Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 30


                                                  చదరంగం

    ఆ వూరు పల్లెగాదు. ఆ వూరులోనూ చెట్లు చేమలుతోపాటు ఆవులు, కుక్కలు నక్కలుతో పాటు మనుషులున్నారు.... మనుషులున్నారు కనక పాలించడానికి ప్రభువులుండాలి కనక ఆ వూళ్ళోనూ ప్రభువులున్నారు. కనక పార్టీలు, కక్షలు, కొట్లాటలు, వైషమ్యాలు తప్పవు గనక అవీ వున్నాయి!
    ఆ వూరికీ మిగతా వూర్లతోపాటు ఎన్నికలొచ్చాయి. పార్టీలు బయలుదేరాయి! హడావిడి వచ్చింది. మిగతా పార్టీలమాట ఎలా వున్నా ఆ వూర్లో చిన్నపరెడ్డి, బాపయ్యనాయుడు ఎదురెదురుగా పోటీపడ్తున్న పార్టీ ముఖ్యమైంది.
    ఆ వూర్లో బాపయ్యనాయుడు, చిన్నపరెడ్డి, ఇద్దరూ సమబలులే! ఇద్దరూ వూరికి ముఖ్యులే! అంగబలం, అర్థబలం సరిసమానంగా వున్నవాళ్ళే! ఇద్దరికిద్దరూ రాజకీయపు ఎత్తులు, పై ఎత్తులు తెల్సినవారే.
    అంచేత వారిద్దరిలో ఎవరు నెగ్గుతారు అన్న విషయం గురించి వూర్లో ప్రజలు ఊహాగానాలు, చర్చలు ఆరంభించారు. ఊరు ఊరంతా వారిద్దరి పోటీ ఫలితాల గురించి ఆరాటంగా నిరీక్షిస్తూంది.
    బాపయ్యనాయుడు నాలుగురోజుల క్రిందటే రంగంలోకి దూకాడు. హరికథలేమిటి, ఇంటింటికి కాన్వాసింగు ప్రారంభించాడు. నోట్లకట్టలు శనగపప్పు బెల్లాలు మాదిరి పంచిపెడుతున్నాడు. సీసాలకొద్ది సారాయి రోడ్లమీదే పారుతూంది. దొరికినంతవరకు ఓట్లు కొనాలన్న ఆరాటంతో బీద ప్రజానీకం గుమ్మాల ముందే చేతులు చాపుకుని కూర్చున్నాడు.
    చిన్నపరెడ్డి రంగంలోకి దుమకలే దేమిటని అందరూ చూస్తున్నారు. అలాంటి సమయంలోనే ఆయన కుడిభుజం అయిన కోటిగాడి హత్య వార్త!
    తెల్లారేసరికి కోటిగాడి హత్య వార్త ఊరంతా పాకింది. అప్పుడే నిద్రలేచి వీధరుగు మీద పందుర పుల్ల నములుతున్న చిన్నపరెడ్డికి పాలేరువాడు పరుగెత్తుతూ వచ్చి కోటిగాడి హత్యవార్త అందించాడు. చిన్నపరెడ్డి ఒక్క క్షణం నోటమాట రాక స్థాణువై అలా వుండిపోయి ఆ తరువాత 'ఆ' అంటూ ఒక్క కేకపెట్టి చేతులో పందుం పుల్ల పారేసి పంచే ఎగలాక్కుంటూ వున్నవాడున్నట్టే పరిగెత్తాడు వీధిలోంచే!
    కోటిగాడి శవం చుట్టు అప్పటికప్పుడే పెద్ద గుంపు తయారయింది. ఊరవతల చెరువుగట్టున కోటిగాడు ఘోరంగా హత్య చేయబడ్డాడు తలమీద ఏ గునపంతోటో పొడిచినట్టుంది. బుర్ర చితికిపోయి నెత్తురు వరదలై గడ్డ కట్టింది. మొహం అంతా కారి గడ్డ కట్టింది. కనుగుడ్లు వెస్స కొచ్చి, భయంకరంగా వుంది మొహం. గోలు గోలున మొగుడి శవం మీద పడి మాలచ్చి గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. గుంపుని త్రోసుకుని, దారి చేసుకుని ముందుకెళ్ళి పడ్డాడు చిన్నపరెడ్డి రొప్పుతూ. కోటిగాడిని ఆ స్థితిలో చూశాక ఒక క్షణం అలా స్థాణువులా నిలబడి ఆ తర్వాత 'కోటిగా' అంటూ అంత మనిషి చేతుల్లో మొహం కప్పుకుని క్రింద కూలబడిపోయాడు.
    కోటిగాడు చిన్నపరెడ్డి నమ్మినబంటు, కుడిభుజం, మంత్రి, సలహాదారు అన్న సంగతి వూరందరికీ తెలుసు. అంచేత చిన్నపరెడ్డి అంతవాడు కోటిగాడి లాంటి వాడి కోసం విచారించడం వింత అన్పించలేదు ఎవరికీ! చచ్చిపోయిన కోటిగాడి వంక జాలిగా, రెడ్డివంక సానుభూతిగా చూశారు.
    ఓ ఐదు నిమిషాలు గడిచాక తలెత్తాడు. యీసారి అతని కళ్ళలో దుఃఖానికి బదులు క్రోధం చోటు చేసుకుంది. మూడో కన్ను విప్పిన శివుడిలా వున్నాడు.
