పెరుమాళ్ బుట్టను కింద పెట్టాడు. దానిపై రెండు ఎముకలు వుంచాడు. జుట్టుపోలుగాడి బొమ్మ దగ్గరకు వెళ్ళాడు.
"జుట్టుపోలుగా" అని కేకేసినట్టు పిలిచాడు.
"రా ఇక్కడకు రా. ఇటు చూడు. అది పాముల బుట్ట. అందులో పాముండాల. మా రైతులింట్లో వడ్లుండాల. ప్రతి ఇంట్లో పిల్లా పాపా వుండాల. మరి నీ మహత్యం చూపించు. బుట్టలోకి పాము పంపించు" అని ఢమరుకం అందుకున్నాడు.
ఢమరుకం శబ్దం ఏదో తెలియని భయాన్ని గుండెల్లో ఒంపుతోంది.
జనం టెన్షన్ తో చూస్తున్నారు. వెనుక నుంచి పులో, సింహమో వచ్చి నాలుకతో గీరినా పట్టించుకునే స్థితిలోలేరు. వాళ్ళ ధ్యాసంతా పెరుమాళ్ మీదే. వాళ్ళ చూపులంతా అతని మీదే.
ఢమరుకం ఆగింది.
పాము బుట్టను చేతుల్లోకి తీసుకుని "అందరూ చప్పట్లు కొట్టండి" అని అరిచాడు.
చప్పట్లు, ఈలలు!
నిదానంగా బుట్టమూత తీసాడు.
అంతే హనం బెదిరి, ఒక్కడుగు వెనక్కు వేశారు. సత్యనారాయణ రెడ్డి కూడా వులిక్కిపడి సర్దుకున్నాడు.
నాగుపాము బుట్టలోంచి స్ప్రింగ్ మీద నుంచి లేచినట్టు లేచి, అరచేతి వెడల్పుతో పడగ విప్పింది. అది కోపంలో బుస కొడుతుండడం అందరికీ విన్పిస్తోంది.
దానిని అందరికీ చూపించాడు.
బుట్టకింద పెట్టాడు. పాము ఇంకా పడగను ముడుచుకోలేదు.
జనం వలయాకారంగా గుమిగూడుతున్నారు.
"బాబూ! ఇలారా" ముందు నులుచున్న ఓ పదేళ్ళ అబ్బాయిని పెరుమాళ్ పిలిచాడు.
వాడు వెళ్ళడానికి జంకాడు. రానన్నట్టు తల వూపాడు.
"వెళ్ళు మాధవా. అంతా తమాషాకి. నీకేం కాదు" అంది పక్కనున్న జయ ఆ అబ్బాయ్ తో.
ఆమె పెరుమాళ్ మోడీని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఆమె ముఖం ఆనందంలో ముంచి లేపుతున్నట్టు మెరుస్తోంది.
"ఒద్దక్కా నాకు భయం" అన్నాడు వాడు.
ప్రేమతో వాడి భుజం మీద చేయి వేసింది జయ.
ఆమె ఆ ఎండలో నల్ల బంగారు బొమ్మలా వుంది .ఆమె కళ్ళు సంతోషం చమ్కీని అద్దుకున్నట్టు ప్రకాశిస్తున్నాయి. యువకులంతా దొంగచాటుగా ఆమెను గమనిస్తున్నారు. ఆమె పగలబడి నవ్వినప్పుడు మరింత అందంగా కనిపిస్తూ అక్కడున్న చాలా మంది నరాలను మెలిపెడుతోంది.
"ఏమిటి ! దొరగారు భయపడుతున్నారా" అడిగాడు జయను పెరుమాళ్.
"అవునట" అంది జయ కిలకిలా నవ్వుతూ.
"మరి రేపు ఏ ఆడపిల్లో గడ్డివాము పక్కకు పిలిస్తే ఇలానే తటపటాయిస్తాడా వెళ్ళడానికి."
జనం నవ్వారు ఆ మాటలకు
"అసలింతకీ నువు మగాడివేనా" అంటూ పెరుమాళ్ ఆ బాబు నిక్కర్ పైకి ఎత్తి అక్కడ చూడడానికి ప్రయత్నించాడు.
వాడు నిక్కర్ పైకి జరగకుండా అణిచిపెట్టడానికి రెండు చేతుల్తోనూ ప్రయత్నిస్తున్నాడు.
జనం మళ్ళీ నవ్వారు.
పెరుమాళ్ నిక్కర్ ను వదిలిపెట్టి పక్కనున్న మరో అబ్బాయిని పిలిచాడు.
