Previous Page Next Page 
జైలు పేజి 30

   
    ఆయన జుట్టంతా రేగిపోయి వుంది. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మండుతున్నట్టున్నాయి. నల్లటి పెదవులు కాటు పడగానే విషం స్రవించే వింత పురుగుల్లా వున్నాయి.

 

    "ఇక నేను వస్తాను కైలాసం. రేపు ఉదయానికల్లా నీ డ్యూటీకి వచ్చేయ్" అని లేచాడు ఆర్ముగం.

 

    బిల్లు చెల్లించి బయటపడ్డాడు. టైమ్ చూస్తే పదయింది ఇక తను వెయిట్ చేయక్కర్లేదని అనుకుని జైలుకేసి నడిచాడు.

 

    జైలుకి చేరుకునేసరికి మరో అరగంట పట్టింది అప్పటికి పూర్తిగా నిషా ఎక్కింది.

 

    కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి. కాళ్ళు పట్టు తప్పుతున్నాయి. శరీరం స్వాధీనం తప్పి కాళ్ళు ఎటు లాగితే ఆ పక్కకు వాలిపోతోంది.

 

    జైలు తోటలోకి వచ్చాడు. మహిళల ఖైదీ బ్యారెక్కు కేసి దృష్టి సారించాడు. ఖైదీలంతా నిద్రపోతున్నట్టు బ్యారెక్కులో దీపం వెలగడం లేదు.

 

    అటుకేసి నడిచాడు. బ్యారెక్కు తలుపు తాళం కోసం జేబులు వెదికాడు.

 

    "సార్! మీ కోసమే చూస్తున్నాం" ఎవరో పక్కనుంచి అడిగినట్టనిపించి ముఖం తిప్పాడు ఆర్ముగం.

 

    మాట్లాడుతున్న వార్డర్ కొత్తగా సర్వీసులో చేరాడు. కుర్రవాడు, ఇంకా పెళ్లి కాలేదు. పేరు కృష్ణారావు.

 

    "ఎందుకు?" విసుగ్గా అడిగాడు ఆర్ముగం.

 

    "మాకూ భాగం కావాలి సార్"

 

    "ఇస్తున్నాగా" ఆర్ముగం విసుగు తారాస్థాయి నందుకుంది.

 

    "కలెక్షన్స్ లో కాదు సార్ పిల్లవాటాలో"

 

    కృష్ణారావు వెకిలినవ్వు వంకర నవ్వులా వుంది.

 

    "మీరలా అడిగితే తప్పుతుందా. కానివ్వండి. అలాగే అయితే నాదే మొదటి ఛాన్స్" ఆర్ముగం ఒప్పుకోవడంతో ఆ కుర్ర వార్డర్ ఎగిరి గంతేసాడు.

 

    "ఇంతకీ ఎక్కడుంది దేవకి?"

 

    "ఈ బ్యారెక్కులోనే సార్"

 

    "పక్క బ్యారెక్కు ఖాళీనేనా?"

 

    "ఖాళీనే సార్"

 

    మరో మాట మాట్లాడకుండా ఆర్ముగం బ్యారెక్కు తలుపు తీశాడు.

 

    జేబులోని చిన్న టార్చీని తీసి బటన్ నొక్కాడు.

 

    దాదాపు పదిమంది స్త్రీలు అటూ ఇటూ పడుకుని వున్నారు వాళ్ళు అప్పుడే నిద్రపోరని ఆర్ముగానికి తెలుసు! కొత్త ఖైదీ వస్తే తను వస్తానని తెలుసు కాబట్టి భయంతో నిద్రరాదు వాళ్ళకు -

 

    ఆర్ముగం ఖైదీల ముఖాలకు ఫోకస్ చేసుకుంటూ నడుస్తున్నాడు!

 

    అడుగులు స్ట్రయిట్ గా పడకపోవడంతో ఖైదీలు కాళ్ళు తొక్కేస్తున్నాడు. పాపం ఆ ఖైదీలు బాధను లోపలే దిగమింగుకుంటున్నారు. ఏడిస్తే లేచి అరిస్తే ఏమౌతుందో వాళ్ళకు తెలుసు. వార్డర్లంతా వచ్చి ఏదో అబద్ధపు సాకు చెప్పి గొడ్లను బాదినట్టు బాదుతారు. అందుకే వాళ్లంతా ఆర్ముగం కాళ్ళను తొక్కుకుంటూ నడుస్తున్నా కిమ్మనకుండా వున్నారు.

 

    దేవకి కనపడగానే ఠక్కున ఆగిపోయాడు ఆర్ముగం.

 

    అప్పుడప్పుడే నిద్రలోకి జారుకుంటున్న దేవకి ఉలిక్కిపడి లేచింది.

 

    తన ఎదురుగ్గా చిన్నసైజు రాక్షసుడిలా నిలబడివున్న ఆర్ముగాన్ని చూస్తూనే ఆమె చిగురుటాకులా వణికిపోయింది. ఠక్కున లేచి నిలుచుంది.

