Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 30

                                        జ్ఞానోదయం
   
    షణ్ముఖం ఉలిక్కిపడి నిద్ర లేచాడు.

    ఆదిలక్ష్మి పాలవాడితో ఘర్షణ పడుతూ వుంది. విసుగ్గా మంచం దిగాడు షణ్ముఖం. అప్పటికే బారెడు పొద్దెక్కింది. గబగబా బాత్ రూంలోకి నడిచాడు.

    ఇవ్వాళ ముఫై ఒకటో తారీఖు. సాయంత్రంలోగా పని పూర్తిచేసి ఆఫీసరుకు చూపించకపోతే తను వినాల్సిన మాటలు ఆ భగవంతుడికే తెలుసు! ఆఫీసర్ మరి! ఏమైనా అంటాడు. తను ఆఫ్టరాల్ ఒక ఎన్.జీ.ఓ. ఏమన్నా తలవంచుకొని పడాలి. తలెత్తి వినకూడదు.

    త్వరత్వరగా స్నానం ముగించాడు. నాలుగు పచ్చడి ముద్దలు మింగి ఆఫీసుకు బయలుదేరాడు.

    'ఏమండీ?'

    గడప దాటుతున్న షణ్ముఘం ఆగాడు. విసుగ్గా భార్య ముఖంలోకి చూశాడు,

    'ఇవ్వాళన్నా పెందలాడే వస్తారా?'

    షణ్ముఖానికి వళ్ళు మండిపోయింది.

    'మాట్లాడరేం?' దీనంగా అన్నది ఆదిలక్ష్మి. షణ్ముఖం మాట్లాడలేదు.

    'నిన్న కూడా పాపకు మందు లేదు. పిల్లవాడికి కోరింత దగ్గు ఎక్కువైంది.'

    షణ్ముఖం భార్య ముఖంలోకి చూశాడు.

    ఆమె చూపులు అతని గుండెలకు తుమ్మ ముళ్ళలా గుచ్చుకున్నాయ్. అపరాధిని చూసినట్టు చూస్తుంది భర్తను భార్య.

    'మాట్లాడరేం?'

    తను ఏం మాట్లాడాలి? తను కావాలని రోజూ ఆలస్యంగా వస్తున్నాడా? తనకేదో ఆకర్షణ వుండి కూర్చుంటున్నాడా? తనేమన్నా ఆఫీసరా కావాలన్నప్పుడు సీట్లోనుంచి లేచి వచ్చి గవర్నమెంటు కార్లో దర్జాగా కూర్చుని బయలుదేరటానికి? దీనికి బొత్తిగా బుద్దిలేదు. తన గురించి బొత్తిగా ఆలోచించదు.

    "మాట్లాడరేం? ఒకవైపు చిన్న వాళ్ళిద్దరికీ జబ్బులు మీ అమ్మగారికి తన పూజలతోనే సరిపోతుంది. ఇంటెడు చాకిరీతో సతమతమై పోతున్నాను. మీరేమో రాత్రి తొమ్మిదింటిదాకా రారాయె! పెళ్ళాం బిడ్డలు గుర్తున్నట్టే వుండదా మీకు?"

    "అయిందా?" కోపంగా అన్నాడు.

    ఆదిలక్ష్మి కళ్ళల్లో నీరు తిరిగింది.

    'మీకు బొత్తిగా మా గురించి ఆలోచనే వుండదు." ఆదిలక్ష్మికి దుఃఖం పొర్లుకొచ్చింది. ఆపైకి మాట్లాడలేక పోయింది. ఛీ! ఛీ! ఇదొకటి! నీళ్ళకుండ ఎప్పుడూ నెత్తినే వుంటుంది. "నా బిడ్డలూ నేనూ, మీకు అంతబరువై పోయామా" ఏడుస్తూనే అన్నది భార్య.

