Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 30


    "మైగాడ్! అనుకోకుండా చాలా మంచి జరిగింది మనకి" అంది శ్రీరంజని.
    "అవును! ఇప్పుడిక మనం ఆమెను మెంటల్ హాస్పిటల్లో చేర్చేందుకు అవసరమైన ప్రయాసలేమీ తీసుకోనఖ్కర్లేదు."
    "అంటే ఆమెనలా వదిలేద్దామంటావా?"
    "అవును! ఆమెను ఎవరూ గుర్తుపట్టలేరు. ఆ బాండేజ్ తో ఆమె రూపం మనకు తప్ప ఇంకెవరికీ తెలీదు. మనకున్న నౌఖర్లు వగైరాలు చాలామందిని అప్పుడే బాంబే పంపించివేశాను. కొత్తగా చేరిన వారెవరూ ఆమెను సరిగ్గా చూడనేలేదు. మిస్సింగ్ పర్సన్ గా డిక్లేర్ చేస్తే సరిపోతుంది. ముసలాడి విల్లు మన లాయర్ ఎప్పుడో చింపి పారేశాడు."
    "మరి శ్రీరామ్ సంగతేమిటి? అతను దీపను తేలిగ్గా గుర్తుపడతాడు."
    "గుర్తుపట్టినా విషయం అతను పట్టించుకోడు. ఆమె చేతిలో తనకు జరిగిన పరాభవానికి ఆమెకు భగవంతుడు తగిన శాస్తే చేశాడని ఊరుకుంటాడు."
    ఆ మాట నిజమేననిపించింది శ్రీరంజనికి.
    సిద్ధార్థ తన వేపుకి తిప్పుకుందామె. విశాలమయిన అతని ఛాతీ మీద ముద్దు పెట్టుకుందామె.
    "అయితే మనం ఇక ఈ ఆస్తికి వారసులమయినట్లే కదూ?"
    "అవును! షుమారు డెబ్బయ్ కోట్ల ఆస్తి. ఈ డ్రగ్స్ రాకెట్ లో డెబ్బయ్ సంవత్సరాలు కష్టపడితేగాని సంపాదించలేనంత ఆస్తి" ఆనందంగా అన్నాడతను.


