"నాన్నోయ్. రంగు పెన్సిళ్ళూ జామెంట్రీ బాక్సు.....మాష్టారుగారు తిడుతున్నారు"
'ఏమండోయ్ మరి....'
'నాన్నోయ్ మరేమో....'
'ఒరే నాయనా....'
షణ్ముఖం చరచర వెళ్ళిపోయాడు.
రోడ్డుమీద ఉసిగా నడుస్తున్నాడు. చురచుర ఎండ నెత్తి మాడుస్తూ వుంది. అరిగిపోయిన చెప్పులు ఎండకు కరిగిన తారుకు మధ్య మధ్య అతుక్కుంటూ వున్నాయి. మెయిలు దూరం నడవాలి. నటరాజా సర్వీస్. నిగానిగాలాడుతున్న నల్లటి ఎంబాసిడర్ షణ్ముఖం పక్కగా దూసుకుపోయింది. అది ఎవరి కారో తెలుసు.
ఆఫీసరు వెళ్ళాడు. తనకు ఇవ్వాళ ఆలస్యం కాక తప్పదు__నడక వేగం హెచ్చించాడు.
ఏమిటీ జీవితానికి అర్ధం? ఈ బ్రతుక్కు ప్రయోజనం? అసలు తను బ్రతికేది కూడా ఒక బ్రతుకేనా?
సెంటర్ లో కొచ్చేసరికి క్లాక్ టవర్ 'టంగ్' న దెబ్బకొట్టింది శ్రీరామచంద్రమూర్తి విరిచిన శివధనుష్టం కారంలా విన్పించింది షణ్ముఖానికి.
షణ్ముఖం చివ్వున తలెత్తి చూశాడు. సత్యాన్వేషణలో పడి విహరిస్తున్న మనసు తార్రోడ్డుమీద సెంటర్ లో నిలబడిపోయిన అతనిలోకి తిరిగి వచ్చింది.
పదిన్నర!
అమ్మయ్యో, పదిన్నరే?
అప్పుడే పదిన్నర అయింది. ఇంకా అరమైలు నడవాలి. సరిగ్గా బయలుదేరేప్పుడు అందరికీ అన్నీ గుర్తొస్తాయి. వాళ్ళకు బొత్తిగా బుద్దిలేదు.
నల్లత్రాచులా తారురోడ్డు షణ్ముఖం కళ్ళముందు పడుకొని వుంది.
'లేట్! లేట్! యూ ఆర్ అల్ వేస్ లేట్ - బుద్ది లేదూ! ఇలా అయితే సస్పెండు చేస్తాను....' ఆఫీసరు ఎలుగ్గొడ్డులా అరుస్తున్నట్టు కళ్ళముందు కన్పించాడు.
షణ్ముఖం పరుగులాంటి నడకతో చెమటలు కక్కుతూ ఆఫీసులోకి వచ్చి పడ్డాడు.
మూడుసార్లు లేటయితే ఒక క్యాజువల్లీవు కట్ అవుతుంది. ఆ తర్వాత మూడు రోజుల లేతుకు ఒకరోజు జీతం కట్. పైగా ఎన్ని మాటలు పడాలి? ఎంత టెన్ షన్?
"ఆఫీసరు పిల్చారు." నురగలు కక్కుతూ ఆఫీసులోకి వచ్చిపడ్డ షణ్ముఖంతో అన్నారు మునుస్వామి.
తను అనుకున్నంతా అయింది. ఆలస్యం అయినరోజే పిలుస్తాడు. తొమ్మిదింటికే వచ్చి కూర్చున్నరోజు ఒక్కసారీ పిలవరు. తను నడుస్తూ రావడం కార్లో వెళ్తూ చూసేవుంటాడు. అందుకే పిల్చి వుంటాడు.
"సార్? అయ్యగారు పిలుస్తున్నారు" ఫ్యూన్ వచ్చి చెప్పాడు. షణ్ముఖం కాళ్ళల్లో వణుకూ, మెదడులో హోరు ప్రారంభం అయింది.
పులిబోనులోకి వెళ్తున్నట్టు గుండె దడదడలాడుతూ వుంటే ఆఫీసరు గదిలోకి వెళ్ళాడు.
'ఏం లేటుగా వచ్చావ్?'
'ఆలస్యం అయింది సార్!'
"ఏమిటా సమాధానం? స్టుపిడ్!"
"ఫూల్" అంటే ఫూల్ లాగా స్టుపిడ్ అంటే స్టుపిడ్ లా ఆఫీసరు ముందు ముఖం పెట్టడం నేర్చుకొని చాలాకాలం అయింది షణ్ముఖం.
"పలకవేం బుద్దిలేదూ?"
అయినా మౌనంగానే నిల్చున్నాడు షణ్ముఖం. ఆఫీసర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకూడదని ఏనాడో తెలుసుకున్నాడు.
"క్యాష్ అంతా వెరిఫైచేసి క్యాష్ బాక్ క్లోజ్ చేసి సంతకం తీసుకో. ఇవ్వాళ ముఫై ఒకటో తారీఖని తెలుసుగా?"
"యస్ సార్!"
'వెళ్ళు!'
ఒక్కసారి బయటకు వచ్చిపడి గుండెల నిండుగా గాలి పీల్చుకున్నాడు.
షణ్ముఖం బయటికి వచ్చిపడి తన సీటులో కూలబడ్డాడు. బుర్రంతా గందరగోళంగా వుంది.