జయరాం గారు గోపీని పక్కకు పిలిచి రావుగారుకీ, అజయ్ కీ, మాధవికీ చెప్పలేని ఒక నిజాన్ని గోపీకి చెప్పారు. శాంతికి 'బ్లడ్ కాన్సర్' అని. ఎంత దాచాలనుకున్నా ఆ మాటలు రావుగారి చెవిలో పడనే పడ్డాయ్. అతని గుండె చెరువయిపోయింది. తన గదిలోకెళ్ళి పసివాడిలా గుండెలవిసిపోయేలా ఏడ్చాడు. ఏది ఏమైనా ఈ వార్త మాధవికీ, అజయ్ కీ తెలియకుండా వుంచాలని, తన దుఃఖాన్ని దిగమింగుకుంటూ వారికి ధైర్యం చెప్పుకొస్తున్నారు. గోపీ ఈ ముగ్గురినీ ఎలా సముదాయించాలో తెలీక అందరినీ ఒక కంటితో కనిపెట్టుకుంటున్నాడు.
"శాంతి రాకపోవడం స్కూలే చిన్నబోయినట్టుంది" అంటూ గులాబీల గుచ్చాన్ని తీసుకొచ్చి శాంతి చేతిలో పెడుతూ అంది మేరీ.
"టీచర్! నాకు తొందరగా స్కూలుకి రావాలని వుంది" అంది శాంతి.
"భగవంతుడు నీకు తొందరగా మంచి ఆరోగ్యాన్నివాలని ప్రార్థన చేస్తున్నానమ్మా. నయమవగానే వచ్చేద్దువుగాని" అంది ఆప్యాయంగా తల నిమురుతూ మేరీ.
నీరసంగా నవ్వింది శాంతి.
రావుగారి గుండె తునాతునకలైంది. మాధవి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి.
కాసేపు కూర్చుని మేరీ టీచర్ వెళ్ళిపోయింది. ఎప్పుడు కళకళలాడుతూ సంతోషంగా వుండే ఆ యిల్లు విచారానికి స్థావరమైపోయింది.
ఆరోజు సాయంత్రం శాంతి స్నేహితులంతా వచ్చారు శాంతిని చూడటానికి. వాళ్ళని చూడగానే శాంతి మొహం విప్పారింది. లేని బలం తెచ్చుకుని లేచి కూర్చుంది. ఏమిటో వాళ్ళ కబుర్లు. ఎడతెరిపి లేకుండా మాట్లాడుతున్నారు. శాంతి తన బొమ్మలన్నీ చూపించింది.
"మా తాతయ్య ఈసారి బొమ్మల కొలువుకి ఇంకా ఎన్నో బొమ్మలు కొంటానన్నారు" అంది శాంతి.
ఆ మాట విన్న రావుగారి దుఃఖం చెప్పనలవి కాదు. అక్కడ కూర్చోలేక మాధవి నడిగారు. బొమ్మల కొలువు పెట్టడానికి దసరా ఇంకా ఎన్నాళ్ళుందని.
"ఇంకా రెండు నెలలు మామయ్యా" అంది మాధవి. రావుగారు జయరాంతో ఫోన్ లో మాట్లాడారు. ఫోన్ పెట్టేసొచ్చి "అమ్మా మాధవీ! దసరా రెండు నెలలు కాదమ్మా. శాంతి కోసం నాలుగురోజుల్లో రావాలి. బొమ్మల కొలువు శాంతికి కావలసినన్ని బొమ్మలతో నిండిపోవాలి" అన్నారు.
ఆ మాటలకి అర్థం వెతికింది మాధవి. గుండె దడదడలాడింది. "మామయ్యా! నిజం చెప్పండి. శాంతికేమయింది?" అంది ఏడుస్తూనే.
రావుగారు మాట్లాడలేదు.
"చెప్పండి మామయ్యా. బండబారిన నా హృదయం దేనికీ పగిలిపోదు" అంది.
"విషంలాంటి నిజాన్ని కక్కలేక కక్కలేక చెప్పారు. "శాంతి మనకి అట్టేకాలం దక్కదమ్మా! ఋణం తీరిపోతోంది" అని.
కట్టలు తెగిన నదీప్రవాహంలా దుఃఖం ముంచుకొచ్చింది. ఎన్ని గంటలు విలపించారో పిచ్చివారిలా. మాధవిని ఒక్క క్షణం ఒదలటం లేదు. మాధవరావుగారు పరిస్థితి ఆందోళనకరంగా వుందని అర్థం చేసుకున్నాడు అజయ్. శాంతినంటిపెట్టుకునే వున్నాడు.
