Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 31

    "నువ్వు చేసే పని ఏమిటో ఆ నిజం ఒక్కసారి వీళ్ళందరికీ చెప్పేస్తే ఏ గోలా వుండదు కదా అన్నయ్యా!" సుమిత్ర అంది.

    "గోల వుండదు సరే! వీళ్ళందరికీ కాలక్షేపం ఎలా అవుతుంది? ఇంట్లో వాళ్లకి ఏ కాలక్షేపం లేదనే. నేనలా చేస్తున్నాను" నవ్వుతూ చెప్పాడు బోసుబాబు.

    "ఏమిటి ఇంట్లోంచి గిన్నెలూ, వెండిగిన్నెలూ, ఇత్తడి బిందెలూ ఎత్తి కెళ్ళడమా?" వ్యంగ్యంగా అన్నాడు జగన్నాధం.

    "నేను అడగ్గానే డబ్బులిస్తే ఏ గోల వుండేది కాదు. దీనికి కారణం మీరు!"

    "అడగ్గానే నువ్వెందుకు చెప్పలేదు?" జగన్నాధం అడిగాడు.

    "ఒక్కసారిగా మిమ్మల్ని ఆశ్చర్యపరుద్దామని!"

    "ఏమిటి ఇలాంటి వెధవ పనులతోనా?"

    "వెధవ పనులో, కొంటె పనులో నాకు తెలియదు. నేను చేసేపని ఏదో ఒకరోజు పేపర్ ఫ్రంట్ పేజీలో బాక్స్ కట్టి మరీ ప్రచురణ అవుతుంది. అప్పుడు నేను చేసిన పనేమిటో చూద్దురు గాని!"

    "ఎప్పుడూ పేపర్ ఫ్రంట్ పేజీలో కెక్కాలని కోరిక వెలిబుచ్చటమే కానీ, నువ్వు చేస్తున్న పనేమిటో చెప్పవు. ఘోరాలు చేసేవాళ్లు కూడా పేపర్ ఫ్రంట్ పేజీలో కెక్కుతారు. ఇంతకీ నువ్వు చేసేపని మంచిపనా, చెడ్డపనా?" లక్ష్మణమూర్తి అడిగాడు.

    "మంచివాళ్ళకి మంచిపని, చెడ్డవాళ్లకి చెడ్డపని. చరిత్రను సృష్టించడమే ప్రస్తుతం నా ధ్యేయం _ నా లక్ష్యం. ఇదే ఆఖరుసారి అడుగుతున్నాను. నాకు ఇంకో వంద రూపాయలు కావాలి! ఆ వంద తరువాత ఇంక అడగను. వంద రూపాయలు ఇవ్వదలచుకున్నారో, లేదో ఎలాగూ సమావేశమయ్యారు కాబట్టి చర్చ జరిపి తేల్చుకోండి కాదంటే నా మార్గం నాకు ఎలాగూ వుంది" "ఈ మాట అని బోసుబాబు లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు.

    అక్కడవున్న అందరికీ ఆ సమయంలో బోసుబాబు అన్నింటికీ తెగించిన వాడిలాగా కనపడ్డాడు.

    ఇప్పుడు మనం ఏం నిర్ణయం తీసుకోవాలి?"

    ఏం చేయాలి?

    ఈ విషయం గురించీ ఎవరితో ఎవరూ మాట్లాడుకోలేదు. అందరూ ఆలోచిస్తూ కూర్చున్నారు.


                                        24


    మరో మర్డర్ జరిగింది.

    "ది గిఫ్ట్" ఈ మర్డర్ కేసులో కూడా ప్రత్యక్షమయింది.

    రూపాదేవి అనే ఇరవై నాలుగేళ్ళ అమ్మాయిని ఎవరో హత్య చేశారు.

    ఓ కంపెనీలో టైపిస్టు జాబ్ చేస్తోందామె. అదే కంపెనీలో నళిని అనే అమ్మాయి పనిచేస్తోంది.

    ఇరువురూ కలిసి ఒక గది అద్దెకు తీసుకొని వుంటున్నారు. పరాయి ఊళ్లో ఉద్యోగం చెయ్యడం వల్ల, వాళ్ళ వాళ్ళు తోడురావడానికి వీలులేక పరాయి వాళ్ళయినా స్నేహితులయి కలిసి వుంటున్నారు. ఇద్దరూ అవివాహితులే.

    రెండు రోజుల క్రితం నళిని తల్లికి సీరియస్ గా వుందని టెలిగ్రామ్ రావటంతో ఆమె ఊరువెళ్ళటం జరిగింది. ఎంక్వైరీలో ఆ విషయం రుజువయింది.

    ఈ హత్య రాత్రి పదకొండూ పన్నెండు గంటల మధ్య జరిగిందే. ఎవరో బాగా తెలిసిన వ్యక్తి ఈ హత్య చేశాడు. ఇదే విషయం గురించీ ఇన్ స్పెక్టర్ మనోజ్. బబితా మాట్లాడుకుంటూ కూర్చున్నారు.

