విజయక్కూడా ఇక దుఃఖం ఆగలేదు.
"అమ్మా" అని మాత్రం అనగలిగింది గాయపడ్డ హృదయంతో.
ఆమెకు ఎటూ తోచడం లేదు.
చంద్రకాంత్ తన సర్వస్వం. ఆరోజు తను తెలివితక్కువగా ఆ అబద్ధం చెప్పకుండా ఉండి ఉంటే అతని మనసులో ఎప్పటికే తనే నిలిచిపోయేది. తనను ప్రేమించకపోయినా వివాహం చేసుకోకపోయినా తన రూపాన్ని అసహ్యించుకున్నా_అతని హృదయంలో తనకో పవిత్రమయిన స్థానం ఉండేది. జీవితమంతా ఆనందంగా గడిపేయడానికి ఆ సంతృప్తి చాలదూ తనకి? అతనెవరిని ప్రేమించినా, ఎవరిని వివాహం చేసుకున్నా తను మాత్రం అతనిని తన హృదయంలో అలానే నిలుపుకుంది. అతనికున్న స్థానం మరెవరూ పొందలేదు. అంతగా అతనిని ఆరాధిస్తోంది తను.
జయ చేసిన తప్పిదానికి ఏ పాపమూ ఎరుగని అతనిని శిక్షించడం ఎంత దారుణమయిన విషయం? ఎప్పటికయినా ఈ విషయం బయటపడితే_అతని మనసెంత గాయ పడుతుంది. తననెంత అసహ్యించుకుంటాడు? అతనికి ఆ తరువాత తన మొఖం ఎలా చూపగలుగుతుంది?
"విజయా! ఇంకా ఆలోచిస్తున్నావా? నేను కోరరాని కోరిక కోరుతున్నాననీ, చేయరాని పని చేస్తున్నాననీ తెలుసు. కానీ ఏం చేయనమ్మా! జయ చేసిన దారుణాన్ని కప్పిపెట్టేందుకే ఇంత నీచానికి పాల్పడుతున్నాను."
ఆమె అంతగా ప్రాధేయపడుతుంటే విజయ ఇంక భరించలేకపోయింది. పార్వతి తన తల్లి! తన తల్లికన్నా ఎక్కువ! తన తల్లి ఎలా ఉండేదో, తననెలా చూసుకునేదో తనకు తెలీదు. కానీ పార్వతి కన్నా ఎక్కువ ప్రేమ ఎవరూ చూపలేరని తను మనస్ఫూర్తిగా నమ్ముతుంది. అలాంటి తల్లి తనను ప్రాధేయపడడము?
"అమ్మా! నువ్వు కన్నీరు పెట్టకు! నువ్వేం చేయమంటే అది చేస్తాను. నన్ను జయకన్నా ఎక్కువగా ఆదరించి పెంచినందుకు నీకెంతో ఋణపడి ఉన్నానమ్మా! నేను జీవించి ఉండగా నువ్వు ఎప్పుడూ కన్నీరు పెట్టకూడదు! నీకెలాంటి కష్టమూ రానీను!"
ఆమె చేతులమీద వాలిపోయి ఏడ్చేయసాగింది విజయ.
అదేరోజు చంద్రకాంత్ కి టెలిగ్రామ్ అందింది.
టెలిగ్రామ్ చూస్తూనే అతను ఆనందభరితుడయిపోయాడు.
తను జయకు రాసిన ఉత్తరానికి ఇంత త్వరగా జవాబు లభిస్తుందని ఊహించనయినా లేదు.
ఆమె అసలు తనతో వివాహానికి అంగీకరిస్తుందో లేదోనన్న సందేహంతోనూ, నిస్పృహతోనూ సతమతమయిపోతున్నాడప్పటివరకూ.
పదేపదే టెలిగ్రామ్ చదువుకోసాగాడతను.