వాడు ధైర్యంగా ముందుకొచ్చాడు.
"శభాష్. నువ్వూ మగాడంటే! నీలాంటి వాడికే అమ్మాయిలు తమ మనసును కట్టబెడతారు. అప్పుడు నీ పనంతా పొలాల్లో వాళ్ళతో దొర్లడమే" అని పొగిడాడు పెరుమాళ్.
ఆ అబ్బాయి సిగ్గుపడుతూ తల వంచుకున్నాడు.
"మీ పేరు?"
"రాము."
"మరి నీకు కాబోయే పెళ్ళాం పేరు సీతా!"
మళ్ళీ నవ్వులు.
పెరుమాళ్ ఢమరుకం మ్రోగింది. ఆ అబ్బాయిని పాముల బుట్ట దగ్గరకి తీసుకెళ్ళాడు.
"రామూ! నువ్వు మగాడివేనా?" ప్రశ్నించాడు పెరుమాళ్.
"ఆ" ఆ అబ్బాయి గట్టిగా అరిచాడు.
"నేను ఏం చెప్పినా చేస్తావా?"
"ఆ"
"చాకలి నిర్మలమ్మకు కడుపు చేస్తావా?"
వాడు సమాధానం చెప్పక కిసుక్కున నవ్వాడు.
"ఇప్పుడు అంత పని చేయవద్దు కానీ, ఆ బుట్టలో చేయి పెట్టు చాలు"
ఆ అబ్బాయి అదిరిపోయాడు. తన వల్ల కాదన్నట్టు తల అడ్డంగా వూపాడు.
"ఛీ ... మగపుట్టుక పుట్టి బుట్టలో చేయి పెట్టడానికి భయపడతావా? మగాడు చాలా వాటిల్లో చేయి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇలా తల అడ్డంగా వూపితే నిన్ను మెచ్చి వచ్చిన ఆడపిల్ల జాకెట్ బటన్లు పెట్టుకుని నీ ముఖం మీద ఉమ్మి వెళ్ళిపోతుంది" అని చిరుకోపం ప్రదర్శించాడు పెరుమాళ్.
అలాంటి బూతు మాటలు అక్కడ మామూలే. గ్రామాల్లో బూతు కంటే మరో ఎంటర్టయిన్ మెంట్ లేకపోవడం కారణం కావచ్చు.
జనం ఆ మాటలకు బాగా నవ్వుతున్నారు.
పెరుమాళ్ బలవంతంగా రామూ చేతిని బుట్టలోకి తోశాడు.
వాడు చేయి లాక్కోవడానికి గింజుకుంటున్నాడు. వాడి కళ్ళల్లో భయం.
కొంతసేపయ్యాక బుట్టమూతను పైకి తీశాడు పెరుమాళ్. అందులో పాము లేదు.
రాముతో పాటు అందరూ హాయిగా వూపిరి పీల్చుకున్నారు.
పెరుమాళ్ ఆ తరువాత రామూని కింద పడుకోమన్నాడు. వాడు నేలమీద పడుకోవడానికి నిరాకరించడంతో కింద దుప్పటి పరిచాడు.
వాడు దానిమీద పడుకున్నాడు.
అంతలో రామూ తల్లి జనాన్ని తోసుకుని ముందుకు వచ్చింది.
"అన్నా! వాడ్ని ఇంక లేపు. నీ మంత్రాలవల్ల వాడికేం కాదని తెలుసుగానీ, కన్న పేగు చూడలేకపోతూవుంది. మరెవర్నైనా పిలిచి నీ విద్యలు చూపెట్టు."
అని ఆమె అర్ధించినట్లు చెప్పింది.
"ఏం కాదులే కాంతమ్మ పిన్నీ. అంతా కనుకట్టు" సర్ది చెప్పింది జయ.
అంతలో ఓ ముసలాయన లేచి "ఏమే కాంతం, నీ బిడ్డకు ఇక్కడ ఎవరూ కాకులకూ, గద్దలకు వేయడంలేదుగానీ కాసేపు వుండు. అంతా వేడుకే, నీ బిడ్డకు ఏం గాదు" అన్నాడు.
అంతమంది చెప్పడంతో ఇక విధిలేక కాంతమ్మ జనంలో కలిసి పోయింది.
అంతలో పెరుమాళ్ ముగ్గు మధ్యలో మంటపెట్టి అందులో ఒక ఇనుప గుండును ఎర్రగా కాల్చాడు.