 

    "నువ్వేనా కొత్తగా వచ్చింది?" అధికారిగా ప్రశ్నించాడు ఆర్ముగం.

 

    "అవును"

 

    వింటున్న మిగిలిన ఖైదీలకు తమ మొదటిరోజు భయంకరమైన అనుభవం గుర్తుకొచ్చింది. ఆర్ముగం తాము జైలుకి వచ్చిన మొదటిరోజు, రాత్రి ఇవే ప్రశ్నలు వేశాడు!

 

    "ఏం పేరు?"

 

    "దేవకి"

 

    "క్యాంటిన్ లో వున్న డబ్బు పోయింది. నువ్వే ఎత్తుకున్నావని చెబుతున్నారు వార్డర్లు. నిన్ను చెక్ చేయాలి. నాతో రా" అని ముందుకు తిరిగాడు ఆర్ముగం.

 

    దేవకికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఆమె షాక్ తిన్నది న్యాయమూర్తులూ, లాయర్లు, పోలీసులు, అంత పెద్ద హంగామం వున్న కోర్టులోనే తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోలేకపోయింది. ఇప్పుడు ఎవ్వరూ లేని ఇక్కడ తనగోడు ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక ఆమె కళ్ళల్లో నీళ్ళను కక్కుకుంది.

 

    ఆర్ముగం వెనక్కి తిరిగి చూసి "రా" అన్నాడు.

 

    ఆమె మౌనంగా వెంట నడిచింది.

 

    బ్యారెక్కు బయట నిలుచున్న కృష్ణారావు ఆమెను చూడగానే కళ్ళను సాగదీశాడు.

 

    పక్కనున్న బ్యారెక్కు రడీగా తెరిచుంది.

 

    ఆర్ముగం లోపలికి అడుగుపెట్టాడు, దేవకి తలుపు దగ్గర ఆగిపోయి, భయంగా చూస్తోంది.

 

    "రా! చెక్ చేయాలి"

 

    "సార్! నేనలాంటి దాన్ని కాను సార్. ఈ రోజే జైలుకి వచ్చాను. క్యాంటీన్ ఎక్కడుందో కూడా తెలియదు సార్" ఆమె ప్రార్థించింది.

 

    దీంతో ఆర్ముగం మరింత ఉగ్రుడైపోయాడు. ఆడపిల్లను లొంగదీసుకోవడానికి బెస్ట్ మార్గం భయపెట్టడమేనని అతను ఎప్పుడో గ్రహించాడు.

 

    "అదంతా నాకు తెలియదు. మర్యాదగా లోపలికి రాకుంటే బెల్ట్ తియ్యాల్సివస్తుంది" అని ఒక్కక్షణం కూడా ఆగకుండా బెల్ట్ తీయడం మొదలుపెట్టాడు.

 

    దేవకి భయంతో వణికిపోతోంది. పోలీసులు, జెయిలు వార్డర్లు ఎంతకైనా తగుదురని ఆమె స్వానుభవంతో గ్రహించింది. మానవత్వం ఎ కోశానా ఉండదని ఆమెకు తెలుసు. అంతేకాకుండా తనను కేవలం చెక్ చేయడానికి కాకుండా మరో పనిమీద తీసుకు వచ్చారని కూడా ఆమెకు తెలుసు. అయితే ఆ పని ఏమిటోనన్నదే తెలియాల్సిన విషయం.

 

    ఆమె ఆలోచనలో వుండగానే ఆర్ముగం బెల్ట్ చేతిలోకి తీసుకుని ఒక్కసారి ఝళిపించాడు.

 

    ఆ దెబ్బ ఆమె చేతిలోని కండరాలన్నింటిని వుబ్బించింది.

 

    "అమ్మో!" అంటూ కుప్పకూలిపోయింది.

 

    "నోరు తెరిచి అరిచావో పర్మినెంట్ గా నోరు మూస్తాను. లోపలికి నడువ్" అని ఆర్ముగం గొంతు తగ్గించి కటువుగా చెప్పాడు.

 

    బెల్టు దెబ్బ మొత్తం శరీరాన్నంతా కత్తిలా కోస్తున్నట్టు అనిపించింది దేవకికి. బలవంతంగా పళ్ళ మధ్య బాధను బిగించి లేచింది.

 

    "రా లోపలికి"

 

    ఆమె మెల్లగా బ్యారెక్కు లోపలికి అడుగుపెట్టింది. చుట్టూ చీకటి. తన ముందున్న బలమైన ఆకారం యముడి నీడలా అనిపించింది ఆమెకు.

 

    "స్త్రీలు దేన్నయినా జాకెట్ లోపలే దాస్తారని తెలుసు. ముందు అక్కడినుంచి మొదలుపెడదాం. పైట తీయ్"

 Previous Page Next Page