    దీని బిడ్దలట! తన బిడ్డలు కారూ! తన పెళ్ళాం అన్నా తన పిల్లలన్నా తనకు పట్టటం లేదా! వాళ్ళు తనకు బరువు అనుకుంటున్నాడా? అలా అనుకుంటే ఏనాడో ఈ బాధ్యతలనుండి పారిపోయేవాడు! దీనికి ఆ మాత్రం జ్ఞానం లేదు.

    ఆదిలక్ష్మి కళ్ళు తుడుచుకుంది.

    ముందు ఏడుపు పుట్టి ఆ తర్వాత ఇది పుట్టింది. దీని బతుకంతా ఏడుపే ఈ ఇంటి కప్పూ గోడలూ దీని కన్నీళ్ళతొ నాని నాని కూలిపోతాయి.

    షణ్ముఖం రెండడుగులు ముందుకు వేశాడు.

    "నా గోడు ఆలకించేవాళ్ళే లేరు." ఎక్కిళ్ళ మధ్యనుంచి ఆదిలక్ష్మి కంఠం.

    ఓ భగవంతుడా! ఎక్కడున్నావయ్యా? ఒక ఏనుగు ఏడిస్తేనే "సిరికిం చెప్పడు__శంఖు చక్ర యుగమున్ చేదోయి సంధింపడు..." ఇంకా ఏమేమో వదిలేసి పరిగెత్తుకొచ్చావటగా! నువ్వు ఆపద్బాంధవుడివట! కరుణామయుడివట. ఒక మనిషి అందులో ఆడమనిషి ఏడుపు ఏనుగు ఏడుపు కదిలించినంత మాత్రం నిన్ను కదిలించలేకపోతుందా? మరెందుకు రావు? నీ గురించి చెప్పిందంతా అబద్దమేనా?

    'ఏమండీ'

    'ఛ! ఊరుకో, ఎప్పుడూ ఏడుపే వెధవ ఏడుపు ముఖము నువ్వూను! ఆఫీసు పని అయిపోగానే వస్తాన్లె' రెండడుగులు ముందుకు వేశాడు షణ్ముఖం.

    "వచ్చేప్పుడు డాక్టరు దగ్గిరకెళ్ళి మందు కూడా తీసుకురండి."

    'అలాగే.' ఎలాగో అనగలిగాడు.

    'ఆ మర్చిపోయాను. కాఫీ పాడీ, పంచదార కూడా అయిపోయినై.

    "ఊ!" మరో అడుగు ముందుకు వేశాడు.

    "పిల్లకు బొత్తిగా దారకం పోవడం లేదు. ఒక గ్లూకోజ్ డబ్బా, బత్తాయి పళ్ళు..."

    షణ్ముఖం గిర్రున తిరిగి భార్యముఖంలోకి చూశాడు. 'ఊఁ ఇంకా?'

    ఆదిలక్ష్మి భర్త ముఖంలోకి చూస్తూ మాట్లాడలేక పోయింది. ఆరోజు ముఫై ఒకటో తారీఖని గుర్తొచ్చి బొమ్మలా నిలబడిపోయింది.

    'ఒరే అబ్బాయ్! కందిపప్పూ, పెద్దుల్లిపాయలూ__చింతపండూ తీసుకురారా."

    షణ్ముఖం తల్లి మంగమ్మ ఉతికి, పిండిన బట్టలు భుజంమీద వేసుకొని బయటికి వచ్చింది.

    షణ్ముఖానికి వెనక్కి తిరిగి తల్లి ముఖం చూసే ధైర్యం లేక వీధిలోకి చూస్తూ నిలబడిపోయాడు.

    'ఎటూ మార్కెట్ కు వెళ్తారుగా కూరగాయలు కూడా పట్టుకు రండి!' పెళ్ళాం గొంతు.

    "ఒరే నాయనా, ఓ పాతిక నిమ్మకాయలు కూడా పట్టుకురా! కోసి ఉప్పులో వేస్తాను. నోరు మరీ చవిచచ్చి పోయింది."

 Previous Page Next Page