"అజయ్! మధూ శాంతి దగ్గరుండు. వదిలిపెట్టి ఎలా వస్తుంది చెప్పు. పద" అంటూ థియేటర్ లోకి తీసికెళ్ళాడు.
రెండు గంటలు పట్టింది ఆపరేషన్ పూర్తికావడానికి. అజయ్ మత్తుమందు వల్ల స్పృహలేకుండా వున్నాడు. శాంతి భౌతికకాయాన్ని తీసుకుని జయరాం కారులో కూర్చున్నాడు.
కారులోంచి శాంతిని చేతుల్లో పడుకోబెట్టి తెస్తూన్న దృశ్యాన్ని చూసి భోరుమని ఏడ్చింది మాధవి.
"బాబాయ్! పుట్టగానే ఇలాగే చేతుల్లో ఉంచుకుని నాకు చూపించావు. ఇప్పుడూ ఇలాగే చూపిస్తున్నావ్" వెక్కి వెక్కి గుండె పగిలేలా ఏడుస్తోంది.
"ఊరుకోమ్మా" ఓదార్చింది రుక్మిణి.
"పిన్నీ శాంతి నా జీవితానికి శాంతి చిహ్నం అనుకున్నాను కానీ ఇలా అశాంతిని రేపి వెళ్ళిపోతుందనుకోలేదు. నెత్తి కొట్టుకుంది.
"ఋణం తీరిపోయిందొదినా" ఊరుకో, ఊరడించింది గౌరి.
"తలొక దిక్కుగా పోయిన మనందర్నీ ఒక్క గూటిలో చేర్చి తనే గూడు విడిచిపోయిందమ్మా శాంతీ... బేబీ...పాపా...ఆ దేముడు నన్నొదిలిపెట్టి పాపనెందుకు తీసికెళ్ళాడమ్మా" గుండె బాదుకుంటూ బావురుమన్నారు రావుగారు.
మరికాసేపటికి శాంతిని తీసుకుపోవడానికి ఏర్పాట్లన్నీ జరిగాయి.
"అమ్మా మాధవీ... ఆ రోజున నన్నడిగావే! శాంతి పెళ్ళయి అత్తవారింటికి వెళితే మీరూ వెళతారా అని. కానీ నిర్భాగ్యుణ్ణమ్మా! కనీసం శాంతితో పాటు నా ప్రాణాలు పోతే బాగుండేది" గుండె బాదుకుంటూ ఏడ్చారు రావుగారు.
జయరాంగారూ, గోపీ, వేణూ కలిసి తతంగాన్నంతా పూర్తిచేశారు.
రావుగారికి నిద్రమాత్రలిచ్చి పడుకోబెట్టారు. మాధవి జబ్బుదానిలా మంచానికి అంటుకుపోయింది.
ఏం తప్పినా కాలం మాత్రం గతి తప్పదు. రోజులు గడుస్తున్నాయి. అజయ్ కి కట్లు విప్పారు.
వేణూ! "మధూ, నాన్నగారు ఒక్కసారైనా రాలేదు ఎందుచేత" అడిగాడు అజయ్.
"మనమే వెళుతున్నాంగా" అన్నాడు వేణు.
"శాంతికెలా వుంది?"
"శాంతి నీ కళ్ళలోనే వుందికదూ! పద. ఇంటికి తీసుకెళతాను" అన్నాడు వేణు.
"నా శాంతిని మనసారా చూడాలి. దాని తియ్యని మాటలు వినడమే తప్ప దాన్ని చూడ్డానికి నోచుకోలేదు ఇన్నాళ్ళూ" అన్నాడు అజయ్.
వేణూకి, జయరాంకి దుఃఖం ఆగడం లేదు. వెర్రి ఉత్సాహంతో శాంతిని చూడ్డానికి ఉబలాటపడుతున్న అజయ్ కి శాంతి లేదని ఎలా చెప్పాలో అర్థంకావడం లేదు. మూగగా ఊరుకున్నారు.
కారు ఇంటి ముందు ఆగింది. "శాంతీ!...శాంతీ!" అంటూ పిలుస్తూ లోపలికొస్తున్న అజయ్ కి మాధవి ఎదురొచ్చింది.
