Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 30


    ఆమె జీవితంలో తొలిసారి తన మెదడుకు ఒకింత పదును పెట్టి ఆలోచిస్తున్న సందర్భం అది.

    "మరి నాతో అన్నాడే ఏదో వ్యాపారం ప్రారంభించబోతున్నానని...?" సందిగ్ధంగా ఆగిపోయింది.

    "నిజంగా నిజం. అతనింతవరకు ఫలానా వ్యాపారం చేయాలనే నిర్ణయం ఏదీ తీసుకోలేదు. కాని..."

    ఆమె ఆతృతగా ముందుకు వంగింది.

    "ఊ... కాని.... చెప్పు..." అతన్ని తొందర పెట్టింది.

    "ఉద్యోగాలిస్తానంటూ ప్రకటన ఇచ్చాడు...."

    "ఎంతమందికి?"

    "దాదాపు ఓ ఇరవైమందికి."

    పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడిందామె.

    "ఏ వ్యాపారమో అభ్యర్ధులకు తెలపకుండానే ఇవ్వడుగా?" ఆమె చురుగ్గా ఆలోచిస్తోంది.

    "మీరు నన్ను అనుమానిస్తున్నారు..." సైంటిస్ట్ ఒకింత నిష్టూరంగా అన్నాడు.

    ఆమె చప్పున తేరుకుంది.

    "ఛా... ఛా... అలా ఏం కాదు. కాకపోతే ప్రకటన ఇచ్చేటప్పుడు ఫలానా సంస్థ, ఫలానా వ్యాపారం- ఫలానా బాధ్యతలు నిర్వర్తించటానికి సిబ్బంది కావాలనిస్తారు గదా" అని అంది సాధారణంగా.

    అతను ఆమెను తిరిగి నమ్మాడు.

    "వసుంధరా ఇండస్ట్రీస్ అనే పేరు మాత్రం ఇచ్చాడు. ఆ సంస్థ ఏ వ్యాపారం చేస్తుందని మాత్రం ఇవ్వలేదు. ఇంతవరకు ఫలానా వ్యాపారము చేయాలనే నిర్ణయానికి మాత్రం అతను రాలేదు... ఇది ష్యూర్!"

    వివరాల్లో మరికాస్త లోతుకు వెళ్ళేదేమో కాని, అంతలో ప్రియాంక తల్లి రావడంతో వారి సంభాషణ అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రియాంకకు ఆ విషయాలు వాళ్ళమ్మకు తెలియడం ఇష్టం లేదు.

    త్రినాధ్ ఏదో ప్లాన్ లో వున్నాడు అని మాత్రం నమ్మకంగా భావించి సైంటిస్ట్ ని ఆ రోజుకి వదిలేసింది కాని- ప్రకటనలో ఏముందనే వివరాలడిగితే మాత్రం త్రినాధ్ కి ప్రియాంక పరంగా గట్టి దెబ్బ తగిలేదే.

    ఏమీ లేకుండా కేవలం ఆరువేలు, ఒక బిల్డింగ్ ని నమ్ముకొని ఏ ధైర్యంతో సిబ్బంది కావాలని ప్రకటన ఇచ్చాడు...?! ఆ ప్రకటనలోనే త్రినాధ్ తన ఫస్ట్ ట్రాక్ ప్రయోగించాడని ఆమె ఊహకు అందని విషయం.


                                                   *    *    *    *


    ఎప్పటిలాగే తెల్లవారుఝామున- శివాలయ ప్రాంగణంలో వారి వారి స్థలాల్లో ఆశీనులయ్యారు.

    "విజయం అన్నది ఒక చక్రం లాంటిది. కదిలిస్తే అది కదులుతుంది" లేదంటే నిశ్చలంగా వుండిపోతుంది. విజయం కాని, అదృష్టం కాని, సంపాదన కాని, ఉన్నతస్థాయికి ఎదగడం కాని- అన్నీ ఆ వీల్ లోనే వుంటాయి. ఎవరో ఒకరు కదిలించే వరకు అది కదలదు. ఎవరైతే దాన్ని కదలిస్తారో- వారికే- ఆ కదలిక ఎంత వేగంగా వుంటుందో ఆ వేగం చివర్ వారి లక్ష్యం కనిపిస్తుంది. చేతికి అంది వస్తుంది.