    "ఎవరురా యింత ఘోరం చేశారు? ఏ ఎదవలురా నా కోటిగాడ్ని యింత దారుణంగా సంపేరు? అన్నెం పన్నెం ఎరుగని నా కోటిగాడ్ని పంపిన ఎదవలెవరో వాళ్ళనట్టుకుని మూడు సెరువులు నీళ్ళు తాగించకపోతే నా పేరు సిన్నపరెడ్డే కాదు" అంటూ భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు.
    "నా మీద కోపం కసి వుంటే నా మీద తీర్చుకోవాలి. అంతేగాని ఏ పాపం ఎరుగని కోటిగాడేం సేసాడని ఆడ్ని సంపాల.... ఆడు నా మనిసవడమా ఆది అపరాధం. ఆడు నా మనిషి, గూడెంకి నాయకుడు ఆడి మూలకంగా గూడెం ఓట్లన్నీ నా కొస్తాయనీ ఆడ్ని సంపేత్తే గొడవుండదని యింత ఘోరం సేస్తారా? చావుంటే బలా బలాలు తేల్చుకోవాలిగాని యిలా మడిసిని అన్నాయంగా సంపేత్తారా!
    "ఓట్ల కోసం, పదవులకోసం నిండు ప్రాణాన్ని ఇలా ఘోరంగా తీయడం మడుసులు సేసేపనేనా!.... కోటిగాడ్ని పంపిందెవరో, ఎక్కడున్నా పట్టుకుని ఉరిశిక్ష వేయించిందాకా నేను నిద్రపోను" మళ్ళీ భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు.
    అప్పటిదాకా అక్కడున్న గుంపు లందరూ కోటిగాడి హత్య గురించి రకరకాలుగా అనుకున్నారు. ఎవరు చంపి వుంటారన్న విషయం ఊహాగానాలు చేశారు. ఇప్పుడు చిన్నపరెడ్డి మాటలు విన్నాక వాళ్ళ సందేహం తీరిపోయినట్లయి అందరూ ఆశ్చర్యంగా గుండెల మీద చేతులు వేసుకున్నారు.
    "ఏటి, ఇది బాపయ్యనాయుడి పనా!"
    "ఓట్లకోసం యింత ఘోరం సేసాడా? ఓరి నాయనో మనిషిని సంపేయడమే ఓట్లకోసం!"
    "కలికాలం మహాప్రభో....ఎంతకి తెగించారో" ఇంతకీ బాపయ్యనాయుడే చేయించాడని ఏముంది?" అంతా తలోమాట అనుకున్నారు. చిన్నపరెడ్డి అందరివంక చూశాడు.
    మీకింకా సందేహం ఏమిటి? ఇది బాపయ్యనాయుడు పని కాకపోతే మరెవరి పనయ్యా సీమకైన అపకారం సెయ్యని కోటిగాడ్ని సంపేయడానికి ఎవరి కవుసరం వుందయ్యా. ఆడు నా మనిషి. ఆడి మూలకంగా గూడెం ఓట్లన్నీ నాకేస్తారు. ఆడ్ని సంపేసి, డబ్బాశ చూపించి ఆళ్ళందరిని అటు తిప్పుకోవచ్చని ప్లానేసాడు, ఇంతఘోరం సేసాడు" విడమర్చాడు.
    అందరూ వప్పుకున్నట్టు తలలాడించారు "యింత పనిచేసిన ఆళ్ళని పట్టుకుని పోలీసుల కప్పగించందే నేనూరుకోను. ఒరే పోలిగా, గమ్మున పోలీసు స్టేషనికి పరిగెట్టి యిక్కడ హత్య జరిగిందని ఇన్ స్పెక్టరుని వెంట బెట్టుకురా, ఆ ... ఆ తోవనే మన ప్రెస్ రిపోర్టరు మూర్తి బాబుని కూడ వెంటబెట్టుకురా.... యీ దగుల్బాజీల పని పేపర్లో ఏయించి లోకానికి సెప్పాల...." కోపంతో వణికిపోతూ అన్నాడు రెడ్డి పోలిగాడు పరిగెత్తాడు.
    కాస్త కోపం దుఃఖం సర్దుకున్నాక మొగుడి శవం మీద పడి హృదయ విదారకంగా ఏడుస్తున్న లచ్చి దగ్గిరకి వెళ్ళి నిలబడ్డాడు రెడ్డి. కామందుని చూసి మరింత శోకాలు పెట్టసాగింది లచ్చి "ఓరి నాయనో ఓరి దేముడో, నానే సెర్లో పడనో దేముడో, నాకేటి దిక్కోరో, నేనేం సేతునే నన్నన్నాయం సేసినోడో దేవుడో" ఏడుస్తున్న లచ్చి వంక జాలిగా చూస్తూ పై పంచతో కళ్ళొత్తుకున్నాడు రెడ్డి.
    'వూరుకో లచ్చీ.... వూరుకో ....యింక ఏడ్చి లాభం ఏటి! సూడు .... నీ మొగుడ్నంటే నీకు తెచ్చి యీయలేను గానీ నీకు, నీ పిల్లలకి ఏ లోటు రాకుండా నే సూత్తాగా.... ఏడవకు' అంటూ ఓదార్చాడు.

 Previous Page Next Page