Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 29


    "శాంతీ! అలా అనకమ్మా" అన్నాడు అజయ్ బాధగా.
    "బాబూ! ఈనాడు నీ కూతురు తన ఒక కన్నూ తీసి నీకిస్తానంటేనే అంత బాధపడిపోయావే, ఆనాడు నా కొడుకు దేశం కోసం తన ప్రాణాలివ్వడానికి వెళ్ళిపోతూ వుంటే నా మనసు ఎంత విలవిల్లాడిపోయిందో తెలుసా? కడుపుతీపి చెబితే తెలీదురా. అనుభవించాలి" అన్నారు రావుగారు.
    "నన్ను క్షమించండి నాన్నా. మిమ్మల్ని బాధపెట్టాను" అన్నాడు అజయ్.
    "బాధపడడం లేదు బాబూ! దేశం కోసం త్యాగం చేసిన నీలాంటి కొడుకుని కన్నందుకూ, పసిదైనా కన్నతండ్రికి తనదొక కన్నిస్తానని అంటూన్న ఇటువంటి మనమరాలు ఉన్నందుకు నేను గర్వపడుతున్నానురా, గర్వపడుతున్నాను" అన్నారు.
    "నిజం! మీ కుటుంబాన్ని చూస్తే నాకే గర్వంగా వుంది. ఈ ప్రేమ మందిరంలో మాకూ కాస్త చోటున్నందుకు సంతోషంగా వుంది" అన్నారు జయరాం.
    గంటలు నిమిషాల్లా సంతోషంగా గడిచిపోయింది కాలం. జయరాం, రుక్మిణీ కూడా వెళ్ళిపోయారు.
    మర్నాడు శాంతిని తీసుకుని అజయ్, మాధవీ అలా బ్రిడ్జికేసి షికారు కెళ్ళారు. పాత జ్ఞాపకాలతో కబుర్లలో పడిపోయారు మాధవీ, అజయ్ లు. శాంతి లేడిపిల్లలా దూకుతూ, అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటోంది.
    ఉన్నట్టుండి "మమ్మీ..." అని పెద్దకేకపెట్టి పడిపోయింది శాంతి. అజయ్ ని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న మాధవి చెయ్యొదిలేసి పరిగెత్తుకెళ్ళింది శాంతి దగ్గరికి. ఎత్తుపల్లాల మీద నడవలేక పడబోతూన్న అజయ్ ని డ్రైవర్ చెయ్యిపట్టుకుని ఆపుతాడు.
    "మమ్మీ...కడుపునొప్పి..." వుండచుట్టుకుపోతోంది శాంతి.
    "ఏడవకు శాంతీ. డాక్టర్ తాతయ్య మందిస్తాడు. తగ్గిపోతుంది. ఎత్తుకుని కారు దగ్గరికి తీసుకెళుతుంది.
    "ఏమయింది మధూ శాంతికి?" అన్నాడు అజయ్.
    "కడుపునొప్పి అని ఏడుస్తోంది. బాబాయ్ దగ్గరికి తీసుకెళదాం"
    "పద."
    పరీక్ష చేసి మందులేవో ఇచ్చారు జయరాం గారు.
    ఆక్కూరలా వాడిపోయినా శాంతిని చూసి కంగారుపడ్డారు రావుగారు. మందు పడగానే బాగా నిద్దరపోయింది శాంతి.
    మర్నాడు జయరాం ఐ స్పెషలిస్టుని వెంటబెట్టుకుని వచ్చారు. "ఇతను డాక్టర్ వేణు" అంటూ పరిచయం చేశారు.
    'నమస్కారం' అన్నాడు అజయ్ చేతులు జోడించి.
    "ఒరేయ్ అజయ్! నేనురా౧ నీ వేణూని" అంటూ కరచాలనం చేశాడు వేణు బాధగా.
    "నువ్వా?"
    "అవును. ఏమిటిరా ఇదంతా! చచ్చిపోయావన్నారు. ఎంత రాంగ్ ఇన్ ఫర్ మేషన్? అసలు ఏం జరిగింది? కళ్ళెలా పోయాయి" అడిగాడు వేణు.
    "ఓ...మీకు అజయ్ తెలుసా?" అన్నాడు జయరాం.
    "నా క్లాస్ మేట్, నా బెంచ్ మేట్, నా ప్రాణ స్నేహితుడు. ఆ... మాధవి బాగుందా?" అన్నాడు.
    బహుకాలం తరువాత కలుసుకున్న ఆప్తమిత్రులు హృదయాలు విప్పి ఎన్నో విషయాలు చర్చించుకుంటున్నారు.
    శాంతి కడుపునొప్పి తగ్గలేదు. మరేవో మందులూ, ఇంజక్షనూ తెప్పించారు జయరాం గారు. పరీక్ష కోసం కొంత రక్తం కూడా తీసుకున్నారు.
    మరికాసేపటికి అజయ్ దగ్గర, రావుగారు దగ్గిరా సెలవు తీసుకుని బయలుదేరారు జయరాం, వేణూ.
    వారం దాటినా శాంతి బాగుపడలేదు. పైగా విడవకుండా జ్వరం కూడా వస్తోంది. చిక్కిశల్యమైపోయింది. ఇంటిల్లిపాదికీ, గుండెలో విచారం గూడు కట్టుకుంది.
    "శాంతీ! ఈ పాలు తాగమ్మా" పాలగ్లాసు నోటి దగ్గర పెట్టింది మాధవి.
    "ఒద్దు మమ్మీ..." నీరసంగా అంది శాంతి.
    "కొంచెం తాగమ్మా" బతిమాలారు రావుగారు.
    "ప్లీజ్... తాతయ్యా!"
    "సరే ఒద్దులేమ్మా పడుకో" అన్నారు రావుగారు.
    మంచంమీద కూర్చొన్న అజయ్ చేతులు గట్టిగా పట్టుకుని పడుకుంది శాంతి.
    మాధవికి దుఃఖం ఆగడం లేదు. పాల గ్లాసు పక్కనబెట్టి లోపలికెళ్ళి కళ్ళు తుడుచుకుంది.
    "తప్పమ్మా... ఏడవకూడదు. తగ్గిపోతుందిగా" ఎలా ఓదార్చాలో తెలీక ఏదో అన్నారు రావుగారు.
    "మామయ్యా! ఇన్నాళ్ళయినా జ్వరం విడవడం లేదు. నాకేదో బెంగగా వుంది. ఆయన తిరిగొచ్చారన్న సంతోషం ఎక్కువసేపు నిలవకుండానే శాంతికిలా జ్వరం పట్టుకుంది. భగవంతుడు మన మీద ఎందుకు కక్ష బూనాడో అర్థం కావడం లేదు.
    "ఏం ఫరవాలేదమ్మా...ధైర్యంగా వుండు. జయరాంకి ఫోను చేస్తాను. కావాలంటే మరే పెద్ద డాక్టర్నయినా తీసుకురమ్మంటాను" అంటూ ఫోన్ చెయ్యడానికి వెళ్ళారు.
    మరో పెద్ద డాక్టర్ శేషగిరిని తీసుకొచ్చారు డాక్టర్ జయరాం. పరీక్ష చేసి, ఎక్స్ రే తియ్యాలన్నారాయన. వెంటనే కారులో తీసుకెళ్ళి నర్సింగ్ హోమ్ లో ఎక్స్ రే తీయించారు.

 Previous Page Next Page