    ఆ వీల్ మనలాంటి సోమరిపోతుల దేశంలో కదలదు. ఇక్కడి జనాలకు కొన్ని గుడ్డి నమ్మకాలున్నాయి. భాగ్యవంతుడే భాగ్యవంతుడవుతాడని- ఒక సాధారణమైనవాడు, కేవలం డబ్బున్నవాడి కూతుర్ని చేసుకుంటేనో, లేక ఒక డబ్బున్న ప్రౌఢ విధవ కోర్కెలతో వుండి తమ దరిచేరితోనో తప్ప భాగ్యవంతులు కారనేవి.

    భారతీయులకున్న ఉదాసీనత ప్రపంచంలో మరెవరికీ లేదు. ఇది మన ఖర్మ అని, భగవంతుడు మన నుదుట ఇలా రాసాడనే ఉదాసీనతలోనే మ్రగ్గిపోతాం.

    తక్ దీర్... ఫేట్... ఖర్మ... మనిషి తన సోమరితనాన్ని కప్పిపుచ్చుకొనే పదాలివి. ఇక్కడ మనమీద మనమే జాలిపడతాం. డబ్బున్నవాడ్ని చూసి వాడు గోల్డ్ స్పూన్ తో పుట్టాడు. మనం కనీసం చెక్క చెంచాతో కూడా పుట్టలేదని మనమీద మనమే పిచ్చి జోకులు వేసుకొని నవ్వుకుంటాం.

    మనం మన లోపాల గురించి, సమాజ లోపాల గురించి, దేశ లోపాల గురించి, ఆర్ధిక వ్యవస్థ లోపాల గురించి- కుటుంబ సమస్యల గురించి, పెట్టిబడి లేకపోవడం గురించి, కాస్తో కూస్తో కూడబెట్టుకున్న పొదుపు డబ్బును ఎలా కూతుర్లు పెద్ద మనుష్యులయినప్పుడు ఖర్చుపెట్టాలా? కూతుర్లు, చెల్లెళ్ళ పెళ్ళి ఎలా గ్రాండ్ గా చేయాలా అని ఆలోచిస్తాం. మనమీద మనకే నమ్మకం లేకపోవం అనే రాక్షసుడి ముందు మనం ఘోరంగా ఓడిపోతాం.

    హిందువులకు భగవద్గీత చెబుతుంది- "నీ విధి నీవు నిర్వర్తించు. ఫలితం నాకు వదిలేయ్" అని.

    క్రిష్టియానిటి చెబుతుంది- ఏసుక్రీస్తు వజ్రాలు సృష్టించేది తనలా త్యాగం చేసి, ఇతరుల కోసం పాటుపడే తన భక్తులకోసం కాని సైతానుల కోసం కాదని.

    త్రినాధ్! నీ లక్ష్యాన్ని నీవు నిర్ణయించుకున్నావు. దాన్ని సాధించేవరకు నిద్రించకు.

    ఇంట్రస్ట్ వున్న ప్రతివాడు టెన్నిస్ ఆడతాడు. ఎలాగోలా ఆడగలడు. కాని ఛాంపియన్ ఆడే ఆట వేరు. ఎందుకంటే అతను ఆ ఆటనే తింటాడు. ఆ ఆటలోనే ఆదమరచి నిద్రపోతాడు. ఆ ఆటనే పలవరిస్తాడు. నటన మీద మోజున్న ప్రతివాడు నటిస్తాడు- నటించానని కొందరితోనైనా అనిపించుకోగలడు. కాని మహానటుడు ఆయా పాత్రలలో జీవిస్తాడు. ఆ పాత్ర కోసమే పుట్టాడా అని కొందరితో కాదు- అందరితో అనిపించుకుంటాడు. ఎలాగో తెలుసా? ఆ పాత్రను అర్ధం చేసుకొని, ఆ పాత్రపట్ల మక్కువ పెంచుకొని, ఆ పాత్రను సజీవం చేయడానికి అన్ని విధాల కృషిచేసి-

    HE EATS

    HE DREAMS

    AND HE SLEEPS WITH THIS OBJCTIVE.   

