తను ఎం.ఎల్.ఏ. అయాక ఇంత సింపుల్ గా వుంటే లాభంలేదు. కొంచెం స్మార్టుగా వుండాలి. పట్టుచీరల్లో తను మరీ లావుగా పొట్టిగా కన్పిస్తుంది. సిల్కు చీరలు కావాలి. హైహీల్స్ వేసుకుంటే తను మరీ అంత పొట్టిగా కన్పించదు. అసెంబ్లీలో తను అలా అలా సరస్సులో బాతులా ఈదుతూ నడుస్తూంది. కలల్లోనుంచి నిద్రలోకి జారిపోయింది మిసెస్ కైలాసం.
ఏమైనా ఈ ఎన్నికల రద్దీలో మిసెస్ కైలాసానికి డబ్బు బాగానే కరిగింది. దాదాపు వున్నదంతా వదిలిపోయినట్టే. కొంచెం బాధ కలిగినా....తీరా రంగంలో దిగాక డబ్బుకు వెనకా ముందూ చూసుకుంటే ఎలా? ఆవార తను గెలిచాక సంపాదించుకోలేకపోతుందా? మినిష్టరు కాకపోయినా హీన పక్షం డిప్యూటీ స్పీకర్ అయినా కాకపోతుందా? అనుకుంటూ తృప్తిపడింది.
ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బయటకు వెళ్ళాలంటే పెద్ద చిక్కే వచ్చిపడింది. చీర మార్చుకుందామంటే మారు చీర మంచిది లేదు. అన్నీ విడిచేసి వున్నై పెట్టెలో ఒక్కటీ లేదు. ఎలక్షన్స్ రద్దీలో పూటకొక్కటి తొక్కేయడం జరిగింది. పట్టుచీరలన్నీ కారు దుమ్ములో ధ్వంసం అయినై. మహిళా ప్రచారకులంతా అందినంత వరకు కట్టిపారేశారు.....దొరికినంతవరకు ఎత్తుకుపోయారు.
అప్పటికీ వాళ్ళకోసం ఎన్ని చీరలు కొన్నదీ? షావుకారు కొట్లో అప్పుచేసి తీసుకొంది. వాళ్ళందర్నీ మేపడానికి కాబూలీవాలా దగ్గర అప్పుకూడా తీసుకుంది ఎంత వెతికినా ఒక్కటీ మంచి చీర కన్పించలేదు. చిరాకు వేసింది మిసెస్ కైలాసానికి.
ఒక ప్రక్క వోట్ల లెక్కింపు జరిగిపోతుందేమో! ఈ ఒంటి చీరెతో ఎలా పోతుంది! తూ! పాడు! అంత దుమ్ముకొట్టుకొని నలిగిన చీరె కట్టుకొని ఎలా పోవడం? అందరూ తనను చూస్తూ "ఈమేనా? మిసెస్ కైలాసం, ఎం.ఎల్.ఏ.?" అంటే తనకే కాకుండా తన పార్టీకి ఎంత నామోషీ? పోనియ్ కొత్తది కొందామంటే డబ్బులేదాయే! ఇప్పటికే చీరల బాపతు పద్దు చాలా పెద్దదే వుంది ఆ షాపులో.
మిసెస్ కైలాసం మెదడులోని మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. సరాసరి బట్టలషాపులోకి వెళ్ళి రెండు సిల్క్ చీరలు కొన్నది. తొందర్లోనే తనకు డబ్బు వస్తుందనీ మొత్తం బాకీ ఒకేసారి తీరుస్తానని చెప్పింది. సంగతి అర్ధంచేసుకున్న షావుకారు కిక్కురుమనకుండా ఇచ్చాడు, పాతా బాకీతోపాటు కొత్తది కూడా రాబట్టుకోవాలనే ఆశతో.
సాయంకాలానికే ఫలితాలు తెలిశాయ్. మిసెస్ కైలాసానికి డిపాజిట్ గల్లంతు అయింది. అంటే మరీ అంత అన్యాయంగా రాలేదు. ఎలక్షన్ ముందు విత్ డ్రా చేసుకున్న అభ్యర్ధికంటే ఏడు వోట్లు ఎక్కువే వచ్చినై.
ఆ వార్త విన్న మిసెస్ కైలాసానికి తల గిర్రున తిరిగి కైలాసంకేసి ఎగిరిపోతున్నట్టనిపించింది. ఏదో మైకం చుట్టేస్తోంది. కళ్ళముందు చిందర వందరగా నలిగి పడివున్న పట్టుచీరెల కుప్పా, పద్దు పుస్తకంలో బాకీలు బట్టలషాపు షావుకారు....కాబూలీ...వాలా....గిర్రున రంగులరాట్నంలా తిరుగుతున్నారు ఒకరి తర్వాత ఒకరు ఆమె బుర్రలో.
భారతదేశంలో ఈసారి ఎన్నికల్లో మహిళల కిచ్చిన ప్రాతినిధ్యం "ప్రపంచ చరిత్రలో అపూర్వం" రేడియోలో విన్పిస్తోంది.
మిసెస్ కైలాసం ఒక్క ఊపున వెళ్ళి రేడియో గొంతు నొక్కేసింది.
"వెధవ ప్రజలు....మాబ్...మంద అదే గొర్రెల మంద....ఎవరికి ఓటివ్వాలో తెలియని గొర్రెలమంద, ఈ మంద ఎప్పటికి మారుతుందో! ఈ దేశం ఎప్పటికి బాధపడుతుందో!" పళ్ళు నూరబోయి నాలిక కరుచుకొని 'అబ్బా!' అన్నది మిసెస్ కైలాసం.