అతనికి సరుకు సప్లయ్ ద్వారా అందే డబ్బును అందకుండా చేయాలి. ఈ ప్రాంత ప్రజల సహకారం అతనికి అందుతుందంటే అది కేవలం అతనంటే వున్న భయం మూలంగానే కాదు_ అతను వెదజల్లే డబ్బు మూలంగా కూడా. వీరూకి డబ్బు ఎప్పుడయితే కరువవుతుందో తన అనుచరుల అవసరాలకు చేతులెత్తేయవలసి వస్తుంది. అప్పుడు వార్ని ఒక్కతాటిపై తన వెనుక తిప్పుకోలేడు.
వీరూకి బద్ధశత్రువైన తంగవేలు చనిపోయాడు. అతని వారసుల్ని మనం చేరదీసి వీరూకి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలి.
చదివిన ఫైల్స్ ని బట్టి అతను స్మగుల్డ్ చేస్తున్న గంధంచెక్క కలకత్తా, కాన్పూర్, ఢిల్లీ, బొంబాయికి వెళుతున్నట్లు తెలిసింది.
సో....ఫస్ట్....అతనికి అందే పచారీ సామాన్లను ఆపుచేయాలి....పదా....ఏం చేయాలో చెబుతాను...." అంటూ రంజిత్ గెస్ట్ హౌస్ బయటకొచ్చి జీప్ ఎక్కాడు. శర్మ ఎక్కి పక్కనే కూర్చున్నాడు. అది మరుక్షణం ఎమ్.ఎమ్.హిల్స్ పోలీస్ స్టేషన్ కేసి దూసుకుపోయింది. వీరూ కోసం పన్నబడే వల ముడులకు సిద్ధమవుతోంది.
* * * *
మైసూర్....ఉదయం పది గంటల సమయం.... లిడో ధియేటర్ కి దగ్గరలోవున్న ప్రయివేట్ బస్ స్టాండులో మహిమ, విజయ్ ఎవరికోసమో ఎదురుచూస్తూ నించున్నారు.
మహిమ భుజానికి ఒక బ్యాగ్ వేలాడుతోంది. అందులో సోనీ మైక్రో కేసెట్ రికార్డర్ ఎమ్_330, మినోలా మైక్రోపామ్ కెమేరా, బ్యాటరీలైట్, ప్యాడ్స్, పెన్స్, బిస్కట్ ప్యాకెట్స్, లైసెన్స్ రివాల్వర్, ఒక నైఫ్ వున్నాయి. క్రైమ్ రిపోర్టర్ కి అవి కనీస అవసరాలు.
"ఏమిటింకా రాలేదు విజయ్?" మహిమ ఎమ్.ఎమ్.హిల్స్ కొల్లెగాళ్, రామరాజనగర్, కౌదల్లీ వెళ్ళే బస్సుల్ని చూస్తూ అంది ఒకింత అసహనంగా.
"వస్తుంది. మనకున్న ఆత్రుత అందరికీ వుంటుందా? అతను మాట తప్పే మనిషికాదు. కారుని చెక్ చేసి కూడా తీసుకురమ్మన్నాను. టీ తీసుకుందామా!" అన్నాడు విజయ్.
ఇద్దరూ టీ తీసుకుంటుండగా మారుతీ ఆటోగ్యారేజ్ మెకానిక్ సురేష్ జిప్సీ తీసుకొని వచ్చాడు.
ఆ మరుక్షణం డ్రైవింగ్ సీట్లో వుంది మహిమ.
అది లలితమహల్ ప్యాలెస్ రోడ్డులోకి మలుపు తిరిగింది.
* * * *
మధ్యాహ్నం రెండు గంటలకు పదకొండు బృందాలు రంగంలోకి దూకేందుకు సిద్ధంగా వున్నాయి. సరిహద్దుల్లోకొచ్చిన శత్రుసైన్యంపై ఎటాక్ చేయబోయే మిలటరీ బెటాలియన్ లా వున్నాయి.
