Previous Page Next Page 
సీతాచరితం పేజి 30


                             అయోధ్య కాండ


    దశరథునికి నలుగురు కొడుకులు. వారు నలుగురూ దశరథునికి నాలుగు భుజాల్లాంటివారు. నలుగురూ అతనికి ప్రియమైనవాళ్లే. అయినా రాముడంటే అతనికి ఎక్కువ ఇష్టం.


    దశరథుడు ముసలివాడైపోయాడు. పైగా అతనికి ఉత్పాతాలు కనిపించాయి. దశరథుడు ఉత్పాతాలు చూచాడు. తన వార్ధక్యం చూచుకున్నాడు. రాముడు రాజ్యం చేస్తుండగా చూచి ఆనందించాలనుకున్నాడు. అందుకు ప్రజామోదం పొందాలనుకున్నాడు. జానపదులను, రాజులను, సామాన్య ప్రభువులను పిలిపించాడు. అవకాశంలేకపోయింది. కైకేయ రాజుకూ, జనకునికి మాత్రం వార్త పంపలేదు.


    దశరథుడు పిలిపించాడు రాజులు, ప్రభువులూ, ప్రజలూ వచ్చారు. దశరథుడు వారిని తగురీతిని సత్కరించాడు. అతడు సభ చేశాడు. అందరూ తమ స్థానాల్లో కూర్చున్నారు. ఆ సభ ఇంద్ర సభలా ఉంది. దశరథుడు ఇంద్రునిలా ఉన్నాడు. దశరథుడు సభను ఉద్దేశించి ప్రసంగించాడు.


    "మా పూర్వులంతా కోసలను పరిపాలించారు. ప్రజలను కన్నబిడ్డలుగా కాపాడారు. నేను కూడా మా పూర్వులు నడిచిన బాటనే నడచాను. రాజ్యపాలనలో నా శరీరం శధిలం అయిపోయింది. ఇహ నాకు విశ్రాంతి అవసరం. నా కొడుకుల్లో రాముడు పెద్దవాడు. అతనికి రాజ్యపాలన అప్పగించాలనుకున్నాను. ఈ విషయంలో మీరూ ఆలోచించండి. రామునిమీద రాజ్యభారం ఉంచడం మంచిదో కాదో నిర్ణయించండి. మీకు మరేదైనా మంచి ఆలోచనతోస్తే చెప్పండి. మధ్యవర్తుల ఆలోచన ఉభయ తారకంగా ఉంటుంది.


    సభాసదులు దశరథుని మాటలు విన్నారు. మేఘ గర్జన విన్న నెమళ్లలా ఉప్పొంగారు. ఆనంద ధ్వానాలు చేశారు. దిక్కులు పిక్కటిల్లాయి. తరవాత బ్రాహ్మణులు, సామంతులు పౌర జానపదులను సంప్రదించారు. ఒక నిర్ణయానికి వచ్చారు. వారిలా అన్నారు.


    "మహారాజా! మీరు అనేకవేల సంవత్సరాలు రాజ్యం చేశారు. ముసలివాళ్లు అయిపోయారు. రాముడు ధార్మికుడు. అతనికి యువరాజ్య పట్టం కట్టండి. రాముడు మహాబలుడు, మహాబాహువు, రఘుకుల తిలకుడు. అతను ఏనుగు, నెక్కాలి. శ్వేత ఛత్రచ్ఛాయన సాగిరావాలి. అప్పుడు మేము అతణ్ణి చేడాలి. అది మా కోరిక.


    వారి మాటలు విన్నాడు. దశరథుని మనసు ఉప్పొంగింది. అయినా ఆనందం బయటపడనివ్వలేదు. "నేను ధర్మంగా పాలించడం లేదా? రాముడు యువరాజు కావాలని ఎందుకు కోరుతున్నారు?" అని అడిగారు.


    దశరథుడు అలా అడిగాడు. సభాసదులు ఇలా చెప్పారు.


    "రామునివద్ద అనేక సుగుణాలున్నాయి. అతడు ధర్మజ్ఞుడు. శీలవంతుడు. జితేంద్రియుడు. స్నిగ్ధ హృదయుడు. సులభసాధ్యుడు. స్థిరుడు. అసూయా రహితుడు. ప్రియవాది. సత్యవాది. ప్రజల దుఃఖమే తన దుఃఖంగా భావించేవాడు. అతడు ఆగ్రహనుగ్రహ సమర్ధుడు. ఇందీవరశ్యాముడు. శత్రు భయంకరుడు. కాబట్టి అతణ్ణి యువరాజును చేసి మమ్ముల సంతోషపెట్టు."


    సభాసదులు మాటలు విని దశరథుడు ఉక్కిరిబిక్కిరి అయినాడు. "రాముణ్ణి రాజును చేయమని కోరారు. అది నా అదృష్టం. అందుకు నేను చాల సంతోషించాను. "అని వశిష్ట వామదేవునితో" చైత్రం వచ్చింది. అడవులన్నీ పూసి వున్నాయి. రమణీయంగా ఉన్నాయి. పట్టాభిషేకానికి కావలసినవన్నీ సమకూర్చండి" అన్నారు.


    సభలో హర్షధ్వానాలు చెలరేగాయి.


