Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 30


    సర్కిల్ ఇన్స్ పెక్టర్ డేవిడ్ వినయంగా ఓ పక్కన నిల్చున్నాడు. అప్పటికే జరిగింది పూసగుచ్చినట్టుగా చెప్పాడు.

 

    "ఆ కొండ లోయలో మొదట ధరణి శవం దొరికింది. ఇంకా సెర్చింగ్ జరుగుతోంది సార్... మొత్తం ఏడుగురు ఖైదీలకు బలమైన గాయాలు తగిలాయి సర్... ముగ్గురు ఖైదీలు చనిపోయారు. వాళ్ళని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు సార్."

 

    "ధరణి పని అయిపోయింది. చిదంబరం నువ్వా ధరణి డెడ్ బాడీని చూశావు గదా" అడిగాడు సి.ఎం. అహోబలపతి.

 

    " ఆ శవాన్ని చూసి నిర్ధారించుకుని, ఇప్పుడే ఉస్మానియా నుంచి వస్తున్నాను" చెప్పాడు హోంమినిస్టర్ చిదంబరరావు.

 

    "నాతో పెట్టుకుంటాడా ఆ పెద్దబ్బాయిగాడు... నన్ను దెబ్బతీయాలనుకుంటాడా. ఒరేయ్ పెద్దబ్బాయ్... ఆ రోజే నీకు చెప్పాను. ఈ అహోబలపతిగాడితో పెట్టుకోవద్దురా అని. చూడు చిదంబరం... వెంటనే ప్రెస్ వాళ్ళను పిలువు. ఆదిత్యకు కొంతమంది రాడికల్ స్టూడెంట్ యూనియన్స్ తో సంబంధాలున్నాయని, ఆదిత్యను తప్పించడానికి ఆ రాడికల్స్ ఆ ప్రిజనర్స్ వ్యాన్ మీద దాడి చేశారని, కాల్పులు జరిపారని, ఆ కాల్పుల కారణంగానే ఈ సంఘటన జరిగిందని చెప్పు. అలాగే... ఇంకో పక్కన ఉస్మానియా యూనివర్శిటీ హాస్టళ్ళ మీద దాడి జరగాలి. రాడికల్ స్టూడెంట్స్ అరెస్టు కార్యక్రమం జరగాలి. పేపర్లలో దీనికి పెద్ద పబ్లిసిటీ వచ్చేట్టుగా చూడు. అర్ధమైందా" ఒకింతసేపు ఆగి డేవిడ్ వైపు సూటిగా చూసి-  

 

    "ఇంతకీ ఆదిత్య గాడేమయ్యాడు?"

 

    "వాడూ చచ్చిపోయి వుంటాడు సర్... నో డౌట్" చెప్పాడు చిదంబరరావు.

 

    "నాకు కబుర్లుకాదు... పని కావాలి. ఆదిత్య కొన ఊపిరితో కూడా బ్రతకడానికి వీల్లేదు. ఎంత రాత్రయినా వాడి చావు కబురు నాకు తెలియాలి" ఉరిమాడు అహోబలపతి.

 

    సెల్యూట్ చేసి సర్కిల్ ఇన్స్ పెక్టర్ డేవిడ్ బయటికెళ్ళిపోయాడు.

 

    ధరణిగాడి చావు గురించి నువ్వే ముందుగా ఆ పెద్దబ్బాయిగాడికి ఇన్ ఫామ్ చేయి. రేపుదయం వాడి శవంతోపాటు, ఆ పెద్దబ్బాయిగాడి ఇంటికి వెళ్ళు... సంతాపం ప్రకటించు. ఈ ఇన్ సిడెంట్ మీద ఎంక్వయిరీ నేనేర్పాటు చేస్తాను. అర్థమైందా?"

 

    "అర్థమైంది సార్!"

 

    "ఇంకో విషయం... ధరణి చావుతో మొత్తం కథంతా అయిపోయిందనుకోకు... ధరణి తన తండ్రి పెద్దబ్బాయిని కాదని పెళ్ళి చేసుకున్నాడు. వాడి భార్య ఎక్కడుందో ఇన్ ఫర్ మేషన్ నాక్కావాలి."

 

    "ఎందుకు సార్?"

 

    "నా ప్రాపర్టీని నేను సంపాదించుకోడానికి" గంభీరంగా చెప్పాడు అహోబలపతి.

 

    "మీ ప్రాపర్టీ ఏమిటి సార్?"

 

    "ఇది నీకు తెలియదులే. ఎప్పుడైనా చెప్తాను... ఇప్పుడు కాదు. నేన్చెప్పిన పని చేయి."

 

    "మరి ఆ అమ్మాయి ఎవరో, ఏమిటో."

 

    "అన్నీ నేనే చెప్తే మరి నువ్వు, నీ పోలీస్ డిపార్ట్ మెంటూ ఎందుకయ్యా?" విసుక్కున్నాడు అహోబలపతి.

 

    మరో పది నిమిషాల తర్వాత హోంమినిస్టర్ చిదంబరరావు సి.ఎం. రూమ్ లోంచి బయటికొచ్చాడు.

 

    నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్ కెళ్ళాడు. ఆదిత్య విషయం తను స్వయంగా ఎంక్వయిరీ చేయడానికి.

 

    అప్పుడు సమయం రాత్రి ఒంటిగంట దాటింది.


                            *    *    *    *    *


    కాళిదాసు చేతులు కట్టుకుని నిల్చున్నాడు.

 

    ఎదురుగా కూర్చున్న గుర్రం పెద్దబ్బాయి కొలిమిలోంచి తీసిన ఇసుక కడ్డీలా వున్నాడు.

