Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 32

    అతను తనని చంపడానికి వచ్చిన వాడని ముందుగా ఆమె గ్రహించి వుండదు. ఆమెకు తను పరిచయస్థుడు అనడానికి ఇంకొక ఉదాహరణ. ఆమె వెనుకనుంచీ కాకుండా ఎదురుగా నిలబడి గొంతు పిసికాడు. ఆ తరువాత పెట్రోలు చల్లి ఎప్పటి లాగానే తగులబెట్టి గిఫ్ట్ తాలూకా అట్టముక్కని అక్కడ వుంచి వెళ్ళిపోయాడు.

    గొంతు పిసికినపుడు ఆమె పూర్తిగా మరణించలేదు. బోర్లా పడిపోయింది. పడిపోయి ఆమె తెలివి వచ్చేసరికి తను కాలిపోతున్నాని తెలుసుకుంది. చేతికి అందుబాటులో చాక్ పీస్ వుండటం వల్ల హంతకుడి పేరు వ్రాయబోయింది. "సి" అన్న అక్షరం రాసేసరికి మళ్ళీ స్పృహతప్పడమో, షాక్ కి లోనయ్యో ఆమె పూర్తిగా మరణించడం జరిగింది.

    హంతకుడి పేరు పూర్తిగా రాసినట్లయితే, అప్పుడే పట్టుబడేవాడు. రూపాదేవి గతంలో నాకు కొద్దిగా పరిచయం. చాలా మంచి అమ్మాయి, కాస్త పరికిది, అమాయకురాలు" అంతవరకూ చెప్పి రూపాదేవితో తన పరిచయం గురించీ చెప్పాడు మనోజ్.

    "దీన్నిబట్టి ఒక్కటి అర్ధమవుతుంది మనోజ్. హంతకుడు తను హత్య చెయ్యడానికి మొదటి భాగంగా పసిపిల్లనీ, ముసలి వాడిని, అమాయకురాలినీ ఎన్నుకున్నాడు" బబిత సాలోచనగా అంది.

    "యు ఆర్ కరెక్ట్!" అన్నాడు మనోజ్.

    "గిఫ్ట్ తాలూకా అట్టముక్కని వుంచడంలోనూ ఈ రకమైన పనులు చేయటంలోనూ హంతకుడు ఎలాంటి వాడు అన్నది పసిగట్టలేకపోయాము. హంతకుడి మనస్తత్వం తెలిస్తే మనం కొంత ముందుకు పోవచ్చు మనోజ్!"

    "నువ్వు చెప్పిందీ నిజమే బబితా! నేనూ ఈ విషయం గురించే తీవ్రాలోచన చేసాను. నా ఆలోచనలు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఈ కేసు మాత్రం నా మెదడుని తినేస్తోంది. ఇన్ని చేస్తున్నవాడు నాకొక విషయంలో అర్ధంకావడం లేదు."

    "ఏమిటా విషయం?" బబిత ఆత్రుతగా అడిగింది.

    "మనకి ప్రతిచోట హంతకుడి వేలిముద్రలు దొరికాయి. కేసుని తికమక పెట్టేవాడు. ఇన్ని గిమ్మిక్స్ చేస్తున్నవాడు అతి మేధావయి వుంటాడు. ప్రతిచోట వేలిముద్రలు వదిలివెడుతున్నాడు.

    వేలిముద్రల ఆధారంతో తనని పట్టుకుంటామని తెలియదా? ఇది నిర్లక్ష్యమా? కావాలని చేస్తున్న పనా? ఈ విషయం ఎంత ఆలోచించినా అణుమాత్రం అర్ధం కావడంలేదు" మనోజ్ అన్నాడు.

    "ఇది హంతకుడు కావాలని చేస్తున్న పనే. గిఫ్ట్ కార్డుల్ని వదులుతున్నాడు. వేలిముద్రలని వదులుతున్నాడు. ఇతను అఖండమైన తెలివిగలవాడే కాదు. మంచి చిత్రకారుడు కూడా అయివుంటాడు. చిత్రకారులందరినీ పట్టుకుంటే సరి" తనకి తెలియకుండానే మాటలతో చిన్న క్లూ అందించింది బబిత.  

    "చిత్రకారుడు....చిత్రకారుడు...." అనుకుంటూ ఏదో ఆలోచనలో పడిపోయాడు మనోజ్.

    మనోజ్ ని చూస్తూ కూర్చుంది బబిత.


                                          25


    కామాక్షికి భర్తమీద అనుమానం పోలేదు.

    రాత్రిపూటే కాదు. పగలు కూడా అతను చేసే ప్రతి పనినీ గమనించటం మొదలుపెట్టింది.

    మూడు రోజుల క్రితం రాత్రిళ్ళు భర్త వెనుక వెళ్ళి చూడటం, అతను రిక్షా లాగటం, అది చూసిన తరువాత మిగతా ఈ మూడు రాత్రులూ అతను బయటకి వెళ్ళలేదు.

