ఆనందంతో కాసేపు నోట మాట రాలేదు మెహతాకి.
"సవ్యసాచి! సవ్యసాచి! నువ్వేనా? యూ సన్ ఆఫ్ ఎ గన్! ఉక్కు పిండానివి నువ్వు!" అన్నాడు ఎగ్జయిటెడ్ గా.
బలహీనంగా సవ్యసాచి నవ్వు వినబడింది.
దీర్ఘంగా నిట్టూర్చి, సీట్లో వెనక్కి జారగిలబడి, సిగరెట్ అంటించి గుండెలనిండా పొగ పీల్చాడు మెహతా. పక్కనున్న వాళ్ళందరికీ సిగరెట్ ఆఫర్ చేశాడు.
క్షణాల్లో ఈ వార్త ఎయిర్ పోర్టులో అందరికీ తెలిసిపోయింది. అందరి మొహాల్లోనూ టెన్షన్ తగ్గి ఆనందం కనబడింది.
ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి హైజాక్ చేయబడుతోందని తెలియగానే ఆ విషయం భారత ప్రభుత్వపు హోం మంత్రికి తెలియబరచబడింది. ఈ విషమ పరిస్థితిని సమర్థవంతంగా హాండిల్ చేయడానికి తక్షణమే ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. భారత ప్రదానికీ, విదేశాంగ మంత్రికీ, రక్షణ మంత్రికీ కూడా క్షణక్షణం తాజా సమాచారం అందించబడుతోంది. ప్రధాని ఆదేశాలు అంచెలంచెలుగా హైదరాబాద్ విమానాశ్రమానికి చేరుతున్నాయి. మామూలుగా ఎయిర్ పోర్టులో వుండే రేడియో సౌకర్యాలకు అదనంగా, టెలిఫోన్స్ శాఖవారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి రెండు ట్రంక్ టెలిఫోన్ లైన్సు ఖాళీగా ఉంచేశారు - కమ్యూనికేషన్స్ ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం. రాష్ట్ర ముఖ్యమంత్రీ, ప్రధాన కార్యదర్శీ అందుబాటులోనే ఉన్నారు.
సైన్యాన్ని అలర్టు చేశారు.
హుటాహుటీన ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకుంది ఒక కమెండో దళం. ఇటువంటి క్లిష్ట పరిస్థితులని ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందారు వాళ్ళు. క్రమశిక్షణతో, వ్యాయామంతో, వాళ్ళ శరీరాలు ఉక్కులా మారి ఉన్నాయి. అన్ని రకాల మార్షల్ ఆర్ట్సులోనూ, గెరిల్లా యుద్ధరీతుల్లోనూ ట్రెయినింగ్ ఇచ్చారు వాళ్ళకి. చీకట్లో కూడా శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని ఛేదించగల క్రాక్ షాట్స్ వాళ్ళు.
ప్లేన్ సేఫ్ గా ఎక్స్ పర్ట్ పైలట్ సవ్యసాచి కంట్రోల్ లోకి వెళ్ళిందన్న వార్త ఢిల్లీ చేరింది.
నుదుటికీ, బట్టతలకూ పట్టిన స్వేదాన్ని కర్చీఫ్ తో తుడుచుకుని పక్కకి చూశారు హోంమంత్రి. ఆయనకోసం గంట క్రితం ట్రేలో ఉంచి సర్వ్ చేయబడిన టీపాట్ ని మొదటిసారిగా గమనించారు. ఆయన కళ్ళు నిద్రలేమితో, అలసటతో ఎర్రబడి ఉన్నాయి. చప్పగా చల్లారిపోయిన ఆ 'టీ'యే మధురాతి మధురంగా అనిపించింది ఆ సమయంలో ఆయనకి.
ప్లేన్ లో -
ప్రయాణీకులని ఉద్దేశించి ఇంటర్ కమ్ లో చెప్పాడు సవ్యసాచి "లేడీస్ అండ్ జంటిల్మన్! నేను మీ పైలట్ సవ్యసాచిని. ఉర్దూలో ఒక సామెత ఉంది, 'వహీ హోతా హై జో మంజూర్ ఏ ఖుదా హోతాహై" అని. దీన్ని తెలుగులో చెప్పాలంటే 'శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని' అంటారు. మృత్యువుకి మూడంగుళాల దూరంలోకి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చాం మనం! దేముడి దయవల్ల ప్లేన్ భద్రంగా పయనిస్తోందని చెప్పడానికి సంతోషిస్తున్నాను."
