కోతులు హోమో ఎరెక్టస్ గా (నిలబడి నడిచేవి) తర్వాత హోమో హాబిలస్ గా (పనులూ ఆయుధాలు చేసుకోగలిగేవి), మరికొన్ని దశల తరువాత హోమోసపైన్ గా (మానవుడు) పరిణామం చెందాయి.
కోతులకీ, మనిషికీ మధ్యదశలో ఉండిన జీవిని "మిస్సింగ్ లింక్" అని వ్యవహరిస్తారు. ఆంత్రో పాలజిస్టులు, కొద్ది సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో అలాంటి "మిస్సింగ్ లింక్" తాలూకు అవశేషాలు దొరికాయి. దానికి 'లూసీ' అని పేరు పెట్టారు. (ఈ మధ్యనే, లీకే అనే శాస్త్రజ్ఞుడు 'హోమో ఎరెక్టస్' తాలూకు అస్థిపంజరాన్ని తను కనుగొన్నానని ప్రకటించాడు.)
అలాంటి జీవులు ఇంకా ఈ భూగోళం మీద ఎక్కడయినా మిగిలివున్నాయా లేదా అన్న ప్రశ్నకు రూఢీగా జవాబు దొరకలేదు. కానీ, 'మిస్సింగ్ లింక్' జాతి ఇంకా కొన్నిచోట్ల జీవించే వుందని నమ్మే శాస్త్రజ్ఞులు చాలామంది వున్నారు. హిమాలయాల్లో కనబడుతుందని చెప్పబడే 'యెతి' అనే మంచుమనిషి (YETI ABOMINABLE SNOW MAN) అమెరికాలో కనబడే SASQUATCH (BIG FOOT - పెద్ద పాదం అని అర్థం), చైనాలో కనబడే 'యే రెన్' (YEREN అడవి మనిషి). ఆ జాతికే చెందినా నరవానరాలయి వుంటాయని ఒక ఊహ.
ఆ మిస్సింగ్ లింక్ ని, నరుడికీ, వానరానికీ మధ్య దశకు చెందినా జీవిని తను ప్రత్యక్షంగా చూస్తున్నాడా ఇప్పుడు ?
ఉద్వేగంతో అతని రక్తం వడివడిగా ప్రవహించడం మొదలెట్టింది. దీనిని తను బంధించగలిగితే, ఆంత్రోపాలజీలో అతి పెద్ద మిస్టరీని ఛేదించగలిగినవాడవుతాడు. ఎనిమిది అడుగుల ఎత్తున, తనకు పదిరెట్లు బలంతో ఉన్నట్లు కనబడుతున్న ఈ నరవానరాన్ని గాయపడకుండా అదుపులోకి తెచ్చుకోవడం అసంభవం పైగా, తను చూస్తూ ఊరుకుంటే అది స్వప్నకి ఏదన్నా అపకారం చెయ్యవచ్చు.
అకారణంగా ఏ జంతువునైనా గాయపరచడం అతని నియమాలకు విరుద్ధం. కాని ఇప్పుడు తప్పేటట్లు లేదు. హడావిడిలో 'ట్రాన్ క్విలైజర్ గన్' తనతో తెచ్చుకోవడం మర్చిపోయాడు. దానితో షూట్ చేస్తే, మత్తుమందు శరీరంలోకి ఇంజెక్ట్ అయి ఊరికే స్పృహ తప్పి పడిపోతుంది జంతువు.
నరవానరం కాలి పిక్కకి తుపాకి గురిచూసి, ట్రిగ్గర్ నోక్కబోయాడు సందీప్.
అంతలో అది అతనికి అభిముఖంగా తిరిగి నిలబడింది.
అప్పుడు మొదటిసారిగా అతనికి కనబడింది, దాని మొహం. నుదురు బాగా ఏటవాలుగా వెనక్కి వుంది. ముక్కు పుటాలు చాలా పెద్దవిగా వున్నాయి.
ఈ రెండు తేడాలు తప్పిస్తే, అది అచ్చం మనిషి మొహమే! ముఖ్యంగా ఆ చూపు, అది మనిషి చూపే! కల్లాకపటం లేకుండా, అతని మొహంలోకే ప్రశ్నార్థకంగా చూస్తోంది. అది ఉన్నట్లుండి చిత్రమైన శబ్దాలు చెయ్యడం మొదలెట్టింది. అంతా మనిషి గొంతే! మనిషి మరో మనిషితో మాట్లాడుతున్నట్లు ఉన్నాయి ఆ శబ్దాలు. కానీ వాటిలో అక్షరాలూ లేవు. పదాలు లేవు. అర్థం ఏదో ఉండే వుంటుంది. కానీ అతను అర్థం చేసుకోలేకపోయాడు.
భాష పుట్టకముందు అలా "మాట్లాడుకునే" వారేమో ఆదిమానవులు!
తన ఎదురుగా నిలబడి వున్నది సాటిమనిషే అన్న భావన కలిగింది సందీప్ కి. దానిని కాల్చి గాయపరచడానికి అతనికి చేతులు రాలేదు.
ఏదో నిశ్చయించుకున్నట్లు వెనుదిరిగి, నెమ్మదిగా నడుస్తూ చెట్ల వెనకగా అదృశ్యమైపోయింది ఆ నరవానరం.
అప్పటిదాకా ఊపిరి బిగపట్టి వున్న సందీప్ దీర్ఘంగా నిశ్వసించి, తుపాకి కిందకు దించబోయాడు.
పసుపుపచ్చటి మెరుపుతో దూకింది ఒక పెద్దపులి అతని మీదకు.
దించబోతున్న తుపాకి క్షణంలో గురిచూసి కాల్చాడు సందీప్.
అతనికి ఒక గజం దూరంలోకి దూకిన పులి, అదే వేగంతో అవతల వైపుకి ఉరికి, గుబురుల్లో మాయమయింది.
మనిషి మీదకు దూకింది కాబట్టి, ఇది ఆ 'మాన్ ఈటర్' పెద్దపులే అయివుండాలి. తను ఒక్కక్షణం అజాగ్రత్తగా వుండడంవల్ల దాన్ని మిస్ అయ్యాడు. తుపాకి గురితప్పిందా? లేదా బుల్లెట్ దాని ప్రాణాలు తీయకుండా కేవలం గాయపరిచిందా? దెబ్బతిన్న బెబ్బులి మరింత ప్రమాదకరం. అది ఏ క్షణంలో అయినా మళ్ళీ దాడి చెయ్యవచ్చు.