అవంతి విసురుగా పైకిలేచింది. లేస్తూనే "లేవండి ముందు...." అంటూ గర్జించినట్లు ఒకే ఒక అరుపు అరిచింది.
ఇందర్ స్ప్రింగ్ లా పైకి లేచి నిలబడ్డాడు.
అవంతి రోదిస్తున్న భద్రకాళిలా వుంది.
"ఏమిటి మీ ఉద్దేశ్యం?" అవంతి తీవ్రంగా అడిగింది.
"ఉద్దేశ్యమా!" ఇందర్ నవ్వుతూ అడిగాడు.
"అవును....చెడు ఉద్దేశ్యం. ఎర్రగా బుర్రగా వాంటెడు నగలతో లక్షలకి అధికారిణి అయిన అమ్మాయి జీవితంలో ఏ మగాడికి తారసపడినా వాడిలో రాక్షసుడు, పశువు ఇంకా చాలా వచ్చి వెర్రెక్కిపోయినట్లు తయారవుతాడు.
"అది కాదు అపర్ణా!"
"నాకేం చెప్పొద్దు. నాకు కలవస్తే నీకెందుకు. మరోకటి అయితే నీకెందుకు. నిద్రపోతున్నా కదా అని దొంగలా మంచంమీద కూర్చుని పిల్లిలా చల్లగా చేసేసి చేసి అబద్ధాలు చెప్పంగానే సరిపోయిందా! మాటకు ముందు భుజాలమీద చేతులు వేస్తూ దగ్గరకు తీసుకుంటూ చెడు కోరికతో కావాలని ఎక్కడెక్కడో చేతులు వేస్తూ...." ముందు ముందు ఇందర్ తనతో తగు జాగ్రత్తగా వుండటానికి కావాలనే ఆ మాట అంది అవంతి.
"అపర్ణా" ఇందర్ అరిచాడు.
"నాకు తెలుసు, మీరు....మీరు....మోసంతో నన్ను లోబర్చుకుంటే నేను, నా నగలు మీకు దక్కుతాయి."
అవంతి అంతా అయోమయం అయింది. పెదవి చురుక్కుమనటంతో 'అబ్బా' అంది.
అవంతి బాధాపూరిత స్వరం వినగానే ఇందర్ కి మత్తు దిగిపోయినట్లయింది. చటుక్కున అవంతిని వదిలేసి ఎవరో తరుముతున్నట్లు బైటికి పారిపోయాడు.
తలుపు వెయ్యలేదని ఇందర్ కి గుర్తుకొచ్చి. ఆ తలుపుకింది గడియ ఎత్తుపట్టి గట్టిగా లాగితే లోపల గడియ పడుతుంది. అలా గడియ బైటనుంచే వేసి వెళ్ళిపోయాడు.
అవంతి మళ్ళీ మంచానికి అడ్డంగా పడి దిండులో ముఖం దాచుకుంది.
* * *
అవంతి ఆలోచనలు పరిపరి విధాల సాగుతున్నాయి. ఇందర్ బైటికి వెళ్ళి గంట అయింది.
వెచ్చవెచ్చని కన్నీళ్ళు మొత్తం ఖర్చుకాగా అవంతి కొద్దిసేపు తర్వాత స్తిమితపడి లేచింది. గదిలో ఓ పక్కనంతా కాఫీ. పగిలిన కప్పు తాలూకు పెంకులు చిందరవందరగా పడివున్నాయి. రెండు నిమిషాలలో ముఖం కడుక్కు వచ్చింది. ప్లాస్కులో రెండోసారి ఇరువురూ తాగటానికి రెండు కప్పుల కాఫీ ఇందర్ పోసి వుంచాడు. ఆ రెండు కప్పుల కాఫీ ఒక్క చుక్క మిగలకుండా తాగేసింది. అప్పటికి ప్రాణం కాస్త తెరిపిన పడ్డట్టయింది. తడిగుడ్డతో కాఫీని తుడిచి పెంకులు ఎత్తి చెత్తవేసే పాత బొక్కెటలో పారేసింది. పక్క దులిపి సరిచేసింది. వచ్చి రిలాక్స్ అవుతూ కుర్చీలో కూర్చుంది.