                        *    *    *    *


    అదే సమయంలో గంగా థియేటర్ లాన్స్ లో కూర్చుని న్యూస్ పేపరు చూస్తున్న చిరంజీవి దీప ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు.
    ఆ ఫోటో చూస్తూనే ఆమె చేసిన అవమానాలన్నీ కళ్ళముందు మెదిలినయ్ అతనికి. రక్తం సలసల కాగిపోసాగింది.
    ఆ డెవిల్ వల్లే తనీ భయంకరమయిన పరిస్థితికొచ్చాడు. రోజూ చిల్లర గూండాలతో కొట్లాటలు, కత్తిపోట్లు, పోలీసులతో గొడవలు.
    అవును! ఆమె తలకా బాండేజ్ ఏమిటి?
    అసలు పేపర్లో ఆమె ఫోటో ఎందుకొచ్చింది?
    విదేశాలు వెళుతోందా?
    కింద రాసిన మేటర్ చదువుతూనే ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరయ్యాడతను.
    ఆమెకు జ్ఞాపకశక్తి పోయిందా? తనెవరో, తన కుటుంబం ఎవరో కూడా గుర్తులేనంతగా మతిపోయిందా?
    అతనికి ఆనందం కలిగింది.
    భగవంతుడు తగిన శాస్తి చేశాడు.
    అసలు వాళ్ళ ఇంట్లోవారెవ్వరికీ ఆమె జాడ తెలియకుండా ఉంటే ఇంకా బాగుంటుంది.
    జీవితాంతం పిచ్చిదానిలా రోడ్ల వెంబడి తిరుగుతూంటుంది.
    అదే సరైన శిక్ష ఆ పొగరుబోతుకి.
    తన కోపానికి తనకే నవ్వు వచ్చేస్తోంది.
    తన భ్రమ గానీ అంత ధనవంతులు ఆమెను కనుక్కోకుండా ఉంటారా? ఆమెను మానసిక చికిత్స చేయించకుండా ఉంటారా?
    డబ్బుతో ప్రపంచాన్నే శాసించగల ధనవంతుడామె తండ్రి.
    అంత అద్భుతమయిన భవనం హైద్రాబాద్ లో ఎవరికీ లేదు ప్రస్తుతం.
    ఆ ఒక్క భవనమే పదికోట్లు రూపాయలు ఖర్చయి వుంటుంది.
    ఆమెకు ఎలాంటి అపకారమూ జరగబోదన్న విషయం గుర్తుకొచ్చేసరికి అతని మనసంతా విచారంతో నిండిపోయింది.
    కనీసం ఆమె దగ్గరకు వెళ్ళి ఒక్కసారి కసితీరా ఆమెను దూషించినా తనకు కొంత మనశ్శాంతి కలుగుతుందేమో!
    ఎందుకో చిన్నప్పటినుంచీ తనది విచిత్ర మనస్తత్వం!
    తననెవరయినా కొట్టినా, ఇన్సల్ట్ చేసినా, మోసం చేసినా ప్రతీకారం తీర్చుకునేవరకూ నిద్రపోయేవాడు కాదు. చిన్నప్పుడు తను హోమ్ వర్కు చేసుకురాలేదని టీచర్ కొట్టినప్పుడు రెండురోజులు ప్రతీకార వాంఛతో నిద్రపోలేదు. మూడోరోజు రాత్రి ఆ టీచరు మార్కెట్లో కనిపించినప్పుడు అతని వెనుకే చాలా దూరం ఫాలో అయ్యి చివరకు నిర్మానుష్యంగా వున్న ప్రదేశం చేరుకున్నాక నాలుగు రాళ్లు అతని మీదకు విసిరి ఆ చీకట్లో పరుగెత్తుకుంటూ పారిపోయాడు. మర్నాడు ఆ టీచర్ తలకు కట్టు కట్టుకుని క్లాస్ కి వస్తూంటే చేశాకగానీ తనలో ప్రతీకార వాంఛ చల్లారలేదు.
    అలాగే తను టెన్త్ చదువుతున్నప్పుడు ఆటల పోటీల్లో రాజేశ్వరరావుతో గొడవ పడినప్పుడు రాజేశ్వర్రావ్ వెళ్లి ఇంకో ఇద్దరు స్నేహితులతో వచ్చి తనను ఎటాక్ చేసి బాగా కొట్టి పారిపోయారు. తను ఆరోజు నుంచీ రాజేశ్వర్రావ్ ఒక్కడే కనిపిస్తాడేమోనని నెల రోజులు ఎదురుచూశాడు. చివరకు ఓ రోజు సినిమా హాల్లో కనిపించాడు. సినిమా అయ్యాక వాడు ఫ్రెండ్ తోపాటు సైకిల్ మీద వెళుతుంటే తను వాళ్లకు తెలీకుండా వెంబడి పరుగెత్తాడు.
    అయిదు కిలోమీటర్ల దూరం పరుగెత్తాక అతను సైకిల్ దిగి వెళ్ళిపోయాడు. రాజేశ్వర్రావ్ ఒంటరిగా సైకిల్ మీద కొద్దిదూరం వెళ్ళాడో లేదో తను వెనుకనుంచి వెళ్లి సైకిల్ లాగిపడేశాడు. రాజేశ్వర్రావ్ కిందనుంచి లేచే లోపల చాలా బలంగా అతని ఛాతీ మీద, వీపు మీదా, భుజాల మీదా తన కాళ్ళతో తన్నాడు. అయిదు నిమిషాల్లో రాజేశ్వర్రావ్ కిందనుంచి లేచి కూర్చోలేని స్థితికొచ్చేశాడు. రెండు చేతులూ ఎత్తి తనకు దండం పెట్టాడు.
    అయినా తనలో ప్రతీకార వాంఛ తీరలేదు.
    అతని సైకిల్ తీసుకుని వెళ్ళి ఆ పక్కనేవున్న ఎలక్ట్రికల్ పోల్ కేసి కొట్టి మళ్ళీ ఉపయోగించటానికి పనికిరాకుండా చేసి అవతల పారేసి వచ్చేశాడు.
    ఆ తరువాత తనమీదకొచ్చిన వాడి ఫ్రెండ్ ని ఎటాక్ చేసి బాగా కొట్టి బట్టలు చింపి వదిలాడు.
    ఇలా ఎన్నో సంఘటనలు.
    తను రివెంజ్ తీసుకోడానికి సాహసం చేయలేకపోయిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు.
    ఒకడు గాంధి.
    తనకు ఇస్తానన్న డబ్బు ఎగ్గొట్టాడు.
    రెండోది దీప.
    తన బ్రతుకు దుర్భరం చేసేసింది.
    ఈ ఇద్దరిలో గాంధీ మీద తను రివెంజ్ తీసుకోబోతున్నాడు.
    ప్రతినెలా అతనికివ్వాల్సిన రెండువేలూ...తనను అతను మోసగించిన మొత్తం తీరేవరకూ అతనికివ్వదల్చుకోలేదు.
    దానివల్ల అతనితో వైరం వస్తుంది. తనకు సమస్యలు చుట్టుకుంటాయ్.
    అయినా ఫర్లేదు. తనలోని ప్రతీకార వాంఛ అలాంటిది.
    అతను తనకివ్వాల్సిన అయిదువేలూ ఎప్పటికయినా వసూలు చేసుకోవాలనుకున్నాడు.
    ఆ అవకాశం ఇప్పటికి వచ్చింది.
    "సార్" ఓ కుర్రాడు పరుగుతో వచ్చాడు.
    "ఏమిటి?"

 Previous Page Next Page