Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 30

    "నమస్తే" అప్రయత్నంగా కృష్ణచేతులు జోడించి నమస్కరించాడు.
   
    "డాడీ! వీరిని పోయినవారం మద్రాస్-ఢిల్లీ-ఫ్లయిట్ లో చూశాను" విమల కనురెప్పలు టపటపలాడిస్తూ తండ్రిని చూసి అంది విమల.
   
    "ఓ! ఐసీ! కృష్ణ ఎవరో కాదమ్మా. మీ బావగారే - మన సుధ భర్త."
   
    విమల ముఖంలో వచ్చిన మార్పును స్పష్టంగానే గ్రహించాడు కృష్ణ. ఆమె ముఖం రంగులు మారింది.
   
    ఏదో అర్ధమైనట్టు తలూపింది విమల.
   
    కృష్ణ కలవరపడ్డాడు.
   
    ఈమెనే తను విమానంలో చూశాడు.
   
    జగన్మోహన్ ప్రియురాలు "సుధాప్రియ" ఈమే అయి వుంటుందని భ్రమపడి పలకరించాడు.
   
    అందుకామె__
   
    "బావగారూ అక్కడే వాకిలికడ్డంగా నిలబడిపోయారు. ఇంట్లోకి రానివ్వరా ఏం?' విమల మృదువుగా అంది కొంటెగా చూస్తూ.
   
    ఆలోచిస్తున్న కృష్ణ ఉలిక్కిపడ్డాడు.
   
    ఏదో ఆలోచన - వెర్రాలోచన - తనమీదే తనకే చిరాగ్గా ఉంది.
   
    "ఓ! ఐయామ్ సారీ! ఏదో ఆలోచిస్తూ నిలబడిపోయాను" అంటూ మురళీకృష్ణ లోపలకు దారితీశాడు.
   
    విమల అతడ్ని అనుసరించింది.
   
    అప్పటికే రమణమూర్తీ, చౌదరీ డ్రాయింగురూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
   
    "సుధ ఎక్కడా కన్పించదేం?" ఇల్లంతా కలియజూస్తూ అడిగింది విమల.
   
    "గుడికెళ్ళింది" కృష్ణ చెప్పాడు.
   
    "గుడికా? మా సుధకు బావగారు పూజా పునస్కారాలుకూడా నేర్పారన్నమాట?"
   
    "నేను నేర్పలేదు. దేముడితో ఆమెకే అవసరమొచ్చింది. దేవుడితో మనిషికెప్పుడు అవసరమొస్తుందో మీకు తెలుసుననుకొంటాను."
   
    విమల బిత్తరపోయింది. సంభాషణ పొడిగించడానికి భయపడింది.
   
    "ఏం బావగారూ? ఆఫీస్ లేదా ఈరోజు? టైమయినట్టుందే?" అంది మాటమారుస్తూ.
   
    "బాస్ ఇక్కడే ఉన్నారుగా?" అంటూ చౌదరికేసి చూశాడు.
   
    "విమ్మీ! ఈరోజు మేమిద్దరం శెలవుపెడ్తున్నాం. అందరం కలిసి ఇవ్వాళ సరదాగా గడిపేద్దాం!" అన్నాడు చౌదరి.
   
    కృష్ణ బాస్ కేసి అదోలా చూశాడు.
   
    ఇదంతా ఏదో  పధకం ప్రకారమే జరిగిపోతున్నట్టుగా వుంది. హఠాత్తుగా మామగారొచ్చారు. ఆయనగారితోపాటు ఈవిడకూడా దిగింది.
   
    ఇదో పెద్ద కుట్ర!
   
    మోసం!
   
    "ఎంతసేపయిందీ మీరొచ్చీ!" లోపలకొస్తూ సుధ విమలను చూస్తూ ప్రశ్నించింది.
   
    సుధ వీళ్ళని చూసి ఆశ్చర్యపడలేదు.
   
    మామూలుగా, తాపీగా అడిగింది.
   
    అంటే దీని అంతరార్ధం?
   
    ఆమెకు వీళ్లొస్తున్నట్టు ముందే తెలుసునన్నమాట! వాళ్ళు వచ్చేంత వరకూ తను కావాలనే గుడిదగ్గర ఉండి వచ్చిందన్నమాట!
   
