ఇంక అక్కడ వుండి చేసేదేమీ కనబడలేదు కామాక్షికి. కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చింది.
కామాక్షి పక్కమీద పడుకుని ఆలోచిస్తూవుంటే రెండు అనుమానాలు వచ్చాయి.
అర్దరాత్రి పూట రెండు మూడు గంటలు రిక్షా లాగినందువలన ఎక్కువ డబ్బులు రావు. ఆ బాడుగ డబ్బులో కొంత అద్దెకి పోతుంది. ఆ పూటకి ఏ బాడుగా లేకపోతే చేతి డబ్బులు యివ్వాల్సిందే కదా! ఏ లాభంతో వీరీ పని చేస్తున్నారు?"
అదీ కాక.
వారానికి ఒకటి రెండు సార్లు తప్ప రాత్రిళ్ళు బయటికి వెడుతున్నట్లు కనపడటం లేదు.
వారానికి ఇన్నిసార్లు మాత్రమే రిక్షా తొక్కాలని నియమం వుందా?
లేదు.
దీనికి వెనుక ఏదో వుంది!
ఆలోచిస్తూంటే తనకి ఏదో అనుమానం వస్తోంది. తన మనసుకి నచ్చ చెప్పుకునే సమాధానం దొరకటంలేదు.
కామాక్షి మరి కొద్దిసేపు ఆలోచించింది.
ఆయన రాత్రిళ్ళు రిక్షా లాగుతున్నానని చెప్పారు.
తను వద్దంది. "సరే! నీ కిష్టంలేని పని నేను చెయ్యలేను అని భర్త తనకి మాట ఇవ్వటం జరిగింది. మాట ఇచ్చిన మనిషి మాట తప్పారు. ఇక్కడ పాయింట్ మాట తప్పటం కాదు నీళ్ళగ్లాసులో ఎందుకు నిద్రమాత్రలు వెయ్యాలి?"
వారానికి ఒకసారి రెండు సార్లే భర్త బయటకి వెడుతున్నాడు.
తన భర్త తను తాగే మంచినీటి గ్లాసులో నిద్రమాత్రలు వేస్తున్నాడు.
ఎందుకు? ఎందుకు?
ఎందుకేమిటి ఏదో వుంది!
ఆ "ఏదో" ఏమిటి?
దరీ. తెన్నూలేని ఆలోచనలతో కామాక్షి బుర్ర గిర్రున తిరిగిపోతున్నది. కానీ అసలు విషయం ఊహకి అందలేదు.
అదేమిటో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి?
కామాక్షి అలా ఆలోచిస్తూనే వుండిపోయింది.
23
ఆ యింట్లో
మరోసారి అసెంబ్లీ సమావేశం జరిగింది.
బోసుబాబు తప్ప సభ్యులందరూ హాల్లో సమావేశం అయ్యారు.
బోసుబాబు చేతబడి అంటూ తనని దడిపించిన తరువాత, కాలూ చెయ్యి విరక్కపోయినా చాలా రోజులు నెప్పిపెట్టి, మరిది మీద నిండా కోపం వచ్చేలా చేసాయి సామ్రాజ్యలక్ష్మికి. చెప్పి నవ్వులపాలు కావటం ఇష్టంలేక, ఈ అవమానం లోపల దిగమ్రింగి, వూరుకుంది.
లక్ష్మణమూర్తి పరిస్థితీ అంతే!
బోసుబాబు వల్ల లక్ష్మణమూర్తి, సామ్రాజ్యలక్ష్మి అవమానం పాలయ్యారుగానీ,
ఇంట్లో వున్న మిగతా ముగ్గురు సభ్యులూ, బోసుబాబు మీద పత్తేదారు పని చెయ్యనూ లేదు. అవమానం అవ్వనూ లేదు.
సమయం వచ్చినప్పుడల్లా మాటల ద్వారా లక్ష్మణమూర్తి, సామ్రాజ్యలక్ష్మి బోసుబాబు మీద అక్కసు తీర్చుకుంటూనే వున్నారు. బోసుబాబుకి మరోసారి డబ్బు అవసరమయింది. ఈ తఫా తండ్రి కూడా విషయమేమిటో చెప్పందే డబ్బు ఇవ్వనని కూర్చున్నాడు.
ఇంతసేపూ బోసుబాబు "నేను కాని పనులేవీ చెయ్యడం లేదు డబ్బు ఇవ్వండి!" అంటాడే కానీ, డబ్బు అవసరమేమిటో ఆ విషం ఏమిటో చెప్పడం లేదు. చేసేది మంచిపని అయినపుడు విషయం చెప్పటానికి ఏమిటి?
అంటే.
