"మాష్ లాడుషోంది భవానీశంకరా?"
"ఎస్ మైడియర్ వర్మా- నేనే!"
"నేన్నమ్మను. సీక్రెట్ కోడ్ ఏదయినా షెప్పు నమ్ముతాను"
"మనకు సీక్రెట్ కోడ్స్ లాంటివేమీ లేవు మిత్రమా"
"లేకపోయినా షరే షెప్పు"
భవానీశంకర్ ఓ క్షణం ఆలోచించాడు "ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ - హవ్ అయ్ వండర్ వాట్ యూ ఆర్!"
"ఎష్! నువ్వు భవానీశంకర్ వే భవానీ! నాకు అర్జంటుగా వెయ్యి రూపాయలు అప్పు కావాలి. కెన్ యూ గివ్?"
"తప్పకుండా ఇస్తాను మిత్రమా! నువ్వెక్కడున్నావిప్పుడు?"
"నేను లాల్ బహదూర్ స్టేడియంలో ఫిలిమ్ స్టార్స్ క్రికెట్ షూస్తున్నాను. అక్కడికొచ్చెయ్! క్యాష్ తీష్కురా. నో క్రెడిట్" ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది.
భవానీశంకర్ నెత్తి కొట్టుకున్నాడు.
* * * *
సుధీర్ కుమార్ హడావిడిగా ఆఫీసుకొచ్చాడు. జనరల్ మేనేజర్ గది తలుపు తీసుకుని లోపలకు జొరబడ్డాడు.
అక్కడ విజయ్ కుర్చీలో భవానీశంకర్ కనిపించడంతో ఆశ్చర్యపోయాడు.
"ఎవరు నువ్వు? వేరీజ్ మై జనరల్ మేనేజర్?" అడిగాడతను చిరిగిపోయిన భవానీశంకర్ చొక్కావేపు ఆనందంగా చూస్తూ.
"నా పేరు భవానీశంకర్. జనరల్ మేనేజర్ విజయ్ కి సెక్రటరీని."
"ఐసీ! బైదిబై నీ చొక్కా చిరిగిపోయినట్లుందే. చాలా బీదవాడిలా వున్నావ్."
"బీదతనమా? అతి దారుణమైన బీదతనం బ్రదర్! మూడ్రోజుల క్రితం అంబలి తాగాను. ఇంతవరకు తిండి తినలేదు మళ్ళీ."
సుధీర్ కుమార్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు "వండర్ ఫుల్! నీకు భోజనం నేను ఏర్పాటుచేస్తాను. అన్నట్టు నువ్వు వుంటోంది పూరి గుడిశెలోనేనా?" అనుమానంగా అడిగాడు.
"అవున్సార్. సగం గుడిశె"
"సగం గుడిశా?"
"అవును! ఒక సగం మొన్న సైక్లోన్ లో పడిపోయింది. రెండో సగంలోనే వుంటున్నాం ప్రస్తుతం."
"అద్భుతం మిస్టర్ శివశంకర్! వండర్ ఫుల్! నిజంగా నీ జన్మధన్యం అనుకో."
"అవున్సార్! నేనూ అదే అనుకుంటుంటాను ఎప్పుడూ."
"ఏమిటోనోయ్ కాళీచరణ్! నేనూ తపస్సు చేస్తున్నాను ఎప్పుడు ఈ ఆస్థినంతా వదిలించుకుని గుడిశెల్లో కాపురముంటూ ఆ అద్భుతమైన జీవితం గడపాలా అని."
"అదంతా నాకొదిలేయండి బ్రదర్! నేనూ, మా బాస్ విజయ్ ఇప్పటికే చాలా బ్రహ్మాండమైన పథకాలు తయారుచేసేశాం."
"ఆ! నిజంగానా? ఆ పథకాలన్నీ తప్పకుండా సక్సెస్ అవుతాయా? నేను దివాళా తీసి పూరిగుడిశెల్లోకెళ్ళిపోతానా?"
"వెళ్ళడమేమిటి బ్రదర్! చావు దెబ్బతిని అడుక్కుతినే స్టేజీకొచ్చేస్తారు" గ్యారంటీగా.