రావుగారు కారు నిండా బొమ్మలుకొని తీసుకొచ్చారు. హాలు నిండా బొమ్మలు సర్ది కొలువుపెట్టింది గౌరి. శాంతి స్నేహితులంతా వచ్చారు. పట్టుపరికిణీ కట్టుకుని తల్లివొళ్ళో కూర్చుంది శాంతి. స్నేహితులు రాగానే నెమ్మదిగా వెళ్ళి వారి మధ్యన కూర్చుంది.
పట్టుపరికిణీలో పుత్తడిబొమ్మలా మెరిసిపోతూన్న శాంతిని చూసి ఆ బొమ్మని దక్కించుకునే మార్గం లేక కుళ్ళిపోతున్నారు ఇంటిల్లిపాదీ.
భోరున ఏడుస్తున్న మాధవిని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తోంది గౌరి. రావుగారు పిచ్చివాడిలా శాంతి పక్కనే కూర్చున్నారు. అజయ్ కి ధైర్యం చెబుతున్నాడు గోపీ.
కుందనపు బొమ్మలా బొమ్మల మధ్య కూర్చున్న శాంతిని చూస్తే గోవిందమ్మకి కూడా దుఃఖం ఆగలేదు. పూజ గదిలోకెళ్ళి దేవుడికి దండం పెట్టింది. "సామీ! ఇదివరకంతా నా తప్పుడు కోరికలు తీర్చమనే నిన్ను కోరుకున్నాను కానీ బుద్ధి వచ్చాక న్యాయమైన కోరిక ఇదొక్కటే కోరుకుంటున్నాను. మా యింటికి వెలుగైన మా శాంతిని తీసుకుపోయి ఈ యిల్లు చీకటి చెయ్యకు. సామీ! ఈ కోరిక తీర్చకపోతే నీవు నిజంగా నాకన్నా పాపాత్ముడివే సుమా!" కళ్ళు తుడుచుకుని, చేతులు సాచి దేముణ్ణి వేడుకుంది గోవిందమ్మ.
"పూజ గదిలో దేముడి బొమ్మలు, సావిట్లో శాంతి ఆడుకునే 'కీ' బొమ్మలూ అన్నీ కలగాపులగంగా కనిపించాయి రావుగారుకి. అసలు మనమే మనుష్యులమే దేముడు చేసిన బొమ్మలు. కొన్ని రాతి బొమ్మలూ, కొన్ని కీలు బొమ్మలూ, కొన్ని గాజు బొమ్మలూ, కొన్ని మట్టి బొమ్మలూ. ప్రతి బొమ్మా కొన్నాళ్ళయ్యేసరికి పాడయిపోవడమో, పగిలిపోవడమో జరుగుతుంది. కొన్ని ముందూ, కొన్ని వెనుక" -ఆలోచిస్తూ కూర్చున్నారు రావుగారు. శాంతి పడిపోవటం చూసి కెవ్వుమన్నారు.
మాధవీ, గోపీ, అజయ్, జయరాం, రుక్మిణి, వేణూ అంతా ఘోల్లుమన్నారు.
"ఏమైంది శాంతికి" అడిగాడు అజయ్.
ఏదో చెప్పబోతున్న గోపీ మాటలకి అడ్డొచ్చి "ఏం కాలేదు పడిపోయింది అంతే. చిన్న దెబ్బ తగిలింది" అన్నాడు.
కంగారు పడుతున్న అజయ్ ని అవతలకి తీసుకెళ్ళమని గోపీతో చెప్పాడు వేణు. డా|| జయరాం చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే జయరాం అజయ్ ని నర్సింగ్ హోంకి తీసికెళ్ళాడు. వేణూ పాపని కూడా తీసుకెళ్ళాడు కారులో.
గోపీ మాధవినీ, రావుగారినీ ఓదార్చలేక సతమతమయిపోతున్నాడు. ఇల్లంతా దుఃఖసముద్రంలా వుంది.
"నాకెందుకు ఇంత అర్జంటుగా ఆపరేషన్ చేస్తున్నారు" అడిగాడు అజయ్.
"అజయ్! కళ్ళున్నాయని కళ్ళ బ్యాంకు వారు ఫోన్ చేశారు" అందుకోసం.
"సరే. మధూని, శాంతినీ ఒకసారి తీసుకురండి."