    తను నిలదీసి అడిగేసరికి, అందరినీ పిలిపించుకొంది. తనమీదకు అందరినీ ఊకుమ్మడిగా తోలుతూంది. ఇంతయాక ఇంకా తనకు భార్యగా ఉండాలనే అనుకుంటూందా?
   
    ఇంతకీ వీళ్ళందరూ తననేమనుకుంటున్నారు?
   
    తనని వెర్రివాడిగా భావిస్తున్నారా?
   
    పిచ్చివాడనుకొంటున్నారా?
   
    "కృష్ణా! ఆఫీస్ కు ఫోన్ చేసి మనిద్దరం ఈరోజు రావడంలేదని చెప్పు."
   
    చౌదరి గొంతు వింటూనే కృష్ణ ఒక్కసారిగా తన ఆలోచనలనించి త్రుళ్ళిపడ్డాడు. అనంతంగా సాగిపోతున్న ఆలోచనలను అదుపులో పెట్టుకొంటూ ఫోన్ దగ్గిరకు నడిచాడు.
   
                                             21
   
    "ఢిల్లీ తీసికెళ్ళడమే మంచిదనుకొంటాను" డాక్టర్ చౌదరి సాలోచనగ అన్నాడు.
   
    "డాక్టర్ భాటియా అవసరమైతే తనే వస్తానన్నాడు. సైకియాట్రిస్టు హేమచందర్ అతని శిష్యుడేనట. చాలా సమర్ధుడట. అతను చూస్తే, తను చూడక్కర్లేదన్నట్టే మాట్లాడాడు డాక్టర్ భాటియా. డాక్టర్ హేమచందర్ కు లెటర్ ఇచ్చాడు. తను ఫోన్ లో మాట్లాడతానన్నాడు? ముందు హేమచంద్రకి చూపిద్దాం పైగా ఢిల్లీ రావడానికి కృష్ణ ఇష్టపడతాడో లేదో?" సందేహాన్ని వెలిబుచ్చాడు రమణమూర్తి.
   
    "ఆమాటకొస్తే ఇక్కడ హేమచంద్ర దగ్గిరకు వస్తాడని నమ్మకం మాత్రం ఏమిట్రా రమణా?" అన్నాడు చౌదరి.
   
    "ఓసారి చెప్పిచూద్దాం. రాకపోతే చేసేదేముంది? బలవంతంగా తీసికెళ్ళాల్సిందే!" అన్నాడు రమణమూర్తి పోలీసాఫీసరు ధోరణిలో.
   
    "బలవంతం చేస్తే మొదటికే మోసమొస్తుందేమో చూడు. ఇప్పటికే నీమీద చాలా కసిగా వున్నాడు."
   
    "అయితే నువ్వు నయానో, భయానో చెప్పిచూడు. మరీ మొరాయిస్తే తప్పేదేముంది,"
   
    ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. చౌదరి లేచి తలుపు తెరిచి బయటికొచ్చాడు.
   
    ఇద్దరు దృఢకాయులు 'టప్' మంటూ సాల్యూట్ చేసి నిలబడ్డారు.
   
    ఎవరు కావాలన్నట్టు చౌదరి వాళ్ళకేసి చూశాడు.
   
    "డి. సి. పి, సాబ్ పంపారు సార్!" అందులో ఒకడన్నాడు.
   
    "డి. సి. పి, పంపాడా? ఎందుకూ?"
   
    "యస్సీసాబ్ ను కలవమన్నారు."
   
    చౌదరి గిర్రున తిరిగి లోపలకొచ్చి ఆ విషయం రమణమూర్తితో చెప్పాడు.
   
    "నేనే పంపించమన్నాను. డి. సి. పి. రామయ్యకు ఫోన్ చేశాను."
   
    "ఎందుకూ?"
   
    "కృష్ణ మొండికేస్తే వీళ్ళ అవసరం ఉంటుందేమోనని!"
   