ఒక్కొక్క బృందంలో పదిహేనుమంది పోలీసులు, ఐదుగురు ఫారెస్టర్స్, ఐదుగురు ఫారెస్ట్ గార్డ్స్, ఆపైన ఒక రేంజర్ వున్నారు. ఒక్కో బృందానికి ఒక జీప్, ఒక వ్యాన్, అవసరమయిన ఏమ్యునేషన్ సిద్ధం చేయబడ్డాయి.
గెస్ట్ హౌస్ ముందు వరుసగా నిలిపివున్న వాహనాల్ని, సిబ్బందిని వారి చేతుల్లోవున్న రైఫిల్స్ ని చూసిన ఆ ఊరి జనం ఒకింత భాయోద్వేగానికి గురయ్యారు.
ఇన్ ఛార్జ్ ఆఫ్ ది ఆపరేషన్....
ఎగెనెస్ట్ వీరు....
ఎస్.పి.రంజిత్ గంభీరాకారం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను, సిబ్బంది చూపుల్ని, ఫిజికల్ మూమెంట్స్ ని గమనిస్తూ, పచార్లు చేస్తూ మెఘా మైక్ లో వారికి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగిస్తూ చెప్పుకుపోతున్నాడు.
"నిద్రపోతున్న చిరుతపులి గాండ్రిస్తూ లేవబోయే సమయం ఆసన్నమవుతోంది. ఏం జరుగుతుందో? ఎన్ని శవాలు పాడెలకోసం సిద్ధమవుతాయో....? వచ్చిన ఎస్.పి. చండశాసనుడిలా వున్నాడు. తాడో పేడో తేల్చుకొనేందుకే సిద్ధమవుతున్నట్లుంది. రాత్రి వేసిన నిఘా విఫలమయిందట. అందుకే రెట్టింపు ఆగ్రహంతో వున్నాడు. మన ఊరి ప్రజలు కొన్నాళ్ళు బయటకు రాకుండా వుండటం క్షేమం" ఆ ఊరికి పెద్ద కాపులాంటి వ్యక్తి ఒక అనధికార తీర్మానాన్ని పాస్ చేశాడు.
సరీగ్గా రెండు గంటల ఇరవై నిమిషాలైంది.
ఆకాశం మేఘావృతమయి వుంది. వర్షంపడే సూచనలు కానవస్తున్నాయి. విజిబిలిటీ పూర్ గా వుంది.
ఏ బృందం ఏ రూట్ లో, ఏ గ్రామానికి వెళ్ళవలసిందీ దినేష్ ఒక రేంజర్ సలహాతో నిర్ణయించాడు. దాన్నే మెఘామైక్ లో ఎనౌన్స్ చేశాడు.
"వెహికల్స్ అన్నీ చెక్ చేశారా? టాంక్ ఫుల్ చేశారా? బ్యాటరీ, హెడ్ లైట్స్, వైపర్స్, టైర్స్ ఫర్ఫెక్ట్ గా వున్నట్లేనా? స్టెఫెన్ టైర్స్, జాకీలు, సెర్చ్ లైట్స్ అన్నీ...." తిరిగి ప్రశ్నించాడు రంజిత్.
అతని సునిశిత దృష్టికి, ఏకాగ్రతకు శర్మ ఆశ్చర్యపోయాడు.
ఓకే అన్నట్లు దినేష్ వినయంగా తలూపాడు.
రంజిత్ విజిల్ ఊదటం....దుమ్మురేపుకుంటూ వాహనాలు దూసుకుపోవటం అంతా నిమిషాల్లో జరిగిపోయింది.
ఇవన్నీ ఎక్కడికి వెళుతున్నాయో, ఎందుకు వెళుతున్నాయో ఆ గ్రామ ప్రజలకు అర్థం కాలేదు. ఆ ప్రాంతంలోనే, అప్పటివరకు, వేరుసెనక్కాయలు అమ్ముకున్న కెంపమ్మ బుట్ట నెత్తికెత్తుకుంది.
