Previous Page Next Page 
గోరింటాకు పేజి 30


    "ఇదిగో చూడు సుఖమైనా, దుఃఖమైనా నీకు నాతోనే, నన్ను ఓ రాక్షసుడినిచేసి నువ్వు మళ్ళా పువ్వులబాటమీద నడవలేవు. నీముఖం చూపించమంటే చూపించవేం?"

 

    "ఈ మాటలంటూ అతను బలవంతంగా ఆమె వదనమండలం మీద నుంచి తలగడ లాగిపారేశాడు. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. నీలమేఘాచ్ఛాదితమైన పశ్చిమదిశలా వివిధవర్ణ కిర్మీరితమై వున్నదామె వదనం. కొరకంచుల్ని వెక్కిరిస్తున్నాయి ఆమె నేత్రాలు. కాని అవి అసలు ముఖంలోగాక ఎక్కడో దూరంగా వున్నట్లుగా వున్నాయి.

 

    "ఎన్నాళ్ళయింది భోజనంచేసి?" అని ప్రశ్నించాడు ఒక్క అడుగు వెనక్కువేసి.

 

    మంజువాణి లేచి ఊర్చుని "మీ కాళ్ళు పట్టుకుంటాను. దయవుంచి వెళ్ళిపొండి" అంది ఒణుకుతూన్న గొంతుకతో.

 

    అతనామె కన్నీటిచారలను చూస్తున్నాడు. "ఎంతసేపటినుంచి ఏడుస్తున్నావు?" అని ప్రశ్నించాడు.

 

    "చేసినపనికి చెంపలేసుకుంటున్నాను. ఒక్క నిమిషమైనా ఇక్కడుండొద్దు. ఈ పాపిష్టిదాన్ని, ఈ సిగ్గులేని ముఖాన్ని విడిచిపెట్టండి. వెళ్ళరా?" అందామె విలపిస్తూ, ప్రాధేయపడుతున్నట్లుగా.

 

    "వెళ్ళగొడుతున్నావా?"

 

    "మొదటిరోజు మీరు నన్ను వెళ్ళగొట్టడంతో  ఈ కథ ఆరంభమైంది, నేను వెళ్ళగొట్టడంతో ముగిద్దాం. మనం ఇహ ఒకర్నొకరు కలుసుకోవద్దు. సెలవు."

 

    అతనికి ఆమెను బుజ్జగించి ఏమిటి కారణమని అడుగుదామనిపించింది. కాని ఎందుచేతో పౌరుషమేమో, అంతరాత్మ ఒప్పుకోలేదు. ఇవతలకు వచ్చేశాడు.

 

    ఇవతలకు వచ్చిన రాజారావు ఊరుకుంటే - బాగుండేది. కాని ఓ ఘడియ గడిచిపోయినప్పటినుంచీ తిరిగి ఆమెను కలవటం ఎట్లాగా? అని ఆలోచించసాగాడు. అతని ఆవేశం మటుమాయమయింది. ఎలా అయినా ఆమెతో మనసువిప్పి మాట్లాడాలి. ఏదో చెప్పించాలి. తపన...! ఆమెను చూడకుండా తను వుండలేదు. అతని భ్రమలన్నీ గాలికి ఎగిరిపోయాయి. శాయశక్తులా ప్రయత్నించసాగాడు. ఆమె అతి బందోబస్తుగా ఆ దర్వాజా తలుపులూ, కిటికీ తలుపులూ అన్నీ మూసేసింది. అసలు జీవితంలో ఇంక బయటకురాదేమోనన్న సంకోచం అవిర్భవిస్తోంది  అతనిలో. పెరట్లో ఏమయినా కనిపిస్తుందేమోనని డాబామీద యెక్కి నిక్కి నిక్కి చూడసాగాడు. అతనికి పిచ్చియెత్తినట్లయింది. అవటమేమిటి? ఇంచుమించు యెత్తింది. రాళ్ళేవో పడివుంటే తలుపులమీదికి విసిరాడు. ఆ సమయములో అతన్నెవరైనా చూస్తే పచ్చిరౌడీ అనుకుంటారు. 

 

    ఇలా ఘోరసంకటంతో ఓ మూడురోజులు గడిచాయి. ఒకరోజు భుజంగరావు ఊరునుంచి వచ్చాడు. వచ్చిన రెండుమూడు గంటలకే పైకి వచ్చి గది తలుపు తట్టాడు. రాజారావు తలుపుతీసేసరికి "మర్యాదస్తులనుకుని ఇంతకాలం మీతో స్నేహంచేశాను" అన్నాడు.

 

    "మీ మర్యాదకి ఇప్పుడేం లోటు వచ్చింది?" అన్నాడు రాజారావు.

 

    "మరి దీన్ని ఏమని పిలుస్తారు? ఇంట్లో మగవాడు లేనప్పుడు ఏదో వంక పెట్టుకుని లోపలికి దూరటం, మేడమీదనుంచి రాళ్ళు రువ్వటం, ఈలలు..."