    చౌదరి నివ్వెరపోయి రమణమూర్తికేసి చూశాడు
   
    "ఏమిట్రా అలా చూస్తావ్? పిచ్చివాడి బలంగురించి నీకు తెలియదు. వాళ్ళని లొంగదీయాలంటే కనీసం నలుగురైనా కావాలి."
   
    "ఛ! ఛ! కృష్ణ మరీ అంత పిచ్చివాడు కాలేదు. ఏదో కొద్దిగా మతి అదే-ఏదో భ్రమలో...."
   
    "ఒరేయ్ చౌదరీ! ఆపరాబాబూ! నువ్వు కెమిస్ట్రీలో డాక్టర్ వు. సైకాలజీ అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావ్!"
   
    "నువ్వెందులోనూ డాక్టర్ కావు. వట్టి పోలీసువాడి ఆలోచన. లాఠీ తిప్పడంకంటే మరోటి తెలియదు. ఏదో ఉపాయంతో  సైకియాట్రిస్టు దగ్గిరకు తీసుకెళ్ళాలి. అంతేకాని బలవంతంగ లాక్కెళ్ళతావట్రా?"
   
    రమణమూర్తి గుబురు మీసాలకిందగా తెల్లటి పళ్ళు మెరిసాయి.
   
    బిగ్గరగా నవ్వుతూ లేచి నిలబడ్డాడు.
   
    "అల్లుడు తనంత తను వస్తే ఇబ్బందేలేదు. అవసరమైతేనే వాళ్ళని ఉపయోగిద్దాం. పోలీసోళ్ళంటే పెద్ద దురభిప్రాయం ఏర్పడిపోయిందిరా ఈదేశంలో. సుధ నా కూతురుకాబట్టే కృష్ణకు ఈ జాడ్యం పుట్టిందేమో? పోలీసువాళ్ళంటే జారులు, చోరులు, తడిబట్టలతో గొంతులు కోసేవాళ్ళు అనే అభిప్రాయం ప్రజల్లో ప్రబలిపోయింది-"
   
    "అవున్రా రమణా! చాలావరకు నిజమేమరి!"
   
    "రీసెర్చి మానేసి అతిగా వార్తాపత్రికలు చదువుతున్నట్టున్నావ్?" బలమైన రమణమూర్తి కంఠం గుర్రుమంది.
   
    "అవున్రా! ఈ ముప్పయ్ ఏళ్ళగా ప్రజల విశ్వాసాన్ని పొందడానికి మీరు చేసిందేమిటో కాస్త చెప్పు? తెల్లారి లేస్తే పేపర్లలో చదివేది అక్రమాల గురించిన వార్తలే గదా? యాంటీసోషల్ ఎలిమెంట్స్ - క్రిమినల్స్ - బందిపోట్లు కలిసి ఎన్ని అక్రమాలూ, దౌర్జన్యాలూ చేస్తున్నారో, అన్నీ మీ వాళ్ళు చేస్తున్నారు. రానురాను మీదే పైచెయ్యిగా ఉంది. కళ్ళు పీకేస్తున్నారు. నిలువునా కాల్చివేస్తున్నారు. సంఘవిద్రోహులు, అవినీతిపరులు, బందిపోట్లు, జారులు, చోరులు-వీళ్ళతోనేగా మీ రోజువారీ సంబంధం? వాళ్ళ మనస్తత్వమే మీకు వచ్చిందేమోనని నా అభిప్రాయం,"
   
    "ఉపన్యాసం అయిందా? ఇలా రోజూ మాగురించి రాసేస్తూనే ఉన్నారుగా? ఎసెంబ్లీలలో, పార్లమెంటులో మా దౌర్జన్యాలను ఏకరువు పెడుతూనే ఉన్నారుగా? అందువల్ల ఏమైనా మార్పు పోలీసు బలగాల్లో వచ్చిందంటావా?"
   
    "మార్పు రాకపోగా, ఇంతకుముందు చాటుమాటుగా చేసే పనులు ఇప్పుడు బహిరంగంగానే చేస్తున్నారు" మధ్యలోనే అందుకొని అన్నాడు చౌదరి.
   
    "కరెక్ట్! అందువల్ల ప్రయోజనం లేనప్పుడు ఈ కంఠశోష ఎందుకూ?"

 Previous Page Next Page