 

    అతని వంటిలోంచి వేడి సెగలొస్తున్నాయి.

 

    అతని కళ్ళు చండ్ర నిప్పుల్లా మండుతున్నాయి.

 

    "ఒరేయ్ ఆహోబలపతీ! ప్లాన్ ప్రకారం నా కొడుకుని పోలీసుల చేత హత్య చేయిస్తావురా... చూస్తాను. దేఖెలేంగే... నువ్విది ఎందుకోసం చేశావో నాకు తెలుసు. ఈ పెద్దబ్బాయి బ్రతికుండగా నువ్వనుకున్నది జరగదు... జరగనివ్వను. ఒరేయ్ అహోబలం! బౌండ్రీ దాటి వచ్చిన వాడినెవ్వడ్నీ యీ పెద్దబ్బాయి బ్రతకనివ్వలేదురా. నీ వేలితో నీ కన్నుపొడిచి, నిన్ను నీ పదవి నుంచి దించి, నిన్ను ఏకాకిని చేసి, అసెంబ్లీ ఎదుట నిన్ను కాల్చి చంపకపోతే నా పేరు గుర్రం పెద్దబ్బాయి కాదు" ప్రతిజ్ఞ చేశాడు పెద్దబ్బాయి.

 

    దూరంగా నిలబడిన జైలు సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం వేపు చూశాడు గుర్రం పెద్దబ్బాయి.

 

    "ఆదిత్య ఏమయ్యాడు."

 

    సుబ్రహ్మణ్యం గజ గజా వణికిపోయాడు.

 

    "మనిషి దొరకలేదు... శవామూ దొరకలేదు సార్."

 

    "అంటే..."

 

    "గాయాలతో తప్పించుకున్నాడంటావా?" ఉగ్రంగా అడిగాడు పెద్దబ్బాయి.

 

    "నా అనుమానం కూడా అదే సార్! అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు సర్. మా జైల్ స్టాప్ కూడా సెర్చ్ చేస్తున్నారు. రెండు రోజుల్లో ఆ ఆదిత్య దొరికిపోవడం ఖాయం సార్. చనిపోతే శవం దొరక్కుండా ఏమవుతుంది సార్. శవాన్ని అహోబలపతి ఏం చేసుకుంటాడు? కనుక ఆదిత్య బ్రతికే వున్నాడు" కాన్ఫిడెంట్ గా అన్నాడు సుబ్రహ్మణ్యం.

 

    "నువ్వేం చేస్తావో నాకనవసరం. ఆదిత్య నాక్కావాలి. నువ్వు చెప్పిందాని ప్రకారం ధరణితో కల్సున్న వ్యక్తి ఆదిత్య. అహోబలపతి రహస్యం తెలిసిన వాడు ఆదిత్య. మనకు ఆయుధంలా ఉపయోగపడేవాడు ఆదిత్య... నీ పనిలో నువ్వుండు... నా పనిలో నేనుంటాను" అని కాళిదాసు వైపు చూసి-

 

    "ఆదిత్యకోసం... అహోబలపతి మనుషులు కూడా వెంటాడుతుంటారు. కనిపిస్తే కాల్చేస్తారు ఎన్ కౌంటర్ పేరు చెప్పి. పైగా అతనిప్పుడు పారిపోయిన ఖైదీ... ఆదిత్యను పట్టుకునే అవకాశాన్ని నీకిస్తున్నాను పట్టుకో... దానికోసం నీకు ఫుల్ పవర్స్ యిస్తున్నాను. విలయం సృష్టించు... పోలీసుల్ని గానీ... ప్రభుత్వాన్ని గానీ... ఎవర్నీ లెక్కచేయొద్దు. దిసీజ్ మై ప్రిస్టేజ్ క్వశ్చన్... అర్ధమైందా?"

 

    "ఎస్ సర్... నేనూ... నా ముఠా ఆ పనిమీదే వుంటాం సర్."

 

    "ఇంకో ఇంపార్టెంట్ పాయింట్... ధరణి నా కొడుకు. ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. నేనొప్పుకోలేదని దూరంగా వెళ్ళిపోయాడు. వాడికో కూతురు కూడా వుంది. ప్రస్తుతం వాడి పెళ్ళాం... సుమబాల... వాడి కూతురు ఎక్కడున్నారో కనుక్కో."

 

    "మీ కోడలు... మనవరాలు ఎక్కడుంటున్నారో కనీసం.. ఎడ్రస్..."

 

    "ఎడ్రస్ తెలిస్తే నువ్వెందుకురా ఇడియట్ నాకు కాళ్ళు లేవా... వాళ్ళ ఎడ్రస్ తెలీకుండా ఇన్నాళ్లూ జాగ్రత్తపడ్డాడు ధరణి. వాడెందుకు జాగ్రత్తపడ్డాడో నాకు తెలుసు... వాళ్ళ అడ్రస్ ను సంపాదించు. ఆ అమ్మాయిని నా దగ్గరకు తీసుకురా! నీకు నెలరోజులు టైమిస్తున్నాను. అటు ఆదిత్య... ఇటు ఆ అమ్మాయి... ఇద్దరూ నా చేతిలో వుంటే... అహోబలపతిగాడు నా దగ్గరకే వస్తాడు. నా కాళ్ళు పట్టుకుంటాడు" అంటూ పెద్దగా నవ్వాడు గుర్రం పెద్దబ్బాయి. ఆ నవ్వు గుర్రం సకిలించినట్టుగా వుంది.

 Previous Page Next Page