"వద్దురా, దాన్ని వెళ్ళనీ. చేతికందిన ఆడపిల్ల, అమ్మకి కాస్త సాయంగా ఉంటుంది. ఈ సమయంలో అదొక్కర్తీ పని చేసుకోలేదు!" పార్వతమ్మ అభ్యంతరం చెప్పింది.
రాధకి ఉండాలని వుంది. అమ్మమ్మ మాటతో సంతోషం కాస్త ఎగిరిపోయింది. ముఖం ముడుచుకుంది.
"అన్నయ్యా! నీ ఎరికని ఏమైనా సంబంధాలుంటే చూడురాధకి!" ఆడపిల్ల తల్లిగా శకుంతల అంది.
"రాధ పెళ్ళి చేసుకోదట! ఉద్యోగం చేస్తానంది, నాతో" శీను అన్నాడు.
"ఏం, రాధా! ఉద్యోగం చూడమంటావా, పెళ్ళి కొడుకుని చూడమంటావా? ఏది కావాలి నీకు?" మేనకోడలితో హాస్యం ఆడాడు రామం.
"ఉద్యోగమే చూడరా ముందు. మహ సరదా పడుతూంది. తమాషా అనుకుంటూంది కాబోలు ఉద్యోగం అంటే....." అన్నారు జగన్నాథంగారు కసిగా. రామం నవ్వాడు.
"పదండమ్మా ..... రైలుకి టైమయిపోతూంది" రామం వాళ్ళను స్టేషనుకి దిగబెట్టి రావడానికి బయలుదేరాడు.
"మందులు సరిగా తీసుకుంటూండమ్మా!" అని పార్వతమ్మ మరోసారి హెచ్చరించింది. కారు దగ్గిర నుంచుని.
"వస్తా నాన్నా!...." అంది శకుంతల.
"మంచిదమ్మా!" అన్నాడు తండ్రి.
9
"విజయ దగ్గిర నుంచిలా ఉంది" అంటూ పోస్టు మాన్ చేతుల్లోంచి ఉత్తరం అందుకుని భర్త కందించింది పార్వతమ్మ. విజయ ధర్మమా అంటూ ఆమెకి మామూలు ఉత్తరాలకి, ఎయిర్ లెటర్స్ కి తేడా తెలిసింది. అది ఎయిర్ లెటర్ అవడంవల్ల కూతురి దగ్గిర నుంచి అని వెంటనే తెలుసుకుంది.
జగన్నాథంగారు ఆత్రుతగా ఉత్తరం విప్పి చదవసాగారు. రెండు నెలలుగా విజయదగ్గిరనుంచి ఉత్తరంలేదని ఆరాటపడుతున్నారు. మామూలుగా నెలకో ఉత్తరం రాస్తుంది విజయ. ఒంట్లో ఎలా ఉందో ఏమిటో అని కంగారుపడుతూ ఈ మధ్యే ఉత్తరం రాసి పడేశారు విజయకి.
ఉత్తరం చదువుతున్న జగన్నాథంగారి ముఖంలో మారుతున్న రంగుల్ని చూసి పార్వతమ్మ కలవరపడింది.
"ఏం రాసిందండీ?.....కులాసాగా ఉన్నట్టేనా? వస్తానని గాని ఏమన్నా రాసిందా?" ఆదుర్దాగా అడిగింది పార్వతమ్మ. ఆయన జవాబియ్యలేదు. ఉత్తరం మడిచి చిన్నగా నిట్టూర్చాడు. ఆయన ధోరణి చూసి పార్వతమ్మకి కంగారెత్తింది. "ఏం రాసిందంటే మాట్లాడరేమండీ? ఏఁవిటి విషయం? అలా వున్నారేం?...."
"ఎందుకలా గాభరా పడతావు?.....నీ కూతురు ఏం అయిపోలేదు. పెళ్ళిచేసుకుని, విహారానికి వెళ్ళింది."
"ఆఁ......పెళ్ళా ..... పెళ్ళి చేసుకుందా?.....ఎప్పుడు? ఎవరిని? నిజంగానేనా?.....దానంతట అది చేసేసుకోవడమేనా!......మనం ఉన్నా మన్న సంగతి మరచిపోయిందా?.....చెప్పాపెట్టకుండా చేసేసుకుందాపెళ్ళి? ఎవరినండీ చేసుకుంది!.....మన వాడేనా, బ్రాహ్మడేనా?...."
జగన్నాథంగారు వింత నవ్వు నవ్వారు. "మనవాడు, బ్రాహ్మడు కావాలి? ఎంత పిచ్చిదానివి!.....అది అమెరికన్ ని పెళ్ళాడింది. ఎవడో రాబర్ట్సుట! అది పనిచేసే చోటే పనిచేస్తున్నాడట. పదిరోజుల క్రితం పెళ్ళిచేసుకుని, ఇప్పుడు యూరప్ లో విలాసయాత్ర చేస్తున్నారట. అదీ అది రాసింది."