పాసెంజర్సు కేబిన్ లో నుంచి హర్షాతిరేకంతో కేకలు! సంతోషం ఆపుకోలేక ఏడుపులు! ఏడుపుతో కలిసిన నవ్వులు!
విమానం ఏటవాలుగా కిందకి జారిపోవడంతో పక్కకి పడిపోయి కూర్చున్న వాళ్ళూ, సీట్లనీ, రాక్స్ నీ పట్టుకుని అతికష్టంమీద బేలన్స్ చేస్తూ నిలుచున్న వాళ్ళూ, నెమ్మదిగా సెటిల్ అయ్యారు.
అప్పుడు పిడుగులు పడుతున్నట్లు వినబడ్డాయి శతృఘ్న మాటలు.
"అందరూ కిక్కురుమనకుండా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. మీరింకా మా చేతుల్లో బందీలుగానే ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు! చేతులు ఎత్తి తల వెనగ్గా పెట్టుకోండి. అతితెలివి ఉపయోగించడానికి ఎవరన్నా ప్రయత్నిస్తే నిర్ధాక్షిణ్యంగా కాల్చేస్తాను. నేను దయాదక్షిణ్యాలకు స్పెల్లింగు మర్చిపోయి చాలా సంవత్సరాలయింది."
ఇక్బాల్, విక్టర్ కూడా గ్రేనేడ్స్ తో, రివాల్వర్సుతో రెడీగా నిలబడి ఉన్నారు.
దారుణమైన ప్రమాదంలో నుంచి తప్పించుకు బయటపడ్డామన్న అనందంలో మునిగిపోయి, తాత్కాలికంగా హైజాకర్స్ సంగతి మర్చిపోయిన ప్రయాణీకుల గుండెలు గుభేలుమన్నాయి. పాలిపోయిన మొహాలతో చేతులు ఎత్తి తల వెనక పెట్టుకున్నారు అందరూ.
"ఇక్బాల్! జాగ్రత్త!" అని హెచ్చరించి, కాక్ పిట్ లోకి వెళ్ళాడు శతృఘ్న.
ఆటో పైలట్ ఆన్ చేసి, సీట్లో నుంచి లేవబోతున్నాడు సవ్యసాచి. "కదలకుండా కూర్చో!" అని గద్దించి, కో పైలట్ సీట్లో తను కూర్చుని హెడ్ సెట్ తగిలించుకున్నాడు శతృఘ్న.
వెంటనే మెహతా గొంతు వినబడింది. "సవ్యసాచీ?"
"నేను సవ్యసాచిని కాను! షాట్ గన్, హైజాకర్ ని! నేను నా డిమాండ్స్ ఏమిటో చెబుతాను. ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడుతారు? నువ్వేనా?"
శతృఘ్న గొంతు వినగానే చాలా ఆశాభంగం కలిగింది మెహతాకి. ప్లేన్ నోస్ డైవ్ చేస్తూ నేలను సమీపిస్తున్న గందరగోళంలో హైజాకర్సు భయపడిపోయి ఆయుధాలు వదిలేసి ఉండవచ్చుననీ లేదా సమయస్ఫూర్తి ఉన్న ప్రయాణీకులెవరన్నా వాళ్ళని లొంగదీసుకుని ఉండవచ్చుననీ అతనికి అప్పటిదాకా సన్నటి ఆశ ఉంది. అది కాస్తా చచ్చిపోయింది ఇప్పుడు.
"జస్ట్ ఏ మినిట్!" అని వెంటనే ఢిల్లీని కాంటాక్ట్ చేశాడు మెహతా.
వింటున్న విదేశాంగమంత్రి మొహం సీరియస్ గా అయింది.
"వాళ్ళని చీఫ్ సెక్రటరీతో మాట్లాడమనండి. మీరు ఎయిర్ పోర్టులోనే అందుబాటులో ఉండండి. ఏ నిమిషాన అయినా మీతో అవసరం రావచ్చు!"
"అలాగే సర్!" అని చీఫ్ సెక్రటరీకి కనెక్షన్ ఇచ్చాడు మెహతా.
"సర్!" అన్నాడు చీఫ్ సెక్రటరీ లైన్లోకి వస్తూ విదేశాంగమంత్రితో.