Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 29


    ఒకరి సబ్బు ఒకరు వాడటం ఏమిటి? నిన్న కమల నా టవల్ వాడింది. అదేమిటంటే సమయానికి ఎదురుగా కనిపించిందట. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకెప్పుడూ నా వస్తువులు ముట్టుకోకండి.


    "ఏమిటమ్మా అమూల్య."


    "చూడమ్మా. ముష్టి సబ్బు. తన సబ్బుతో స్నానం చేశానని ఒకటే సాధిస్తున్నది. నిన్న అక్క తన టవల్ తీసిందట. టవల్ కూడా అరిగిపోయింది కాబోలు" రాగం తీసింది విమల.


    "ఛీ.ఛీ. మీకు చెప్పినా అర్థం కాదు"


    "ఏమిటమ్మా ఛీ ఛా అంటున్నావు. నువ్వు ఎంత గొప్ప ఇంట్లో పుట్టినా ఇది అత్తగారిల్లు అని మర్చిపోవద్దు" వళ్ళు మండిన బంగారమ్మ అన్నది.


    "నా సబ్బు ఎందుకు వాడిందో మీ కూతురికి ముందు చెప్పండి"


    "ఈ మాత్రం దానికే ఇంత రాద్దాంతం ఎందుకమ్మా రేపటి నుంచి ముట్టుకోదులే"


    "నీలా ఖరీదైనా సబ్బులు వాడలేదు గానీ, మేము చిన్నప్పటినుంచీ సబ్బులు వాడుతూనే వున్నాం" అన్నది కమల.


    "నేను చెప్పేది అదికాదు. ఒకరు వాడే సబ్బును మరొకరు వాడకూడదు."


    "ఇది మరీ చోద్యంగా వుందమ్మా" అన్నది బంగారమ్మ.


    "మీకు అలాగే ఉంటుంది. మాకు చిన్నప్పటి నుంచీ అదే అలవాటు. ఇకనుంచి నా టవల్, మీ అబ్బాయి టవల్, నా సోపు, మీ అబ్బాయి సోపూ ఎవరూ ముట్టుకోడానికి వీల్లేదు" అన్నది అమూల్య అత్తగారితో.


    "నీ సంగతి చెప్పు. మా అన్నయ్య గురించి నీకెందుకూ? ఇంతకాలం అన్నయ్యా మేమూ ఒకే సబ్బూ, ఒకే టవల్ వాడుకోలేదూ? మా అన్నయ్యను కూడా మాకు దూరం చేస్తావా?" కసిగా అన్నది విమల.


    అమూల్య తెల్లబోయి విమల ముఖంలోకి చూసింది.


    శ్రీధర్ గదిలో నుంచి బయటికి వచ్చాడు. అన్నీ వింటూనే వున్నాడు. తను కలుగచేసుకుంటే బాగుండదని ఊరుకున్నాడు. కాని విషయం పాకాన పడుతున్నది. చిలికి చిలికి గాలివాన అయ్యేలా వుంది.


    "విమలా ఏమిటా మాటలు?"


    విమల అన్న ముఖంలోకి అదోలా చూసింది.


    "అమూల్య చిన్న విషయానికి ఇంత తర్జన భర్జన లేమిటి? స్నానం చేసిరా" అన్నాడు విసుగ్గా.


    స్నానం చెయ్యడానికి వెళ్తున్న అమూల్య గిర్రున తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది.


    వెనకే శ్రీధర్ లోపలకు వెళ్ళాడు. విమల వెళ్తున్న అన్నను కసిగా చూసింది. "చూశావా అమ్మా అన్నయ్య వదిన పక్షమే."


    బంగారమ్మ "నోరు మూసుకో" అన్నది.


    "నువ్వు కూడా మమ్మల్నే అంటావేమమ్మా? నా వళ్ళు అంత కుళ్ళి పోయిందా? నేను వాడిన సబ్బు వాడదా? అక్కయ్య టవల్ తీసిందని నిన్న ఎంత గొడవ చేసింది?"


    "వెంటనే దాన్ని చాకలికి పడేసింది.


    లోపల వదిన అన్నయ్య మధ్యా ఏదో ఘర్షణ జరుగుతున్నట్టు అన్పించి కమలా, విమలా చెవులు రిక్కించి వినడానికి ప్రయత్నించసాగారు.


