"చివరిసారిగా అడుగుతున్నాను_ ఎవరు మీరు?" గర్జించాడు కమాండరు.
"మా స్థావరానికి ఎందుకు వచ్చారు?" ఆషాను సూటిగా చూస్తూ గద్దించాడు.
"ప్లీజ్ ! నా మాట నమ్మండి....నేను యూనివర్శిటీలో రీసెర్చ్ స్కాలరును. నా సబ్జెక్టు క్రిమినాలజి. నేను పోలీస్ ఆఫీసరును కానేకాదు...." భోరున విలపించింది ఆషా.
"డోంట్ టెల్ మి కాక్ అండ్ బుల్ స్టోరీస్!" కమాండరు మరొక అడుగు ముందుకు వచ్చాడు.
"ఆషాను ఏమీ చేయకండి! ఆమె ఆడపిల్ల. అబల ఆమె శీలాన్ని కాపాడండి! స్త్రీని గౌరవించండి! మీ కోపం కక్ష ప్రతీకారం నా మీద! నేను పోలీస్ ఆఫీసరును కాను మొర్రో అన్నా మీరు నమ్మడం లేదు. నిరూపించుకోవడానికి నా దగ్గర ఏ ఆధారమూ లేదు....ఆమెను ఏమీ చేయకండి....ప్లీజ్....ఆమెను వదిలేయండి...." గొంతు పెకల్చుకుని అరుస్తున్నాడు కిరణ్ కుమార్. శక్తిని కూడగట్టుకుంటున్నాడు.
"వెల్ మిస్టర్, వెల్ సెడ్! ఆడదానికి శీలం ప్రాణం కంటే ఎక్కువనేగా నువ్వనేది! ఆ....! ఆ ఒక్క బలహీనతే చాలు_ ఈమెచేత నిజం చెప్పించడానికి! కాని, స్త్రీ శీలం జోలికి పోవడం మా సిద్దాంతం కాదు! అయినా, మాకు నిజం కావాలి, ఆ నిజాన్ని ఈమె నోటే ఎలా కక్కిస్తానో చూడు!" హేళనగా నవ్వాడు కమాండరు.
ఒక సాయుధుడు సల్ ఫ్యూరిక్ యాసిడ్ సీసాను కమాండరుకు అందించాడు.
"న్నో....నో...." ప్రాణ భీతితో గావు కేకలు పెడుతున్నది ఆషా.
ఇంటరాగేషన్ లో క్రూడ్ మెథడ్స్ ను సాధారణంగా విదేశీ శత్రువుచేత రహస్యాలను చెప్పించడానికి, ఆరితేరిన నేరస్తులనుంచి నిజం కక్కించడానికి ప్రయోగిస్తుంటారు. కాని అబల అసహాయరాలు, బందీగా వున్న యువతిని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంగా టెర్రరిస్టులు క్రూరాతి క్రూరంగా హింసిస్తూ తన నికృష్ట విధానాన్ని అమలుపరచడానికి వెనుకాడడం లేదు.
స్త్రీకి శీలం ఒక్కటి మాత్రమే ప్రధానం కాదు. సౌందర్యాన్ని సయితం అంతగానూ వారు పరిరక్షించుకుంటారు. అటువంటిది....అటువంటిది....
సీసా మూత తీశాడు కమాండరు....
ఆషా కళ్ళలో నీలినీడలు. ఆమె కళ్ళు బయర్లుకమ్ముతున్నాయి.
కమాండరు సీసాను ఆషా ముఖంమీదకు విసరడానికి చేయి ఎత్తాడు.
అదే క్షణాన....
"ఆగండాగండి....!"
కేకలేసుకుంటూ రొప్పుతూరోజుతూ పరుగెత్తుకొచ్చా డొక సాయుధుడు.
ఆగిపోయాడు కమాండరు. ఏమిటన్నట్టు విసుగ్గా చూశాడు.