    ఇంతలో సుమంత్రుడు రాముణ్ణి తీసుకొని వచ్చాడు. రాముడు చల్లని గాలిలా సభలో ప్రవేశించాడు. ఎండకు దడ్సినవారికి నల్లని మేఘంలా అనిపించింది. రాముణ్ణి చూచినా దశరథునికి తనివి తీరలేదు. రాముడు తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుని గుండె చెమర్చింది. అతడు కొడుకును గట్టిగా కౌగలించుకున్నాడు. శిరసు మూర్కొన్నాడు. రత్నాలు పొదిగిన ఉన్నతాసనం మీద కూర్చుండబెట్టాడు. అప్పుడా రాముడు మేరు శిఖరం మీద ఉన్న బాల సూర్యునిలా ప్రకాశించాడు. గ్రహ, నక్షత్రాలు గల ఆకాశాన్ని శరచ్చంద్రుడు ప్రకాశింపచేస్తాడు. అలాగే రాముడు ఆ సభను ప్రకాశింపచేశాడు.


    అప్పుడు దశరథుడు రామునితో ఇలా అన్నాడు.


    "రామా! పుష్యమినాడు నీకు యౌవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను. అందుకు ఈ సభాసదులంతా అంగీకరించారు. నీవు సకల గుణాభిరాముడవు. ప్రజా రంజకుడవు. అయినా నీకు కొన్ని నీతులు భోదిస్తాను విను.


    "రాజయినవాడు వినయవంతుడు కావాలి. జితేంద్రియుడు కావాలి. కామ క్రోధాలను జయించాలి. మంత్రులతోనూ, సేవకులతోనూ జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎప్పుడు పరోక్షంగా ప్రవర్తించాలో, ఎప్పుడు ప్రత్యక్షంగా ప్రవర్తించాలో తెలుసుకొని ప్రవర్తించాలి. ప్రజలను రంజింపచేసినవాడు రాజు. ప్రజారంజకంగా పాలించిన రాజును ప్రజలు దేవునిగా భావిస్తారు. ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నించు."


    రాముడు తండ్రి చెప్పిన మాటలు విన్నాడు. వాటిని తలదాలుస్తానన్నాడు. తండ్రికి పాదాభివందనం చేసాడు. సభకు నమస్కరించాడు. శెలవు తీసుకున్నాడు .రథం ఎక్కి వెళ్లిపోయాడు.


    సభాసదులు రాముని మెచ్చుకున్నారు. రాజువద్ద శెలవు తీసుకున్నారు. వెళ్లిపోయారు. సభ రిక్తంగా ఉంది. అప్పుడు దశరథుడు మంత్రలతో ఆలోచించాడు. "ఆలస్యం వద్దు. రేపే పుష్యమీ నక్షత్రం. రేపే పట్టాభిషేకం జరిగిపోవాలి" అన్నాడు.


    దశరథుని ఆజ్ఞ అయింది. పట్టాభిషేకపు ఏర్పాట్లు ప్రారంభం అయినాయి. వశిష్టుడు రాజోద్యోగులకు ఉత్తర్వులు ఇచ్చాడు. ముత్యాలు, పగడాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు సమకూర్చమన్నాడు. కానుకలు, మూలికలు, పూలు, తేనె, కొత్త బట్టలు తెమ్మన్నాడు. రథము, ఏనుగు, చామరాలు, శ్వేతచ్ఛత్రము, నూరు స్వర్ణ కలశాలు సిద్ధం చేయమన్నాడు. కొమ్ములకు బంగారం పొదిగిన ఎద్దు, పులిచర్మం కావాలన్నాడు. నగరాన్ని అలంకరించమన్నాడు.


    రాముడు సభనుంచి తన భవనానికి వెళ్లాడు. అక్కణ్ణుంచి తల్లి దగ్గరికు వెళ్లాడు. కౌసల్యా, సుమిత్రా అక్కడే వున్నారు. సీత కూడా అక్కడే వుంది. రాముడు కౌసల్య దగ్గరికి వెళ్లాడు. నమస్కరించాడు. వినయంగా నుంచున్నాడు. "అమ్మా! ప్రజాపాలన చేయవల్సిందని తండ్రి ఆజ్ఞాపించాడు. రేపే పట్టాభిషేకం. ఈ రాత్రికి నేనూ, సితా ఉపవసించాలి. ఇంకా ఏమేం చేయాలో మాకు తెలియదు. మాతో ఆ పనులు చేయించు" అన్నాడు.


    కౌసల్య రాముని మాటలు విన్నది. ఆనంద బాష్పాలు రాల్చింది. "నాన్నా! రామా! నువ్వు రాజువి అవుతున్నావా! నాకెంతో సంతోషంగా వుంది. నేను చాలాకాలంగా ఇదే కోరుకుంటున్నాను. అందుకు వ్రతాలు చేశాను. ఉపవాసాలున్నాను. నా కోరిక ఇవ్వాళ నెరవేరింది. నువ్వు రాజువు అవుతున్నావు. నాకు ఎంతో ఆనందంగా వుంది. నువ్వు రాజువుకా. నన్నూ నా బంధువులనూ సంతోషపెట్టు. సుమిత్రనూ సుమిత్ర బంధువులనూ ఆనందపరచు. అంతే నాయనా నా కోరిక" అన్నది. ఆమె గొంతు బొంగురువోయింది.


    రాముడు తల్లిమాటలు విన్నాడు. పక్కకు చూచాడు. లక్ష్మణుడు కనిపించాడు. అతని ముఖంలో వినయ విధేయతలు ఉట్టిపడుతున్నాయి. చేతులు జోడించుకొని ఉన్నాడు. రాముడు "లక్ష్మణా! తమ్ముడూ! నీవు నాకు రెండో ప్రాణానివి. నీవు నాతో కూడా రాజ్యం పాలించు. రాజ్యలక్ష్మి నాతోపాటు నిన్ను కూడా వరించింది" అన్నాడు.

 Previous Page Next Page