సుధీర్ కుమార్ కి కోపం వచ్చింది "నో! నేనెప్పటికీ అడుక్కోను. పొలాల్లో పాటలు పాడుతూ కూలిపని చేస్తాను. ఏం పాటో తెలుసా? పచ్చపచ్చానీ వరిసేలలో ఎర్ర ఎర్రానీ నూలు సీరలో నల్లనల్లనీ రంగు రైకలో ఆ తరువాత గుర్తులేదు, మర్చిపోయాను. ఒకవేళ కూలిపని కాకపోతే కొండ చరియల్లో మేకలు పెంచుతాను. మేకా మేకా మేమే ఎక్కడికెళ్తావ్ మేమే బెత్తెడు తోక మేమే చెంగున దూకే మేమే"
భవానీశంకర్ చప్పున అతని ధోరణికి అడ్డుపడ్డాడు "ప్రస్తుతానికి లిజనర్స్ కార్యక్రమం వాయిదా వేద్దాం సార్! నేనూ మా బాసూ అర్జంటుగా మన ఫ్యాక్టరీకెళ్ళాలి."
"ఓ! అలాగా - అయితే సరే. తర్వాత తీరిగ్గా నా పాటలన్నీ వినిపిస్తాను."
"అలాగే బ్రదర్!"
భవానీశంకర్ బయటకు నడిచాడు.
ఫ్యాక్టరీ వర్కర్లందరూ విజయ్ ని చూడగానే అతనిచుట్టూ మూగిపోయారు కోపంగా. "మేము ఎక్కువ జీతం పెంచమని అడుగుతుంటే నువ్వొచ్చి వున్న జీతం తగ్గించేస్తున్నావా? ఏమిటయ్యా ఇది?" అరిచాడు యూనియన్ నాయకుడు.
భవానీశంకర్ చిరునవ్వుతో జోక్యం కలుగజేసుకున్నాడు "మీకు జీతాలు తగ్గించడానికి పదహారు కారణాలున్నాయి బ్రదర్! అవేమిటో చెప్పమంటారా? నెంబర్ వన్ పవర్ కట్, నెంబర్ టూ డీజల్ షార్టేజ్, నెంబర్ త్రీ సింగరేణి కాలరీస్ బొగ్గు కార్మికుల సమ్మె, నెంబర్ ఫోర్ ముడి పదార్థాల ధరల పెరుగుదల, నెంబర్ ఫైవ్..."
"ఈ సోదంతా మాకనవసరం. జీతాలు తగ్గించడానికి వీల్లేదు" అరిచాడు లీడర్.
భవానీశంకర్ ఆశ్చర్యంగా యూనియన్ లీడర్ వైపు చూశాడు. "అలా అరవటం ఆరోగ్యానికి మంచిదికాదు బ్రదర్! నేను చెప్పిన కారణాలన్నీ బైహార్ట్ చేసుకొని వల్లెవేసుకుంటూ శాంతంగా వర్క్ చేసుకోండి. ఎందుకంటే జీతాలు ఈ నెల నుంచే తగ్గించి ఇవ్వబోతున్నాం. మీరెంత అరిచినా ఉపయోగం ఏమాత్రం లేదు."
"ఇదన్యాయం...అక్రమం...అమానుషం. నేనిప్పుడే లేబర్ కమీషనర్ కి కంప్లయింట్ ఇస్తాను."
భవానీశంకర్, విజయ్ పగలబడి నేలమీద కూర్చుని నవ్వారు.
"ఏమిటలా నవ్వుతారు?" మండిపడుతూ అడిగాడతను.
"మానసికంగా ఇంకా చాలా ఎత్తు ఎదగండి బ్రదర్! లేబర్ కమీషనర్ లేబర్ కి సహాయం చేస్తాడా? అతనికి నెలకు రెండువేలు ఇస్తున్నాం బ్రదర్. మా జోలికి ఛస్తే రాడు. కావాలంటే వెళ్ళి ప్రయత్నించండి."
"అలాగా! అయితే సరే కాసుకోండి ఈ క్షణంనుంచే సమ్మె చేస్తున్నాం. అరవండ్రా. మేనేజ్ మెంట్- ముర్దాబాద్! కొత్త జి.యం - ముర్దాబాద్! ఆ జి.యం. గాడి చెంచా భవానీశంకర్ - ముర్దాబాద్!"
"ఇంకో పేరు మర్చిపోయారు బ్రదర్! సుధీర్ కుమార్ - ముర్దాబాద్ అని కూడా అరవాలి. అది అరిచేటప్పుడు మాక్కూడా చెప్తే మేమిద్దరం కూడా అరుస్తాం."
అందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు.
భవానీశంకర్ విజయ్ ని కౌగిలించుకున్నాడు "అద్భుతం గురూజీ! దీంతో ఈ కంపెనీ శాశ్వతంగా మూలబడినట్లేనా?"