లోపలకు వెళ్ళబోతున్న రంజిత్ ఆ వయస్సులో ఎంతో వాడిగా వెళుతున్న కెంపమ్మను దూరంనుంచి యధాలాపంగా చూసినా ఒకింత ఆశ్చర్యపోయాడు.
* * * *
సాయంత్రం నాలుగు గంటలవుతుండగా మహిమ, విజయ్ మారుతీ జిప్పీ ప్రకాశం పాలయంలోని చర్చ్ ముందాగింది. చుట్టూ అడవి....అడవి మధ్యలో చిన్న గ్రామం.... ఆ గ్రామానికి ఓ చివర పురాతన కాలంనాటి చర్చ్....
మైసూర్ హైదర్ అలీ రోడ్డులోని సెయింట్ ఫిలోమినా చర్చ్ ఆకారంలోనే ఉన్నప్పటికి, పరిమాణం తక్కువ.
చర్చ్ ప్రాంతంలో ఎవరూ కనిపించలేదు.
నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా వుంది.
ఎండకు ఎండి, వానకు తడిసిన చర్చ్ జేగురు రంగులోకి మారిపోయింది. చర్చ్ చుట్టూవున్న ప్రహరీగోడ అక్కడక్కడ పెచ్చులా, ఆ చర్చ్ కొచ్చే భక్తుల పేదరికాన్ని తెలియజేయబడుతోంది.
"వీరూ దగ్గర కోట్ల సొమ్ము మూలుగుతుందట_మరి తను అభిమానంచే ఫాదర్ కి ఆర్థిక సహాయం చేయలేదా?" నెమ్మదిగా చర్చ్ కేసి నడుస్తూ అడిగింది మహిమ.
"ప్రిన్స్ పుల్స్....వీరూ ఆర్జించే సొమ్ము న్యాయసమ్మతమయినది కాదని, వీరూ ఎన్నోసార్లు ఆర్థిక సహాయం అందజూపినా, ఫాదర్ అంగీకరించలేదని అనుకుంటుంటారు...." అన్నాడు విజయ్ ఆమె వెనుకే నడుస్తూ.
అప్పటివరకూ అక్కడెవరూ లేనట్లే కనిపించినా, వాళ్ళు ధ్వార బంధాన్ని సమీపిస్తుండగానే చర్చ్ పక్కనుంచి వడివడిగా వచ్చిన ఒక మధ్య వయస్కుడు "ఎవరు కావాలి? ఎందుకొచ్చారు?" అంటూ వారి గమనానికి అడ్డు తగిలాడు ఒకింత చిరాకును ప్రదర్శిస్తూ.
"ఫాదర్ ని కలిసేందుకు వచ్చాం. వారితో జరూరుగా మాట్లాడవలసి వుంది" అన్నాడు విజయ్.
అతను సందేహంగా వారిద్దరివేపు, మహిమ భుజానికి వేలాడుతున్న బ్యాగ్ వేపు, ఆపైన ఆవరణ బయట ఆపివున్న జిప్సీ జీప్ వైపు చూసి_
"మీరిక్కడే వెయిట్ చేయండి. ఫాదర్ బహుశా విశ్రాంతి తీసుకుంటూండవచ్చు. నేను చూసివచ్చి చెబుతాను" అంటూ చర్చ్ తలుపులు తెరిచి, ఆ వెంటనే మూసివేశాడు.
లోన గడియ పెట్టిన శబ్దం కూడా వారికి వినిపించి, అక్కడే చిన్న అరుగుమీద కూర్చుండిపోయారు.
"వెనక్కి వెళ్ళి చూద్దామా?" అంది మహిమ ఆ ఆలస్యాన్ని భరించలేక.