 

    రాజారావుకి మతిపోయింది. మరుక్షణంలో మండుకొచ్చింది. పెద్ద పెట్టున అరుస్తూ అన్నాడు "వింటారా నా సమాధానం?"

 

    తృటిలో అతనికి తలతిరిగింది. తాను ఎంత నీచమైనపని చేస్తున్నాడు. ఓ ఆడదాని కాపురం నిలువునా తీసే మాటలు ఉచ్చరించబోతున్నాడు. క్షణికావేశానికిగురై ఓ గాడిదలా, ఆడవిమనిషిలా ప్రవర్తించబోతున్నాడు. తన చదువు, సంస్కారం, విజ్ఞానం ఇవన్నీ ఎక్కడ తగలడినాయి?

 

    "ఎవరు చెప్పారు?" అన్నాడు చప్పబడిపోయి.

 

    "స్వయంగా - ఎవరికోసమైతే ఇవన్నీ చేశారో వారు."

 

    అతనిలో ప్రతీకార వాంఛ చచ్చిపోయింది. "భుజంగరావుగారూ!" అన్నాడు మెత్తగా. "మీతో దెబ్బలాట పెట్టుకోవడం నాకు ఇష్టంలేదు. నేనూ మీకంటే గట్టిగా అరవగలను. మీ భార్యమాటల్ని నమ్మి మీరు ఎవరిమీదకైనా యుద్ధానికి రాబోయేముందు కాస్త ఒక్కసారి... ఒక్కసారి ఆలోచించాలి."

 

    మరుక్షణంలో ఆఫీసరుగారి ముఖం నల్లబడిపోయింది. "మీ ఉద్దేశ్యం..." అన్నాడు.

 

    "ఉద్దేశం లేదు. ఇలా వాళ్ళమాటలు విని తగూలాటకొస్తే పరువు చెడి వీధికెక్కుతుందని చెబుతున్నా."

 

    "బెదిరిస్తున్నారా?"

 

    "మిమ్మల్ని మాత్రం నేను బెదిరించడంలేదండీ! ఇది బెదిరింపని నేననుకోవట్లా."

 

    ఆయన ఏమనుకున్నాడో ఏమిటో "అన్ కల్చర్డు" అంటూ క్రిందకు దిగిపోసాగాడు.

 

    "అదేదో గట్టిగా అంటే..." అన్నాడు రాజారావు మెట్లపై నుంచి.

 

    "మిమ్మల్ని గురించి కాదులే" అంటూ ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

 

    రాజారావు ఓ నిట్టూర్పు విడిచాడు. "నేను తొందరపడ్డాను" అనుకున్నాడు. "ఆ మాత్రం మాట్లాడకుండా వుండలేకపోయాను. ఆ నాగన్నకి అర్థమైవుండదు" అనుకున్నాడు. "ఏమిటీ విపరీతం?" అనుకున్నాడు. "వాడికామాత్రం శాస్తి కావలసిందేలే" అనుకున్నాడు.

 

    అతనికా క్షణంలో సర్వప్రపంచం మీదకూడా అసహ్యంవేసింది. ఏకాకిగా వుండటం ఎంత నష్టమో - అంత సుఖంకూడా అన్నభావన పొందాడు.

 

    కాని అసలు ఏకాంతం నలుగురిమధ్యా వున్నప్పుడే వుంటుంది. నలుగురు అసహ్యించుకునే మనుష్యుల మధ్య.

 

    ఒకరోజు అతను టాక్సీ పిల్చుకువచ్చి, డ్రయివరు సహాయంతో సామాన్లన్నీ అందులోకి ఎక్కించసాగాడు. ఇరుగూపొరుగూ ఇళ్ళలోనివాళ్ళు కొందరు హాస్యస్ఫోరకంగా చూడసాగాడు. అప్పుడు భుజంగరావు ఇంట్లోనే వున్నాడు. బయటికివచ్చి రాజారావు చేతినిపట్టుకుని "నేనన్నమాటలకే వెళ్ళిపోతున్నారా?" అని ప్రశ్నించాడు.   

 

    "అపార్థాలకు అవకాశం ఇవ్వటం నా అభిమతం కాదండీ" అన్నాడు రాజారావు.

 

    "మీరు చాలా మంచివారు. మీ మనసుకి గాయం కలుగజేశాను. మీరు ఇక్కడే వుండిపోండి. మిమ్మల్ని నేనర్థం చేసుకున్నాను" అన్నాడు భుజంగరావు.

 

    రాజారావు బాధగా నవ్వి "నన్నాపకండి. మనం మిత్రుల క్రింద విడిపోదాం. నా ప్రవర్తనలోనే లోపం వుందేమో? కష్టం కలిగిస్తే క్షమించండి" అన్నాడు.

 Previous Page Next Page