వరండాలో కూర్చుని ఉన్న పరబ్రహ్మనికి అల్లుడుని చూడగానే మొహం పాలిపోయింది.
"ఏంటండీ మాంగారూ... నన్ను చూడగానే మొహంఅట్టా పాలిపోయింది?... ఆ??..."కొంటెగా అడిగాడు ఆనందరావు మాంగార్ని.
"అబ్బే... అది మొహం పాలిపోవడం కాదులే అల్లుడూ... మొహానికి పౌడర్ కస్తెక్కువ పూస్కున్నానులే..." తొట్రుపాటుపడుతూ జవాబిచ్చి లోపలికి తొంగి చూస్తూ "ఏమేవ్... అమ్మాయి, అల్లుడు వచ్చారుగానీ ఇలా వస్తావ్..." అని అరిచాడు.
లోపలనుండి ఆనందరావు అత్తగారు ఆండాళ్ళమ్మ హడావిడిగా వచ్చింది.
అల్లుడ్ని చూడగానే ఆవిడ గుడ్లనీరు కక్కుకుంది.
"బాగున్నారా అల్లుడుగారూ?..." అని ప్రశ్నించి ఆనక నోట్లో కొంగు దోపుకుని దుఃఖాన్ని ఆపుకుంది.
"బాగానే ఉన్నాను... మీరు బాగున్నారా?"
"ఇప్పటిదాకా బాగానే ఉన్నాం అల్లుడూ..." పరబ్రహ్మం కండువాతో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.
ఆండాళ్ళమ్మ కుమిలిపోయింది.
ఆనందరావు మరదలు కమల బావగార్కి కళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది.
కాళ్ళు కడుక్కుని మాంగారి వైపు తిరిగి "అవునూ!ఉత్తరంలో ఏంటి ఇట్లు, నీ బీద మాంగారు అని సంతకం చేశారు... ఒహో... ఏదో గూడుపుఠాణి చేస్తున్నట్లున్నారే... అవేం నా దగ్గర చెల్లవ్..." అన్నాడు ఆనందరావు అల్లుడు దర్జాతో.
"ఉహు హు హు..." నోటికి చీరకొంగు ఇంకా దోసేస్కుంటా కుమిలిపోయింది ఆండాళ్ళమ్మ.
ఇంతలో మరిది శీనుగాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
"బావా...బావా... ఊర్నుండి నాకోసం ఏం తెచ్చావ్?..." అని సంబరంగా అడిగాడు.
ఆనందరావు ఆశ్చర్యంగా వాడివంక చూశాడు.
"ఓర్ని... భలేవాడివే... నేను నీకోసం ఏమైనా తేవాలా?... ఇంతకీ ఈ ఇంటి అల్లుడ్ని నేనా? లేపోతే నా ఇంటికి అల్లుడిని నువ్వా?... ముందు నాకోసం ఏమేం కొన్నారో మీ నాన్ననడుగు...హిహిహి..."హుషారుగా అన్నాడు.
"హుహుహుహు..." చీరని మరింత నోట్లోకి దోపుకుంటూ కుమిలిపోయింది ఆండాళ్ళమ్మ.
"అమ్మా... నువ్వు చీరంతా నోట్లోకి దోపేస్కున్నావే..." కంగారుగా అంది సరస్వతి.
ఆండాళ్ళమ్మ ఓసారి తనవంక చూస్కుని కాస్సేపు సిగ్గుతో చచ్చిపోయి మళ్ళీ బతికి లోపలికి పరుగెత్తి చీర కట్టుకుంది.
ఆ రెండురోజులూ ఆనందరావు మాంగారూ,అత్తగారూ ఇంట్లోని ఇబ్బందులు గురించి కొన్ని అల్లుడుతోనూ, కొన్ని వాళ్లిద్దరూ అల్లుడికి వినబదేలాగు మాట్లాడుకున్నారు.
కానీ ఆనందరావు ఏమాత్రం కరగలేదు.
దీపావళి రోజు ఉదయం అల్లుడుకి కాఫీ అందిస్తూ అంది ఆండాళ్ళమ్మ.
"చూడు నాయనా... ఈ చీర లేదు... ఏం చేస్తాం నాయనా అంతా నా ఖర్మ..."
అపుడే అక్కడికి వచ్చిన పరబ్రహ్మం భార్య మాటలు విని భగ్గున మండిపడ్డాడు.
"చీరలు లేకపోవడం ఏమటి?..." దీపావళి పండక్కి నీకు వెయ్యి రూపాయలు పెట్టి కొత్తచీర కొన్నావే!... అదేం చేశావ్!... కొంపతీసి దాన్ని స్టీలుసామాన్లవాడి కేసేశావా?" ఆండాళ్ళమ్మ నెత్తి కొట్టుకుంది.
"మీ తెలివి తెల్లారినట్టే ఉంది... ఎక్కడి మట్టిబుర్ర దొరికిందండీ నాకూ... మీరు నాకు చీరెక్కడ కొన్నారు... ఎంత ఇబ్బందితో చస్తున్నాం మనం?" అంటూ అల్లుడినిచూపించి కన్నుకొట్టి నాలుక పక్కలకి ఆడించింది.
పరబ్రహ్మం నెత్తిమీద ఠకీమని ఒకసారి మొట్టికాయ్ వేస్కుని నాలుక కొరుక్కున్నాడు.
"అవును కదూ... హిహిహి... మొన్న నీకు వెయ్యి రూపాయలు పెట్టి చీరకొన్నట్టు కలొచ్చింది... నేనింకా నిజంగానే నీకు చీర కొన్నానని అనుకుంటున్నాను... అంత డబ్బు మనకెక్కడిదీ... మనకెంత ఇబ్బందో." అన్నాడు.