బోసుబాబు చేసేది మంచిపని కాదన్నమాట.
ఇదంతా చూస్తూంటే అలానే అనుకోవాల్సి వస్తోంది.
జగన్నాధం ఎవరి కాళ్ళో పట్టుకుని ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తే నమ్రతగా ఉద్యోగం చెయ్యకపోగా, వాళ్ళ దగ్గర ఒకే ఒక్కరోజు ఉద్యోగం చేసి, అక్కడ పోట్లాట పెట్టుకుని నానా గందరగోళం చేసి, వాళ్ళని తిట్టి ఉద్యోగం మానేసి రావడం జరిగింది. దాంతో జగన్నాధం పరువుపోయినట్లయింది.
ఆ ఉద్యోగం వదిలిపెట్టేసరికి, బోసుబాబు మీద అందరికీ కోపం వచ్చింది.
ఒక మాటంటే తిరిగి నాలుగు మాటలంటాడు బోసుబాబు. అందువల్ల లక్ష్మణమూర్తి, సామ్రాజ్యలక్ష్మి అతని ఇంట్లోలేని సమయం చూసి, "గారాబమే వాడిని పాడుచేసింది. వాడు అడగంగానే మీరు డబ్బులిచ్చి చెడగొడుతున్నారు" అంటూ తన అక్కసు అంతా ప్రదర్శించేవారు.
ఒకందుకు ఇది కూడా నిజమే అనిపించింది జగన్నాధానికి నిక్షేపంలాంటి ఉద్యోగం వదులుకున్నదేకాక, యజమాని మీద ఎగిరిపడ్డాడు.
అంతక్రితం రోజు బోసుబాబు వంద రూపాయలు కావాలని అడిగాడు. ఇదివరకయితే నాలుగు మాటలని, జగన్నాధం డబ్బులు ఇచ్చేవాడు. ఎప్పుడైనా లక్ష్మణమూర్తి ఇచ్చిన సందర్భాలు కూడా వున్నాయి కానీ. ఇప్పుడు ఎవ్వరూ ఇవ్వలేదు.
పైగా బోసుబాబుతో ఖచ్చితంగా చెప్పేశారు "నువ్వు అరిచి గీ పెట్టినా ఇచ్చేదిలేదు" అని. బోసుబాబుకీ ఎంత కోపం రావాలో అంతా వచ్చింది.
కానీ తండ్రి తిట్టిన తరువాత ఇంట్లో ఎవరినీ అడుగలేదు. ఎవరి డబ్బులూ తీసుకోలేదు. చిన్న వెండిది గంధం గిన్నె తీసుకువెళ్ళి అది కుదువపెట్టి వందరూపాయలు తెచ్చుకున్నాడు.
ఇంట్లోవున్న వెండి గంధం గిన్నె మాయమయినట్లు ఎవరూ కనిపెట్టలేదు. బోసుబాబు ఆ ఉదయం పనిగట్లుకొని? భోజనం కూడా చేసిన తరువాత బయటకి వెడుతూ తను చేసిన పని దర్జాగా ఇంట్లో అందరికీ చెప్పి మరీ వెళ్ళాడు.
బోసుబాబుని పట్టుకొని తిడదామంటే ఎదురుగుండా లేకుండా వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో తెలియక లబ్బున నెత్తీ నోరూ కొట్టుకున్నారు ఇంట్లోవాళ్ళు.
బోసుబాబు దొంగతనాల దాకా వచ్చాడని వాళ్ళ అభిప్రాయం.
బోసుబాబుని మందలించాలా? ఈ తఫాకి వదిలేయాలా?
ఆ విషయం ఎటూ తేలని సమయంలో సుడిగాలిలా బోసుబాబు లోపలికి వచ్చాడు.
బోసుబాబుని చూడగానే అందరి నోళ్లూటక్కున మూసుకుపోయాయి. బోసుబాబు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. నిమిషంసేపు చూశాడు. ఎవరూ అతనితో మాట్లాడేటట్లు కనిపించలేదు. ఆఖరికి వాళ్ళల్లో వాళ్లు కూడా మాట్లాడుకోలేదు.
"అన్ని పార్టీలవాళ్ళూ ఏకమయినట్లున్నారు. ఒకే ఒక బలమైన పార్టీని పడగొట్టటానికి. అదీ నేనే కదూ!" బోసుబాబు అందరినీ కలయజూస్తూ ప్రశ్నించాడు.
ఎవరూ సమాధానం ఇవ్వలేదు అతని మాటలకి.
"నువ్వు కూడా ప్రతిపక్షంలో జేరిపోయావా, సుమిత్రా?" నవ్వుతూ అడిగాడు సుమిత్రని.