ఆ రోజుటి వార్తా పత్రికను తీసి, అందులోని ఒక ప్రకటనను కమాండరుకు చూపాడు సాయుధుడు.
ప్రకటనతో పాటు ఆషా ఫోటో కూడా వున్నది!
"ఈ ఫోటోలోని యువతి యూనివర్శిటీ హాస్టలు నుంచి కనిపించకుండా పోయింది. ఈమె ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయగలరు.
__స్పెషల్ ఆఫీసరు, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, ఖార్ఖాన, సికిందరాబాద్."
పేపరులోని ఫోటోను, ఆషాను మార్చి మార్చి చూశాడు కమాండరు.
"ఆమెను వదిలేయండి!" సౌమ్యంగా చెప్పాడు.
ఆమెనే మరల మరల సూటిగా చూస్తూ చెప్పాడు.
బంధవిముక్తురాలు అయింది ఆషా.
పేపరును అందించాడు కమాండరు. ప్రకటన చదివిన ఆషా ముఖం విప్పారింది.
"ఎస్_నేనే, నాదే ఈ ఫోటో! చూశారా, నేను మొత్తుకుంటూనే వున్నానా? ఇప్పటికైనా నన్ను నమ్మండి, ప్లీజ్...." బొటబొటా కన్నీరు కార్చింది ఆషా. స్వరం సన్ననయింది.
"కాని...." కమాండరు క్షణం సంశయించాడు.
"నువ్వు రిసెర్చ్ విద్యార్దినివి. మాతో ఏం అవసరం నీకు? మాతో చేతులు కలపడం అంటే అంత తేలికైన విషయం అనుకున్నావా? మా సిద్ధాంతాలలో విభేదించే వారి నెవ్వరినీ మేం స్పేర్ చేయం, తెలుసా? పక్కలో బళ్ళేలను అసలే సహించం!"
"నేను....నేను....బళ్ళాన్ని కాను...."
క్షణం ఆగి, ఆమె ముఖంలోకి చూశాడు. ఆ ముఖంలో ఏ విధమైన ఫీలింగ్స్ లేవు!
ఈ పిల్ల ఇప్పుడొక సమస్య అయింది కమాండరుకు!
"పెళ్ళికాని పిల్లవు. మా మధ్య స్వేచ్చగా తిరగలేవు. దోపిడీలు, హత్యలు మాకు నిత్యకృత్యాలు. కిడ్నాప్ లు చేయాలి. నువ్వివన్నీ చేయలేవు. ప్రభుత్వానికి ఎదురుతిరిగి మా ఉద్యమంలో ఉద్యమిస్తే ఏం జరుగుతుందో తెలుసా! కనిపిస్తే కాల్చిపారేస్తారు పోలీసులు. అరష్టయితే కోర్టు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగారవాస శిక్ష విధిస్తుంది తెలుసా? తిరిగి రిసెర్చ్ అంటూ ప్రజల మధ్యకు ఎలా వెళ్ళగలవు?"
కమాండరు ఏవో ఏవో చెప్పుకుపోతున్నాడు.
అవేవీ ఆమె బుర్ర కెక్కడం లేదు. స్థిరంగా, ఆవేశంగా చెప్పింది: "ఎస్, కమాండరు! మంచి, చెడులన్నీ ఆలోచించే నేనీ నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయానికి తిరుగులేదు. ప్రభుత్వం నన్ను దేశ ద్రోహి అని చిత్రించినా, న్యాయస్థానాలు యావజ్జీవ కారాగారవాస శిక్ష విధించినా, చివరకు పోలీసులు కాల్చి చంపినా నేను మారను. నా ధ్యేయం నెరవేరేవరకు ఎన్ని కష్టనష్టాలనైనా ఆనందంగా అనుభవిస్తాను. పరిశోధన కోసం వచ్చిన నేను మీ సిద్ధాంత ప్రభావాలకు పూర్తిగా స్పందించాను, మీతో కలిసిపోతున్నాను! ఉద్యమం నా ఊపిరి...."