"ఊఊ... మీరు కన్నుకొట్టడం నాలిక ఊపడం అన్నీ చూశాను... అవేం నా దగ్గర చెల్లవుగానీ నేను మంచం ఎక్కుతాను" కుర్చీలోంచి లేస్తూ అన్నాడు ఆనందరావు.
"ఎందుకు నాయనా.. ఇప్పుడేగా నిద్రలేచి మొహం కడుక్కుని స్నానం చేశావ్?" ఆశ్చర్యంగా అడిగింది.
"ఇపుడు మళ్ళీ నిద్రపోడానికి కాదు... అలగడానికి. అలకపాన్పు ఎక్కుతున్నానన్న మాట!!... నా అలక తీర్చడానికి నేనేదడిగితే మీరది ఇవ్వాలన్నమాట"
"ఉహుహుహు..." చీర నోట్లో దోపుకోసాగింది ఆండాళ్ళమ్మ.
ఆనందరావు అలకపాన్పు ఎక్కాడు కొత్త అల్లుడిలా. ఎవరూ పట్టించుకోలేదు.
మీరిలా పట్టించుకోపోతే నేను చాలా పెద్ద కోరిక కోరి మీకు పనిష్మెంటివ్వాల్సి వస్తుంది?" మంచంమీంచి గావుకేక పెట్టాడు.
ఇది మరీ డేంజర్ లా ఉందే అనుకుని భయపడి పరుగున అతని దగ్గరికి వెళ్ళి ఏం కావాలని అడిగారు అత్తగారూ, మాంగారూ.
"నాకు ఉంగరం కావాలి!..."అన్నాడు ఆనందరావు.
"ఉంగరం కావాలి... అంతేకదూ?" సూటిగా అడిగాడు పరబ్రహ్మం.
"అవును"
"మళ్ళీ మేం ఉంగరం పెట్టాక నేను ఇదేం అడగలేదు అనకూడదు"
"ఎందుకంటానూ... హాయిగా తీస్కుంటా" అన్నాడు ఆనందరావు.
పండగైపోయింది. ఆనందరావు, సరస్వతి ఊరికి బయల్దేరాడానికి సిద్ధంగా ఉన్నారు.
"ఇదిగో అల్లుడూ ఉంగరం?" వేలికి తొడుగుతూ అన్నాడు పరబ్రహ్మం.
ఉంగరం చూసి ఆనందరావు కెవ్వుమన్నాడు.
"ఏంటిది?"
"నువ్వు ఉంగరం కావాలని అన్నావుగానీ బంగారపు ఉంగరం అన్లేదు కదా అల్లుడు. దీంతో నీ మొదటి పండగలన్నీ అయిపోయాయి. ఇహ నీకు పండగలకు ఆఠే మర్యాద చెయ్యక్కర్లేదు"
ఆనందరావు 'బేర్'మన్నాడు.
* * *
డిస్కౌంట్ సేల్
"కెవ్వ్ వ్వ్ వ్వ్ ..."
చెవులు గళ్లు పడిపోయే కేక!
ఆ కేకకి గడ్డం గీస్కుంటున్న కాంతారావు చెయ్యివణికి గెడ్డం మీద కసుక్కున గాటుపడింది.
"కెవ్వ్ వ్వ్ వ్వ్ ..." అన్నాడు అద్దంలో రక్తాన్ని చూస్కుని కాంతారావు.
"ఏంటి అట్టా అరిచారు?... ఈ పేపర్లోని అడ్వటైజ్ మెంట్ మీరు కూడా చూశారా?" సంబరంగా అడిగింది అతని భార్య కామేశ్వరి.
"నా గెడ్డంతెగి నేనరిచాను... నువ్వెందుకలా అరిచావ్?..." కోపంగా అడిగాడు కాంతారావు.
"ఇదిగో!... పేపర్లోని ఈ అడ్వర్ టైజ్ మెంట్ చూసి ఆనందం పట్టలేక అలా అరిచానంతే..."
"ఏంటా అడ్వర్ టైజ్ మెంట్? కళ్ళు చిట్లించి అడిగాడు కాంతారావు.
"డిస్కౌంట్ సేల్స్ గురించి! ఏముందో చదివి వినిపించనా?"
"చదువు..." అన్నాడు మళ్ళీ గెడ్డం గీసుకోడంలో మునిగిపోతూ.
కామేశ్వరి చదవడం ప్రారంభించింది.
"ప్రియమైన మిత్రులారా,
నేనువ్యాపారంలో చాలా నష్టపోయి బొంబాయి నుండి మీ ఊరికి దేభ్యంమొహం వేస్కుని వచ్చాను. ఇలా రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ బజార్లో, సెంటర్లో మా డిస్కౌంట్ సేల్ ఈ రోజు నుండే ఆరంభించాం. ఎంతో నాణ్యమైన, ఖరీదైన బట్టలు మీకు అతి తక్కువ ధరలో అమ్మి ఇంకా దివాళా తీసేసి చేతులు దులుపుకుని మా ఊరెళ్లిపోదామని అనుకుంటున్నాను. కాబట్టి నన్ను దివాళా తీయించే అవకాశం మీరు పొందుతారని భావిస్తూ, ఈ వేళే మా డిస్కౌంట్ సేల్ కం ఎగ్జిబిషన్ కి రావాలని కోరుకుంటూ-
మీ
దగాచంద్".