    తన అనుమానం నిజమే. వారానికి రెండుసార్లో మూడుసార్లో మాత్రమే భర్త బయటకు వెళుతున్నాడు రాత్రిపూట.

    భార్యల దగ్గర సుఖంలేక కొందరు భర్తలూ పరాయి స్త్రీల దగ్గరికి వెళ్ళి వస్తూంటారు. తన భర్త వెళ్ళేది అందుకు కాదు. రిక్షా లాగటానికో, ఆటో నడపటానికో వెళుతూ వుంటాడు. అదీ నిజం కాదు. ఈ రెండు నిజాలు కాని అసలు నిజం ఏమిటి?

    ఎవరైనా సరే ఒక పని ఇష్ట పూర్వకంగా చేస్తున్నారూ అంటే వారికి ఆ పనిలో ఆనందం అయినా వుండాలి. లాభం అయినా వుండాలి. రాత్రిళ్లు తన భర్త బయటికి వెళ్ళి చేసే పనులలో ఆనందం పొందుతున్నాడా? లాభం పొందుతున్నాడా? కామాక్షి కొద్దిసేపు ఆలోచించింది.

    తన భర్త ఆనందం కోసం బయటికి వెళ్ళటం లేదు, ఏదో ప్రయోజనం ఆశించి వెడుతున్నాడు. ఆ పనివల్ల లాభం కూడా వుండి వుంటుంది. లాభం ఎప్పుడూ డబ్బు రూపేణా వుంటుంది.

    డబ్బు.

    ఆ మాట గుర్తుకు రాగానే కామాక్షికి తన భర్త సామానులు పెట్టె వెతకాలనిపించింది.

    భర్తకి తెలియకుండా చేస్తున్న ఈ పని తప్పని తనకి తెలుసు. అయినా కూడా అతన్ని పూర్తిగా అనుమానించిన కామాక్షి భర్త సామానులు వెతకడానికే నిశ్చయించుకుంది.

    ఆ సమయంలో పాండురంగం యింట్లో లేడు.

    కామాక్షి గదిలోకి వెళ్ళి లోపల గడియ వేసుకుంది.

    భర్త సామానులు వెతికింది. పుస్తకాలు అతని గుడ్డలూ, అతనికి సంబంధించిన కొన్ని వస్తువులూ, ప్రతిదీ క్షుణ్నంగా పరిశీలించి చూసింది. ఆ వస్తువులలో అనుమానాస్పదంగా ఏదీ కానరాలేదు.

    టక్కున కామాక్షికి ఒక విషయం గుర్హ్తుకు వచ్చింది.

    పాండురంగం డైరీ రాస్తాడు. తనకి డైరీ అంటే మహా మంట. డైరీ రాయదు డైరీ రాయటం గొప్పపనీ అనుకోదు. ఎవరి డైరీలనూ చదవదు. ఇతరుల డైరీలను చదవటం తప్పో, ఒప్పో కూడా కామాక్షికి తెలియదు.

    ఒకసారి పాండురంగం డైరీ రాయడం వల్ల ఏం ఉపయోగమో చెబుతూ, "డైరీ అద్దం లాంటిది. మనస్సు ప్రతిబింబం డైరీలో ద్యోతకమవుతుంది. నిజంగా డైరీ రాసేవాళ్ళు ఏదీ దాచుకోరు. ప్రతి చిన్నమాటా డైరీలో పొందుపరుస్తారు" అని. ఏనాడో అతను చెప్పిన విషయం ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కామాక్షికి.

    తన డైరీ భార్య చూడదని పాండురంగంకి గొప్ప నమ్మకం. తన డైరీని మామూలు అలమారాలో ఓ మూలగా వుంచాడు.

    కామాక్షి వెతికేపని లేకుండా కష్టపడకుండా డైరీని చేతిలోకి తీసుకుంది. తను పుట్టింటికి వచ్చిన దగ్గర్నుంచీ భర్త ఏం రాసిందీ చదివితే చాలు అనుకున్న కామాక్షి సరీగ్గా ఆ తారీఖు చూసుకుని అక్కడి నుండి చదవడం ప్రారంభించింది.

    అతని ఉద్యోగం పోయిన తరువాత, భర్త మానసికంగా ఎంత నలిగిపోయిందీ. భార్య అత్తమామల మంచితనం ఇవే రాసి వున్నాయి. అందులో పోనూ పోనూ డైరీలో మార్పు వచ్చింది.

    "ఈ రోజు అతనిని కలుసుకున్నాను. అతను చెప్పినదంతా పూర్తిగా విన్నాను. మొదట నేను ఈ పనికి ఇష్టపడలేదు. కానీ అతను వివరంగా చెబుతుంటే నిజమే అనిపించింది. నాకు రెండురోజులు ఆలోచించుకోవటానికి టైము ఇచ్చాడు."

    అది చదివిన కామాక్షి, గబగబా మిగతా రెండు పేజీలూ తిరగవేసింది. 

 Previous Page Next Page