"ఇందర్ మోసగాడో, దొంగో తనకనవసరం. ఇతని ఇంట్లో వుంటూ అతను పెట్టింది తింటూ నిర్భయంగా ఇక్కడ దాక్కుంది తను. ఈ చుట్టుపక్కల తనకోసం ఆ సురేంద్ర ముఠావాళ్ళు మాటు వేసి వుండవచ్చు. వాడి చేతికింద నున్నవాళ్ళంతా అసురగణం లాంటి వాళ్ళు. తను ఇప్పుడు డ్యూటీలో వుంది. న్యాయంగా అయితే తను ఎక్కడ వుందీ ఎం.ఆర్ బ్రాంచీకి తెలియజేయాలి. బైటకి వస్తేచాలు తన దగ్గర వుంచుకోవాల్సిన మారణాయుధం వాకీటాకీ, స్పెషల్ మెసేజ్ ఎస్.టి.ఎస్.టి. ఏదీ తన తనదగ్గరలేదు. వారంరోజులన్నా తను అజ్ఞాతవాసంలో తలదాచుకోడం మంచిది. తొందరపడి సరాసరి వెళ్ళి వాళ్ళ వలలో చిక్కుకుంటే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. అలాంటి తెలివితక్కువ పనులు తను ఎప్పుడూ చేయదు.
కనుక....ఇక్కడ వుండటం సర్వత్రా క్షేమం. తనకి భయంకరమైన పీడకల వచ్చినమాట నిజమే. ధైర్యానికి మారుపేరు అయిన తను పీడకలకి వెరవటమా! తను నిజంగా కలలో భయపడింది. ఏడ్చింది. ఇందర్ చెప్పింది నిజమే. పిలిచి వుంటాడు. ఎంతకి పలక్కపోయేసరికి మంచంమీద పక్కనే కూర్చుని వుంటాడు. తను అతన్ని గట్టిగా పట్టుకొని అతనిమీద వాలిపోయి ఏడ్వడం ఏమిటి? ఛీ.ఛీ.
పోనీ అక్కడితో ఊరుకుందా. అతని కళ్ళలోని కొత్త కాంతి ప్రేమగా చేరువ అయ్యే ఉద్దేశ్యంతో "అపర్ణా!" అంటూ తేనెలూరు పిలుపు. దాంతో వళ్ళుమండి, ఇంకెప్పుడూ తనజోలికి రాకుండా వుండటానికి అతన్ని దూరంగా వుంచటానికి ప్లాను వేసి కటినంగా మాట్లాడింది. అది తిప్పికొట్టింది. అలా మాట్లాడితే రెచ్చగొట్టినట్లు అవుతుందని తన బుర్రకి తట్టలేదు. మగాడి మోటు హృదయానికి తెలిసింది. ఒక్కటే అచ్చోసి వదిలిన ఆంబోతులా అమాంతం మీదకు వచ్చాడు.
ఆపైన అవంతి ఊహించలేక బలంగా విసురుగా తల విదిలించింది. చేత్తో నెమ్మదిగా పెదవి తడుముకుంది. పొంగిన పెదవిగాటు అబ్బా అనిపించింది.
అవంతి పెదవులు ఎందుకో కంపించాయి.
తప్పు తనది. తను చెప్పిన కథ ఇందర్ నమ్మాడు. తను అమాయకురాలిలాగానే ఓ రాగం తీస్తే సరిపోయేది కదా! ఏడుపంటే హడల్ దెబ్బతో అవతలికి వెళ్ళేవాడు. తను చాలా తెలివితక్కువ పని చేసింది. గోటితో పోయేదానికి గొడ్డలి వుపయోగించింది. ఆ భయంకరమైన కలకాదు గాని మతి మతిలో లేకుండా పోయింది. తను ఇక్కడ నుంచి తప్పుకోవడం మంచిది. వీలయితే మరో నాలుగురోజులు తల దాచుకోడం అంతవరకే....