    అప్పుడైతే కూలిపోతావో అప్పుడు నీ అంతట నీవే లేవడం నేర్చుకో, ఎప్పుడైతే తప్పుదారిన పోతావో అప్పటినుంచి ఆ తప్పుల్ని తెల్సుకోవడం నేర్చుకో. ఎక్కడా, ఎప్పుడూ మొండిగా, మూర్ఖంగా వ్యవహరించకు. మార్పును ఆహ్వానించి, అది మంచిదైతే నీ జీవితంలో దాన్ని అమలుపర్చుకోగలిగేంత సులువుగా వుండు.

    ఎప్పుడైతే నీ ముందు దారి మూసుకుపోతుందో వెంటనే ఆ దారి మార్చి కొత్తదారికి అనుగుణంగా మారిపో.

    ఎక్కడైతే నీవు ఆగిపోతావో అప్పుడు అమెరికా దేశానికి వచ్చిన తొలి వలసవాదుల మాటలు గుర్తుంచుకో."

    "We have no way to go but up."

    "మాకు ముందుకు వెళ్ళేందుకు మరో దారిలేదు పైకి వెళ్ళటం తప్ప. వారి మాటలని ఎందుకన్నానంటే వాళ్ళే అమెరికాను భాగ్యవంతం చేసింది కనుక. ఇక్కడ పైకి వెళ్ళడం అంటే ఉన్నతస్థాయికి అని అర్ధం చేసుకో...."

    ఆరోజుకు మాలినీదేవి తన ప్రసంగాన్ని ముగించి లేచింది.

    ఆమె ముందూ, అతను వెనుకా- ఆలయ ప్రాంగణం దాటుతున్నారు నెమ్మదిగా.      

    అప్పుడందామె-

    "ఇప్పుడు నువ్వు రక్షించింది న్యూట్రాన్- ప్రోటాన్ ల మిశ్రమాన్ని. అది మహాబలసంపన్నమైన ముడిపదార్ధం. దానికి పదును పెట్టు. మరెంతో బలవంతమైన న్యూక్లియర్ ఉద్భవిస్తుంది. సముద్రపు ఉప్పునీరు ఉప్పెనయితే దారుణాలు జరుగుతాయి. అదే ఆవిరై- మేఘమై- వర్షిస్తే నవరత్నాలు పండుతాయి. ప్రస్తుతం హాస్పటల్ లో వున్న ఆ కఠినమైన ఉప్పు నీటిని కరిగించి మలినాన్ని వడకట్టు-" అంటూ జీప్ ఎక్కి కూర్చుంది.


                     *    *    *    *


    పత్రికలో ప్రకటన ఇచ్చి అప్పటికి నాల్గవరోజు. మొత్తం కలిపి అప్పటికి వచ్చిన అప్లికేషన్స్ మూడే.

    ఈ విషయం కనుక్కొనేందుకు పత్రికాఫీసుకి వెళ్ళిన హిందూకి తెలిసిన అతి నిరుత్సాహకరమైన వార్త అది. ఆ విషయం త్రినాధ్ కు చేరవేసేందుకు ఆమె బయలుదేరింది.


                     *    *    *    *


    త్రినాధ్ ని చూడగానే ఛటర్జీ పరుగెత్తుకొచ్చి అమాంతం వాటేసుకున్నాడు. ఆయన కళ్ళకిప్పుడు త్రినాధ్ దేవుడిలా కనిపిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకును, తన ప్రాణానికి ప్రాణాన్ని రక్షించి తన కప్పగించాడు. ఆయన భార్యకైతే త్రినాధ్ దేవుడుకన్నా ఎక్కువగా కనిపిస్తున్నాడు.

    బోస్ ఆ రోజే కొద్దిగా స్పృహలోకి వచ్చాడు. కొడుకు ఆవేశానికి అడ్డు కట్టవేసి, బాగుచేసే బాధ్యతను త్రినాధ్ కి అప్పగిస్తూ కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు ఛటర్జీ.

    ఆయన దీనమైన స్థితిని, కన్నతండ్రిగా అతను పడే బాధను అర్ధం చేసుకోగలిగాడు త్రినాధ్.

    ఇనుము వేడెక్కింది... ఇక దెబ్బ వేయాలనుకున్నాడు త్రినాధ్.

