Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 29


    "పోనీలెండి....ఏదో ఒకటి. ద్యోగం పురుష లక్షణం కదా!" అంది అవంతి.

    "ఈ పిల్లకి ప్రపంచమే తెలియదు. నేనేం చెప్పినా నమ్ముతుంది. అదీ ఒకందుకు మంచిదే. అప్పుడప్పుడు అతితెలివి తేటలు ప్రదర్శించి నా ఇలాంటి అమాయకురాలిని దారికితేవటం బహు తేలిక" ఇందర్ ముందాలోచన చేస్తూ అనుకున్నాడు.

    "ఆంజనేయుడి ముందు కుప్పిగంతులుటరా బిడ్డా! ఈ అవంతి చేసే జాబ్ ఏమిటో ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే నాముందా నీ కాకమ్మ కబుర్లు! కానియ్యి నేనెక్కడికి పోతాను. నీవెక్కడికి పోతావ్?" అనుకుంది అవంతి.

    గజదొంగ పోలీసువాడు ఒక ఇంట్లో కాపురం చేస్తే ఎవరిది పై చేయి అవుతుంది?

    తీర్పు చెప్పాల్సింది కాలమే.


                          *    *    *


    అవంతి ఎప్పుడు మాట్లాడినా ఇందర్ పది అడుగుల దూరాన నుంచుని మాత్రమే మాట్లాడుతున్నది.

    ఇందర్ ని మొదట్లోనే అనుమానించింది అవంతి. అందుకే బహుజాగ్రత్తగా అతనితో వ్యవహరిస్తున్నది. ఇందర్ ఇంట్లో లేనప్పుడు ఆ రెండు గదుల్లో ఉన్న అన్ని సామానులనీ పరీక్ష చేసింది. బరువుగా ఉన్న ఒక పెద్దపెట్టె తప్ప. దానికి తాళం వేసివుంది. లేకపోతే దానిలో భద్రపర్చబడిన విలువైన వస్తువులని శల్య పరీక్ష చేసేదే.

    అవంతి వచ్చిం తరువాత మొదరిసారి బైటికి వెళుతూ అవంతితో లోపల గడియ వేసుకోమన్నాడు ఇందర్.

    తను లోపల గడియ వేసుకుంటే ఎవరైనా వచ్చి తలుపు తడితే తను తీయాలి. అది ప్రమాదం తన వునికి కొత్తవాళ్ళకి తెల్సిపోతుంది, అలా అని ఇందర్ తో చెపితే తను బైట పడిపోతుంది. కనుక....అవంతి తెలివిగా ఆలోచించి ఇందర్ తో అంది.

    "అలాగే లోపల గడియ వేసుకుంటాను. ఎవరైనా వస్తే మీరు ఎక్కడికి వెళ్ళారని చెప్పను! వచ్చిన వాళ్ళని లోపలికి వచ్చి కూర్చోమని చెప్పనా లేక మళ్ళీ రామ్మననా?"

    ఇందర్ కాస్త ముందుచూపుతో ఆలోచించాడు. అవంతికి కావాల్సిందీ అదే.

    "సాధారణంగా మాకోసం ఎవరూ ఈ ఇంటికి రారు. ఓ వేల ఎవరో ఒకరు వచ్చారే అనుకో. వాళ్ళేవరో నీకు తెలియక నీవెవరో వాళ్ళకి తెలియక మరోరకంగా అనుకుంటే లేనిపోని చిక్కు. పోనీ ఓ పనిచేస్తాను. బైట తాళం వేసుకొని వెళతాను. ఎలాగూ నీవు బైటికి రావు కదా!"

    "ఆ....అలా చేయండి బాగుంటుంది. నా కసలే భయం కొత్త వాళ్ళతో ఏం మాట్లాడాలో ఏమిటో!"

    దాంతో ఒక ప్రాబ్లం తీరిపోయింది ఇరువురికీ.

    ఇందర్ బైటికి వెళ్ళేటప్పుడు బైట తాళం వేసుకొని వెళ్ళేవాడు. అవంతి నిర్భయంగా ఆ రెండు గదుల్లో తిరిగేది.