"అతనికళ్ళకేసి పిచ్చిదానిలా చూస్తూ నుంచుంది."
"ఏమిటి మధూ అలా చూస్తున్నావ్. నాకు చూపు ఒచ్చిందా లేదా అనేనా? ఒచ్చింది. బాగానే కనిపిస్తోంది."
"మాధవి అతని భుజాల మీద వాలి వెక్కివెక్కి ఏడ్చింది."
"పిచ్చిదానా! గతాన్ని ఒక పీడకలగా మర్చిపో. ఇకముందు మనకేబాధా రాదు రానివ్వను. ఆ...శాంతేది?" అన్నాడు.
"పదండి" అంటూ తీసుకెళ్ళింది మాధవి.
హాల్లో పెద్ద దండవేసి వుంచిన ఫోటోని చూపించింది. "శాంతి ఫోటోలో వుందండీ" అంటూ అతని భుజం మీద తల ఆనించి పసిపిల్లలా ఏడ్చింది.
అజయ్ మతిపోయిన వాడిలా కొయ్యబారిపోయాడు.
"శాంతి ఎక్కడికీ పోలేదు. మనందరి హృదయాల్లోనూ చిరంజీవిగా వుందమ్మా" అంటూ హాలులో చిందరవందరగా పడివున్న బొమ్మల్ని పేరుస్తూ కూర్చున్నారు రావుగారు.
పిచ్చివాడిలా వున్న అతని వాలకం చూసి మరింత చలించిపోయాడు అజయ్. దుఃఖాన్నాపుకోలేక ఈ దుఃఖానికంతటికీ కారకుణ్ణి నేనే. మీకందరికీ తీరని అపకారం చేశాను. కన్నతండ్రి అనీ, కట్టుకున్న భార్య అనీ బాధ్యత లేకుండా నా ధ్యేయం కోసం స్వార్థంతో నాదారిన నేను వెళ్ళిపోయాను. దిక్కు దివాణం లేక, నాదీ నా వాళ్ళూ అని పరితపిస్తూ వెనకొచ్చేసరికి విధి నన్ను వెక్కిరించింది. అందరూ నా చుట్టూనే వుండి, ఎవరూ లేనివాడిలా ఒంటరిగా దుఃఖాననుభవించాను. గుండె కొత్త భరించలేక చచ్చిపోవాలనుకున్నాను. శాంతి నా జీవితంలో ప్రవేశించి నన్ను చావనివ్వలేదు. బ్రతుకు తీపి చూపించింది. తీరా శాంతి నా బిడ్డే అని తెలుసుకునేసరికి నాకు కాకుండా పోయింది. నన్ను బతికించి తాను చచ్చిపోయింది. భగవాన్! నన్నెందుకిలా చిత్రవధ చేస్తున్నావ్? మా జీవితాలతో ఎందుకిలా ఆడుకుంటున్నావ్? అసలు నువ్వు దేముడివేనా? అయితే ఎందుకిలా రాక్షసత్వం వహించావు? పిచ్చివాడిలా గుండెలు బాదుకున్నాడు అజయ్.
అతని దుఃఖాన్ని ఆపడం ఉప్పెనతో ఉనికి వస్తున్న సముద్రానికి ఇటుకరాళ్ళతో ఆనకట్టకట్టడంలా అనిపించింది ఇంటిల్లిపాదికీ. నిశ్శబ్దం గుండెల్ని కోసేస్తోంది. అజయ్ రోదన నరాల్ని పిండి చేసేస్తోంది.
"బావా! శాంతి కళ్ళతో నువ్వు కన్నీళ్ళు కార్చకూడదు. ఆ కళ్ళు సంతోషంతో దిగులంటే ఏమిటో తెలీకుండా మెరిసిపోవాలి" అన్నాడు భుజం తడుతూ గోపి.
"ఏమిటి నువ్వనేది? ఈ కళ్ళు శాంతివా? నా చిట్టితల్లి తన చూపును నాకు దానం చేసిందా?" ఆశ్చర్యంతో కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు అజయ్.
