"దూరంగా వెళ్ళి మాట్లాడండి" అవంతి గట్టిగా అరిచింది.
"అది కాదు అపర్ణా!" ఇందర్ ఏదో చెప్పబోయాడు.
"నాకు మసిబూసి చూపే మారేడుకాయ కబుర్లు చెప్పవద్దు. నేను గాఢనిద్రపోతున్నానని తలచి నెమ్మదిగా వచ్చి నా మంచం మీద కూర్చుని నన్ను....నన్ను."
"అదికాదు అపర్ణా! అసలేం జరిగిందంటే!"
"అబద్ధాలు చెప్పవద్దు. మనసులో దురుద్దేశం పెట్టుకుని సమయము చూసి....
"కాదు.... కాదు.... కాదు...."
"ఉహూ.... మీరు మొదటినుంచీ అందమైన అమ్మాయివంతూ నాతో ప్రతి మాటకీ అనటమే. నేను మంచివాడినని చెపుతూ చివరికి ఈరోజు.... నేను గాఢనిద్రలో ఉండడం చూసి"....
ఇందర్ ఒక్కంగలో అవంతిని సమీపించి అవంతి భుజాల మీద చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. అవంతి అతన్ని నెట్టేసింది దూరంగా నెట్టబోయింది. పట్టు బలవంతాన అతని కబంధ హస్తాల నుంచి తప్పించుకోవడం అసాధ్యమే అయింది. అవంతికి ఒక్కసారిగా భోరున ఏడ్వాలనిపించింది. మంచి శిక్షణ పొందిన అవంతి లిప్తపాటులో తనని తానే కంట్రోల్ చేసుకుని శిలలా నుంచుండిపోయింది. ప్రత్యర్ధిని చావుదెబ్బ తీసేముందు శరీరానికి మనసుని అదుపులోకి తెచ్చుకొని రెడీ అయే తీరు అది.
ఇదేం తెలియని ఇందర్ అవంతిని అలాగే పట్టుకొని "అపర్ణా! ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఆలోచించు. నీవు ఇక్కడి వచ్చి మూడురోజులు అయింది. నిన్నుముట్టుకునే ప్రయత్నం ఒక్కసారి అయినా చేశానా! అందంగా వున్నావు కాబట్టి నా మనసులో మాట అందంగా వున్నావంటూ బైట పెట్టాను. అదేగా నేను చేసిన నేరం. నీ అందం నీకు తెలియదు అపర్ణా! ఉత్త అమాయకురాలివి. ఇదే మరొక అమ్మాయి అయితేనా ఫోజు కొట్టేది. అణువణువునా గర్వంతో అడుగుడుగునా విర్రవీగుతూ వుండేది"....
ఇందర్ అంటుంటే వినటానికి ఇంపుగానే ఉంది. అవంతి జీవితంలో ఇంతకుమించిన పొగడ్తలు చాలానే వింది, పొగడ్తకి పొంగిపోక పొగడ్తకి కృంగిపోక మంచి శిక్షణ పొందిన విద్యార్ధినిలా కర్తవ్యము తెలిసి కరెక్ట్ గా మెలిగే బాధ్యతగల సైనికుడిలా అన్నింటికీ అతీతంగా మెలిగేది.
ఇందర్ మనసులోతుల్లోకి తొంగి చూడటానికి ఈ మూడు రోజుల్లో ప్రయత్నించింది. నగల విషయం మాట్లాడినప్పుడు అతని కళ్ళు ఎంతగా తళతళలాడాయి! తనకి బాగానే అర్ధమైంది. మాటల్లో రవంత అధికారం, చనువు చూపించడం తను గ్రహించుకుంది. తనని అంచనా వేస్తున్నట్లు నఖశిఖ పర్యంతం చూస్తూ వుండేవాడు. తను అతన్ని చూడంగానే కంగారుగా చూపులు తిప్పుకునేవాడు. తప్పుచేసినట్లు ఆ కంగారు దేనికట....
తనని అతను మర్యాదగా వదలకపోతే పిడుగులాంటి ఒకేఒక ముష్టిఘాతం మెడమీద వేద్దామనుకుంది. రెడీ అవుతూ పిడికిలి బిగించింది. ప్రత్యర్ధిని మెలుకువగానే చావుదెబ్బ తీసే మంచి పద్ధతి. చాలా తేలికైన మార్గం అది. ఆ దెబ్బతిన్న తర్వాత అతను తన్ని అనుమానిస్తే! అందుకే అవంతి ఆలోచిస్తూ పిడికిలి బిగించింది.
"....నీకేదో భయంకరమైన పీడకల వచ్చింది. నీవు నిద్రలో ఏడ్చే తీరునిబట్టి గ్రహించాను. గట్టిగా పిలిచి లేపినా నీవు లేవలేదు. నీ పక్కనే మంచంమీద కూర్చుని నిన్ను లేపటానికి భుజంమీద చేయి వేశాను. నీవు లేస్తూనే నామీద వాలిపోయావు. అది నా తప్పా అపర్ణా పోనీలే తప్పు నాది. కలలో నిన్నెవరైనా తరుముతుంటే భయపడ్డావా! లేక నీ ఆప్తురాలు మీ బుచ్చికక్కి మీద వచ్చిందా!" అవంతి భుజం పట్టుకుని కుదుపుతూ ఇందర్ అడిగాడు.
అవంతి బిగించిన పిడికిలి చటుక్కున వదిలేసింది "అవును. స్వప్నం సుకుమార సుందరమైంది కాదు. అతి భయంకర స్వప్నం అది.... అది."
అవంతి కళ్ళు విపరీతంగా చలించడం చూసిన ఇందర్ "ఏమైంది అపర్ణా!" అన్నాడు గాభరాగా.
అవంతి మాట్లాడలేదు. శరీరం చల్లగా అయింది. శరీరమంతా ముచ్చెమటలు దిగజారుతుంటే అయోమయంగా పిచ్చిగా చూస్తూ నిలబడలేనట్లు తూలింది.
ఇందర్ చటుక్కున అవంతిని పొదివి పట్టుకుని చేతులమీద తీసుకువస్తున్నట్లు నడిపిస్తూ మంచం దగ్గరకు వచ్చి అవంతిని మంచం మీద కూర్చోబెట్టాడు.
అవంతి మంచంమీద వాలిపోయినట్లు పడిపోయి దిండులో ముఖం దాచుకుంది.
ఇందర్ ఒక్క నిమిషం అవంతిని అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత వెళ్ళి కప్పు నిండుగా వేడికాఫీ పట్టుకుని వచ్చాడు.
"అపర్ణా! అపర్ణా!" మంచం పక్కనే నుంచుని మృదువుగా పిలిచాడు ఇందర్.
అవంతి మాట్లాడలేదు.
ఇందర్ అవంతి పక్కనే మంచంమీద కూర్చుంటూ "అపర్ణా!" అన్నాడు. ఒక చేతిలో కాఫీ కప్పు వుండడంవల్ల రెండో చేతిని అవంతి భుజంమీద వేశాడు.