    ఇందర్ టిఫిన్ బైట నుంచి తెచ్చేవాడు. కాఫీ, భోజనం ఇంట్లో తయారు చేసేవాడు.

    ఉదయం లేచి అరగంట అయింది. కాఫీ తయారు చేసి ఓసారి తాగడం కూడా అయింది. అవంతి లేవలేదు. అవంతిని లేపాలి ఎలా? ఇందర్ ఆలోచిస్తున్నాడు.

    అవంతి తెలివిగా కొన్ని కండిషన్లు పెట్టింది మొదట్లోనే.

    అవంతి మంచంమీద పడుకుంటే మంచానికి దూరంగా కింద పడుకోవాలి ఇందర్. తనకి దగ్గరగా రాకూడదు. పిచ్చి వేషాలు వెయ్యకూడదు. అలాంటివే మరికొన్ని....

    అవంతి పేరు అపర్ణ అనుకుంటున్న ఇందర్ మంచానికి కాస్తా దూరంగా నుంచుని "అపర్ణా! అపర్ణా!!" అని పిలిచాడు.

    అవంతి కదలలేదు.

    మళ్ళీ మళ్ళీ పిలిచి ఇంకా విసుగు చెందడంతో ఇందర్ వెళ్ళి కుర్చీలో కూర్చుని కళ్ళార్పకుండా అవంతిని చూస్తూ వుండిపోయాడు. ఇందర్ అవంతిని ఎన్నిసార్లు చూసినా సింపుల్ గా వాయిల్ చీర కట్టుకున్నా ప్రస్తుతం ఎదురుకుండా ఉన్న రూపం కనిపించడం లేదు. అలిసిపోయిన కళ్ళతో వాడిపోయిన మోముతో ఉన్న అందమైన పెళ్ళికూతురు అలా అలా అలా కనిపించేది. మళ్ళీ మళ్ళీ చూడాలనే రూపంతో.

    ఇందర్ కొద్దిసేపు అవంతిని చూస్తూ ఉండిపోయాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న అవంతి ముఖంలో ఏవేవో భావాలు కదలాడుతున్నాయి. చివరికి నిద్దట్లోనే అవంతి ఎక్కి ఎక్కి ఏడ్వటం మొదలుపెట్టింది.

    ఇందర్ కుర్చీలోంచి  గాభరాగా లేచి అవంతి మంచం దగ్గరకు వచ్చి "అపర్ణా! అపర్ణా!!" అంటూ పిలిచాడు. అవంతి లేవకపోగా ఇంకా ఎక్కి ఎక్కి ఏడ్వటం మొదలు పెట్టింది.

    ఇందర్ చటుక్కున అవంతి పక్కనే మంచంమీద కూర్చుని అవంతి చేయిపట్టుకొని కదుపుతూ "అపర్ణా! అపర్ణా!! లేలే....ఏదైనా పీడకల వచ్చిందా!" అన్నాడు.

    అవంతి నిద్ర మెలుకువకాని స్థితిలో పైకి లేచి ఇందర్ మీద వాలిపోయి ఇందర్ ని దట్టిగా పట్టుకొని ఏడ్వటం మొదలు పెట్టింది. ఇందర్ "ఊరుకో.... ఊరుకో" అంటూ ఊరడిస్తూ అవంతి తల నిమిరాడు.

    అతుక్కున్నంత దగ్గరగా ఒకరికొకరు. అవంతిని తనకు తానే తెలియకుండా దగ్గరకు హత్తుకున్నాడు ఇందర్.

    అవంతికి మెలుకువ వచ్చింది. అలాగే ఉండిపోయి అరక్షణం మాత్రమే ఆలోచించింది. తను ఎక్కడ వుందో తెలుసుకోంగానే చటుక్కున పైకి లేచి మంచం మీద నుంచి ఒక్క దూకు కిందకి దూకింది. దోసిట్లో ముఖం కప్పుకుని ఏడ్వటం మొదలు పెట్టింది.

 Previous Page Next Page