"మన వివాహం గురించి మాట్లాడ్డానికి వెంటనే ఇక్కడకు రండి_ విజయ" ఎన్నిసార్లు చదివినా అది కలా నిజమా అన్న అనుమానం కలుగుతూనే ఉంది.
వెంటనే విజయ వాళ్ళ ఊరు బయల్దేరాడతను.
ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయగూడదనిపించిందతనికి. ఆలస్యం చేస్తే మళ్ళీ విజయ తన మనసు మార్చుకుంటుందేమోనని భయం! ఆమె మనసు మార్చుకుందంటే తను ఆత్మహత్య చేసుకుని జీవితం ముగించడం తప్ప వేరే మార్గం లేదు.
అతన్ని అంత దూరంలో చూస్తూనే జయ వాడిపోయిన మొఖంతో లోపలి గదిలోకి వెళ్ళిపోయింది.
ఇదిచూసి ఆశ్చర్యపోయాడతను. ఆమె చిరునవ్వుతో సిగ్గుపడుతూ తనను పలకరిస్తుందని కలలు కన్నాడు తను బస్ లో.
పార్వతి వచ్చి మాట్లాడింతనితో.
ఆమెతోపాటు విజయ కూడా అక్కడే కూర్చుంది.
"విజయకు వెంటనే వివాహం చేయాలని ఇక్కడకు పిలిపించాను బాబూ! విజయ నీ గురించి చెప్పింది. మీరు వివాహం చేసుకోడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కాని వివాహం వీలయినంత త్వరలో జరగాలి. అదీ తిరుపతిలో జరగాలి! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు." అడిగింది పార్వతి.
అతను నవ్వాడు.
"నా అభిప్రాయం ఏముంటుందండీ! నా విషయాలన్నీ విజయకు హైద్రాబాద్ లో చెప్పేశాను. మీరెప్పుడంటే అప్పుడే వివాహం జరుగుతుంది. మావాళ్ళకెవరికీ ఎలాంటి అభ్యంతరం కూడా ఉండదు."
అతని కుటుంబ వివరాలు తెలుసుకున్నాక, వారంరోజుల తరువాత ఓ రోజున ముహూర్తం కూడా నిశ్చయించింది పార్వతమ్మ. అతను తన తల్లిదండ్రులతో తిరుపతి చేరుకుంటానని మాట ఇచ్చాడు.
అంతా అనుకున్నట్లే జరిగిపోయింది.
తిరుపతిలో జయ, చంద్రకాంత్ ల వివాహం ఎలాంటి అట్టహాసం లేకుండా జరిగిపోయింది.
వివాహం జరుగుతున్న సమయంలో విజయ దుఃఖాన్ని అదుపులో ఉంచుకోడానికి విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది.
తన శరీరాన్ని తన నుంచి ఎవరో వేరుచేస్తున్నట్లనిపించింది. కానీ చంద్రకాంత్ ని వివాహం చేసుకుంటోంది ఎవరో కాదు. తన చెల్లెలే! తను అమితంగా అభిమానించే చెల్లెలు!
మొదటిరాత్రే జయ ప్రవర్తనలో ఏదో లోటు కనిపించిందతనికి. ఆమెలో కొత్త పెళ్ళికూతురు కుండాల్సిన లజ్జ, ఉత్సాహం, కోరిక - ఇవేవీ కనిపించలేదు.
ప్రణయం జరిపేటప్పుడు కూడా ఆమె శరీరం అతని స్వాధీనం చేసింది కాని తను ఆ ఆనందంలో భాగం పంచుకోలేకపోయింది. బహుశా కొంతమంది కొత్తలో ఇలాగే ఉంటారేమోనని సరిపుచ్చుకోడానికి ప్రయత్నించాడతను. కానీ నెలరోజులయినా ఆమెలో ఎలాంటి మార్పు కనిపించకపోయేసరికి అతనిలో ఆలోచనలు, సందేహాలూ ప్రారంభమైనాయ్.