"హల్లో"
ఆవలి గొంతు ఎవరిదో గుర్తుపట్టగానే అదోలాంటి వివశత్వం.
"మీరా?" అంది తేజా గొంతు గుర్తుపట్టినట్టుగా.
"ఏం? ఆశ్చర్యపోయారా?"
ఆమెకి హఠాత్తుగా రాత్రి కల గుర్తుకొచ్చింది.
కలలో సైతం తేజా ఇలానే అన్నాడు.
అంటే.....
కలని నిజం చేస్తూ తేజా ఖచ్చితంగా అలానే మాట్లాడబోతున్నాడా?
గగుర్పాటుగా చూస్తూందామె.
అలా మాట్లాడితేనేం? అది తాత్కాలికంగా ఆమెలో కలిగిన మార్పో కావచ్చు కానీ భాస్వంత్ పై ద్వేషం తేజా అలా మాట్లాడితే బాగుండు అనుకునేట్టు చేసింది.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?" అడిగాడు తేజా.
"నిజంగానే మీ ఫోన్ వూహించలేదు నేను."
"ఇప్పుడే నిద్ర లేచారా?"
ఇంచుమించు ప్రతి ప్రశ్నా రాత్రి కలని గుర్తుచేస్తుంటే "అబ్బే..... ఊరికినే బెడ్ మీద రిలాక్సయ్యాను" అంది.
"నిద్ర లేపానేమో అనుకున్నాను."
"చెప్పండి" అంది వుత్సాహంగా.
"రాత్రి మీరు కలలోకొచ్చారు" అన్నాడు.
గుండె లయతప్పింది.
అంటే తనూ కలగన్నాడన్నమాట తనలాగే.
"కామీ...." నెమ్మదిగా అడిగింది "నన్ను మీరింతవరకూ చూడలేదు..... నేనే అని ఎలా గుర్తుపట్టారు?"
"మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నారు."
"అలాగా..... సరే! ఎలా వున్నాను నేను?"
"అరవయ్యేళ్ళ నాయనమ్మలా."
ఫకాల్న నవ్వింది.
"ఆనందంగా వుందా?" అడిగాడు.
"దేనికి?"
"మీరు అందంగా లేరని చెప్పినందుకు."
"అందులో ఆనందం దేనికి?"
"అందంగా వున్నారూ అంటే నేను మరేదో ఆలోచిస్తున్నానేమో అని మీరు ఆందోళన పడేవారుగా?"
"ఫర్వాలేదు..... మీ గురించి నేనలా భయపడటంలేదు."
"అయితే చాలా అందంగా వుంటారని నేను చెప్పొచ్చన్నమాట."
ఇదేమిటి - మాటలతో తను వశం తప్పేట్లు చేస్తున్నాడేం?
"పాయింటుకి రండి" అంది చిరుకోపాన్ని ధ్వనించే కంఠంతో.
"కొత్త సీరియల్ మొదలైంది నాది."
"ఏ వీక్లీలో?" అడిగింది.
"చదవలేదా? నవల పేరు అపశృతి" చెప్పాడు తేజా.
"బహుశా మార్కెట్ లోకి ఈరోజే వచ్చుంటుందేమో కదూ?" అప్పటికి చదవనందుకు చాలా నొచ్చుకుంది.
"అవును. మొదటి ఇష్యూ ఎలా వుందో చెప్పాలి మీరు."
"ప్రత్యేకించి అడుగుతున్నారూ అంటే టెన్షన్ లో వున్నారన్నమాట."
"అవును ఆర్తీ! ఈసారి చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ ఎన్నుకున్నాను."
"అంటే?"
"హ్యూమన్ సైకాలజీకి సంబంధించిన ఇతివృత్తం. పెళ్ళయ్యీ, దాంపత్యంలో సుఖముండీ, మరేదో వెలితితో అక్రమసంబంధం పెట్టుకున్న ఓ యువతి కథ."
అంటే ధీరలాంటి అమ్మాయి కథా?
ఎందుకో తనలాంటి అనుకోవటానికి ఆర్తికి మనస్కరించలేదు.
"వెరయిటీగా ఉంది."
"ఉందో, లేదో మీరు చదివి చెబుతూ వుండాలి."
"అయినా....." ఆర్తి సందేహంగా అడిగింది "దాంపత్యంలో సుఖమున్న ఓ యువతి మరేదో వెలితితో అక్రమసంబంధం పెట్టుకోవడమేమిటో నాకు బోధపడటం లేదు."
అరక్షణం తర్వాత అన్నాడు తేజ "సుఖసంతోషాలన్నవి వ్యక్తిగతం తప్ప సామాజికం కాదు ఆర్తీ!"
"నాకు అర్థంకాలేదు."
"మీకు సంతోషమనిపించింది సమాజానికి బాధాకరం కావచ్చు. సమాజం నిర్దేశించింది మీకు బాధని కలిగించొచ్చు" తేజా విశ్లేషణలా అన్నాడు "అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తకి బ్రతికినంతకాలమూ నిజాయితీగా కట్టుబడి వుండాలన్నది సంఘం ఆలోచనకావచ్చు. కానీ ఆ భర్తలో తను కోరుకున్న లక్షణాలు కనిపించనప్పుడు సంఘం కోసం ఆడది మనసుని చంపుకుంటూ బ్రతకలేదు ఒక్కొక్కప్పుడు."
ఆర్తి ఉద్విగ్నంగా వింటూంది.
"ఇది అందరి విషయంలోనూ నిజం కాకపోవచ్చు. కానీ నేను రాస్తున్నది ఇమడలేని కొందరు ఆడవాళ్ళ గురించి."
"అంటే సుఖపడటమన్నది అక్రమసంబంధాలలో వుంటుందని మీకు సందేశంగా చెబుతున్నారన్నమాట"
"నో..... నో" వెంటనే రియాక్టయ్యాడు తేజ. "నేను దాన్ని సమర్థించడమూ లేదు......
ఖండించటానికి ప్రయత్నించడమూ లేదు. కొన్ని జీవితాల గురించి యథాతథంగా తెలియచెప్పాలనుకుంటున్నాను."
"అంటే అలాంటి వ్యక్తులు మీకు తెలుసా?"
"కొందరు తెలుసు. మరికొందరి గురించి విన్నాను అయినా రచయిత రాసే ప్రతిదీ జరిగి వుండాలన్న రూలేం లేదు ఊహించి రాయడమూ మామూలేగా, చూస్తూంటే మీకు ఇది నచ్చని సబ్జెక్టులా వుంది."
"అహఁ..... అదేం కాదు."
"మరెందుకిలా మాట్లాడుతున్నారు?"
"నాకు అలాంటి ఓ స్నేహితురాలు వుంది కాబట్టి..... బావని పెళ్ళి చేసుకొని అతడు చాలా మంచి వ్యక్తి అని ఓ పక్క చెబుతూనే ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకొని సరిగ్గా మీలాగే తనూ సమర్థించుకోటానికి ప్రయత్నించింది కాబట్టి."