    అమూల్య చేతిలో వున్న టవల్ ను ఓ మూలకు గిరాటు పెట్టి మంచంమీద కూర్చుంది. ముఖం కందగడ్డలా వుంది.


    అమూల్య ఇప్పుడేమయిందని అంత రాద్ధాంతం.


    నీకు అలాగే ఉంటుంది. నా సోపు మీ చెల్లెలు వాడటం ఏమిటి.


    నిన్న టవల్ వాడారు. మొన్న గుంటూరుకు వెళ్ళినప్పుడు నాకు చెప్పకుండా నా పట్టుచీర విమల కట్టుకుని పేరంటానికి వెళ్ళింది. చీరంతా పసుపూ, గంధం. పైగా వుండగా చుట్టి దండెం మీద పడేసింది. ఇలాంటి అనాగరిక పనులు నేను సహించలేను. మీకూ ఆ అలవాట్లే గనక మీకేమీ అనిపించదు."


    శ్రీధర్ కు కోపం వచ్చింది. కాని తమాయించుకున్నాడు.


    అమూల్య వాళ్ళను అర్థం చేసుకో. మధ్యతరగతి వాళ్ళు. ముఖ్యంగా పల్లెటూరి వాళ్ళు. తలకొక టవలూ, సోపూ వాడరు. మా చెల్లెళ్ళు ఎప్పుడూ నీదగ్గర ఉన్నటువంటి వస్తువులు చూడలేదు. కుతూహలంకొద్దీ వాడతారు. నేను వాళ్ళకు చిన్నగా నచ్చచెబుతానుగా. కొంచెం సహనం వహించు. చదువుకున్న దానివి. ఈ ఇంటికి వెన్నెలలా వచ్చావు. ఆ వెన్నెల స్వచ్చంగా వుండాలి. దానికి చీకటి మరకలు అంటించకు."


    "అంత విసుగ్గా ఉన్నదా? నీ తప్పేం కాదు. తప్పంతా నాదే. నీలాంటి అందాలరాశిని, పట్నంలో అల్లారు ముద్దుగా పెరిగినదాన్ని చేసుకున్నాను. నీకు అన్యాయం చేశాను. నా వివేకం ఆ సమయంలో ఏమైందో నాకే తెలియదు. బహుశా నా స్వార్థమే నాచేత ఈ పని చేయించింది. నీ గురించి ఆలోచించలేకపోయాను" తనకు తనే చెప్పుకుంటున్నట్టు అన్నాడు.


    ఆమె శ్రీధర్ ముఖంలోకి చూసింది.


    అతని మీద జాలి వేసింది.


    తన మీద తనకే కోపం వచ్చింది.


    ఛ. ఏమిటా మాటలు? నేనే కావాలని ఈ జీవితాన్ని వరించాను. మీరేం చేశారు.


    "నీ అమాయకత్వాన్ని నాకు తెలియకుండానే ఉపయోగించుకున్నాను."


    "ప్లీజ్ అలా మాట్లాడకు."


    "అయితే లే స్నానం చెయ్యి."


    "అలాగే. కాని సబ్బులేదు."


    "సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు తెస్తాను కొత్త సబ్బు ఇప్పటికి ఎలాగోలా స్నానం చెయ్యి."


    "మీకు టైం అవుతోంది. భోజనం చేసి వెళ్ళండి" అంటూ టవల్ తీసుకొని అమూల్య స్నానాల గదిలోకి వెళ్ళింది.


    భోజనం పెట్టి తల్లి ముభావంగా కూర్చుంది.


    "అమ్మా! అమూల్యను అర్థం చేసుకో. కష్టం తెలియకుండా పెరిగింది. వాళ్ళ అలవాట్లు వేరు. మన తాహతుకు మించిన పని కనక మనం అందరం ఒకే సబ్బు వాడతాం. ఒకే టవల్ వాడతాం కాని వాళ్ళు..."


    "అదేమిటి చోద్యం. ఆ షావుకారు భద్రయ్యగారికి ఏం తక్కువ? వాళ్ళు కూడా మనిషికో సబ్బు వాడరు?"

 Previous Page Next Page