"అవునండీ! అదే నా కోరిక. మిమ్మల్ని చూసినప్పుడల్లా మీ చూపులో దాన్ని చూసుకునేలా చేసి వెళ్ళిపోయిందండీ" అజయ్ గుండెలమీద తల ఆనించి వెక్కివెక్కి ఏడ్చింది మాధవి.
"శాంతి చిరంజీవి. అతని కళ్ళలో, మన మనసులలో ఎప్పుడూ వుంటుంది. ఈ మందిరంలో మన హృదయంలో ప్రేమదేవతగా నిలిచిపోతుంది. ఏడవకండి" ఓదార్చాడు గోపి.
"బాబూ! మనందర్నీ ఒక్కచోట కలిపి గాలిపటాల్లా తలో దారినా పోతున్న మనని ఏకం చేసి ఈ వనంలో మనందరినీ కొత్త మొలకల్లా నాటింది.
తాను జారుకుంది శాంతి. అది పోయినా కనీసం అది చేసిన ప్రయత్నమైనా ఫలించేలా మనందరం కలకాలం హాయిగా కలిసి వుండాలి. శాంతి కోరిక తీరింది. కానీ అది శాశ్వతంగా నిలిచిపోయేలా చేసే బాధ్యత మన మీద వుంది. ఈ ఇంట్లో శాంతి తాండవం చెయ్యాలి! ప్రేమరాజ్యమేలాలి! సంతోషం విజృంభించాలి! ఐక్యమత్యం అణువణువునా వ్యాపించాలి! అదే నా చిన్నారి శాంతికి ఆత్మ తృప్తి! మనకి ముక్తి! నవ్వండి బాబూ! అందరూ నవ్వుతూ వుండండి. అమ్మా మాధవీ! ఇంటినిండా దీపాలు వెలిగించు. శోక దేవతని తరిమికొట్టు. అజయ్ లో శాంతిని చూసుకో! వెళ్ళండి లోపలికి" అంటూ చేతిలోని బొమ్మల్ని కిందపడేసి మాధవినీ, అజయ్ నీ దగ్గరకు తీసుకుని తల నిమిరారు రావుగారు.
అందరికీ కాఫీలందించింది గోవిందమ్మ.
కాస్సేపటికల్లా చుట్టాలతో, స్నేహితులతో ఇల్లు నిండిపోయింది.
ఆ రోజు రాత్రి అజయ్ గుండెల మీద వాలిపోయిన మాధవిని గడ్డం పట్టుకుని తలపైకెత్తి ముఖం నిండా ముద్దుల వర్షం కురిపించాడు అజయ్. అతని కళ్ళలోకి చూస్తూ దివ్యానుభూతిని పొందింది మాధవి. చుక్కలతో కలిపి చంద్రుడు మబ్బుల్లోకి దూరిపోయాడు. ఆకాశంలో చీకటి వీరి హృదయాలలో కొత్త వెలుగులు వింత సోయగంతో మైమరచిపోయారు అజయ్, మాధవీలు. ఏ శక్తీ విడదీయలేనంతగా ఏకమైపోయారు. కాలం నడుస్తోంది, కాలం గడుస్తోంది.
ఈ విశాల ప్రపంచంలో కాలం ఎవరి కోసమూ ఆగదు. ప్రేమ ఎన్నటికీ చెరిగిపోదు. మనుషులున్నంతవరకూ ప్రేమలుంటాయి. ప్రేమలుంటేనే మనిషి మనిషిగా మనగలుగుతాడు. చీకటి కడుపు నుంచి కాంతి, దుఃఖ గర్భంలోంచి సంతోషం ఉద్భవిస్తాయి.
"ఏమిటో జీవితం! ఏది ఏమైనా జీవితానికే గెలుపు. జీవి వట్టి పావు మాత్రమే" తనలో తాను గొణుక్కున్నారు రావుగారు. రాణి నిద్దర కోసం ఎదురుచూస్తూ. అదీ, అంతం తెలియని ప్రశ్నల పరంపరాకు జవాబులు వెతుకుతూ!!
* సమాప్తం *