ మా ఇద్దరినీ ఆ సినిమా విషయంలో మెంటల్ సింగ్ లాగా వెర్రికేకలేసి జిప్సీ డాన్స్ లాంటిది చేశాడు."
    "ఏమైందా సినిమా?"
    "ఒక్కడు కూడా కొనడానికి రాలేదు"
    "వెరీ బాడ్! అందుకే కాబోలు ఆ భవానీశంకర్ తో నీ పెళ్ళి జరగదు అంటూ అరిచాడు డాడ్."
    "అంత దూరం వచ్చిందా వ్యవహారం?"
    "భవానీ! డోంట్ గెట్ ఎగ్జయిటెడ్..! మా డాడీని మెప్పించడానికి ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది."
    "ఏమిటది?"
    "అబిడ్స్ లో మా డాడీ ఓ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని కొంత స్థలం కొన్న విషయం నీకు తెలుసు గదా?"
    "తెలుసు"
    "తీరా చూస్తే ఆ స్థలం చాలదని కార్పొరేషన్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్థలానికి ఆనుకుని వున్న పక్క స్థలం వేలంపాట వేస్తున్నారని న్యూస్ పేపర్లో వేశారు. మనిద్దరం వెళ్ళి ఆ స్థలం వేలంపాటలో కొనేశామంటే డాడీ వెంటనే మన మ్యారేజ్ కి ఒప్పుకుంటారు."
    భవానీశంకర్ ఉత్సాహంగా, ఆమెను మరింతగా గాఢంగా కౌగిలించుకున్నాడు "ఓ.కె. డియర్! చాలా ఈజీ విషయం అది. ఫాదరిన్లాకు ఆ స్థలం అప్పజెప్పి ఐస్ చేసేద్దాం."
    "ఓ.కే! ఇంకో గంటలో ఆక్షన్ స్టార్టవుతుంది. పద వెళ్దాం."
    "కమాన్ డియర్"
    ఇద్దరూ హడావుడిగా బయటకు నడిచారు.


                              *    *    *    *


    ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతోంది. కేవలం డిపాజిట్ పదివేలు కట్టినవారినే ఆక్షన్ లోకి అనుమతించారు. ఆ కాస్త స్థలం కోసం మార్వాడీలు, అగర్ వాలాలు, మోతీ చంద్ లు ఆ ప్రదేశమంతా నిండిపోయారు. అబిడ్స్ లో ఆ స్థలం వుంటే దాని ద్వారా కొన్ని జెనరేషన్స్ వరకూ రాబడి సంపాదించవచ్చని కొంతమంది ప్లాన్! మరికొంతమందికి అక్కడ ఒక బట్టల షాపు పెడితే కోట్లు గడించవచ్చన్న కాన్ఫిడెన్స్! ఇంకొంతమంది దానిని మరి కొన్నేళ్ళ తర్వాత చాలా లాభానికి అమ్మేయవచ్చని ఆశ.
    వేలంపాట తను టేబుల్ ఎక్కి మైకు ముందు నిలబడ్డాడు.
    "మొఖద్దల్ ఆజ్ మానేవాలోంసబ్ కోహమారా ప్రణామ్!" మూడు వందల గజాల వైశాల్యం వున్న ఆ అద్భుత వాణిజ్య ప్రదేశం కేవలం యాభయ్ వేలకే మీ సొత్తు కావచ్చు సార్! మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
    గజం మార్కెట్ వాల్యూ నాలుగువేల రూపాయలున్న ఈ స్వర్ణ కమలం మీకు అదృష్టం వుంటే రెండు లక్షలకే లభించవచ్చు అమ్మా!
    మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, మీ పక్కనున్న వారి దురదృష్టాన్ని కూడా కనులారా చూసి ఆనందించండి.
    ఈ గోల్డెన్ ప్లేస్ కనీసం ధర - అంటే మా కంపెనీ తరపున మేము ఆఫర్ చేసే రేటు రెండువందల గజాలకూ యాభయ్ వేలు మాత్రంమే."
    ప్రతిమ భవానీశంకర్ వైపు ఉత్సాహంగా చూసింది.
    "మనం ఒకేసారి పెంచవద్దు. స్లోగా, స్టడీగా పెంచుదాం సరేనా?"
    "ఓ.కె." అంటూ గొంతు సవరించుకుని "యాభయ్ వేల ఒక్క రూపాయి బ్రదర్" అన్నాడు భవానీశంకర్.
    "కోట్లకు పడగలెత్తిన ఆ కూలింగ్ క్లాసెస్ హీరో ఒక్క రూపాయ్ పెంచారండీ! ఏభయ్ వేల ఒక్క రూపాయి."
    "ఆరు లక్షలు" అంది ఒక గొంతు మరో మూలనుంచీ.
    భవానీశంకర్ తో పాటు ప్రతిమ కూడా ఉలిక్కిపడింది.
    "ఎవడు వాడు? ఒకేసారి ఆరులక్షలంటాడు?" అడిగిందామె.
    "ఏడ్చాడు. మనం ఎట్ ఎనీ కాస్ట్ దీన్ని వదలం అని తెలీక వాగి వుంటాడు పిచ్చి నాయన! వాడిని ఫట్ ఫట్ లాడించేస్తాను చూడు" అంటూ గొంతు పెంచి "ఏడు లక్షలు" అన్నాడు భవానీశంకర్ చిరునవ్వుతో.
    "అహో అద్భుతం! కోట్లకు పడగలెత్తిన కూలింగ్ క్లాసెస్ హీరో ఛాలెంజింగ్ ఆక్షన్ ఏడు లక్షలు" అన్నాడు వేలంపాటవాడు.
    "ఎనిమిది లక్షలు" అంది అతనివైపున్న గొంతు వెంటనే.
    భవానీశంకర్ గతుక్కుమన్నాడు.
    ప్రతిమ పెదాల మీద బలహీనమైన చిరునవ్వు వెలసింది.
    "డోంట్ వర్రీ భవానీ. అంతిమ విజయం మనదేనన్న భారతదేశం పాలసీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో! చైనాతో యుద్ధం మొదలయినప్పటినుంచీ అదే మన పాలసీ" అందామె.
    "ఓహోహో! సఫారీ సూట్, కర్లీ హెయిర్ కోశాధికారి పాట ఎనిమిది లక్షలు. కాలేహైతో క్యాహువా దిల్ వాలేహై! అలాంటి దిల్ దార్ మనుషులు ఇంకెవరయినా వున్నారా ఈ వేలమంది హీరోల్లో?"
    "ఏం చేద్దాం?" ప్రతిమనడిగాడు భవానీశంకర్.

 Previous Page Next Page