పార్వతమ్మ నోరు తెరుచుకుని ఉండిపోయింది కాసేపు. "అయ్యో, అయ్యో! అదేమిటండీ!.....దొరని పెళ్ళాడిందా? అవ్వ, అవ్వ!....ఇదేం పొయ్యేకాలమండీ దానికి! బ్రాహ్మణపిల్ల వెళ్ళి కిరస్తానీవాడిని పెళ్ళాడడ మేమిటండీ?....ఎంత అప్రాచ్యపు పని చేసింది!.....మీరేమిటి అలా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు! అది అలాంటి వెధవపనిచేస్తే, అంత నిశ్చింతగా ఎలా కూర్చున్నారండీ?....." కలవరపాటుతో గోలపెట్టింది పార్వతమ్మ.
"ఏం చెయ్యమంటావు?.....యేడవమంటావా, ఎందులోనేనా పడి చావమంటావా?......యేం చెయ్యమంటావు?"
"ఎంత అప్రతిష్ఠండీ నలుగురిలో! ముఖం ఎలా ఎత్తుకుంటామండీ!" కళ్ళు ఒత్తుకుంటున్న భార్యవైపు జాలిగా చూశాడు జగన్నాథంగారు.
"నువ్వూ, నేనూ నెత్తిమొత్తుకుని యేం ప్రయోజనం పార్వతీ?.....అది మన చెప్పుచేతల్లోంచి జారిపోయి చాలాకాలమైంది. దానియిష్టంవచ్చినవాడిని అదిచేసుకుంది. అందులో మనయిష్టాయిష్టాల ప్రసక్తి ఏమీలేదు. ఈ రోజుల్లో యిలాంటి సంఘటనలు ప్రతి యింట్లోనూ జరుగుతున్నవే. అప్రతిష్ట అని బెంగపెట్టుకోవలసిన అగత్యం లేదు యీకాలంలో. అంచేత ఎవరో యేదో అనుకుంటారని విచారించకు నువ్వు.....ఇప్పటికయినా అది ఎవడినో ఒకడిని పెళ్ళి చేసుకుని ఓ యింటిదయిందని సంతోషించు-అంతే!" భార్యని ఓదారుస్తూ అన్నారు జగన్నాథంగారు.
"ఇలాంటి పెళ్ళిచేసుకునేకంటే, అసలు పెళ్ళి చేసుకోకపోయినా నాకు సంతోషంగానే ఉండేది. చేసుకు చేసుకు జాతి, మతం కాని వాడినా చేసుకోవడం!....."
"నీకు, నాకు ఆ జాతి మత భేదాలు. దానికి అలాంటివేం లేనపుడు మనం ఏమనుకుని యేం లాభం పార్వతీ?.....అయినా, చేతులు కాలాక ఆకులు పట్టుకుని యేం ప్రయోజనం!.....ఇంక ఆ సంగతి మరచిపో."
"ఆ మొగుణ్ణి పట్టుకుని ఇంక ఆ దేశం వదిలి వస్తుందా అది? ఇన్నాళ్ళు ఎప్పుడో రాకపోతుందా అనుకునే దాన్ని.....ఇంక ఆ ఆశ లేదు......పోనీ......రాకపోతే పోనీ, అడ్డమయిన వాళ్ళనీకొంపకి తీసుకువచ్చి పడేసేకంటే రాకపోవడమే మంచిది".....అని గొణుగుకుంది పార్వతమ్మ.
జగన్నాథంగారికి విజయ ఎవరో విదేశీయుణ్ణి పెళ్ళాడిందన్న దానికంటే......ఆ పెళ్ళిమూలంగా అక్కడే స్థిరపడిపోయి యింక స్వదేశానికి తిరిగి రాకపోవచ్చు నన్నదే ఎక్కువ బాధ కలిగించింది. ఇన్నాళ్ళూ ఎప్పుడో ఒకప్పుడు విజయ తిరిగివస్తుందన్న ఆశ ఆయనకీ ఉండేది. ఆ ఆశ కాస్తా ఈ ఉత్తరంతో అడుగంటింది. విజయ......తన కూర్మి బిడ్డ......తను ప్రాణసమానంగా చూసుకున్న విజయ ఇంక తనకంటపడదు! తను చనిపోయేలోగా ఒక్కసారి కూడా చూడలేడు. ఆడది పార్వతమ్మలా ఆయన తనబాధ వెలిబుచ్చక పోయినా మనసులో ఎంతో బాధపడ్డాడు.