    "బాగు చేయాలనే వుంది. చేయగలను కూడా. కాని ఎలా-? అతనికేదో వ్యాపకాన్ని అప్పజెప్పాలి. ఏం అప్పజెప్పాలి-?"

    ఛటర్జీ భార్య అందుకుంది...

    "ఏదైనా అప్పజెప్పు బాబు. నువ్వేం చేసినా మాకిష్టమె. మా బాబు బాగుపడితే చాలు. నీకేం కావాలన్నా తీసుకో. లక్షలకు లక్షలు డబ్బులా? బంగారమా? పొలమా? ఇళ్ళా? ఆమె గొంతులో మాతృవాత్సల్యం పొంగి పొరలుతోంది.

    ఆమె కన్నీటిని చూసి త్రినాధ్ ఒకింత బాధపడితే, ఛటర్జీకైతే గుండెల్లో సూదులు గుచ్చినట్టుగా ఫీలయ్యాడు.

    "నా భార్య చెప్పింది ఏదైనా చేయడానికి సిద్ధంగా వున్నాను. నా కొడుకును బాగుచేసుకోవడానికి నా యావదాస్థిని ధారపోయమన్నా పోస్తాను-" ఆయనిప్పుడు ఓ పెద్ద లైసెన్సింగ్ ఆఫీసర్ లా కనిపించడం లేదు. సర్వస్వం పోగొట్టుకుని, గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఒక దిక్కులేనివాడిలా వున్నాడు.

    సమయం ఆసన్నమైంది.

    ఫైండ్ ఏ నీడ్...

    దాన్ని ఫుల్ ఫిల్ చేసి తాను ఎదగాలి. త్రినాధ్ మెదడు చురకత్తిలా పని చేసింది.

    "అవేమీ వద్దు సార్. బోస్ లాంటివాళ్ళు ఏదో ఒక బాధ్యత నెత్తికెత్తుకోకపోతే నాశనం అయ్యే ప్రమాదం వుంది...."

    "చెప్పు బాబు నన్నేం చేయమంటావో? చెప్పడమేమిటి ఆజ్ఞ జారీ చెయ్..." ఛటర్జీ కళ్ళు తడిదేరి వున్నాయి.

    "మీరు ఇండస్ట్రీస్ లైసెన్సింగ్ ఆఫీసర్. ఎందరో క్రుకెడ్ ఇండస్ట్రియలిస్ట్స్ కు కూడా తెలుసో, తెలియకో లైసెన్స్ లు ఇచ్చారు. నేను అలా కాదు. మీ కొడుకు అలా కాడని నా గ్యారంటీ. మీకు మా మీద నమ్మకం వుంటే, మేం బాగుపడాలని వుంటే మాకు లైసెన్స్ లు కొన్ని ఇప్పించండి."

    త్రినాధ్ మాటలు విని ఛటర్జీ విస్మయపడ్డాడు.

    కోరుకున్నంత డబ్బు, స్థిరాస్తులు, బంగారం ఆఫర్ చేస్తే వాటిని కాదన్నాడు. లైసెన్స్ లు కోరుకుంటున్నాడు. చిత్రంగా వుంది. ఇలాంటి యువకులు ఇప్పుడు కూడా వున్నారా? ఆయనకు నమ్మశక్యంగా లేదు.

    ఆయన భావాల్ని చదివేశాడు త్రినాధ్.

    "మీ ఆలోచనలు నాకర్ధమయ్యాయి సార్! స్వార్ధపరుడు, తెలివి తక్కువవాడు అయితే మీరు ఆఫర్ చేసినవి అడిగుండేవాడు. డబ్బు కావాలా? లేక డబ్బు సంపాదించడం నేర్చుకుంటావా అని అడిగితే నేను రెండోది కోరుకుంటాను. మీరిచ్చిన డబ్బు కొన్నాళ్ళకి అయిపోతే తిరిగి మేం యథా స్థానానికి వస్తాం. అదే దాన్ని సంపాదించడం నేర్చుకుంటే అది మమ్మల్ని రోజురోజుకి పైకి తీసుకెడుతుంది. పైగా అది మొదటిదానిలా బిచ్చం కాదు- రెండోదానిలా నేర్చుకోవడం అవుతుంది..."

 Previous Page Next Page