    "మనం మళ్ళీ ఒకసారి తీరుబడిగా ఈ కేసు గురించీ మాట్లాడుకుందాం! డీప్ గా ఆలోచించి చూద్దాం. చిన్న క్లూ దొరకక పోతుందా? తీగ చేతికి దొరికినట్లయితే డొంక మొత్తం కదులుతుంది. మళ్ళీ మొదటి నుంచీ నరుక్కొద్దాం! నీకేమన్నా అభ్యంతరమా మనోజ్!" బబిత అడిగింది.

    మనోజ్ కళ్ళు మెరిసాయి.

    "ఒక్కడినీ ఆలోచిస్తూంటే బుర్ర పనిచెయ్యటం లేదు. ఇద్దరం కలిసి చర్చిస్తేనే పాయింట్లు బయటికివస్తాయి. ప్రొసీడ్!" అన్నాడు ఉత్సాహంగా మనోజ్. 

    "మొదటినుంచీ ఈ కేసులో మనకి ఎదురవుతున్నది ఒకటే. గిఫ్ట్ పాకెట్ బొమ్మవేసి, "ది గిఫ్ట్" అని రాసి వున్న అట్టముక్క. అట్టముక్క మీద బొమ్మ వేసిన విధానాన్ని బట్టీ అతను మంచి ఆర్టిస్టు అని తెలుస్తోంది. ఆ ఆర్టు, రాసిన అక్షరాలు ఒకరివే. ఆ అట్టముక్కను బట్టి ఇవన్నీ చేసింది ఒకరే ఇది మెయిన్ పాయింట్.

    నెంబర్ టూ, మొదట్లో వస్తువుల్ని దగ్ధం చెయ్యడం మాత్రమే జరిగింది. ఇది ఎవరో కావాలని చేస్తున్న పని అని అనుకున్నాం. పిచ్చివాడి చర్య కావచ్చు. అల్లరివాళ్ళ పని కావచ్చు. చివరికి జెన్నీ హత్య దగ్గరికి వెళ్లింది. అప్పుడు నువ్వు ఒకమాట అన్నావు గుర్తుందా మనోజ్!"

    "అది కూడా నువ్వే చెప్పు బబితా!" అన్నాడు మనోజ్.

    "నేను ముందే వూహించాను. హంతకుడు ఎవరినో మర్డర్ చెయ్యాలని పెద్ద ప్లాన్ వేసుకుని, పోలీసులుని తప్పుదారి పట్టించటానికి గిఫ్ట్ అనే నాటకం ఆడుతున్నాడు. ఈ ఒక్క హత్యతో ఈ కేసు ముగియదు.

    అసలు ఎవరిని చంపాలనుకుంటున్నాడో హంతకుడు. అతనిని చంపేవరకూ ఇలా అతనికి సంబంధించని వారిని కూడా బలి పెడతాడని అవునా! ఒకవేళ నీ ఆలోచన తప్పుకావచ్చు కదా!"

    "రాంగ్ అని నేను అనుకోవడం లేదు!" ముక్తసరిగా జవాబిచ్చాడు మనోజ్.

    "పోనీ నీ మాట ప్రకారం రాంగ్ కాదు రైటే. ఒక హత్యకీ, మరొక హత్యకీ పోలికే లేదు! ఒకచోట చిన్నపిల్ల, మరొకచోట ముసలివాడు. ఇప్పుడు రూపాదేవి. ఈ ముగ్గురిలో హంతకుడికి ఎవరిమీద పగవున్నా, ఇప్పుడు చంపినట్లే ఈజీగా చంపవచ్చు. దీనికో పెద్ద పథకం వెయ్యనక్కరలేదు...."

    "ఇదిగో ఇక్కడే నాకు కూడా తలనొప్పి మొదలయ్యింది. అసలు వ్యక్తిని ఇంకా చంపటం జరగలేదు. ఆవ్యక్తిని చంపేవరకూ ఈ హత్యలు ఇలానే కొనసాగుతాయేమో! ఇదే నా భయం, ఈ లెక్కన మరికొన్ని హత్యలు జరిగి తీరుతాయి. వాటిని ఆపగలనా? లేనా?"

    "హంతకుడు ఏదో ఒక కేసులో తప్పు చేస్తాడు. పట్టుబడి తీరతాడు. ఒక హత్య చిన్నపిల్లది. మరొక హత్య ముసలివాడిది ఆ రెండూ వదిలేస్తే మూడోది రూపాదేవిది. ఈ హత్యలో కూడా చిన్న క్లూ దొరకక పోయే...."

    బబిత అంటూంటే మధ్యలో అడ్డు తగిలి మనోజ్ అన్నాడు.

    "హంతకుడు వచ్చినపుడు, రూపాదేవి తలుపు తీసుకొని అయినా వుండి వుంటుంది. తలుపు తీసి అయినా వుండి వుంటుంది. హంతకుడు ఎవరో ఆమెకి తెలిసినవాడే అయివుంటాడు. 

    ఆమె హంతకుడూ కలిసి కాసేపు మాట్లాడుకొని వుంటారు. హంతకుడు మంచినీళ్లు అడగటమూ, ఆమె ఇవ్వటమూ అతను త్రాగుటమూ జరిగింది. గ్లాసు మీద వేలిముద్రలు వున్నాయి.

 Previous Page Next Page